కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • g94 7/8 పేజీలు 25-27
  • సముద్రపు తాబేలు వార్షిక సందర్శన

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • సముద్రపు తాబేలు వార్షిక సందర్శన
  • తేజరిల్లు!—1994
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • సముద్రంలో నుండి అవి వస్తున్నాయ్‌!
  • గ్రుడ్లను పాతిపెట్టుట
  • సంరక్షణా ప్రయత్నాలు
  • మనిషి తాబేలు కలిసేచోటు
    తేజరిల్లు!—1993
  • ప్రపంచ పరిశీలన
    తేజరిల్లు!—1997
  • వినాశనానికి ఒక అంతం
    తేజరిల్లు!—1999
తేజరిల్లు!—1994
g94 7/8 పేజీలు 25-27

సముద్రపు తాబేలు వార్షిక సందర్శన

మలేషియాలోని తేజరిల్లు! ప్రతినిధి

దాదాపు అర్థరాత్రి కావస్తుంది. పైనుండి పౌర్ణమి చంద్రుడు ప్రశాంతంగాను, నిమ్మళంగానువున్న సముద్రముపై బంగారు కాంతిని వెదజల్లుతున్నాడు. రాంటవ్‌ అబాన్‌ సముద్ర తీరాన ప్రజలు గుంపులు గుంపులుగా కూడియున్నారు, కొందరు నిలబడి, మరికొందరు చల్లగా, మృదువుగానున్న ఇసుకపై ఆసనం వేసుకొని లేదా కూర్చొని వున్నారు. ఈ వేళప్పుడు వారిక్కడ ఏమి చేస్తున్నట్లు? ఈదుటకు పనికి వచ్చే నాలుగు కాళ్లను కల్గిన అతిపెద్ద సముద్రపు చిప్ప—అదే తాబేలు లేదా వీపుపై గట్టి చర్మం కల్గిన సముద్రపు తాబేలు సందర్శన కొరకు వారు ఓపికతో ఎదురు చూస్తున్నారు.

ఈ వింతైన ఉభయచర సందర్శకులు మరుగునపడిన ఈ సముద్ర తీరానికి అంతర్జాతీయ ఖ్యాతిని తెచ్చిపెట్టాయి. రాంటవ్‌ అబాన్‌ మలేషియా ద్వీపకల్పానికి తూర్పు తీరాన సింగపూర్‌కు 400 కిలోమీటర్ల ఎగువ ప్రాంతంలో డంగన్‌కు ఉత్తర భాగాన వున్నది. సముద్రపు తాబేళ్లు ఏటా ఒక ప్రత్యేక కార్యం నిమిత్తం సందర్శించే ప్రపంచమందలి కొన్ని ప్రదేశాలలో యిదొకటి.

ఇక్కడ గ్రుడ్లు పెట్టే కాలం రమారమి మే నుండి సెప్టెంబరు వరకు కొనసాగుతుంది. ముమ్మరంగా సాగే జూన్‌, జూలై, ఆగస్టు నెలల్లో గ్రుడ్లు పెట్టే పద్ధతిని గమనించడం చాలా సులభం. సర్వసాధారణంగా తాబేలు చీకటి పడిన తరువాత నీళ్లలో నుండి బయటకు వస్తుంది. మలేషియా, సింగపూర్‌, మరియు పశ్చిమ తీర ప్రాంతాలనుండి వచ్చిన సందర్శకులు పడిగాపులు కాయుట వృధాయేనా?

సముద్రంలో నుండి అవి వస్తున్నాయ్‌!

అకస్మాత్తుగా, తీరానికి అతి సమీపాన ప్రకాశిస్తున్న నీటిని ఛేదించుకొంటూ ఒకటి పైకి క్రిందికి కదులాడుతూ కన్పించింది. జనసమూహం పులకించిపోయారు! అది తీరానికి చేరుతుండగా, గుమ్మటం ఆకారంలోనున్న ఆ రూపం నీటిలో నుండిపైకి రావడం ప్రారంభించింది. అది తీరానికి వస్తున్న తాబేలే! అందరూ నిశ్శబ్దంగా పరిశీలించాలని లేకపోతే శబ్దం దాన్ని భయపెడుతుందని, అక్కడవున్న కొంతమంది మార్గదర్శకులు హెచ్చరించారు.

మొదట తల కన్పిస్తుంది, పిమ్మట దాని మెడ, అటుతరువాత దాని ముందు భాగం, ముందుకాళ్లు, చివరకు తాబేలు మొత్తం తీరాన్ని చేరుకొన్నది. మృదువుగా తాకుతున్న అలలు దాని తోకను, వెనుక కాళ్లను కడుగుతున్నాయి. నిజంగా ఎంత పెద్దదో కదా, ముక్కు దగ్గరనుండి తోక చివర వరకు దాదాపు రెండు మీటర్లు లేదా అంతకన్నా ఎక్కువే వుండవచ్చు! అది తీరమున కదలకుండా పడివుంది.

అకస్మాత్తుగా, తాబేలు తన ముందుకాళ్లతో తన్నుతాను లేవదీసుకొని దబ్బుమని నేలనుకొట్టి శరీరాన్ని ముందుకు నెడుతుంది. ఊపిరి తీసుకొని తరువాత లేచి ముందుకు దూకడానికి అన్నట్లు అది అక్కడే ఒక క్షణం ఆగుతుంది. ఇలా అది నేలపై కదులుతూ వుంటుంది. దానికిరువైపులానున్న జనసమూహం కొంచెం ఎడంగానే వున్నారు. ఈ విషయంలో మార్గదర్శకులు చాలా ఖండితంగా వున్నారు. దాని ప్రతీ ముందడుగుతోపాటు జనసమూహం కూడా ముందుకు సాగుతున్నారు—అయితే చడీ చప్పుడు లేకుండా వెళ్తున్నారు.

తాబేలు తీరంపై అతికష్టం మీద కదలాడుతూ, సహజసిద్ధ జ్ఞానంతో తన గమ్యాన్ని తాను తెలుసుకుంటోంది. దాని గ్రుడ్లు ఎక్కడ విజయవంతంగా పొదగబడతాయో ఆ స్థలాన్ని కనుగొనడానికి దానికున్న నిర్దేశిత జ్ఞానం దోహదపడుతుంది. అక్కడ అది ఒక గుంటను త్రవ్వడానికి ప్రారంభిస్తుంది. ఇసుకను తీసివేసే పారలవలే వెనుక కాళ్లు పనిచేస్తాయి.

ఎంతో సమయం గడిచిందనిపించిన తరువాత, గ్రుడ్లను సేకరించే అనుమతిని కూడ పొందిన ఒకానొక మార్గదర్శకుడు ముందుకు వచ్చి తన చెయ్యిని ఒక రంధ్రంలో చొప్పించాడు, అతని మోచేయి కనబడకుండాపోయేంత లోతుగా అది వుంది. అతడు తన చేయిని ఆ రంధ్రంలోనుండి వెలికి తీయగా ప్రతి ఒక్కరూ ఆశ్చర్యంతోను, పులకింతతోను ఎగయూపిరి తీశారు. అతడు ఒక గ్రుడ్డును వెలికి తీసాడు!

ఈ సముద్రపు తాబేలు గ్రుడ్డు, పాలిపోయిన తెలుపు రంగులోవుంది. దాని పరిమాణం, టేబిల్‌ టెన్నీస్‌ బంతి పరిమాణం మొదలుకొని టెన్నీస్‌ బంతి పరిమాణం వరకూ వివిధ విధాలుగా వుంటుంది. ఆ గూట్లో మిగిలివున్న చివరి కొన్ని గ్రుడ్లు సర్వసాధారణంగా గోళీల పరిమాణంలో వుంటాయి. పక్షిజాతి గ్రుడ్లవలేకాక, వీటికున్న పైపెంకు గట్టిగావున్న చర్మంలా వుంటుంది, దాన్ని వత్తితే సులభంగా నొక్కుడు పడుతుంది. వింతేమంటే, దాన్ని ఉడకబెట్టిన తరువాత కూడా అందలి తెల్లసొన ద్రవరూపంలోనే వుంటుంది. ఉడకబెట్టిన గ్రుడ్డు రుచి కొద్దిగా కారంగా, కొంచెం చేప మాదిరిగా వుంటుంది. ఒక తాబేలు సగటున 85 గ్రుడ్లను ఒకేసారి పెడుతుంది. అయితే రికార్డు స్థాయిలో 140 గ్రుడ్లను పెట్టినట్లు 1967లో నివేదించబడింది.

ఇప్పుడు ఆ జనసందోహం స్వేచ్ఛగా తిరుగవచ్చు. కొందరు సంకోచిస్తూ తాబేలును తాకి, పరిశీలిస్తున్నారు. మరి కొందరైతే దాని మీద ఎక్కి లేదా దానికి ఆనుకొని తమ కుటుంబ ఫోటో ఆల్బం కొరకు ఫోటో తీయించుకొనడానికి ఫోజులిస్తున్నారు. దాన్ని దగ్గరగా పరిశీలిస్తే, ఇసుక రేణువులతో కూడిన చిక్కని శ్లేష్మం దాని కండ్లలో నుండి కారడం కన్పిస్తుంది. నీటిలో నుండి గాలిలోనికి వచ్చినందువలన ఇది వస్తుందంటారు. ఆ తాబేలు అప్పుడప్పుడు తన నోరు తెరచి లోతునుండి వస్తున్న శబ్దంతో ఊపిరి పీల్చుకొంటుంది.

గ్రుడ్లను పాతిపెట్టుట

కొంత సమయం గడచిన తరువాత ఆ గోతిలోనికి మరలా ఇసుకను నెట్టడానికి ఆ ప్రాణి తన వెనుక కాళ్లను కదపడం ప్రారంభిస్తుంది. ఆ గొయ్యి నిండిపోగానే, ఆ సముద్రపు తాబేలు తన వెనుక కాళ్లను ఒక శక్తివంతమైన పారవలే కదిలిస్తుంది. ఇసుక అన్ని దిక్కులకు ఎగురుతుంది! జనసమూహం తమ ముఖాలను, శరీరాలను కాపాడుకొనడానికి వెంటనే వెనుకకు మళ్లుతారు. కదులాడుతున్న ఆ కాళ్లు కొంతసేపటి వరకు అలానే కొనసాగుతాయి. ఎంతటి శక్తి, బలం ప్రదర్శించబడిందో కదా! ఆ కాళ్లు చివరకు ఆగిపోయినప్పుడు, ఆ తాబేలు త్రవ్విన గొయ్యి ఎక్కడుందో జనసందోహం గుర్తుపట్టలేకపోయింది. నిజంగా అది సహజసిద్ధమైన జ్ఞానమే కదా! అయితే ఈ తాబేలును సృజించినవాని జ్ఞానం మరెంత అనంతమో కదా!

సముద్రపు తాబేలు తిరిగి సముద్రంలోనికి వెళ్లకముందు, గ్రుడ్లను సేకరించడానికి అనుమతిపొందిన వ్యక్తి దాని ముందుకాళ్లల్లో ఒకదానికి తాడును కడతాడు. ఎందుకంటే అది తరచూ భూమి మీదికి వచ్చినప్పుడు, సముద్రంలో కదులాడుతున్నప్పుడు చూడడానికి వీలుపడేలా ఇలా చేస్తారు. ప్రతి సీజన్‌లోను ఆరు నుండి తొమ్మిది సార్లు 9 నుండి 14 రోజుల వ్యవధిలో గ్రుడ్లు పెట్టడానికి వస్తుంది.

అకస్మాత్తుగా ఆ సముద్రపు తాబేలు పైకిలేచి తన్నుతాను ముందుకు నెట్టుకొంటుంది. అది సముద్రం వైపుకు వెనుదిరిగి తాను వచ్చినప్పటికంటే ఎక్కువ వేగంగా సముద్రంలోనికి వెళ్లిపోతుంది. అది నీటిని తాకినప్పుడు మొదట దాని తల అటు తరువాత పైడొప్ప లోపలికి వెళ్లిపోతుంది. చివరకు అది కనుమరుగైపోతుంది. తలను నీటిపైకి ఎత్తేసరికి తాబేలు ఎంతో దూరం వెళ్లిపోతుంది. వేగంగా అది నీటిలో ఈదుతుండగా వెన్నెల దాని ముక్కు చివర ప్రతిబింబిస్తుంటుంది. అది నీటిలో ఎంత చురుకుగా, వేగంగా తిరుగాడుతున్నదో చూడండి! అది నేలమీద ఉన్నప్పుడు ఎంత వికారంగా, సోమరి దానిలా వున్నదో దానికి పూర్తి భిన్నంగా వుంది.

సంరక్షణా ప్రయత్నాలు

ఇతర అనేకమైన జంతుజాలాలకు సంభవించినరీతిగానే ఈ సముద్రపు తాబేళ్లకు కలుషితమైన పర్యావరణం, మానవుని దురాశ మూలంగా ప్రమాదమేర్పడుతున్నది. ఆ మధ్య 1970వ పడి మధ్యకాలంలో వందలాది తాబేళ్ల పిల్లలు చనిపోయి పొరుగు రాష్ట్రమైన పహాంగ్‌ తీరప్రాంతానికి కొట్టుకొని వచ్చాయి. ప్రజలకున్న అసాధారణ జిహ్వకోరికను తృప్తిపర్చడానికి తాబేళ్ల గ్రుడ్లు విచక్షణారహితంగా సేకరించబడ్డాయి.

అదృష్టవశాత్తు ఈ తాబేళ్ల విషయంలో వాటి సంఖ్య తగ్గిపోతున్నందుకు మలేషియాలో అమితమైన శ్రద్ధ చూపబడినందున 1951 నందు తాబేళ్ల సంరక్షణా చట్టం చేయడానికి మార్గం సుగమం అయ్యింది. వ్యక్తిగతంగా గ్రుడ్లను సేకరించడం నిషేధించబడింది. అయితే దాని వలన వచ్చే అధిక లాభం ఒక శోధనగా ఉన్నందున దుర్లాభాపేక్షగల వ్యక్తులు ఈ చట్టాన్ని ధిక్కరిస్తున్నారు. అయినప్పటికిని, సంరక్షణా ప్రయత్నాలు వృధా కాలేదు.

రాంటవ్‌ అబాన్‌ సముద్ర తీరాన చిన్న చిన్న అట్టలున్న కర్రలు ఇసుకలో నిలువబెట్టి ఉండడం చూడముచ్చటగా వుంది. ప్రతిదీ సముద్ర తాబేళ్లగ్రుడ్లు పాతిపెట్టిన ప్రాంతాలను చూపిస్తుంటుంది. ఎన్ని గ్రుడ్లు ఉన్నాయో, అవి పెట్టబడిన తారీఖు ఏమిటో, ఆ గ్రుడ్లు దేనికి సంబంధించినవో తెలియజేసే రహస్య సంఖ్య ప్రతి బోర్డు చూపిస్తుంది. అవి పెట్టబడిన 45 రోజుల తరువాత, పిల్లలు తప్పించుకొని పోకుండా నిరోధించడానికి ప్రతి అట్ట చుట్టూ వలను వేస్తారు. అవి పిల్లలయ్యే కాలం 52 నుండి 61 రోజుల వరకూ ఉంటుంది. సర్వసాధారణంగా సూర్యాస్తమయం తరువాత పిల్లలపైకి వస్తుండగా, ప్రతి రంధ్రంలోనుండి వస్తున్నవాటి సంఖ్యను వ్రాసుకుంటారు. తరువాత వాటిని పాత్రల్లో వేసి, అటుపిదప సముద్ర ఒడ్డున విడిచిపెడతారు.

ఈ సంరక్షణా కార్యక్రమం అనేక వేలాది పిల్లలను విజయవంతంగా ఉత్పత్తిచేసి వాటిని తమ గృహమైన నీటిలోనికి పంపివేసింది. అయితే అవి బ్రతికి బయటపడే సంఖ్య తక్కువగా వుండడం, అలాగే రాంటవ్‌ అబాన్‌ తీరానికి వస్తున్న తాబేళ్ల సంఖ్య తగ్గిపోవడం ఇంకనూ శ్రద్ధ వహించాల్సిన విషయంగానే వున్నది.

[26వ పేజీలోని చిత్రాలు]

తల మొదలుకొని తోకవరకు సుమారు రెండు మీటర్ల పొడవున్న, సముద్ర తాబేలు డజన్ల కొద్దీ గ్రుడ్లను పెడుతుంది. సుమారు ఎనిమిది వారముల తరువాత పిల్లలు బయటకు వస్తాయి

[Credit Lines]

Leathery turtle. Lydekker

C. Allen Morgan/Peter Arnold

David Harvey/SUPERSTOCK

[Picture Credit Line on page 25]

C. Allen Morgan/Peter Arnold

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి