నేను మార్చుకోడానికి యిష్టపడని జీవితం
చాలామంది ప్రజలు తమ జీవితాలను గడిపిన విధానాన్ని బట్టి పశ్చాత్తాపపడతారు. వారు యిలా అనవచ్చు: ‘నేను జీవితాన్ని మరొకసారి మొదలు పెట్టినట్లయితే, నేను ఎన్ని సంగతులను మరోవిధంగా చేసేవాడినో!’ నా జీవితాన్ని గూర్చి తలపోసినప్పుడు అది అంత సాఫీగా జరుగకపోయినప్పటికీ, అది నేను మార్చుకోడానికి యిష్టపడని జీవితమే.
నా తల్లిదండ్రులు నన్ను యెహోవాసాక్షుల్లో ఒకరిగా పెంచారు. చిన్నప్పటి నుండే దేవుని నియమాలు నా హృదయంలో నాటుకున్నాయి. (2 తిమోతి 3:15) యెహోవాసాక్షుల కూటాలకుగాని, సమావేశాలకుగాని నేను హాజరుకాకపోవడం గుర్తేలేదు. నేను చిన్న పిల్లగా ఉన్నప్పుడు, దేవుని రాజ్య పరిపాలన క్రింద భూపరదైసుపై నిత్యజీవమును పొందే బైబిలు నిరీక్షణను గూర్చి ప్రజలు తెలుసుకొనేలా వారికి సహాయం చేయడానికి, నేను కూడా పెద్దవారైన యెహోవాసాక్షులతోపాటు వెళ్ళేదాన్ని. (మత్తయి 24:14) నాకు ఐదేండ్లున్నప్పుడు, ది కింగ్‌డమ్, ది హోప్ ఆఫ్ ది వరల్డ్ అనే పేరుగల చిన్న పుస్తకాలను యితరులకు అందించడం నాకిప్పటికీ గుర్తుంది.
నా తల్లిదండ్రులు 1917లో మొదటిసారిగా దేవుని రాజ్యమును గూర్చిన సత్యాన్ని విన్నారు. చర్చీకి వెళ్ళేవారైనప్పటికీ, అమెరికాలోని న్యూ జెర్సీయందలి, బ్రిడ్జ్‌టన్‌లో వాచ్‌టవర్ సొసైటీ ప్రయాణ ప్రతినిధి యిచ్చిన ప్రసంగంలో వారు సత్యాన్ని గ్రహించారు. మా తాత అదే ప్రసంగాన్ని విన్నాడు, తాను విన్నది సత్యమని ఆయన కూడా నమ్మారు. నాకు 14 ఏండ్లున్నప్పుడు, మిచిగన్, డెట్రోయిట్‌లో జరిగిన సమావేశంలో నా జీవితాన్ని యెహోవాకు సమర్పించుకున్నానని సూచించడానికి బాప్తిస్మం తీసుకున్నాను.
ఆ సంవత్సరాల్లో, బైబిలు పఠనం కొరకైన మా వారపు కూటాలు మా యింటి మొదటి గదిలో జరిగేవి. చివరికి, ఒక దుకాణాన్ని కొని, దాన్ని రాజ్యమందిరంగా మార్చేశారు. అప్పట్లో రాజ్య మందిరాలు ఉండేవి కావు. కాని నేడు, ప్రపంచవ్యాప్తంగా, 70,000 కన్నా ఎక్కువ సంఖ్యలోవున్న యెహోవాసాక్షుల సంఘాలకొరకు వేలాది రాజ్యమందిరాలు నిర్మించబడ్డాయి.
పూర్తికాల సేవను ఆరంభించుట
మా అమ్మ 1939లో పూర్తికాల సేవకురాలిగా పరిచర్యను ఆరంభించి, తన మరణం వరకు, అంటే 85 ఏండ్ల వరకు కొనసాగించింది. రెండవ ప్రపంచ యుద్ధం ఐరోపాలో చెలరేగినప్పుడు, రాజకీయాల విషయంలో మనం తటస్థంగా ఉండడం వలన అంతటా యెహోవాసాక్షులపై విరోధం ప్రబలినప్పుడు, అంటే, 1941, ఏప్రిల్ 1న నేను నా సహోదరుడు డిక్, పూర్తికాల సేవను ప్రారంభించాము.
తటస్థంగా ఉండడం వలన మా సంఘంలోని యౌవనసాక్షుల్లో ముగ్గురు, ఐదు సంవత్సరాలు జైల్లో వేయబడ్డారు. వారిలో యిద్దరు యిప్పటికీ సంఘ పెద్దలుగా సేవ చేస్తుండడాన్ని చూడడం ఎంత ప్రోత్సాహకరంగా ఉందో! పిమ్మట, నా సహోదరుడు న్యూయార్క్‌లోని బ్రూక్లిన్‌లో యెహోవాసాక్షుల ప్రపంచ ప్రధాన కార్యాలయమైన బేతేలులో సేవ చేశాడు, యిప్పటికి న్యూ జెర్సీలో, మా స్వంత ఊరైన మిల్‌వైలెలో సంఘ పెద్దగా సేవ చేస్తున్నాడు.
మిగతాచోట్ల ఉన్నట్లే, అమెరికాలో కూడా యుద్ధం జరిగిన సంవత్సరాల్లో యెహోవాసాక్షులకు చాలా యిబ్బందిగా ఉండేది. విధ్వంసకాండలు సర్వసాధారణంగా ఉండేవి. పిల్లలను స్కూలునుండి వెళ్ళగొట్టేవారు. (లిలియన్ గ్లోబిటాజ్ క్లాజా జీవితమును గూర్చి అవేక్! జూలై 22, 1993 చూడండి.) అనేక వేలమంది మన ఆత్మీయ సహోదరులు జైళ్ళకు వెళ్ళారు, కాబట్టి, స్త్రీలమైన మేము సంఘం యొక్క వివిధ కర్తవ్యాలను నిర్వహించవలసి వచ్చింది. అందుకే, నేను చిన్నగా ఉన్నప్పుడే సాహిత్య పరిచారకురాలిగా పని చేయవలసి వచ్చింది. యుద్ధం జరిగిన క్లిష్టమైన సంవత్సరాలను యెహోవా సహాయము వల్ల అధిగమించగల్గాం, సహోదరులు జైళ్ళనుండి తిరిగి వచ్చినప్పుడు అన్నీ సక్రమంగా జరిగాయి.
ఆ సమయంలోనే బేతేలు నుండి లైమెన్ స్వింగెల్ మా సంఘాన్ని దర్శించారు. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఐరోపాలోని మన తోటి సాక్షుల ఉపశమన ఏర్పాట్లలో సహాయపడేందుకు నన్ను బ్రూక్లిన్‌కు రమ్మని ఆయన ప్రోత్సహించారు. అలా నేను 1948, మార్చిలో బ్రూక్లిన్‌కు వెళ్ళాను.
కొత్త సంఘంలో సంతోషకరమైన సంవత్సరాలు
బ్రూక్లిన్ సెంటర్‌లోని నా కొత్త సంఘానికి నేను నియమించబడ్డాను. వేరే పేరైనప్పటికీ, మొదటి ప్రపంచ యుద్ధానికి ముందు న్యూయార్క్ నగరంలోను, దాని చుట్టుప్రక్కల ఉన్న ప్రాంతాల్లోను నెలకొల్పబడిన మొదటి సంఘం అదే. ఆ కాలంలో అది బ్రూక్లిన్ హైట్స్ అనే ప్రాంతంలో ఉండేది. కాని, 1948లో నేను బ్రూక్లిన్ సెంటర్‌కి వచ్చినపుడు, అది బ్రూక్లిన్‌లో ఐదవ అవెన్యూ, 8వ వీధి కలిసేచోట ఉండేది. దీనికి యింకొంచెం దూరాన ఒక కొత్త రాజ్యమందిరాన్ని కొనే వరకు దాదాపు 30 సంవత్సరాల వరకు అద్దెకు తీసుకున్న ఆ స్థలం మా కూటాలకు ఉపయోగపడింది.
బ్రూక్లిన్‌లోని, హెన్రీ వీధిలో నేను సువార్త పని చేసిన మొదటి రోజును నేనెన్నటికీ మరువను. చిన్న పట్టణంలో సాక్ష్యమివ్వడానికి దీనికి ఎంతో తేడా ఉంది. కొద్దిసేపటిలోనే నేను ఒక యువతిని కలిశాను, ఆమె బైబిలు సాహిత్యాన్ని తీసుకొని, గృహ బైబిలు పఠనానికి అంగీకరించింది. కొంత కాలంలోనే ఆమె, ఆమె పిల్లల్లోని యిద్దరు యెహోవాకు సమర్పించుకున్న పరిచారకులయ్యారు. యీ మధ్యే, ఆమె కొడుకు ఆర్థర్ లానోన్, బ్రూక్లిన్ బేతేలులో తన భార్య లిండా, తమ కొడుకు, కోడలుతోపాటు సేవ చేస్తున్నారు.
మేము ప్రకటించిన సంఘం యొక్క ప్రదేశం విస్తారంగాను, ఫలవంతంగానూ ఉంది. యెహోవా సహాయం వలన, నా బైబిలు విద్యార్థుల్లోని అనేకులు సత్యాన్ని నేర్చుకొని బాప్తిస్మం పొందడాన్ని నేను చూడగల్గాను. కొంతమంది యీ దేశంలోనే యిప్పటి వరకూ పూర్తికాల సేవకులుగా పరిచర్య చేస్తున్నారు. ఇంకా కొందరు విదేశాల్లో మిషనరీలుగా సేవ చేస్తున్నారు. మరి కొందరు సంఘంలో పెద్దలయ్యారు. అనేకులు యితర స్థానాల్లో ఉంటూ నమ్మకస్థులైన దేవుని రాజ్య పరిచారకులుగా సేవ చేస్తున్నారు.
అభివృద్ధి అద్భుతంగా ఉంది. న్యూయార్క్ నగరానికి, చుట్టుప్రక్కల ప్రాంతాలకు కలిపి ఒకే ఒక సంఘముండిన చోట, నేడు, కేవలం న్యూయార్క్ నగరంలోనే దాదాపు 400 సంఘాలున్నాయి. ఈ విస్తరణంలో నేను పాలుపంచుకున్న మధురస్మృతులెన్ని ఉన్నాయో!
ఫ్రెంచ్ భాష మాట్లాడేవారి ఆసక్తి పెరుగుతుంది
మా సంఘప్రాంతంలో హయిటీ నుండి వచ్చిన ఫ్రెంచ్ భాష మాట్లాడేవారిని, మేము 1960లలో కలవడం ప్రారంభించాం. అనేకులు ఏదో ఇంగ్లీషు కొద్దిగా మాట్లాడగలరు, కొందరు అసలు మాట్లాడలేరు. ఇదొక సవాలు. బైబిలును గూర్చి ఎక్కువగా తెలుసుకోవడానికి మేం వారికెలా సహాయం చేయగలం? నేను ఫ్రెంచ్ భాష మాట్లాడలేను. అయినప్పటికీ, బైబిలు మూల పాఠాలను నేర్పే ఇంగ్లీషు ప్రతిని ఒక చేతిలోను, దాని ఫ్రెంచ్ అనువాదాన్ని మరో చేతిలోను పట్టుకుని, బైబిలు పఠనాలు నిర్వహించగల్గాను.
అయినా, యీ ప్రజలు ఆత్మీయంగా ఎదగడానికి సహాయపడేందుకు ఫ్రెంచ్ భాషలో కూటాలు ఉండేవికావు. అందువల్ల, ఫ్రెంచ్ భాష మాట్లాడగల సాక్షులైన మిషనరీలు ఎవరైనా బ్రూక్లిన్ సందర్శించినప్పుడు, సహాయం చేయమని వెంటనే వారిని అడిగేవారు. మాకు సహాయం చేయడానికి మొదటిగా వచ్చినవారిలో గ్వాడెలోప్ బ్రాంచి కమిటీ సమన్వయకర్తయైన నికలోస్ బ్రిజార్ ఒకరు. యిప్పటికీ యెహోవాను నమ్మకంగా సేవిస్తున్న, సహోదరి భర్తా లేడాన్ యింట ఆయన మా మొదటి బహిరంగ ప్రసంగాన్ని ఫ్రెంచ్ భాషలో యిచ్చారు. ఆ రోజు 27 మంది హాజరయ్యారు.
అయినా, ఆ కాలంలో న్యూయార్క్ నగరంలో స్పానిష్ భాష తప్ప వేరే విదేశీ భాష సంఘాలు లేవు. కాబట్టి, అధికారంగా ఫ్రెంచ్ భాష మాట్లాడేవారి సంఘాన్ని నెలకొల్పాలని ఊహించడమే చాలా కష్టంగా ఉండేది. ఈ దేశంలోని ప్రజలందరూ ఇంగ్లీషు భాషను నేర్చుకోవడమే అప్పుడు చేపట్టవలసిన విధానమని తెలుపుతూ, ప్రయాణ కాపరి ఆ పనిని మరింత నిరుత్సాహపరచారు.
తర్వాత వాచ్‌టవర్ సొసైటీ అధ్యక్షుడైన, సహోదరుడు ఫ్రెడ్ డబ్ల్యు. ఫ్రాంజ్, బాగా ప్రోత్సాహపరచేవారు. “మేరీ, యెహోవా చిత్తమైతే, ఫ్రెంచ్ సంఘం ఏర్పడుతుంది,” అని ఆయన అన్నారు. బ్రూక్లిన్ సెంటర్ సంఘాధ్యక్షుడైన సహోదరుడు హారి పెలోయన్ కూడా బాగా ప్రోత్సాహపరచేవారు. సాయంకాలాల్లో రాజ్యమందిరాన్ని ఉపయోగించనప్పుడు, ఫ్రెంచ్ భాషలో సంఘ పుస్తక పఠనాలను అనధికారంగా కలిగియుండవచ్చు. ఫ్రెంచ్ భాష తెలిసిన సందర్శకుడు వచ్చినప్పుడెల్లా, బహిరంగ ప్రసంగాలను కలిగియుండవచ్చని ఆయన అన్నారు.
ఈ సమయంలో, హయిటీ నుండి వచ్చిన బాప్తిస్మం పొందిన సహోదరులు అనేకులున్నారు కాని, ఫ్రెంచ్ సంఘానికి నాయకత్వం వహించడానికి అవసరమైన అనుభవం ఎవరికీ రాలేదు. తర్వాత, ఫ్రాన్సులో చదువుకున్న, బ్రూక్లిన్ బేతేలు కుటుంబ సభ్యుడైన సహోదరుడు తిమోతి గాల్‌ఫాస్ మా పరిస్థితిని తెలుసుకున్నారు. ప్రతి శనివారం బేతేలులో పని ముగిసిన తర్వాత, ఆయన అక్కడనుండి వచ్చేవాడు, హయిటీ నుండి వచ్చి యిక్కడ నివసిస్తూ ఎక్కడ కూడుకోవాలో తెలియని సహోదరసహోదరీల కొరకు వెదకేవారము.
తొందరలోనే మాతో పాటు సహవసించడానికి దాదాపు నలభైమంది చేరారు. మేము మా ప్రయాణ కాపరితో, మేము ఫ్రెంచ్ భాషలో అధికారిక సంఘ పుస్తక పఠనాన్ని కలిగివుండేందుకు అనుమతికొరకు సొసైటీకి వ్రాయమని కోరాం. అది అనుమతించబడినప్పుడు మేమెంతగా ఆనందించామో! ఆ తర్వాత క్రమంగా బహిరంగ ప్రసంగాలను, వారపు కావలికోట పఠనాన్ని కూడా కలిగియుండేందుకు మాకు అనుమతి లభించింది.
మొదటి ఫ్రెంచ్ సంఘం
డిశంబరు 1, 1967న, అమెరికాలో మొదటి సారిగా ఫ్రెంచ్ భాష మాట్లాడేవారి సంఘాన్ని నెలకొల్పేందుకు మాకు అంగీకారం లభించింది. అది బ్రూక్లిన్ సెంటర్‌తోను, ప్రోస్‌పెక్ట్ సంఘంతోను రాజ్యమందిరాన్ని పంచుకొనేది! తాము అర్థం చేసుకోగల్గే భాషలో అయితే వారు ఆత్మీయంగా ఎంతో ఎదుగుతారని మాకు తెలుసు. బ్రూక్లిన్ సెంటర్ సర్వీస్ కమిటీగా ఏర్పడిన హారి పెలోయన్, జార్జ్ హాడడ్, కార్లోస్ క్విల్స్ సహోదరులు శ్రమలు ఎక్కువైన ఆ సంవత్సరాల్లో యిచ్చిన మద్దతు ఎంతో ప్రశంసనీయము.
మేము అతి త్వరగా ఎదిగాం. త్వరలోనే, న్యూయార్క్‌కి దక్షిణాన ఉన్న మాన్‌హట్టాన్, క్వీన్స్ నగరాల్లోను, న్యాక్ గ్రామంలోను కొత్త ఫ్రెంచ్ సంఘాలు ఏర్పడ్డాయి. బ్రూక్లిన్ బేతేలులోని జెఫ్ కెల్ట్స్, టామ్ సెసల్ యీ పెరుగుదలకు ఎంతో తోడ్పడ్డారు. సహోదరుడు కెల్ట్స్ మా ప్రయాణ కాపరిగాను, సహోదరుడు సెసల్ మా జిల్లా సమావేశ కమిటీలోను సేవ చేశారు. ఫ్రెంచ్ భాష మాట్లాడే దేశాల నుండి అనారోగ్య కారణాల వల్ల అమెరికాకు తిరిగి వచ్చిన మిషనరీలు, యితరులు కూడా సహాయం చేశారు. వారి సహాయం ఎంత అమూల్యమైనదని నిరూపించబడిందో! అధ్యక్షుడుగాను, సహాయ ప్రయాణ కాపరిగాను సేవచేస్తున్న స్టాన్లీ బోగెస్ వారిలో ఒకరు.
ఐదవ అవెన్యూ, 8వ వీధిలోని చిన్న ఫ్రెంచ్ సంఘం నేడు కొన్ని డజన్ల సంఘాలుగాను, రెండు సర్క్యూట్లుగాను పెరుగుతుండడం చూస్తుంటే ఎంత ఆనందంగా ఉందో! నిజానికి, 1970 ఏప్రిల్‌లో, మా మొదటి ఫ్రెంచ్ ప్రాంతీయ సమావేశం కూడా జరిగింది. అప్పుడు వాచ్‌టవర్ సొసైటీ అధ్యక్షుడుగావున్న సహోదరుడు నాతాన్ హెచ్. నార్, శుక్రవారం రాత్రి మమ్మల్ని సంబోధించి, శుభాకాంక్షలు తెలిపారు. ఆ వేసవిలోనే న్యూజెర్సీ, జెర్సీ నగరంలోని రూస్‌వెల్ట్ స్టేడియంలో, తాత్కాలికంగా కట్టిన గాలరీలో మా మొదటి జిల్లా సమావేశం జరిగింది. అది చాలా వేడిగాను, దుమ్ముతోనూ ఉంది, అయినా ఫ్రెంచ్ భాషలోని నాటకంతో సహా కార్యక్రమమంతటిని వినడానికి హాజరైన 200 కంటే ఎక్కువ మంది ఎంతో సంతోషించారు.
జెర్సీ నగరంలోని యెహోవాసాక్షుల సమావేశ మందిరాన్ని మన జిల్లా సమావేశానికి ఉపయోగించడానికి 1986లో అనుమతి లభించడం కూడా పులకింతగా ఉంది. గత సంవత్సరం జరిగిన ఫ్రెంచ్ సమావేశానికి 4,506 మంది హాజరయ్యారు, 101 మంది బాప్తిస్మం పొందారు. ఆ సమయంలోనే ఫ్లోరిడాలో మరొక ఫ్రెంచ్ సమావేశం జరిగింది.
నమ్మకస్థులైన సహవాసులు
బ్రూక్లిన్‌లోని ఒకే యింట్లో పూర్తికాల సేవ చేస్తున్న సహోదరీలతో ఉండడం నా జీవితంలో మరో సంతోషకరమైన భాగం. మొదటి యిద్దరు (రోజ్ లూయిస్ పెలోయన్, మద్లెన్ మర్దెక్ విల్డ్‌మాన్) బేతేలుకి వెళ్ళారు. తర్వాత యింకో యిద్దరు (లైలా రాజర్జ్ మాల్‌హాన్, మార్గరెట్ స్టెల్‌మా) కూడా బేతేలు కుటుంబ సభ్యులయ్యారు. వేరే యిద్దరు (బార్బరా రెపాస్కె ఫార్‌బ్స్, వర్జినియా బురిస్ బెల్ట్రామెలీ) వాచ్‌టవర్ గిలియడ్ స్కూల్‌కి వెళ్ళారు, వారు యిప్పటికీ గ్వాటిమాలలోను, ఉరుగ్వేలోను సేవచేస్తున్నారు.
సహోదరీలమైన మేము ఎల్లప్పుడు ఒక లేఖనాన్ని చర్చించి ఆ దినాన్ని ఆరంభించడానికి సమయం తీసుకునేవారం. ఆ తర్వాత మా ఉద్యోగాలకు, పరిచర్యకు వెళ్ళేవారం. మేము రాత్రి అలసిపోయి ఆకలితో తిరిగి వచ్చేవాళ్ళం, అయినా సంతోషంగా ఉండేవాళ్ళం! చెప్పుకోడానికి బలపర్చుకునే అనేక అనుభవాలు ఉండేవి! ఉదాహరణకు, ఒక సారి నేను ఎలిజా బోమాన్ ఫారెనా అనే పేరుగల ఒక యువతితో పఠనం నిర్వహించాను, ఆమె తన పఠనం రాత్రి పది గంటలకే జరగాలని పట్టుబట్టింది. ఆమె త్వరగా అభివృద్ధిని సాధించింది. నేను ఆమెను మొదటిసారిగా పరిచర్యకు తీసుకు వెళ్ళినప్పుడు, “నేను ఎల్లప్పుడూ యీ పనే చేస్తూ ఉంటానని అనుకోకండి!” అని ఆమె అన్నది. అయితే ఆమె పూర్తికాల సేవకురాలయ్యింది, తర్వాత గిలియడ్ స్కూల్‌కి వెళ్ళి, అనేక సంవత్సరాలు ఈక్వెడార్‌లో బోధకురాలిగా సేవచేసింది. న్యూజెర్సీలోని ట్రెన్‌టన్‌లో, ఆమె యిప్పటికీ పూర్తికాల సేవ చేస్తుంది.
నా సహవాసుల్లో కొందరు పిల్లలను పెంచారు, వారు కూడా యెహోవా సేవను ప్రశంసించి దానిలో కొనసాగుతున్నారు. ఇంతకు ముందటి నా సహవాసుల్లో ఒకరి (వర్జీనియా హెండె రాబర్ట్‌సన్) కుమార్తె (జాడి రాబర్ట్‌సన్ సాకిమా) గత సంవత్సరం పెళ్ళి చేసుకొని యిటీవలే బ్రూక్లిన్ బేతేలులో తన భర్తతో పాటు సేవ చేస్తుంది.
నా సహవాసుల్లో 20 కన్నా ఎక్కువ మంది యెహోవాను నమ్మకంగా సేవిస్తున్నారని, వారిలో చాలామంది యిప్పటికీ పూర్తికాల సేవలో కొనసాగుతున్నారని చెప్పడానికి నేను సంతోషిస్తున్నాను.
మన ప్రపంచవ్యాప్త కుటుంబ బాంధవ్యాన్ని అనుభవించుట
ఇతర దేశాలనుండి వచ్చిన చాలామంది సాక్షులకు దగ్గరవడం నాకు చాలా సంతోషాన్నిచ్చింది. ఉదాహరణకు, మేము సొసైటీ ప్రధాన కార్యాలయం దగ్గర నివసించడం వలన, అప్పట్లో బ్రూక్లిన్ బేతేలులో ఉన్న గిలియడ్ మిషనరీ స్కూల్‌కి వచ్చే విద్యార్థులతో సహవసించే ఆధిక్యత లభించింది.
ఆస్ట్రియా బ్రాంచిలో యిటీవల సేవ చేస్తున్న గెంటర్ బుష్‌బెక్, జర్మనీ బ్రాంచిలో సేవ చేస్తున్న విలె కోన్‌స్టెంటే అనే ఇద్దరు విద్యార్థులు, గిలియడ్‌కి హాజరైనప్పుడు బ్రూక్లిన్ సెంటర్ సంఘంలో నియమించబడ్డారు. నిజంగా వారు ఎంత ప్రోత్సహించేవారుగా ఉండేవారో! నా సహవాసులు కూడా గిలియడ్ సేవను గూర్చి తలంచేలా, వీరిపై వారు మంచి ప్రభావాన్ని చూపారు.
నేను అనేక మార్లు, విదేశాలను సందర్శించడం వల్ల, ప్రపంచ వ్యాప్త కుటుంబంతో స్నేహబంధాన్ని పెంపొందించుకునే ఆధిక్యత నాకు లభించింది. నేను అనేక అంతర్జాతీయ సమావేశాలకు హాజరయ్యాను, నాకు యింతకు ముందు పరిచయమున్న గిలియడ్ పట్టభద్రుల్లో అనేకులను వారు నియమించబడినచోట మళ్ళీ కలిశాను.
అనుభవంతో నిండిన జీవితం
నా జీవితాన్ని గూర్చి తలపోసినప్పుడు, అది ఆశీర్వాదాలతో కూడిన అద్భుతకరమైన, సంతోషకరమైన జీవితమని నేను చెప్పగలను. ఈ విధానంలో సర్వసాధారణమైన సమస్యలను నేను ఎదుర్కొన్నప్పటికీ, నా గతాన్నిబట్టి నేనెన్నడూ విచారించనూ లేదు, పూర్తికాల సేవలో ఉండే అమూల్యమైన ఆధికత్యను వదులుకోనూలేదు.
నా చిన్నతనంలోనే, మా అమ్మ, కీర్తన 126:5, 6లోని “కన్నీళ్లు విడుచుచు విత్తువారు సంతోషగానముతో పంట కోసెదరు. పిడికెడు విత్తనములు చేత పట్టుకొని యేడ్చుచుపోవు విత్తువాడు సంతోషగానము చేయుచు పనలు మోసికొనివచ్చును” అన్న మాటలను నాలో నాటింది. ఆ లేఖనం యిప్పటికీ నాకొక మార్గదర్శిగా ఉంది. ఎన్ని సమస్యలు ఎదురైనప్పటికీ, వాటిని అధిగమించడానికి, ఆ సంతోషాన్ని నిలదొక్కుకొనే మార్గాన్ని కనుక్కోడానికి యెహోవా నాకు సహాయం చేశాడు.
నా జీవితాన్ని నిజంగా నేనెన్నటికీ మార్చుకోవాలని కోరుకోను. పూర్తికాల సేవలో యెహోవా కొరకు 53 సంవత్సరాలు గడిపినందుకు నేనెన్నటికీ విచారించను. ఆయన తీసుకువచ్చే కొత్త లోకంలో నిత్యమూ ఆయనను సేవించడంలో కొనసాగడానికి ఎదురు చూస్తున్నాను.—మేరి కెండాల్ చెప్పింది.
[23వ పేజీలోని చిత్రం]
మేరి కెండాల్