ఆస్ట్రేలియాలో నేను నిజమైన సంపదను కనుగొన్నాను
అది ఏప్రిల్ 1971. ఏడు సంవత్సరాలు ఆస్ట్రేలియాలో గడిపిన పిదప, ఇటీవలే నేను నా కుటుంబాన్ని దర్శించటానికి గ్రీసుకు తిరిగి వచ్చాను. అది సాయంకాల సమయం, కారీస్ అనే గ్రామం సెంటర్‌లోనున్న కాఫీహోటల్‌లో ఒక టేబులువద్ద నేను నిశ్శబ్దంగా కూర్చొని ఉండగా, స్థానిక మతగురువు, మేయరు వచ్చి, నాకు ఎదురుగా కూర్చొన్నారు. వారు కలహాన్ని రేపే ఆశతో వున్నారని స్పష్టమౌతుంది.
ఆ మతగురువు కనీసం వందనమైనా చెప్పకుండా నేను ఆస్ట్రేలియాకు వలసవెళ్లింది కేవలం డబ్బు సంపాదించడానికేనని ఆరోపించాడు. బాహాటంగా నేరం మోపినందుకు నేను ఆశ్చర్యపోయాను. ఆస్ట్రేలియాలో ఉన్నపుడు, డబ్బుకంటె మిన్నయైన సంపదను నేను ఆర్జించాను అని సాధ్యమైనంత మృదువుగా సమాధానమిచ్చాను.
నా సమాధానం ఆయనకు విస్మయాన్ని కలిగించినప్పటికి, నేను చెప్పినదాని భావాన్ని తెలిసికోవాలని ఆయన కోరాడు. నేను ఇతర విషయాలతోపాటు, దేవుని పేరునుకూడ తెలిసికొన్నానని చెప్పాను. ఆయన కళ్లలోకి సూటిగా చూస్తూ, “మీరు మాకు బోధించడానికి అలక్ష్యము చేసింది యిదే,” అని నేను చెప్పాను. ఆయన తిరిగి సమాధానం చెప్పక ముందే, నేను: “‘నీ నామము పరిశుద్ధపరచబడునుగాక’? అని యేసు ప్రార్థించమని మనకు నేర్పిన మాదిరి ప్రార్థనలో సంబోధించిన దేవుని పేరు ఏమిటో దయచేసి మీరు నాకు చెప్పగలరా?” అని అడిగాను.—మత్తయి 6:9.
ఆ వివాదమును గూర్చిన వార్త గ్రామం నలుమూలల త్వరగా వ్యాపించింది, పది నిమిషాలలో దాదాపు 200 మంది అక్కడ గుమికూడారు. మతగురువు ముళ్లమీద వున్నట్లు భావించసాగాడు. దేవుని నామముగూర్చి నేనడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమివ్వకపోగా, యితర బైబిలు ప్రశ్నలకు అసంపూర్ణ జవాబులను ఇవ్వసాగాడు. తరచూ సర్వర్‌ను పిలుస్తూ, గ్రీకు మద్యమైన ఓజోని తీసుకొనిరమ్మని చెబుతుండడంతో ఆయన తత్తరపాటు వ్యక్తమయ్యింది.
రెండు గంటలు ఆసక్తికరంగా గడిచిపోయాయి. మా నాన్న నా గురించి వెతుక్కుంటూ వచ్చి, జరుగుతున్న దాన్ని చూసి, ఒక మూలన నెమ్మదిగా కూర్చొని అక్కడి దృశ్యాన్ని పరిశీలిస్తున్నాడు. బాగా మత్తుగా తాగిన ఒక వ్యక్తి కోపంతో పెద్దగా అరుపులు మొదలుపెట్టేవరకు, ఆ ఉత్సాహపూరితమైన చర్చ రాత్రి 11:30 వరకు కొనసాగింది. అప్పుడు చాల పొద్దుపొయింది కాబట్టి, ఆ సమూహముతో అందరం ఇండ్లకు వెళ్లి పోదాము అని నేను సలహా యిచ్చాను.
ఇలా ఎదుర్కొనడానికి గల కారణమేమిటి? ఆ మతగురువు, మేయరు నాతో కలహం పెట్టుకోవడానికి ఎందుకు ప్రయత్నించారు? దీనికి ముందుగా, ఈ గ్రీసు ప్రాంతములో నేను పెరిగిన విధానాన్ని గూర్చి కొంత వివరిస్తే ఇది మీరు అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది.
తొలి కష్టాలు
నేను పిలోపోనీసోస్‌నందలి కారీస్ అనే గ్రామములో డిశంబరు 1940లో జన్మించాను. మేము చాల బీదవాళ్లం, నేను యింకా పాఠశాలకు వెళ్లనప్పుడు, నా తల్లితోపాటుగా ఉదయం నుంచి సాయంత్రం వరకు వరి పొలాల్లో, మోకాళ్ల లోతువరకున్న నీళ్లలో నిలబడి పనిచేసేవాడ్ని. నా ప్రాథమిక పాఠశాల చదువు 13 సంవత్సరాలకు ముగిసిన వెంటనే, నా తల్లిదండ్రులు నన్ను అప్రెంటీస్‌గా పనిచేయడానికి ఏర్పాట్లు చేశారు. నేను కొళ్లాయి, కిటికీలను అమర్చువాడిగా శిక్షణ పొందవలిసియుండగా, నా యాజమానికి నా తల్లిదండ్రులు 500 కిలోగ్రాముల గోధుమలను, 20 కిలోగ్రాముల వంటనూనెను ఇచ్చారు. ఇదంతా వారికి యించుమించు ఒక సంవత్సరపు ఆదాయంతో సమానము.
అప్రెంటిస్‌గా జీవించడం అంటే—ఇంటినుండి కొన్ని మైళ్ల దూరంలో ఉండడం, వేకువనుండి అర్థరాత్రివరకు పనిచేయడం—కష్టంతో కూడుకొన్నదే. కొన్నిసార్లు తిరిగి ఇంటికి వెళ్లాలని అన్పించినా, నా తల్లిదండ్రుల నిమిత్తం అలా చేయలేకపోయాను. నాకోసం వాళ్లు చేసింది నిస్వార్థమైన త్యాగం. కాబట్టి నా సమస్యలను ఎప్పటికిని వాళ్లకు తెల్పడానికి అంగీకరించలేదు. ‘ఎంతటి కష్టం కలిగినప్పటికి, నీవు పట్టుదల కలిగియుండాలి’ అని నాకు నేనే అనుకొనేవాడ్ని.
సంవత్సరాలు గడుస్తూండగా, అప్పుడప్పుడు నా తల్లిదండ్రులను దర్శించడానికి వెళ్తూ, తుదకు నా శిక్షణా కాలాన్ని నాకు 18 సంవత్సరాలు వచ్చేసరికి ముగించాను. అప్పుడు నేను ఉద్యోగావకాశాలు ఎక్కువగావున్న రాజధానియైన ఎథెన్సుకు వెళ్లడానికి నిర్ణయించుకొన్నాను. అక్కడ నేను ఒక ఉద్యోగాన్ని సంపాదించి, ఒక గది అద్దెకు తీసుకున్నాను. ప్రతిరోజు పని ముగిసిన తరువాత, ఇంటికి వచ్చి, వంటచేసుకొని, గది శుభ్రం చేసి, మిగిలిన కొంత సమయాన్ని ఇంగ్లీష్, జర్మన్ మరియు ఇటాలియన్ భాషలను నేర్చుకోవడంలో గడిపేడివాడ్ని.
నాతోటి యౌవనస్థుల అసభ్యకరమైన మాటలు, వారి ప్రవర్తన నాకు ఇబ్బందికరముగా ఉండేది కాబట్టి, వారితో సహవాసాన్ని మానేసాను. అయితే ఇది నేను ఒంటరివాడిగా భావించడానికి కారణమైంది. నాకు 21 సంవత్సరాలు వచ్చేసరికి, మిలటరీ సేవను నిర్వహించడానికి పిలువబడ్డాను. అప్పుడుకూడ భాషలను నేర్చుకొనడం కొనసాగించాను. అటు తరువాత, మార్చి, 1964లో నేను మిలటరీని వదిలిపెట్టిన తరువాత, ఆస్ట్రేలియాకు వలసవెళ్లి, అక్కడ మెల్‌బోర్న్‌లో స్థిరనివాసము ఏర్పరచుకొన్నాను.
క్రొత్త ప్రాంతంలో మతాన్వేషణ
నేను ఉద్యోగాన్ని సంపాదించాను, అలెగ్జాండ్రియా అనే పేరుగల మరొక విదేశీయురాలిని కలిశాను, ఇక్కడకు వచ్చిన ఆరు మాసాలలోనే మేము వివాహంకూడ చేసుకున్నాం. కొన్ని సంవత్సరాల తరువాత, 1969లో, యెహోవాసాక్షులలో ఒకరైన, ఒక వయస్సుమళ్లిన స్త్రీ, మా ఇంటికి వచ్చి, వాచ్‌టవర్ మరియు అవేక్!లను అందించింది. నాకు ఆ పత్రికలు ఆసక్తికరముగా తోచి, వాటిని ఒక భద్రమైన చోట పెట్టి, నా భార్యతో వాటిని పారవేయవద్దని గట్టిగా చెప్పాను. ఒక సంవత్సరం తరువాత ఇద్దరు సాక్షులువచ్చి ఉచిత గృహపఠన ఏర్పాటును అందించారు. నేను దానికి ఒప్పుకొనగా, నా జీవితంలో ఉన్న శూన్యతను భర్తీ చేసికొనడానికి నేను ఎదురు చూసిన వాటినే లేఖనాలనుండి నేర్చుకోవడం మొదలుపెట్టాను.
ఎప్పుడైతే మా పక్కింటామె నేను సాక్షులతో పఠించటం చూసిందో, ఆమె ఇవేంజిలిస్టులే ఒక మంచి మతమని వారివైపుకు త్రిప్పింది. దాని ఫలితంగా, ఇవేంజిలిస్ట్ చర్చిలోని ఒక పెద్దతోకూడా పఠించడం ఆరంభించాను. ఏది సత్యమైనమతమో కనుగొని నిర్ణయించుకొనడానికి, నేను వెంటనే ఇవేంజిలిస్ట్‌ల కూటాలకు, సాక్షుల కూటాలకు హాజరవ్వడం మొదలుపెట్టాను.
అదే సమయంలో, గ్రీకు సాంప్రదాయంలో పెంచబడిన నేను, దాని పక్షంలో ఆర్థడాక్స్ మతాన్ని కూలంకశంగా పరిశీలించడం ప్రారంభించాను. ఒకరోజున నేను మూడు గ్రీకు ఆర్థడాక్స్ చర్చీలకు వెళ్లాను. నేను దర్శించడానికి మొదటిగా వెళ్లిన చర్చిలో నా ఉద్దేశాన్ని వివరించగా, అక్కడ ఆ మతగురువు నెమ్మదిగా ముఖద్వారాన్ని చూపాడు. ఆయన అలా చెబుతూ, మనం గ్రీకువాళ్లం కాబట్టి, సాక్షులతోను మరియు ఇవేంజిలిస్ట్‌లతోను సాంగత్యము చేయడం తప్పుని వివరించాడు.
ఆయన వైఖరి నన్ను ఆశ్చర్యపర్చినప్పటికి: ‘ఈ మతగురువు మాత్రమే చర్చికి ఒక మంచి మధ్యవర్తి కాడేమో’ అని నేను తలంచాను. నాకు ఆశ్చర్యం కల్గేరీతిగా రెండవ చర్చిలోని మతగురువుకూడా అలాగే ప్రతిస్పందించాడు. ఏమైనప్పటికిని, ఆయన ప్రతి శనివారం సాయంత్రం చర్చిలో బైబిలు పఠనాన్ని ఒక మతగురువు జరుపుతున్నాడని నాతో చెప్పాడు. నేను మూడో చర్చిని దర్శించడానికి ప్రయత్నించేప్పటికి, నాకున్న భ్రమ మరింత తొలిగిపోయింది.
ఏది ఏమైనా, రెండో చర్చిలో నిర్వహించబడుతున్న బైబిలు పఠనానికి మరుసటి శనివారం హాజరవ్వడానికి తీర్మానించుకొన్నాను. బైబిలు పుస్తకమైన అపొస్తలుల కార్యములు చదువుచుండగా నేను ఆనందించాను. పేతురు ఎదుట కొర్నేలి మోకరిల్లిన భాగము చదువుతున్నప్పుడు, ఆ మతగురువు దానిని ఆపి, కొర్నేలి చేసిన ఆరాధనను పేతురు కచ్చితముగా తిరస్కరించుటను గూర్చి నొక్కి చెప్పాడు. (అపొస్తలుల కార్యములు 10:24-26) అప్పుడు నేను చెయ్యెత్తి, నాకు ఒక ప్రశ్న ఉందని చెప్పాను.
“నీవు తెలిసికోవాలని కోరుతున్నదేమిటి చెప్పు?”
“మరి, అపొస్తలుడైన పేతురే ఆరాధించబడడానికి తిరస్కరిస్తే, మనమెందుకు ఆయన విగ్రహాన్ని చేసి, దానిని ఆరాధించాలి?”
దానితో కొన్ని సెకన్లవరకు సూదిపడితే వినిపించేంత నిశ్శబ్దం అలుముకుంది. అటు తరువాత బాంబు పడినట్లుగా అన్పించింది. కోపాలు చెలరేగి, “నీవెక్కడినుండి వచ్చావు?” అనే కేకలు వినిపించాయి. రెండు గంటలసేపు ఉద్రేకపరచు వాగ్వివాదము, పెద్ద అరుపులతో కొనసాగింది. చివరకు, నేను వదిలివస్తుండగా, యింటికి తీసుకువెళ్లడానికి నాకు ఒక పుస్తకం యివ్వబడింది.
నేను దానిని తెరిచినప్పుడు, మొదటి పదాలు ఇలా ఉన్నాయి: “మనము గ్రీకులము, మన పారంపార్యాచారం కాపాడుట కొరకు మన మతము రక్తాన్ని ధారపోసింది.” దేవుడు ఒక్క గ్రీకు ప్రజలకు మాత్రమే చెందినవాడు కాడని నాకు తెలుసు, కాబట్టి నేను గ్రీకు ఆర్థడాక్స్ చర్చితో త్వరితంగా సంబంధాన్ని తెంచుకున్నాను. అప్పటినుండికూడ నేను ఒక్క సాక్షులతో మాత్రమే బైబిలు పఠనాన్ని కొనసాగించాను. ఏప్రిల్ 1970లో, నేను యెహోవాకు సమర్పించుకున్నానని సూచించుటకు నీటి బాప్తిస్మము తీసుకున్నాను, ఆరు నెలల తరువాత నా భార్యకూడ బాప్తిస్మము పొందింది.
ఆ గ్రామ మతగురువుతో సంప్రదించుట
ఆ సంవత్సరాంతంలోగా, గ్రీసులోని మా స్వగ్రామంనుండి మతగురువు ఆ గ్రామ చర్చిని మరమ్మత్తు చేయించడానికి డబ్బు సహాయం చేయమని కోరుతూ ఉత్తరము పంపాడు. డబ్బును పంపటానికి బదులుగా, నేను నిత్యజీవమునకు నడుపు సత్యము అను పుస్తకాన్ని దానితోపాటుగా, ఇపుడు నేను యెహోవాసాక్షినని, నేను తెలుసుకొనిన సత్యము యెడల నమ్మకంతోకూడిన ఒక వివరణాత్మక ఉత్తరాన్నికూడ వ్రాసి పంపాను. నా ఉత్తరము అందిన వెంటనే, ఆయన ఆస్ట్రేలియాకు పరదేశిగా వెళ్లినవాడు తిరుగుబాటు చేశాడని చర్చిలో ప్రకటించాడు.
అటుతరువాత, ఎవరి కుమారులైతే ఆస్ట్రేలియాకు వెళ్లారో ఆ తల్లులు, అతడు తమ కుమారుడాయని ఆ మతగురువును అడిగారు. మా అమ్మకూడ ఆయన ఇంటికి వెళ్లి, చెప్పమని ప్రాధేయపడింది. “దురదృష్టవశాత్తు, నీ కుమారుడే,” అని చెప్పాడు. నన్నుగూర్చి అట్లా చెప్పే దానికన్నా, ఆయన తనను చంపితే బాగుండునని తాను తలంచినట్లు అమ్మ తరువాత నాతో చెప్పింది.
గ్రీసుకు తిరిగివచ్చుట
మా బాప్తిస్మము తరువాత, నేను నా భార్య కలిసి గ్రీసుకు తిరిగివచ్చి, మేము బైబిలునుండి నేర్చుకొనిన మంచి విషయాలను మా కుటుంబములోనివారికి మా స్నేహితులకు చెప్పాలని ఇష్టపడ్డాం. కావున 1971ఏప్రిల్‌లో, మేము మా ఐదు సంవత్సరాల పాప తెమెత్రా సమేతంగా, సెలవుకాలాన్ని పొడిగించుకొని, నా స్వగ్రామమైన కారీస్‌కు 30 కిలోమీటర్లు దూరములో కిపారిస్యా అను పట్టణములో ఉండడానికి వచ్చాం. బయలుదేరిన చోటికే తిరిగి చేరుటకు వీలు కల్పించు మా విమాన టిక్కెట్లు ఆరు నెలలు అక్కడే ఉన్నా చెల్లుతాయి.
ఇంటికి వచ్చిన రెండవరోజు రాత్రే, మా అమ్మ మనస్సు క్రుంగినదై, మా కుటుంబం పేరుకు కళంకాన్ని తెచ్చురీతిగా నేను ఎంపిక చేసికొన్నది తప్పుడు మార్గమని కన్నీటితో విలపిస్తూ చెప్పింది. దుఃఖిస్తూ, నేనెన్నుకున్న “ప్రమాదమైన” మార్గాన్ని విడిచిరమ్మని వెక్కివెక్కి ఏడుస్తూ వేడుకొంది. ఆ తరువాత ఆమె మూర్ఛపోయినట్లై నాచేతులలో పడిపోయింది. మరుసటిరోజున దాని కారణాన్ని ఆమెకు వివరించటానికి ప్రయత్నిస్తూ, చిరుప్రాయమునుండి ఆమె ప్రేమతో నేర్పిన దేవునిగూర్చిన నా జ్ఞానము కొంతమేరకు పెరిగిందని వివరించాను. ఆ రోజు సాయంత్రమే అక్కడ స్థానిక మతగురువు, ఆ గ్రామ మేయరు కలిసి తారసిల్లడం మరిచిపోలేని విషయము.
ఏథెన్సులో నివసిస్తున్నవారైన నా తమ్ముళ్లిద్దరు, ఈస్టరు పండుగకు వచ్చారు. నేనేదో ఒక కుష్ఠరోగిని అన్నట్లుగా వారు నన్ను తప్పించుకొని తిరుగసాగారు. ఏమైనప్పటికి, ఒకరోజున, వారిద్దరిలో పెద్దవాడు వినటానికి ఇష్టపడ్డాడు. కొన్ని గంటల చర్చ జరిగిన తరువాత, నేను బైబిలునుండి చూపించిన ప్రతిదానికి ఆయన ఒప్పుకొన్నట్లుగా చెప్పాడు. ఆ రోజు మొదలుకొని, మిగిలిన నా కుటుంబ సభ్యుల ఎదుట నా పక్షాన వాదించువాడుగా ఉన్నాడు.
పిమ్మట నేను తరచుగా ఏథెన్సులోని నా సహోదరునివద్ద ఉండుటకు వెళ్లేవాడ్ని. వెళ్లిన ప్రతిసారి, ఆయన ఇతర కుటుంబాలను కూడా ఈ మంచి విషయాలను వినడానికి ఆహ్వానించేవాడు. నాకు అధిక సంతోషాన్ని కల్గించినదేమనగా, అతడు, అతని భార్య, మేము బైబిలు పఠనము చేసిన మరో మూడు కుటుంబాలుకూడ, ఆ తరువాత తాము దేవునికి సమర్పించుకొనినట్లుగా సూచించు నీటి బాప్తిస్మము తీసుకొన్నారు.
వారాలు త్వరగా గడిచిపోతుండగా, మా ఆరు నెలల కాలము ముగుస్తుండగా, ఇక్కడకు 70 కిలోమీటర్ల దూరాన ఒక సంఘంలో సేవచేస్తున్న ఒక సాక్షి మా గ్రామాన్ని దర్శించాడు. ఈ ప్రాంతములో ప్రకటించు పనికి ఎక్కువగా అవసరత ఉన్నదని నొక్కిచెబుతు, నేను అక్కడే శాశ్వతంగా స్థిరపడే ఆలోచన చేసానేమోనని నన్ను అడిగాడు. ఆరోజు రాత్రే నా భార్యతో అలాంటి అవకాశాన్నిగూర్చి నేను చర్చించాను.
ఇక్కడ ఉండాలంటే కష్టమేనని, మేమిద్దరం ఒప్పుకున్నాం. అయితే ఇక్కడి ప్రజలు బైబిలు సత్యాలను వినాల్సిన గొప్ప అవసరతగలదని తేటతెల్లమగుచున్నది. చివరకు, మేము ఒకటి లేక రెండు సంవత్సరాలు ఇక్కడనే ఉండడానికి నిర్ణయించుకొన్నాం. నా భార్య మాత్రం మా ఇల్లు, కారు అమ్మి, మాకు కావల్సిన సామాన్లను తీసుకురావటానికి ఆస్ట్రేలియాకు తిరిగివెళ్లింది. మా పాపను స్థానికంగా ఉన్న ఒక ప్రాధమిక పాఠశాలలో చేర్పించాము.
చెలరేగిన వ్యతిరేకత
యుద్ధము త్వరలోనే మాపై ప్రకటించబడింది. పోలీసులు, పాఠశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులద్వారా వ్యతిరేకత వచ్చింది. పాఠశాలలో తెమెత్రా సిలువను గీయనందుకు. పాఠశాల అధికార్లు ఒక పోలీసును పిలిపించి, దానిని అమలుపర్చటానికి భయపెట్టినప్పటికి, ఆమె స్థిరముగా నిలబడగల్గింది. నేను ప్రిన్సిపాల్ వద్దకు పిలువబడ్డాను, ఆయన నేను తెమెత్రాను తీసుకొని ఈ పాఠశాలను వదిలివెళ్లడానికి ప్రధాన బిషప్పునుండి వచ్చిన ఒక లేఖను నాకు చూపించాడు. సుదీర్ఘంగా ఆ ప్రిన్సిపాల్‌తో చర్చించిన తరువాత, ఏమైనప్పటికి, ఆమె పాఠశాలలోనే ఉండడానికి అనుమతించబడింది.
ఈమధ్యకాలంలో కిపారిస్యాలో జరిగిన యెహోవాసాక్షుల సమావేశమునకు హాజరైన ఒక జంట మరలా తమ ఆసక్తిని పునరుజ్జీవింపజేసుకున్నారని విన్నాను. నేను, నా భార్యకూడ మా గ్రామానికి సమీపానగల ఇతర సాక్షులను మా బైబిలు పఠనాలకు రమ్మని ఆహ్వానించాం. అయితే, పోలీసులు వెంటనే వచ్చి, మమ్మల్ని ప్రశ్నించడానికి పోలీసు స్టేషనుకు తీసుకొని వెళ్లారు. నేనుంటున్న ఇల్లును అనుమతి లేకుండా, ఆరాధన స్థలంగా ఉపయోగిస్తున్నారనే నేరం మోపబడింది. అయితే మేము చెరసాలలో బంధింపబడలేదు, గనుక మా కూటములను కొనసాగిస్తూ వచ్చాము.
నాకు ఒక ఉద్యోగము దొరికినప్పటికి, ఎప్పుడైతే దాన్నిగూర్చి బిషప్పు విన్నాడో, నా దుకాణపు యాజమాని దగ్గరకు వచ్చి, నన్ను పనిలోనుండి తీసివేయకపోతే దుకాణమును మూసివేయాల్సి ఉంటుందని బెదిరించసాగాడు. పైపులు, మురుగు నీటిగొట్టాల దుకాణం అమ్మకానికి సిద్ధంగా వుండగా, మేము దానిని కొనగల్గాము. వెంటనే, ఇద్దరు మతగురువులు వచ్చి దుకాణాన్ని మూసేయాలని బెదిరించారు, కొన్నివారాల తరువాత ప్రధాన బిషప్పు మా కుటుంబాన్ని బహిష్కరించవలసిందిగా ఆదేశించాడు. ఎవరైన సరే గ్రీకు ఆర్థడాక్స్ చర్చినుండి బహిష్కరించబడితే పూర్తిగా కులమునుండే బహిష్కరించబడినట్లుగా పరిగణించేవారు. ఒక పోలీసు అధికారి దుకాణము ఎదుట నిల్చొని ఎవ్వరు లోపలకి రాకుండా అడ్డగించసాగాడు. ఏ విక్రయదారుడు రానప్పటికి, మేము మొండిగా ప్రతిరోజు దుకాణాన్ని తెరిచే ఉంచేవారం. మా క్లిష్టపరిస్థితిని గురించి త్వరలోనే పట్టణమంతటి ముచ్చటయింది.
నిర్బంధించబడి, విచారింపబడుట
ఒక శనివారం నేను, మరొక వ్యక్తి కలిసి మోటారు సైకిలుపై మా పట్టణానికి ప్రక్కనే ఉన్న ప్రాంతానికి సాక్ష్యం ఇవ్వడానికి వెళ్లాం. అక్కడున్న పోలీసు మమ్ములను ఆపి, పోలీసు స్టేషనుకు తీసుకు వెళ్లి, ఆ వారాంతము పూర్తిగా అచ్చటనే ఉంచాడు. సోమవారం ఉదయాన్నే మమ్మల్ని రైలులో కిపారిస్యాకు తీసుకువచ్చారు. మేము నిర్బంధించబడిన వార్తలు అంతటా వ్యాపించాయి. మేము పోలీసు అంగరక్షకులతో వస్తున్నదానిని చూడడానికి ఒక సమూహము రైల్వేస్టేషనులో సమకూడారు.
వేలిముద్రలను తీసుకొన్న తరువాత, మమ్మల్ని పబ్లిక్ ప్రాసిక్యూటర్ దగ్గరకు తీసుకొని వెళ్లారు. పోలీసులు ప్రశ్నించగా, గ్రామ ప్రజలు మాకు విరోధంగా చేసిన ఫిర్యాదులను తాను బిగ్గరగా చదువుతానని చెప్పి తన కార్యకలాపాలను మొదలుపెట్టాడు. “యేసుక్రీస్తు 1914లో రాజయ్యాడని వారు మాతో చెప్పారు,” అన్నది మొదటి ఆరోపణ.
ఆ ప్రాసిక్యూటర్ కయ్యానికి కాలుదువ్వుతున్నట్లుగా, “మీకు ఎప్పుడు ఈ విచిత్రమైన ఆలోచన వచ్చింది?” అన్నాడు.
నేను ఒక అడుగు ముందుకు వేసి, ఆయన డెస్కుమీదనున్న బైబిలును తీసి మత్తయి 24వ అధ్యాయాన్ని తెరిచి, ఆయననే చదవమని సలహా ఇచ్చాను. ఒక సెకండు ఆయన సంకోచించినప్పటికిని, బైబిలును తీసుకొని చదవటం ఆరంభించాడు. కొన్ని నిముషాలు చదివిన తరువాత, ఆయన ఉద్రేకముతో: “ఆహాహా, ఇదే నిజమైతే, నేను అన్ని వదలిపెట్టి, మఠములో చేరిపోతాను,” అన్నాడు.
“కాదండి, మీరు బైబిలునుండి సత్యాన్ని నేర్చుకొని, ఇతరులకుకూడా సత్యాన్ని నేర్చుకోడానికి మీరు సహాయపడాలి” అని నేను శాంతముగా చెప్పాను.
కొంతమంది న్యాయవాదులు వచ్చారు, వారిలోకూడ కొంతమందికి మేము ఆ దినము సాక్ష్యము ఇచ్చే ఆవకాశము లభించింది. విచిత్రమేమంటే, ఇది మరొక నేరాన్ని మోపడానికి దారితీసింది—అదే మత మార్పిడి!
ఆ సంవత్సరంలోనే, మేము మూడు కోర్టు కేసులలో ఇరుక్కున్నప్పటికిని, చివరకు వాటి నేరాలన్నింటినుండి విడిపింపబడ్డాం. ఈ విజయమనేది మాకు సంబంధించిన విషయంలో ప్రజలకున్న ఉదాసీన దృక్పథాన్ని తొలగించినట్లు కనబడింది. అప్పటినుండి వాళ్లు మమ్ములను ఎంతో స్వతంత్రంగా సమీపిస్తూ, మేము దేవుని రాజ్యముగూర్చి చెప్పేదాన్ని వింటున్నారు.
కిపారిస్యాలో మా ఇంటిలో ప్రారంభమైన ఒక చిన్న పఠన గుంపు తుదకు ఒక సంఘంగా ఏర్పడింది. ఒక క్రైస్తవ పెద్ద మా క్రొత్త సంఘానికి బదీలి చేయబడ్డాడు, నేను ఒక పరిచారకునిగా నియమించబడ్డాను. మా ఇంట్లో జరుగు కూటములకు త్వరలోనే 15 మంది సాక్షులు క్రమముగా హాజరవ్వడం మొదలైంది.
ఆస్ట్రేలియాకు తిరిగివచ్చుట
రెండు సంవత్సరాల, మూడు నెలలు గడిచిపోయిన తరువాత, మేము ఆస్ట్రేలియాకు తిరిగి వెళ్లడానికి నిశ్చయించుకొన్నాం. ఈ సంవత్సరాలన్నికూడ చాల త్వరగా గడిచిపోయాయి. మా అమ్మాయి తెమెత్రా తన విశ్వాసమును కాపాడుకొంటూ, మెల్‌బోర్న్ సంఘంలో ఒక పరిచారకుని వివాహమాడింది. ఇపుడు నేను మెల్‌బోర్న్‌లోనున్న ఒక గ్రీకు భాషా సంఘములో సంఘ పెద్దగా ఉంటున్నాను, అక్కడనే నా భార్య, 15 సంవత్సరాల మాపాప మార్తాకూడా హాజరవుతున్నారు.
కిపారిస్యాలో మేము వదిలిపెట్టిన ఆ చిన్న సంఘం, ఇపుడు చాల పెద్దదయ్యింది. ఎంతోమంది యోగ్యమైనవారు బైబిలు సత్యాలయెడల తమ హృదయాలను విప్పసాగారు. నేను 1991 వేసవిలో కొన్ని వారాలకొరకు గ్రీసును దర్శించి, కిపారిస్యాలో ఒక బహిరంగ ప్రసంగమివ్వగా, 70 మంది హాజరయ్యారు. మా చిన్న చెల్లెలు మరియా కుటుంబములో వ్యతిరేకత ఉన్నప్పటికికూడ యెహోవాయొక్క సేవకురాలుగా మారినందుకు ఎంతో సంతోషంగా వుంది.
ఆస్ట్రేలియాలో నేను నిజమైన సంపదను—అదే సృష్టికర్తయైన యెహోవా దేవుని, ఆయన ప్రభుత్వమునుగూర్చిన జ్ఞానమును, అవగాహనను పొందగల్గినందుకు నేనెంతో కృతజ్ఞుడను. నా జీవితము ఇపుడు వాస్తవమైన సంకల్పముతో వుంది. నాకుటుంబము నేనును రాబోయే భవిష్యత్తులో దేవునియొక్క పరలోక ప్రభుత్వము క్రింద భూవ్యాప్తముగా ఉండబోయే ఆశీర్వాదముల కొరకు నిరీక్షిస్తున్నాము.—జార్జి చెప్పినది.
[23వ పేజీలోని చిత్రం]
ఆస్ట్రేలియానుండి తిరిగి వచ్చిన తరువాత నేను నివసించిన కిపారిస్యా
[23వ పేజీలోని చిత్రం]
నా భార్య అలెగ్జాండ్రియాతో