అరటి పండు—ఓ అద్భుతమైన పండు
హొండూరాస్‌లోని తేజరిల్లు! ప్రతినిధి
గ్రీకులు, అరబ్బులు దాన్ని “ఓ అద్భుతమైన ఫల వృక్షం” అని పిలిచారు. సా.శ.పూ. 327లో అలెగ్జాండరు ది గ్రేట్ సైన్యములు దానిని ఇండియాలో కనుగొన్నాయి. పురాతన చరిత్ర ప్రకారం, ఇండియాలోని ఋషులు వాటి నీడలో విశ్రాంతి తీసుకొని వాటి పండ్లు భుజించేవారు. కాబట్టి అది “జ్ఞానుల పండు” అని పిలువబడింది. అది ఏ పండు? అదేనండి అరటి పండు!
ఇంతకు అరటి పండు ఆసియా నుండి కరీబియనుకు ఎలా వచ్చింది? తొలి అరబ్బు వర్తకులు అరటి పిలకలను ఆసియా నుండి ఆఫ్రికా తూర్పు తీర ప్రాంతానికి తీసుకువెళ్ళారు. పోర్చుగీసు పరిశోధకులు 1482లో అక్కడ పెరుగుతున్న అరటి మొక్కలను చూసి, వాటి పిలకలను ఆఫ్రికాలో దానికి పెట్టబడిన బనానా అన్న పేరును, కానరీ దీవుల్లోని పోర్చుగీసు కాలనీలకు తీసుకు వెళ్ళారు. అక్కడి నుండి అట్లాంటిక్ మీదుగా పశ్చిమార్ధ గోళానికి ప్రయాణం చేయడమే తర్వాతి మెట్టు. కొలంబస్ సముద్రప్రయాణం చేసిన కొన్ని సంవత్సరాల తర్వాత 1516లో అది జరిగింది. స్పానిష్ మిషనరీలు అరటి మొక్కలను కరీబియన్ దీవులకు, ఉష్ణమండల ప్రాంతాలకు తీసుకువెళ్ళారు. అలా, యీ అద్భుతమైన ఫల వృక్షం మధ్య అమెరికాను, దక్షిణ అమెరికాను చేరుకోడానికి సగం మట్టుకు ప్రపంచయానం చేయవలసి వచ్చింది.
నివేదిక ప్రకారం, 1690లో అరటి పండు మొదటి సారిగా కరీబియా దీవుల నుండి న్యూ ఇంగ్లాండుకి తీసుకు వెళ్ళబడింది. ప్యూరిటన్లు వింతైన అరటి పండ్లను ఉడకబెట్టారు, అది వాళ్ళకు నచ్చలేదు. అయితే, దక్షిణ అమెరికా, మధ్య అమెరికా దేశాల్లో, అలాగే యితర ఉష్ణమండల దేశాల్లో లక్షలాది మంది ప్రజలు పచ్చి అరటికాయలను ఉడకబెట్టి, వాటిని ఉల్లాసంతో తింటారు.
అరటి తోటలు
అనేక మంది ఐరోపా వర్తకులకు, ఉత్తర అమెరికా వర్తకులకు, అరటి పండ్లను ఎగుమతి చెయ్యాలన్న ఆసక్తి 1870కి, 1880కి మధ్య కాలంలో పెరిగి ఉండవచ్చు. వారు కంపెనీలను స్థాపించి అరటి తోటలను నాటి, వాటిని ఫిన్‌కాస్ అని పిలిచారు. ఇందు నిమిత్తమే, పనివారు, ఇంజనీర్లు, అడవులను నరికి రహదారులను నిర్మించి, రైల్వేలైన్లను, సమాచార సంబంధాలను నెలకొల్పారు. పనివారి కొరకు, వారి కుటుంబాల కొరకు యిండ్లు, పాఠశాలలు, ఆసుపత్రులు ఉన్న గ్రామాలను నెలకొల్పారు. అరటి పండ్లను రవాణా చెయ్యడానికి ప్రపంచమంతటా ఆవిరితో నడిచే ఓడలను నిర్మించారు. పరిశ్రమ పెరుగుతున్న కొలది, అరటిని సాగు చేసే దేశాల్లో కంపెనీలు ఎక్కువ భూమిని కొన్నాయి.
నేడు, దక్షిణ అమెరికాలో తింటున్న అరటి పండ్లలో 90 కన్నా ఎక్కువ శాతాన్ని లాటిన్-అమెరికా దేశాలు సరఫరా చేస్తున్నాయి. బ్రెజిల్ ఎగుమతుల్లో అగ్రగామి. హూండూరాస్ పట్టికలో ఆరవది. యిది సంవత్సరానికి వందకోట్ల కిలోగ్రాముల అరటి పండ్లను ఎగుమతి చేస్తుంది.
అరటి చెట్లు ఎలా పెరుగుతాయి
అరటి మొక్క వృక్షం కాదు. దానికి చెక్కబెరడులు లేవు. అయితే యిది తాటి చెట్టులా కనబడే మిక్కిలి పెద్ద మొక్క. వాతావరణం, నేల మొక్క పెరుగుదలను, పరిమాణాన్ని నిర్ణయిస్తాయి. వేడిగా ఉండే ప్రాంతాల్లోను, చిత్తడిగా ఉండే వాతావరణంలోను బాగా పెరుగుతుంది, యిసుకలోను, బురద మట్టిలోను, మురికి నీరు బాగా లభించే చోటను అరటి యింకా ఏపుగా ఎంత నిడివికైనా పెరుగుతుంది. అది బాగా పెరగాలంటే, ఎన్నటికీ ఉష్ణోగ్రత 20 డిగ్రీల సెల్సియస్ కన్నా తక్కువ ఉండకూడదు.
ఈ పైరును వేయాలంటే బాగా ఎదిగిన మొక్కల మొదలు నుండి నరికిన అరటి పిలకలను మీరు నాటాలి. ఒక్కో గుంట ఒక్కొక్క అడుగు లోతు చొప్పున 18 అడుగుల దూరాన తవ్వాలి. మూడు నాలుగు వారాల్లోగా, పచ్చని ఆకులు బిగుసుగా చుట్టుకున్న పచ్చని చిగుర్లు పైకివస్తాయి. పెరుగుతున్న కొలది వాటి ఆకులు విప్పుకుంటాయి. అరటి మొక్కలు రోజుకు ఒక అంగుళం చొప్పున అతి వేగంగా పెరుగుతాయి. పది నెలల తర్వాత, మొక్క పూర్తిగా ఎదిగి, మూడు నుండి ఆరు మీటర్ల ఎత్తున ఉండి తాటి చెట్టులా కన్పిస్తుంది.
పూర్తిగా ఎదిగిన బోదెమీద, చుట్టలా ముడుచుకొనివున్న ఆకుల నుండి ఎరుపు నీలం కలిసిన రంగులోని చిన్న రెమ్మలతో కూడిన పెద్ద మొగ్గ పెరుగుతుంది. తర్వాత చిన్న పూల గుచ్ఛాలు కన్పిస్తాయి. ఒక చెట్టు 30 నుండి 50 కిలోగ్రాముల బరువు కలిగి, 9 నుండి 16 గుత్తులు గల ఒకే ఒక గెలను కాస్తుంది. ప్రతి గుత్తును హస్తం అంటారు. ప్రతి హస్తంలోను 10 నుండి 20 పండ్లుంటాయి. కాబట్టి అరటి పండ్లను వేళ్ళంటారు.
మొదట్లో, అరటి పండ్లు నేలవైపు కిందికి పెరుగుతూ, అరటిగెల అందరికీ తెలిసిన వంపుకి మారుతుంది. పెరుగుదల సమయంలో పోషణ, సంరక్షణలను గూర్చిన మాటేమిటి? సకాలంలో పనివాడొచ్చి, చెట్టులోని ఆహారమంతటినీ పండ్లు తీసుకునేలా మొగ్గను తీసివేస్తాడు. తర్వాత కీటకాలనుండి రక్షించడానికి అరటి పండ్లపై పాలిఎథిలీన్ సంచిని కప్పుతాడు. అరటి పండ్లు పైకి పెరుగుతూ, చాలా బరువెక్కుతాయి, గనుక, గాలి వలన, కాయల బరువు వలన చెట్టు, పండ్లు పడిపోకుండా ఉండేందుకు, దాన్ని ప్రక్కనున్న చెట్లతో కడతారు. చివరికి, పండ్లు ఎప్పుడు కోతకు వస్తాయో తెలుసుకునేందుకు రంగు రిబ్బన్ను కవరుకు కడతారు.
ప్రతిరోజు, విమానాలు తోటలపై ఎగురుతూ మొక్కల ఆకులపై మందును చల్లుతాయి. ఇది వాటిని మూడు ముఖ్యమైన రోగాల నుండి రక్షిస్తుంది. కొన్ని చెట్లను పాడు చేసే ఫంగస్ గల పనామా రోగం ఒకటి. అయితే పాడైన మొక్కలకు బదులుగా యీ రోగాన్ని ఎదిరించగల వేరే రకాల మొక్కలను నాటుతారు. బాక్టీరియా వలన వచ్చే మాకో రోగం మరొకటి. కొన్ని రోగాలను వ్యాపింపజేసే క్రిములను ఆకర్షించే మొక్కలను పుష్పాలను తొలగించడం ద్వారా వాటిని అదుపులో ఉంచవచ్చు. సిగాటొకా మరొక రోగం. ఇది సోకినప్పుడు, రసాయనిక మందులను వెంటనే చల్లితే పండ్లకు హాని కలిగించకుండా ఆకులను మాత్రమే అది పాడు చేస్తుంది. అరటి చెట్లకు చిన్న నీటికాలువల ద్వారా, హై ప్రెషర్ స్ప్రేయర్ సిస్టం ద్వారా మరింత నీరు పెట్టవలసి ఉంది. అరటి తోటలను గడ్డి, కలుపు లేకుండా ఉంచాలని కూడా చెప్పవచ్చును.
తోటనుండి మీ బల్ల మీదికి
రిబ్బను రంగు అరటి పండ్లు కోతకు సిద్ధంగా ఉన్నాయని సూచిస్తున్నట్లయితే, అవి కోతకు తగినంతగా పెరిగాయని నిర్థారించడానికి వాటి పరిమాణాన్ని కొలవాలి. స్థానిక అవసరానికొరకైనప్పటికీ, అరటికాయలు పండడానికి వాటిని చెట్టు మీదే ఉంచకూడదు. ఎందుకలా? ఎందుకంటే విశేషమైన వాటి రుచి పోతుంది. పంటను ఎప్పుడు కోయాలని తీర్మానించే ముందు ఎంత దూరానికి ఎగుమతి చేస్తారు, ఎలా తీసుకువెళ్తారు అన్న విషయాలను తప్పనిసరిగా పరిగణించాలి. పనివాడు పెద్ద కత్తితో గెలలను కోసి వాటిని ప్యాకింగ్ చేసే గృహానికి పంపుతారు. కోత తర్వాత అరటి మొక్కను ఏం చేస్తారు? దాని స్థానంలో కొత్త మొలకలు పెరగడానికి దాన్ని కొట్టివేస్తారు.
ప్యాకింగ్ చేసే గృహం దగ్గర, అరటి కాయలను కడుగుతారు, చితికిన వాటిని పనివారు, వారి కుటుంబాలు తినడానికి పక్కన తీసిపెడతారు. చిన్న అరటి కాయలను రుచిని కలుగజేయడానికి, పిల్లల ఆహారం తయారుచేయడానికి ఉపయోగిస్తారు. మంచి పండ్లను ఒక్కో పెట్టెలో 18 కిలోల చొప్పున పెట్టి రెఫ్రిజిరేషన్ ఉన్న రైళ్ళలోను, ఓడల్లోను విదేశాలకు పంపుతారు.
ఓడరేవులో పండ్ల నాణ్యతను చూస్తారు, వాటి ఉష్ణోగ్రతను చూస్తారు. అరటి కాయలను మొక్క నుండి కోసిన తర్వాత, మార్కెట్‌కి చేరుకునే దాకా అవి పచ్చగానే ఉండాలి. అరటిపండ్లు పాడవుతాయి కాబట్టి, వాటిని త్వరగా తీసుకొని, ఓడలో ఎక్కించి 10 నుండి 20 రోజుల్లోగా కొట్లలో అమ్మేయాలి. అరటి కాయలు పండిపోకుండా ఉండేందుకు 12 నుండి 13 డిగ్రీల సెల్సియస్ చల్లదనంలో ఉంచాలి. ఆధునిక రవాణా సౌకర్యాల వల్ల మధ్య ఆఫ్రికా, దక్షిణాఫ్రికాల నుండి కెనడా, ఐరోపా అంతటి దూర ప్రాంతాల వరకు ఎలాంటి సమస్యలు లేకుండా అరటి పండ్లను పంపించవచ్చు.
ఆచరణాత్మక విలువ, మరియు పోషణ
వంద లేదా అంతకన్నా ఎక్కువ రకాల అరటి పండ్లున్నాయి. చిన్నవిగా ఉండే అరటి పండ్లు ముఖ్యంగా ఐరోపాకు, కెనడాకు అమెరికాకు సర్వసాధారణంగా ఎగుమతి చేయబడే రకం. ఎగుమతి చేయడానికి పల్చని తొక్కగల చిన్న రకాలు విస్తారంగా హూండూరాస్‌లో కన్పిస్తాయి. ఇవి మాన్‌సానా (ఆపిల్) మరియు రెడ్ జమైకా అని పిలువబడతాయి.
అరటి ఆకుల్లో ప్రయోజనకరమైన నారలు ఉన్నాయి, వాటిని ఉష్టమండల ప్రాంతాల్లో వివిధ అవసరాలకు ఉపయోగిస్తారు. మార్కెట్‌కి వెళ్ళినప్పుడు, వివిధ దేశాల్లో ఖ్యాతి చెందిన టామేల్స్ అని పిలువబడే వేడివేడి శాఖాహారాన్ని కట్టేందుకు ఉపయోగించే అరిటాకులను కుప్పలు కుప్పలుగా వేసి ఉండడాన్ని చూడవచ్చు.
హూండూరాస్‌లోని అనేకమంది ప్రజలు తమ ఆహారంతో పాటు అరటి పండును తినడానికి యిష్టపడతారు. హూండూరాస్ ఉత్తర తీరంలో రుచికరమైన ఆహారాన్ని మాచుకా అంటారు. దాన్ని తయారు చేయడానికి లేత అరటి కాయను రోట్లో వేసి దంచి, సుగంధ ద్రవ్యాలను కలిపి ఆ మిశ్రమాన్ని పీతలతోపాటు కొబ్బరి నూనెలో వేసివండుతారు.
అమెరికాలో సంవత్సరానికి 11 అరబ్‌ల (పదకొండు వందల కోట్లు) అరటి పండ్లు తింటారు. కెనడాకు, బ్రిటన్‌కు, ఐరోపాలోని యితర దేశాలకు బారీ ఎత్తున ఎగుమతి చేయబడతాయి. ఈ పండ్లను తినడం వల్ల ఏ పోషక గుణాలు లభిస్తాయి? అరటి పండ్లలో విటమిన్ ఎ, విటమిన్ సి, కార్బోహైడ్రేట్‌లు, ఫాస్ఫరస్, పొటాషియమ్ సమృద్ధిగా లభిస్తాయి.
అరటి పండ్ల వలన చాలా ఉపయోగాలు ఉన్నాయి! అల్పాహారాల్లో, ధాన్యంతో చేసే ఆహార పదార్థాల్లో, పండ్ల మిశ్రమాల్లో, పిండి వంటకాల్లో, కేకుల్లో, బనానా స్ప్లిట్‌లో కూడా అరటి పండ్లు వేస్తే బాగుంటుంది. అయితే యీసారి మీరు అరటి పండ్లు తినేటప్పుడు దాని శ్రేష్ఠతలను గూర్చి తలంచండి. ఈ పండుకి తనదైన తొడుగు ఉంది. దీనిలో విటమిన్లు, ఖనిజ పదార్థాలు సమృద్ధిగా ఉన్నాయి. అవును, అరటి పండు మీ బల్ల మీదకు చేరుకోవడానికి ప్రపంచ సగభాగాన్ని చుట్టి వచ్చి ఉండవచ్చు.