కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • g94 8/8 పేజీలు 3-4
  • పాఠశాలలు సంక్షోభంలో ఉన్నాయి

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • పాఠశాలలు సంక్షోభంలో ఉన్నాయి
  • తేజరిల్లు!—1994
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • పాఠశాలలో దౌర్జన్యం
  • తల్లిదండ్రులారా—మీ పిల్లలకు సలహాదారులై యుండండి
    తేజరిల్లు!—1994
  • ఉపాధ్యాయ వృత్తి దాని సవాళ్ళు, ప్రమాదాలు
    తేజరిల్లు!—2002
  • మీ పిల్లవాడు బోర్డింగ్‌ స్కూల్‌కు వెళ్లాలా?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1997
తేజరిల్లు!—1994
g94 8/8 పేజీలు 3-4

పాఠశాలలు సంక్షోభంలో ఉన్నాయి

తల్లిదండ్రులు, తమ పిల్లలు చదవడం, వ్రాయటం, లెక్కలు చేయడంకంటే ఎక్కువే నేర్చుకోవాలని వారిని పాఠశాలకు పంపుతారు. పాఠశాలలు, తాము గర్వించదగిన వ్యక్తులుగా తీర్చిదిద్దడానికి సహాయపడే పరిపూర్ణమైన విద్యను యౌవనస్థులకు అందిస్తాయని తల్లిదండ్రులు ఆశిస్తారు. కానీ తరచూ వారి ఆశలు నిరాశలౌతాయి. ఎందుకు? ఎందుకంటే పాఠశాలలు ప్రపంచవ్యాప్తంగా సంక్షోభంలో ఉన్నాయి.

అనేక దేశాల్లో డబ్బు, ఉపాధ్యాయుల కొరత పిల్లల విద్యకు ముప్పు వాటిల్లేలా చేస్తుంది. ఉదాహరణకు, అమెరికా మొత్తంలో, ఇటీవలి సంవత్సరాల్లోని ఆర్థిక మాంద్యం మూలంగా, కొన్ని పాఠశాలలు ‘పాత పాఠ్య పుస్తకాలను మళ్లీ బైండింగ్‌ చేయించి, సీలింగ్‌ ప్లాస్టరు ఊడిపోతున్నా పట్టించుకోకుండా ఉంటూ, ఆర్ట్స్‌ క్లాసులు, ఆటల కార్యక్రమాలు తీసేసి, లేక కొద్ది రోజుల వరకు పాఠశాలను మూసేసె దుస్థితికి,’ తెచ్చిందని టైమ్‌ పత్రిక పేర్కొంటుంది.

అలాగే ఆఫ్రికాలో కూడా, విద్యాభ్యాసానికి తగినన్ని వనరులు లేవు. లాగోస్‌ నుండి వెలువడే డైలీ టైమ్స్‌ వార్తాపత్రిక ప్రకారం, నైజీరియా దేశంలోని ప్రతి 70 మంది పిల్లలకు కేవలం 1 ఉపాధ్యాయుడు మాత్రమే ఉన్నాడు, అందులోనూ “ప్రతి ముగ్గురు ఉపాధ్యాయుల్లో ఒకరు అనర్హులుగా ఉండే అవకాశం చాలా ఎక్కువగా ఉంది.” దక్షిణాఫ్రికాలో—ఉపాధ్యాయుల కొరతకు తోడు—క్రిక్కిరిసి ఉన్న తరగతి గదులు, రాజకీయ అనిశ్చయత, సవుత్‌ ఆఫ్రికన్‌ పనోరమ అనే పత్రిక, “నల్లజాతి పాఠశాలల్లో గందరగోళం” అని పిలవడానికి దోహదపడింది.

అయినా, తగినంత మంది పాఠశాల సిబ్బంది, సరిపడేటన్ని పరికరాలు ఉన్న పాఠశాల కూడా విద్యాపర విజయానికి హామి ఇవ్వదు. ఉదాహరణకు ఆస్ట్రియాలో, 14 సంవత్సరాల పిల్లల్లో దాదాపు మూడవ వంతు మంది చిన్న చిన్న లెక్కలు చేయలేరు, లేక సరిగ్గా చదవలేరని పేర్కొనబడింది. బ్రిటన్‌నందు, లెక్కలు, విజ్ఞాన శాస్త్రం, దేశ భాష విషయాల్లో ఉత్తీర్ణులయ్యేవారి సంఖ్య “జర్మనీ, ఫ్రాన్సు, జపానులోని వారి సంఖ్యకంటే చాలా తక్కువగా ఉందని,” లండన్‌కు చెందిన ది టైమ్స్‌ వార్తాపత్రిక పేర్కొంటుంది.

అమెరికానందు, పిల్లలు పరీక్షలలో మంచి మార్కులు పొందుతున్నా, అనేకమంది మంచి వ్యాసాన్ని రాయడానికి, లెక్కలు చేయడానికి, లేక వేర్వేరు పాఠాలు లేక కథల ముఖ్యమైన అంశాలపై సారాంశాలను సిద్ధం చేయలేక పోతున్నారని ఉపాధ్యాయులు ఫిర్యాదు చేస్తున్నారు. అందునుబట్టి, ప్రపంచ వ్యాప్తంగా విద్యా అధికారులు, ఒక విద్యార్థి అభివృద్ధిని అంచనా వేయడానికి పాఠ్య ప్రణాళికను, ఉపయోగింపబడే విధానాలను మరోసారి సరికొత్తగా పరిశీలిస్తున్నారు.

పాఠశాలలో దౌర్జన్యం

పాఠశాలలో దౌర్జన్యం ప్రమాదకరమైన రీతిలో ఎంతో ఎక్కువగా పెరిగిపోతోందని నివేదికలు చూపిస్తున్నాయి. పాఠశాల పిల్లల్లో ఏ వయస్సుకు చెందిన వారైనా 15 శాతం మంది “దౌర్జన్యానికి పాల్పడేందుకు సిద్ధంగా ఉన్నారని—5 శాతం మంది మితిమీరిన క్రూరత్వానికి కూడా పాల్పడడానికి వెనుకాడరని, అంటే నేలపై నిస్సహాయంగా పడివున్న వ్యక్తిని కాలితో తంతారని” జర్మనీలోని ఒక ఉపాధ్యాయుల సమావేశానికి తెలుపబడింది.—ఫ్రాంక్‌ఫర్టర్‌ ఆల్జెమైన్‌ జీటంగ్‌.

మితిమీరి క్రూరంగా ప్రవర్తించే వ్యక్తుల వృత్తాంతాలు చాలా విచారాన్ని కలిగిస్తున్నాయి. ప్యారిస్‌లోని ఒక ఉన్నత పాఠశాలలో ఒక 15 సంవత్సరాల బాలికపై నలుగురు అబ్బాయిలు మరుగుదొడ్డిలో అత్యాచారం చేయడం, విద్యార్థులు తమకు పాఠశాలవద్ద గట్టి భద్రత కావాలని అభ్యర్థిస్తూ వీధుల్లో ప్రదర్శనలు చేయడానికి దారి తీసింది. లైంగిక దుర్ఘటనలు, బ్లాక్‌ మెయిల్‌ చేయడం, భావోద్రేక దౌర్జన్యాలు ఎక్కువవుతున్నందుకు తల్లిదండ్రులు కంగారుపడుతున్నారు. అటువంటి సంఘటనలు కేవలం ఐరోపాకు మాత్రమే పరిమితమవ్వలేదు కానీ ప్రపంచ వ్యాప్తంగా మరీ ఎక్కువ అవుతున్నాయి.

జపాను విద్యా శాఖ, జూనియర్‌, సీనియర్‌ ఉన్నత పాఠశాల విద్యార్థుల్లో దౌర్జన్యం విపరీతంగా పెరిగిందని నివేదిస్తుంది. దక్షిణాఫ్రికా వార్తాపత్రిక ది స్టార్‌, “తుపాకులతో ఆడుకునే విద్యార్థులు పాఠశాలలను తమ ఆధీనంలో ఉంచుకుంటున్నారు,” అనే వార్తాశీర్షిక క్రింద, సొవేటోలోని అనేక తరగతి గదులలోని దృశ్యాన్ని, 19వ శతాబ్దంలో అమెరికాలోని “సరిహద్దు పోరాటంతో” పోల్చింది. దౌర్జన్యాన్ని గురించి న్యూయార్క్‌ పట్టణానికున్న అపకీర్తి, లండన్‌కు చెందిన ది గార్డియన్‌ పత్రిక ప్రకారం, “పాఠశాల పిల్లల కొరకు బుల్లెట్‌ ప్రూఫ్‌ దుస్తులను చేపించమని ఒక భద్రతా సంస్థ ప్రకటించడంతో క్రొత్త పుంతలను త్రొక్కింది.”

బ్రిటన్‌ కూడా పాఠశాల దౌర్జన్యమనే తెగులుతో పీడింపబడుతోంది. “గత 10 సంవత్సరాల్లో, ఆయుధాలను చేపట్టాలనే దృక్పథం పెరగడం మేము చూశామని,” ఒక ఉపాధ్యాయుల సంఘ సభ్యుడు తెలుపుతున్నాడు. “చిన్న పిల్లలు కూడా దాన్ని ఉపయోగించడం ప్రారంభించారు, ఆడా మగా అన్న తేడా లేకుండా పోతోంది.”

అలాంటప్పుడు, కొంతమంది తల్లిదండ్రులు తమ పిల్లలను పాఠశాలల్లో నుండి తీసేసి వాళ్లకు ఇండ్లవద్దనే విద్య చెప్పాలనుకోడంలో ఆశ్చర్యం లేదు.a ఇది ఆచరణాత్మకం కాదని కనుగొన్న వాళ్లు తమ పిల్లలపై పాఠశాలలు చూపే చెడు ప్రభావాన్ని గురించి తరచుగా చింతిస్తుంటారు, దానినెలా ఎదుర్కోవాలని వాళ్లు ఆలోచిస్తుంటారు. పాఠశాలయందు ఎదురయ్యే సమస్యలతో ఎలా వ్యవహరించాలో పిల్లలకు సహాయం చేయడానికి తల్లిదండ్రులు ఏమి చేయగలరు? పిల్లలకు పాఠశాలనుండి మంచి విద్య లభిస్తుందని నిశ్చింతగా ఉండడానికి తల్లిదండ్రులు ఉపాధ్యాయులతో ఎలా సహాకరించగలరు? తదుపరి శీర్షికలు ఈ ప్రశ్నలకు జవాబులను యిస్తాయి.

[అధస్సూచీలు]

a జూలై 8, 1993 తేజరిల్లు!లో ప్రచురింపబడిన “ఇంట్లో విద్యాబోధన—మీ కొరకా?” అనే శీర్షిక ఈ ఎంపికను పునఃపరిశీలిస్తుంది.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి