ఆడీ జవాబు ఆలస్యంగా కనుగొన్నది కాని మరీ ఆలస్యంగా కాదు
ఒక నల్లజాతి స్త్రీ, 87 సంవత్సరాలుగా సాంఘిక న్యాయం కొరకు వెదికిన వృత్తాంతాన్ని గురించిన కథ ఇది. ఆమె ఒక నీళ్ల గుంట దగ్గిర ఓ మొద్దు మీద కూర్చుని చేపలు పడుతుంది. ఆమె చర్మం మృదువుగా ఉంది, ఆమె మనస్సు నిశ్చలంగా ఉంది, ఆమెలో ఏదో హుందాతనం ఉంది. ఆమె దృఢమైనది, అనుభవంగలది, జ్ఞానవంతురాలు, కానీ ఆమె కళ్లల్లో సరదాను, హాస్యాన్ని, దానికితోడు ప్రసన్నపరిచే దీనత్వాన్ని మీరు చూడగలరు. ఆమె కథలు చెప్పడంలో ఎంతో నేర్పరి. ఆమెలో ఆఫ్రికా వారసత్వం, అలాగే అమెరికా దక్షిణ ప్రాంతం యొక్క ఆమె జ్ఞాపకాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి. ఆమె తన జీవిత గాథను మళ్లీ స్మరించుకుంటోంది వినండి.
“మా నానమ్మ ఆఫ్రికానుండి జార్జియాకు వెళ్తున్న ఒక బానిసల ఓడలో పుట్టింది. ఆమె ఎంత సన్నగా పుట్టిందంటే ఆమె బ్రతుకుతుందని ఎవ్వరూ అనుకోలేదు. అందుకని, ఆమె తల్లిని అమ్మినప్పుడు, బలహీనంగా ఉన్న బిడ్డను తన తల్లితోపాటు పంపించారు. అది దాదాపు 1844, ఆ ప్రాంతంలో జరిగింది. ఆ బిడ్డకు రేచెల్ అని పేరు పెట్టారు.
“డివిట్ క్లింటన్ తన బాబాయ్ కొరకు ఒక పత్తిపంట సాగు చేసేవాడు. డివిట్ ద్వారా మా నానమ్మ నా తండ్రి, ఐసెయా క్లింటన్‌కు తల్లి అయ్యింది, అతను జూన్ 1866లో జన్మించాడు. వాళ్లు అతన్ని ఐక్ అని పిలిచారు. చిన్నపిల్లవానిగా, అతను తరచూ డివిట్తోపాటు అదే గుర్రం మీద తిరిగేవాడు, మరి పత్తి పంటను ఎలా సాగు చేయాలో ఆ విషయాలన్నీ అతనికి నేర్పబడ్డాయి. కొన్ని సంవత్సరాల తర్వాత, డివిట్ ఐక్కు యిలా చెప్పాడు: ‘నువ్వు నీ స్వంతగా సంపాదించుకోవాల్సిన సమయం ఇక వచ్చింది.’ అతను తన నడుముకున్న డబ్బులు పెట్టుకునే జేబులుండే బెల్టును తీసి ఐక్కు యిచ్చాడు.
“దాని తర్వాత నా తండ్రి, స్కిన్నర్ గారి దగ్గిర పని చేయడానికి వెళ్లి, స్కిన్నర్ పొలానికంతటికి పర్యవేక్షకుడు అయ్యాడు, ఎలెన్ హూవర్డ్ను వివాహం చేసుకున్నాడు. నేను జూన్ 28, 1892లో, జార్జియా, వేనెస్బోరో దగ్గరున్న, బర్క్ కౌంటీలో జన్మించాను. జీవితమంటే నాకెంతో అద్భుతంగా ఉంది. నేను ముందు తలుపు దాటి బయటికి వెళ్లకుండ ఉండలేక పోయేదాన్ని. అమ్మ నన్ను వెనకనుండి పట్టుకుని నా గౌన్ వెనక కుచ్చులు కట్టేదాకా వెళ్లనిచ్చేది కాదు, ప్రతి రోజు ఆమె యిలా అనడం నేను వినేదాన్ని: ‘కుచ్చులు కట్టు దాన్ని విడిచిపెట్టు.’ నేను నా తండ్రికి దగ్గరగా ఉండడానికి నాగలి ముందు ఉండే చువ్వల మీద కూర్చునేదాన్ని.
“ఒక రోజు, ఒక వేసవి కాలపు గాలివానలో, మెరుపులు స్కిన్నర్ గారికి ఆయన గుర్రానికి ఒక బయలు మైదానంలో తగిలాయి. ఇద్దరూ చనిపోయారు. స్కిన్నర్ గారి శ్రీమతి అమెరికాలోని ఉత్తర ప్రాంతానికి చెందిన శ్వేతజాతి స్త్రీ గనుక అంతర్యుద్ధం సమయంలో జనరల్ సెర్మాన్ అట్లాంటాను దహించినప్పుడు అతను చేసిన దానికి బర్క్ కౌంటీలోని ప్రజలందరు ఆమెను ద్వేషించారు. అందుకని ఆ ప్రాంతపు శ్వేతజాతీయులు, నల్లజాతి వారిని ద్వేషించిన దానికంటే స్కిన్నర్ గారి శ్రీమతిని ఎక్కువగా ద్వేషించారు! స్కిన్నర్ గారి శ్రీమతి కూడ వాళ్లందరిపై తన పగ తీర్చుకుంది. ఆ ద్వేషంతో, ఆమె తన భర్త చనిపోయినప్పుడు, నల్లజాతివాడైన నా తండ్రికి పొలాన్ని అమ్మింది. ఆ శతాబ్దం తిరగక ముందే జార్జియాలో నల్లజాతి మనిషి పొలాన్ని స్వంతంగా పొందడం అంటే ఊహించండి!
నీలి గారు, ఆయన కిరాణా కొట్టు
“నాన్నకు ఏదైనా అవసరమైతే, ఆయన నీలి గారి కిరాణా కొట్టుకు వెళ్లేవారు. అక్కడ అన్నీ ఉంటాయి. వైద్యుడు కావాలన్నా, కిరాణా కొట్టుకు వెళ్లాలి. శవ పేటిక కావాలన్నా, కిరాణా కొట్టుకు వెళ్లాలి. దేని కొరకు డబ్బు చెల్లించాల్సిన అవసరం లేదు; పత్తి పంట దిగుబడి అయ్యేంత వరకు, దాన్ని కేవలం మీ జమా లెక్కల్లో రాసుకోండి. నాన్నకు బ్యాంకులో డబ్బుందని నీలి తెలుసుకున్నాడు, అందుకే అతను మాకు అన్ని వస్తువులను తీసుకురావడం మొదలుపెట్టాడు. మాకు అవసరం లేని వాటిని—ఐస్ డబ్బా, కుట్టుమిషన్, తుపాకులు, సైకిళ్లు, రెండు కంచర గాడిదలు. ‘మాకది అవసరం లేదు!’ అని నాన్న అనేవారు. నీలి యిలా జవాబిస్తాడు: ‘ఇది ఒక బహుమతి. నేను మీ జమా లెక్కల్లో రాస్తాలే.’
“ఒక రోజు నీలి ఒక పెద్ద నల్ల స్టుడ్బేకర్ను తీసుకుని మా పొలం దగ్గరకు వచ్చాడు. నాన్న యిలా చెప్పారు: ‘నీలి గారూ, మాకది అవసరం లేదండి! దాన్నెలా నడపాలో, ఎలా భద్రపర్చాలో ఎవ్వరికీ తెలియదు, అదంటే అందరికీ భయం!’ నీలి ఆ మాటలను పక్కకు తోసేసాడు. ‘దీన్ని ఉండనివ్వు, ఐక్. నేను దాన్ని నీ జమా లెక్కలో రాస్తాను, దాన్నెలా నడపాలో నా పనివాళ్లు వచ్చి నీ మనుషులకు నేర్పుతారులే.’ మేము దాన్ని ఉపయోగించనే లేదు. ఒక రోజు పెట్రోలు పోయించుకోడానికి పనివాళ్లతో పాటు నేను కూడా వెళ్తానని నాన్నను బ్రతిమలాడాను. నాన్న యిలా అన్నారు: ‘దాన్ని ముట్టొద్దు; నీ సంగతి నాకు బాగా తెలుసు!’ మేము నాన్నకు కనిపించనంత దూరం వచ్చాక, నేనిలా అన్నాను: ‘నన్ను ప్రయత్నించని. నేను నడుపుతానని నాన్నకు తెలుసు.’ కారు వేగంగా వెళ్లింది, నేను స్టీరింగును కుడికి మళ్లీ ఎడమకూ తిప్పుతూ చెట్లు, పొదల మధ్యకు వెళ్లాము. నేను దాన్ని నీళ్ల గుంటలో పడేశాను.
“వీటన్నిటినీ ఎందుకు వద్దనలేదని నేను నాన్నను అడిగాను, ఆయనిలా జవాబిచ్చారు: ‘అదొక పెద్ద తప్పు అయ్యుండేది, అవమానం అయ్యుండేది. అంతే కాకుండా, కెకెకె [కూ క్లక్స్ క్లాన్] నీలి గారి స్నేహితులతో గొడవ పెట్టుకోరు.’ అందుకని మాకు అవసరం లేని వస్తువులన్నింటికీ మేము డబ్బు చెల్లించాము. ఇంకా నాన్న ఎప్పుడూ చెప్పే మాటలను గురించి నేను ఆలోచించాను: ‘నీకు అవసరం లేని దాన్ని కొనకు, లేకపోతే నీవు త్వరలో అప్పుల్లో పడి నీకు అవసరమైన దాన్ని కూడా కొనలేని పరిస్థితికి వస్తావు.’ నేను నీలిని ద్వేషించాను!
అందరూ శతాబ్దం గడిచిందని ఉత్సవం జరుపుకుంటుంటే, జనవరి 1, 1900న, మా అమ్మ తన నాల్గవ బిడ్డకు జన్మనిస్తూ మరణించింది. ఆ సమయానికి నాకు కేవలం ఎనిమిదేండ్లే, అయినా సమాధి దగ్గర ఆ బిడ్డను సంరక్షిస్తానని నేను నాన్నతో చెప్పాను.
“మా అమ్మమ్మ మమ్మల్ని అందరిని చూసుకునేది. ఆమె పేరు మేరి. ఆమె చాలా మత నిష్ఠగలది, ఎంతో జ్ఞాపకశక్తిగలది, కానీ చదవడం లేక వ్రాయడం తెలియదు. నేను వంటగదిలోకెళ్లి ఆమెపై ప్రశ్నల వర్షం కురిపించే దాన్ని. ‘దేవుని దృష్టిలో అందరూ సమానమే అని వాళ్లు చెబుతునప్పుడు, తెల్ల వాళ్లకు నల్లజాతి వాళ్లంటే అంత లెక్కలేదెందుకు? మనం పరలోకానికి వెళ్లినప్పుడు తెల్లవాళ్లందరు కూడా అక్కడికి వస్తారా? ఆ నీలి గారు కూడా అక్కడుంటారా?’ మేరి యిలా జవాబిచ్చేది: ‘నాకు తెలియదు. మనందరం అక్కడ సంతోషంగా ఉంటాము.’ అది కచ్చితంగా జరుగుతుందని నేను అనుకోలేదు.
“‘అమ్మమ్మా, మనం పరలోకంలో ఏం చేస్తాం?’ ‘ఆ, మనము బంగారు వీధుల్లో నడుస్తాం! మనం రెక్కలు కట్టుకుని ఈ చెట్టు నుండి ఆ చెట్టుకు ఎగురుతాం!’ నేనిలా ఆలోచించాను: ‘నేను ఎప్పుడూ బయటే ఆడుకుంటా.’ నేను పరలోకానికి వెళ్లాలని ఎప్పుడూ ఇష్టపడలేదు, కానీ నాకు నరకానికి వెళ్లాలని కూడా లేదు. ‘అమ్మమ్మా, మనం పరలోకంలో ఏం తింటాము?’ ఆమె ఇలా జవాబిచ్చింది: ‘ఆ, మనం పాలు తేనె తింటాం!’ నేనిలా కంగారుగా అరిచాను: ‘మరి నాకు పాలంటే ఇష్టంలేదు, తేనె అంటే ఇష్టంలేదు! అమ్మమ్మా, నేను ఆకలితో చచ్చిపోతా! నేను పరలోకంలో ఆకలితో చచ్చిపోతా!’”
నేను నా విద్యాభ్యాసాన్ని మొదలుపెట్టాను
“నేను చదువుకోవాలని నాన్న ఇష్టపడ్డాడు. ఆయన 1909లో నన్ను అలబామాలోని టస్క్జీ సంస్థకు పంపించాడు. బూకర్ టి. వాషింగ్టన్నే దానికి సర్వస్వం. విద్యార్థులు ఆయనను నాన్నా అని పిలిచేవారు. ఆయన విరివిగా ప్రయాణించి పాఠశాల కొరకు డబ్బు సేకరిస్తూ ఉండేవారు, దానిలో చాలా వరకు డబ్బు శ్వేతజాతీయుల దగ్గరనుండే సేకరించారు. ఆయన పాఠశాలలో ఉన్నప్పుడు, ఆయన మాకు యిలా బోధించారు: ‘మంచిగా చదువుకోండి. ఒక ఉద్యోగం సంపాదించి, మీ డబ్బు దాచుకోండి. అప్పుడు కొంత భూమి కొనుక్కోండి. మరి నేను మీ ఇంటికి వచ్చినప్పుడు గడ్డి కత్తరించకుండా ఉండి, ఇంటికి రంగు వెలిసిపోయి, లేక కిటికీ అద్దాలు పగిలిపోయి ఉంటే చలిని ఆపడానికి బట్టముక్కలను అడ్డం పెట్టి ఉంచిన పరిస్థితిలో ఎప్పుడూ ఉండకండి. స్వాభిమానాన్ని కల్గివుండండి. మీ ప్రజలకు సహాయం చేయండి. వాళ్లు పైకి రావడానికి వారికి సహాయం చేయండి. మీరు ఒక మంచి మాదిరిగా ఉండగలరు.’
“వాళ్లు నిజంగా ‘పైకి రావలసిన’ అవసరం ఉంది. వాళ్లు మంచి ప్రజలు—వాళ్లలో చాలా మంచి లక్షణాలున్నాయి. శ్వేతజాతీయులు నీగ్రోలను గురించి తలంచినప్పుడు వాళ్లు జ్ఞాపకం ఉంచుకోవాల్సిన సంగతులు చాలా ఉన్నాయి. నీగ్రోలకు చదువుకునే అవకాశం ఎప్పుడూ ఇవ్వబడలేదు. నీగ్రోలకు చదువు చెప్పడం బానిసత్వపు నియమాలకు విరుద్ధం. ఈ దేశంలోకి ఇష్టం లేకుండా వచ్చింది మేము ఒక్కరమే. ఇతరులు ఇక్కడికి రాడానికి ఆతురత చూపించారు. కానీ మేము ఇష్టపడలేదు. వాళ్లు మమ్మల్ని గొలుసులతో బంధించి ఇక్కడికి తెచ్చారు. వాళ్లు మా చేత 300 సంవత్సరాలు జీతం లేని దాసులుగా పని చేయించుకున్నారు. మేము 300 సంవత్సరాలు శ్వేతజాతీయుల కోసం పని చేశాము, అయినా వాళ్లు మాకు తగినంత తిండి, బట్టా ఇవ్వలేదు. మా చేత ఉదయం నుండి సాయంత్రం వరకు పని చేయించుకున్నారు, మా రెక్కలు ముక్కలయ్యేంత వరకు పని చేయించుకునే వాళ్లు. మాకు స్వాతంత్ర్యాన్ని ఇచ్చినప్పుడు కూడ, మాకు చదువుకునే అవకాశాన్ని ఇవ్వలేదు. మేము పొలంలో పని చేయాలని వాళ్లు అన్నారు, మా పిల్లలు కూడా పని చేయాలని, సంవత్సరానికి మూడు నెలలు మాత్రమే బడికి వెళ్లాలని అన్నారు.
“మరి మీకు తెలుసా అది ఎలాంటి పాఠశాలో? ఒక చిన్న చర్చి ఎందుకంటే నీగ్రోల కొరకు బడిలేదు. చెక్క బల్లలు. సంవత్సరంలోని వేడి నెలలైన జూన్, జూలై, ఆగస్టు, నెలల్లో పాఠశాల జరిగేది. కిటికీలకు పరదాలు ఉండవు. పిల్లలు నేల మీద కూర్చుంటారు. నూటముగ్గురు విద్యార్థులకు ఒక టీచరు, పురుగులన్నీ లోపలికి వస్తుంటాయి. మూడు నెలల్లో నువ్వు పిల్లలకు ఏం బోధిస్తావు? ఒక వేసవి సెలవుల్లో టస్క్జీ నుండి వచ్చి, నేను 108 మంది అన్ని వయస్సుల వాళ్లకు బోధించాను.
“నేను 1913లో నర్సుగా పట్టా పొందాను. నేను 1914లో, సామ్యెల్ మెంట్గోమెరీని వివాహం చేసుకున్నాను. తర్వాత అతను మొదటి ప్రపంచ యుద్ధానికి వెళ్లాడు, నేను గర్భిణిగా ఉన్నాను. సామ్యెల్ వచ్చిన కొద్ది కాలానికి, అతను మరణించాడు. నా పసి బాలునితో, నేను ఇలినాయిస్‌లో ఉన్న నా చెల్లి దగ్గరకు రైలులో ప్రయాణించి వెళ్లాను అక్కడ ఏదైనా నర్సు ఉద్యోగం దొరుకుతుందనే ఆశతో వెళ్లాను. నల్ల వాళ్లనందరినీ ఇంజెను వెనక కంపార్ట్మెంట్లో కూర్చోమన్నారు. అది చాలా వేడిగా ఉంది కిటికీలు తెరిచి ఉన్నాయి, మా మీద బొగ్గు తునకలు నిప్పు రవ్వలతో వచ్చి పడుతున్నాయి. రెండవ రోజుకల్లా మా ఆహారం అంతా అయిపోయింది, బాబుకు పాలు లేవు. నేను భోజనాల బోగిలో ఎక్కాలని ప్రయత్నించాను కానీ ఒక నల్లజాతి పోర్టరు నన్ను ఆపాడు. ‘నువ్వు ఇందులోకి ప్రవేశించకూడదు.’ ‘నా బిడ్డ కొరకు వాళ్లు కొన్ని పాలు అమ్ముతారా?’ లేదు అనే జవాబు దొరికింది. నాకు చాలా బాధను కలిగించిన మొదటి అన్యాయం నీలి మా నాన్నకు చేసినది. ఇది రెండవది.
“నేను 1925లో, రైల్వే పోర్టరయిన జాన్ ఫ్యూను వివాహం చేసుకున్నాను. అతను మినెసోటా, సెయింట్ పౌల్లో జీవిస్తున్నాడు గనుక నేను అక్కడికి తరలాను. సామాజిక న్యాయం విషయంలో నాకు బాధను కలిగించిన మూడవ విషయం ఇప్పుడు జరిగింది. సెయింట్ పౌల్లో నేను సుదూర ఉత్తర ప్రాంత రాష్ట్రంలో జీవిస్తున్నాను, కానీ దురభిమానం దక్షిణాని కంటే ఇక్కడ ఎక్కువగా ఉంది. కౌంటీ ఆసుపత్రిలో నన్ను నర్సుగా రిజిస్టరు చేసుకోము అని అన్నారు. నల్లజాతి వాళ్లు నర్సులు అవ్వడాన్ని గురించి తామెప్పుడూ వినలేదని వాళ్లన్నారు. టస్క్జీలో మేమందరమూ మంచి శిక్షణ పొందాం, మరి రోగికి ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చేవారం, కానీ సెయింట్ పౌల్లో మాత్రం, చర్మం రంగే అన్నింటికంటే ప్రాముఖ్యం. అందుకని నేను వేనెస్బోరోలో నాకున్న చిన్న ఇల్లును అమ్మి ఆ డబ్బును కొంత స్థలం, బిల్డింగు కొరకు మొదటి వాయిదాగా చెల్లించాను. నేను ఒక గ్యారేజి మొదలుపెట్టి, అందులో పని చేయడానికి నలుగురు మెకానిక్‌లను పెట్టుకున్నాను, త్వరలో నా వ్యాపారం మంచిగా నడవడం ప్రారంభించింది.”
నేను ఎన్ఏఏసీపీని కనుగొన్నాను
“దాదాపు 1925 ఆ ప్రాంతంలో నేను ఎన్ఏఏసీపీని [నేషనల్ అసోసియేషన్ ఫర్ ది అడ్వాన్స్మెంట్ ఆఫ్ కలర్డ్ పీపుల్] కనుగొని, దాని పనిలో పూర్తిగా నిమగ్నమయ్యాను. బూకర్ టి. వాషింగ్టన్ యిలా చెప్పలేదా: ‘మీ ప్రజలకు సహాయం చేయండి. వాళ్లు పైకి రావడానికి వారికి సహాయం చేయండి’? నేను చేసిన మొదటి పనేమంటే, రాష్ట్ర గవర్నరు వద్దకు స్వంత ఇల్లుండి, పన్నులు చెల్లించే నల్లజాతి వోటర్ల పేర్లు ఉన్న పెద్ద లిస్టును తీసుకెళ్లి ఇచ్చాను. ఆయన విని, నన్ను నిరాకరించిన అదే కౌంటీ ఆసుపత్రిలో ఒక నల్లజాతి యౌవన నర్సుకు ఉద్యోగాన్ని యిప్పించాడు. అయితే, శ్వేతజాతి నర్సులు, ఆమెతో ఎంత ఘోరంగా ప్రవర్తించారంటే—చివరకు ఆమె యూనిఫారం మీదంతా మూత్రం పోశారు—ఆమె కాలిఫోర్నియాకు వెళ్లి డాక్టర్ అయ్యింది.
“నా గ్యారేజి వ్యాపారమైతే, 1929లో ఒక రోజు వరకు చాలా బాగా నడిసింది. నేను అప్పుడే బ్యాంక్‌లో 2,000 డాలర్లు డిపాజిట్ చేశాను, నేను బయటికి వెళ్తుండగా, బ్యాంకు హఠాత్తుగా నష్టపోయిందని ప్రజలు కేకలు వేయడం మొదలుపెట్టారు. గ్యారేజిలో నాకు రెండు చెల్లింపులే ఉన్నాయి. నేను నా వ్యాపారమంతా కోల్పోయాను. నేను మిగిలించుకున్న డబ్బును నా మెకానిక్‌లకు పంచి ఇచ్చాను.
“ఎవ్వరి దగ్గరా డబ్బు లేదు. నా జీవిత భీమా పాలసీనుండి 300 డాలర్ల డబ్బు తీసుకుని నేను నా మొదటి ఇల్లు కొనుక్కున్నాను. నాకు ఇల్లు 300 డాలర్లకు దొరికింది. నేను పువ్వులమ్మాను, కోళ్లను, గ్రుడ్లను కూడా అమ్మాను; నేను ప్రయాణికులకు భోజనం, వసతి ఏర్పాటుచేసి డబ్బు సంపాదించాను; మిగతా డబ్బుతో ఒక్కొక్కటి 10 డాలర్ల చొప్పున ఇళ్ల స్థలాలను కొన్నాను. నేను ఎప్పుడూ ఆకలితో లేను లేక ఇతరుల దగ్గర చేయి చాచలేదు. మేము గ్రుడ్లు తిన్నాము. మేము కోళ్లను తిన్నాము. మా పందులకు వాటి ఎముకలను మేతగా వేశాము.
“తర్వాత నేను ఇలానర్ రోజ్వెల్ట్కి స్నేహితురాలినయ్యాను, హ్యూబర్ట్ హమ్ప్రేకి సన్నిహిత స్నేహితురాలిని అయ్యాను. హమ్ప్రే గారు, నేను సెయింట్ పౌల్ యొక్క డవున్టౌన్ వైట్ అంటే, శ్వేతజాతీయులు ఎక్కువగా ఉండే ప్రాంతంలో పెద్ద అపార్ట్మెంట్ భవనాన్ని కొనడానికి నాకు సహాయం చేశారు. ఆస్తి అమ్మకాల విషయాలు చూసే ఏజెంటు తన ప్రాణాలను గురించి ఎంతగా భయపడ్డాడంటే, నేను ఆ భవనాన్ని 12 నెలల వరకు ఉపయోగించ కూడదని నాదగ్గర మాట తీసుకున్నాడు.”
నా జీవితంలో ఒక పెద్ద మలుపు
“ఎంతో అసాధారణమైన సంఘటన 1958లో జరిగింది, దాన్ని నేను ఎప్పుడూ మర్చిపోలేను. ఇద్దరు శ్వేతజాతీయులు, ఒక నల్లజాతి వాడు కలిసి, ఒక రాత్రి ఉండడానికి స్థలం కొరకు నా వద్దకు వచ్చారు. నన్ను చట్టపరిధిలో యిరికించి చిక్కుల్లో పెట్టడానికి వాళ్లు ప్రయత్నిస్తున్నారని నేను భావించాను, అందుకని నేను వాళ్లను కొన్ని గంటలపాటు ప్రశ్నించాను. వాళ్ల కథ ఏమిటంటే వాళ్లు యెహోవాసాక్షులు, న్యూయార్క్‌లోని ఒక సమావేశం కొరకు వాళ్లు దేశం ఈ చివర నుండి ఆ చివరకు ప్రయాణిస్తున్నారు. వాళ్లు దురభిమానం అసలు ఉండని పరదైసు భూమి కొరకైన దేవుని సంకల్పాన్ని గురించి బైబిలు చెప్పిన విషయాన్ని నాకు చూపించారు. మానవ సౌభ్రాతృత్వం. నేనిలా ఆలోచించాను, ‘నేను ఇంతకాలం వెదుకుతున్నది వీళ్ల వద్ద దొరుకుతుండవచ్చా?’ వాళ్లు తామెవరమని చెప్పుకున్నారో వారిలాగే—సహోదరులకు వలెనే కనిపించారు. రాత్రి కొరకు వాళ్లు వేర్వేరు స్థలాల్లో పండుకోవాలని ఇష్టపడలేదు.
“కొన్ని సంవత్సరాల తర్వాత, నా ఇంట్లో అద్దెకుండే ఒక స్త్రీ చనిపోయే పరిస్థితిలో ఉందని నేను విని ఆమెను దర్శించడానికి వెళ్లాను. ఆమె పేరు మయినీ. ఆమె కొరకు నేనేమి చేయగలనని నేనడిగినప్పుడు, ఆమె ఇలా చెప్పింది: ‘దయచేసి అక్కడున్న ఆ చిన్న నీలిరంగు పుస్తకం నుండి నా కొరకు చదవండి.’ అది యెహోవాసాక్షులు పంచిపెట్టే, నిత్యజీవమునకు నడుపు సత్యము అనే పుస్తకం. అందుకు నేను ప్రతి వారం ఆ చిన్న నీలిరంగు పుస్తకం నుండి చాలా ఎక్కువ విషయాలు చదివేదాన్ని. ఒక రోజు మయినీ చనిపోయింది, నేను ఆమె గదికి వెళ్లేసరికి, డెయిజీ గెర్కెన్ అనే ఒక శ్వేతజాతీయురాలు అక్కడ ఉంది. ఆమె దాదాపు పూర్తిగా అంధురాలు. ఆమె మయినీతో చిన్న నీలిరంగు పుస్తకం నుండి పఠించేదని ఆమె నాకు చెప్పింది. నేను ఇక్కడ నుండి ఏదైనా తీసుకోదల్చారా అని డెయిజీ నన్ను అడిగింది. నేనిలా చెప్పాను: ‘కేవలం ఆమె బైబిలు, ఆ చిన్న నీలిరంగు పుస్తకం.’
“నేను ఆ నీలిరంగు పుస్తకంలోని సంగతులను అనుకరిస్తే, నా ప్రజల కొరకు నేను చేసే పనులన్నింటిని నేనాపివేయాల్సి వస్తుందని నాకు తెలుసు. నేను చేస్తున్నవి యోగ్యమైనవని నేను భావించే పనులు ఎన్ని ఉన్నాయంటే నేను వాటిని గురించి వివరించలేను. రైల్వే పోర్టర్ల కొరకు నేను ఒక యూనియన్ను సంస్థీకరించాను. కొందరు పోర్టర్ల పౌరహక్కుల కొరకు కోర్టు కేసులను కూడా గెలిచాను. నేను పట్టణంలో ఒకే సమయంలో అనేక ప్రాంతాలలో ప్రదర్శనలను కూడా ఏర్పాటు చేశాను. నా ప్రజలు చట్టాన్ని వ్యతిరేకించకుండా నేను చూడవలసి ఉంది, మరి వారలా చేస్తే, నేను వాళ్లను జైలునుండి బయటికి రప్పించాల్సి ఉంది. నేను పదికంటే ఎక్కువ క్లబ్బులకు చెందినదాన్ని అయినా పౌర సేవకు సంబంధించిన వాటికి మాత్రమే.
“అందుకని నేను భవిష్యత్తు జీవితాన్ని గురించి ఆలోచించలేను అని భావించాను. నా ప్రజలు ఇప్పుడు కష్టాలను ఎదుర్కొంటున్నారు! నాకు ఎన్ఏఏసీపీలో చాలా సిబ్బంది ఉంది, ఒక శ్వేతజాతి సెక్రేటరీ కూడా ఉంది. నేను 1937 నుండి 1959 వరకు సెయింట్ పౌల్లో ఎన్ఏఏసీపీ ఉపాధ్యక్షురాలిగా, 1959 నుండి 1962 వరకు అధ్యక్షురాలిగా సేవ చేశాను. నేను నాలుగు రాష్ట్రాలను ఒక సభగా ఏర్పాటు చేసి, ఎన్ఏఏసీపీ చివరికి దాని జాతీయ సమావేశాన్ని అక్కడ సెయింట్ పౌల్లో జరుపుకోడానికి అక్కడ సేవ చేశాను. ఎన్నో పోరాటాలను గెలిచాను, ప్రతిదీ దానంతటదే ఓ కథ. నేను 1962లో, 70 సంవత్సరాల వయస్సుకు నా పని విరమించే ముందు, అధ్యక్షుడైన జాన్ ఎఫ్. కెనడీని సందర్శించాను. దుఃఖకరమైన విషయమేమంటే ఆ సమయంలో నేను నా పద్ధతిలో న్యాయాన్ని సంపాదించడంలో ఎంతగా మునిగిపోయి ఉన్నానంటే, నేను దేవుని పద్ధతికి ప్రాధాన్యతను ఇవ్వలేదు.”
తుదకు సాంఘిక న్యాయానికి ఏకైక మార్గాన్ని నేను కనుగొన్నాను
“డెయిజీ గెర్క్న్, నేను ఎప్పుడూ ఫోను ద్వారా సంబంధాన్ని కలిగి ఉన్నాము, మరి నన్ను చూడడానికి ఆమె ప్రతి సంవత్సరం వచ్చేది. నేను టక్సన్, ఆరిజోనాకు వెళ్లిన కొద్ది రోజులకే, కావలికోట కొరకైన నా బహుమతి చందా గడువు తీరిపోయింది. నా మడిమ నొప్పి వలన నేను ఇంట్లోనే ఉన్నాను కాబట్టి యెహోవాసాక్షుల్లో ఒకరైన ఆడెల్ సిమోనియన్ నన్ను దర్శించినప్పుడు నేను ఆమెను కలుసుకోగలిగినందుకు సంతోషంగా ఉంది. మేము బైబిలును కలిసి చదవడం ప్రారంభించాము. తుదకు సత్యం యొక్క పూర్తి శక్తిని నేను తెలుసుకున్నాను. నేను నా ప్రజలందరి సమస్యలను పరిష్కరించి వాళ్లు ‘పైకి రావడానికి’ సహాయం చేయలేను. సమస్య నీలి గారి కంటే పెద్దది. దక్షిణానికంటే పెద్దది. అమెరికాకంటే పెద్దది. వాస్తవానికి, ఈ ప్రపంచానికంటే పెద్దది.
“అది ప్రపంచానికి సంబంధించిన ప్రశ్న. ప్రపంచాన్ని పరిపాలించే హక్కు ఎవరికుంది? మనిషికా? దేవుని శత్రువైన సాతానుకా? లేక అది సృష్టికర్త హక్కా? ఆయనదే, నిజంగా! ఒకసారి ఈ వివాదం పరిష్కరింపబడితే, ఏ సాంఘిక అన్యాయపు సూచనలకు విరుద్ధంగా నేను నా జీవితాంతం పోరాడానో అవన్నీ సమసిపోతాయి. నేను, నల్లజాతి వాళ్లు లేక శ్వేతజాతీయులు ఎవరి కొరకు పోరాడినా, మనందరం ముసలి వారమై చనిపోతాం. దేవుడు సాంఘిక న్యాయంతో భూమిని ఒక పరదైసుగా మారుస్తాడు. నిత్యం జీవించడం, చెట్లు, జంతువుల పట్ల శ్రద్ధ తీసుకోడం, మరి నా తోటి వారిని నాలాగే ప్రేమించడం—ఆ విధంగా పురుషున్నీ, స్త్రీని సృష్టించడంలోగల దేవుని ఆది సంకల్పాన్ని నెరవేర్చడంలో భాగం వహిస్తామనే ఉత్తరాపేక్షనుబట్టి నేను అమితానందం పొందాను. (కీర్తన 37:9-11, 29; యెషయా 45:18) నేను పరలోకానికి వెళ్లి అక్కడ పాలు, తేనె తినాల్సిన అవసరం, లేక ఆకలితో చనిపోవాల్సిన అవసరం లేదని కూడా నేను ఎంతో సంతోషించాను!
“నేను బాధపడుతున్న విషయాలు కొన్ని ఉన్నాయి, ప్రాముఖ్యంగా నేను నా జీవితం యొక్క చాలా భాగాన్ని తప్పుడు మూలం నుండి సాంఘిక న్యాయాని కొరకు వెదికాను. నేను దేవునికి నా యౌవనకాల బలాన్ని ఇవ్వడానికి ఎంతో ఆనందించి ఉండేదాన్ని. వాస్తవానికి, ఇతరులకు సహాయం చేయడం ద్వారా నేనలా చేశానని నేను భావించాను. నేను ఇంకా సహాయం చేస్తున్నాను, అయితే ఇప్పుడు యేసు క్రీస్తు ఆధ్వర్యంలో దేవుని రాజ్య నిరీక్షణ వైపు ప్రజలను త్రిప్పుతున్నాను. ఆయన నామమే పరలోకం క్రింద మనందరికి రక్షణను కలిగిస్తుంది. (మత్తయి 12:21; 24:14; ప్రకటన 21:3-5) నా తండ్రి తన పిడికిలిని బిగించి చూపిస్తూ నాకిలా చెప్పే వారు: ‘నీ పిడికిలి గట్టిగా బిగిస్తే, ఏమి బయటకు పోదు, ఏది లోనకు రాదు.’ ఇతరులకు సహాయం చేయడానికి నేను నా చేతిని విప్పాలని ఇష్టపడుతున్నాను.
“నేను 87 సంవత్సరాల వయస్సులో యెహోవాసాక్షుల్లో ఒకరిగా బాప్తిస్మం తీసుకున్నాను. నాకు చాలా తక్కువ సమయం ఉంది గనుక నేను నెమ్మదిగా చేయలేను. నేను ఇంకా చురుకుగా ఉన్నాను కానీ ముందు ఉన్నంత కాదు. నేను గత రెండు సంవత్సరాల్లో కేవలం రెండు సంఘ కూటాలకు మాత్రమే హాజరవ్వడానికి తప్పిపోయాను. నా కుటుంబీకులు పునరుత్థానం చేయబడినప్పుడు నాకు వీలైనదంతా వాళ్లకు నేర్పడానికి నేను నేర్చుకోగలిగినన్ని విషయాలను నేర్చుకోవాలి. నేను అడెల్ సహాయంతో 20 నుండి 30 గంటలు ప్రాంతీయ సేవలో గడుపుతున్నాను.
“ఇప్పుడు నేను చెప్పిన విషయాలు నా జీవితంలోని ఉన్నతాంశాలు. నేను మీకు అన్ని విషయాలు చెప్పలేకపోయాను, లేకపోతే మనం ఈ మొద్దు మీద యిలాగే కూర్చుని కొన్ని వారాలు మాట్లాడుకుంటూ ఉండే వాళ్లం.”
అంతలోనే ఒక పెద్ద నీటిపాము మొద్దు మీదకు పాకుతూ వచ్చింది, ఆడి యిలా అరిచింది: “ఆ పాము ఎక్కడినుండి వచ్చింది?” ఆమె తన చేపలు పట్టే కర్రను, తాను పట్టుకున్న చేపలు కట్టి ఉన్న తాడును పట్టుకుని అక్కడినుండి వెంటనే వెళ్లిపోయింది. ఇంటర్వ్యూ అయిపోయింది.—ఒక “తేజరిల్లు!” ప్రతినిధికి ఆడి క్లింటన్ ఫ్యూ చెప్పినది. ఈ ఇంటర్వ్యూ తరువాత కొద్ది రోజులకే, ఆడి 97 సంవత్సరాల వయస్సులో మరణించింది.