కరాకాస్ కొండప్రాంతాల్లో పట్టణ జీవితం
వెనిజ్యులాలోని తేజరిల్లు! ప్రతినిధి
కరాకాస్, వెనిజ్యులా. గందరగోళ రాకపోకలు, రద్దీ దుకాణాలు, మరియు ప్రజలతో క్రిక్కిరిసి ఉన్న రెస్టారెంటులకు పైగా ఎత్తైన, ఆధునిక కార్యాలయ భవనాలు అస్పష్టంగా కనిపిస్తుంటాయి. పర్యాటకులు నిక్కర్లు వేసుకుని, వెడెల్పాటి టోపీలను పెట్టుకుని, మెడ చుట్టూ లేక భుజాలకు కెమేరాలను తగిలించుకుని బజారు కూడల్లో తిరుగుతూ ఉంటారు. కాలిబాటలు ప్రజలతో నిండి ఉంటాయి.
కాని కరాకాస్‌కు ఇంకో వైపు కూడా ఉంది. క్రోము, స్టీలు, అద్దాలతో నిర్మింపబడిన భవనాల అవతల, లాస్ సీరోస్ (కొండలు), కొండప్రాంతాల్లో నిర్మింపబడిన అసాధారణ నివాసాలు ఉన్నాయి. పట్టణానికి తూర్పు, పడమర, మరియు దక్షిణాన ఉన్న ఏటవాలు ప్రాంతాల్లో వారు జీవిస్తున్నారు. ఇంచుమించు 20 లక్షలమంది ప్రజలు వార్డులు అనబడే వందలాది వీధులలో జీవిస్తున్నారు.
ఈ నివాసాలు ఎలా ఏర్పడ్డాయి? నిరుద్యోగులైన పట్టణవాసులకు డబ్బు యిచ్చే ఒక పథకాన్ని ప్రభుత్వం 1958లో ప్రారంభించింది. ఆ పథకం మూలంగా లాభాన్ని పొందడానికి ప్రజలు రాజధానికి తరలి వచ్చారు. పట్టణంలో లభిస్తున్న ఆసుపత్రులు, పాఠశాలలు, విశ్వవిద్యాలయాల సౌకర్యాలను పొందడానికి చాలామంది పల్లెప్రాంతాలను విడిచివచ్చారు.
పొరుగు దేశాల్లోని రాజకీయ దౌర్జన్యం మరియు ఆర్థిక సంక్షోభంవల్ల ప్రజలు పని కొరకు కరాకాస్‌కు వలసరావడం జరిగింది. కొద్ది కాలంలోనే లోయలోని పల్లపు ప్రాంతమంతా పూర్తిగా ఆక్రమింపబడింది, మరి ప్రజలు నివసించడానికి స్థలం కొరకు ఎత్తు ప్రాంతాలకు వెళ్లవలసి వచ్చింది. ఆ విధంగా ఈ కొండప్రాంతపు నివాసస్థావరాలు ఉద్భవించాయి.
ఎగువ ప్రాంతానికి ప్రయాణం
మేము బారు తీరిన ప్రజలతో కలవడం ద్వారా మా ప్రయాణాన్ని ప్రారంభించాము. వారు బస్సు కొరకు కాక ఒక జీపు కొరకు వేచి ఉన్నారు, ఎందుకంటే మా ముందున్న ఏటవాలు దారికి అదే మంచిగా సరిపోతుంది. ఒక పొడవాటి చట్రమున్న జీపు వచ్చింది, మరి డజనుమంది లోనికి దూరారు. ఐదుగురు చొప్పున వెనుక ఉన్న రెండు పొడవాటి సీట్లల్లో కూర్చున్నారు; ఇద్దరు ముందున్న మంచి సీట్లల్లో కూర్చుంటారు. మేము వెనక తలుపు ద్వారా లోనికి రావడానికి పూర్తిగా సగానికి వంగి కూర్చున్నాము. మేము బెంచీలో ఉన్న కొంచెం స్థలంలో ఇరుక్కున్నాం, మా మోకాళ్లను మా గడ్డానికి ఆన్చుకుని, ఒక స్త్రీ యొక్క కూరగాయల సంచిని త్రొక్కకుండా ఉండడానికి ప్రయత్నిస్తూ కూర్చున్నాము.
మేము కొండ ప్రాంతానికి ఎక్కడం మొదలుపెట్టాము. వీధులు ఇరుకుగా ఉన్నాయి మరి చాలాచోట్ల వంకర టింకరగా ఉన్నాయి. కొన్నిచోట్ల అవి ఇంచుమించు నిలువుగా ఉన్నాయి. డ్రైవరు తనకు నచ్చిన సంగీతం క్యాసెట్టును జీపులోని క్యాసెట్టు ప్లేయర్‌లో పెడతాడు, వెంటనే ఆ లాటిన్ దరువుకు తగ్గట్టు కాళ్లు దరువులు వేస్తాయి. అకస్మాత్తుగా ఎవరో ఒకరు డ్రైవరుతో యిలా చెబుతారు: “డొండే పూడా!” (నీకు వీలైన చోట!) అతన్ని ఆపమని అడగడానికి అదొక వింత పద్ధతిలా అనిపిస్తుంది. కాని అతని తీర్పుపై ఆధారపడటం చాలా మంచిది. ఒకవేళ జీపును దారిలోని ఒక ఏటవాలు స్థలంలోగాని ఆపితే, అది మళ్లీ కదలకపోవచ్చు—కనీసం, ముందుకు మాత్రం కదలదు! చింపిరి జుట్టుతో ఉన్న కొంతమంది ప్రయాణికులు, మధ్యమధ్యలో కొంతమంది కాళ్లను త్రొక్కుతూ వెనక తలుపు ద్వారా బయటపడతారు.
కొంతసేపయ్యాక మేము అన్ని చోట్లనుండి కారుతూ, మెల్లిగా వెళ్తున్న ఒక వాహనం వెనుక ఉన్నాం. అదొక నీళ్ల ట్యాంకు, అది విలువైన ద్రవాన్ని కుళాయి నీటి సౌకర్యం అంటే ఏమిటో తెలియని ఇళ్లకు తీసుకువెళ్తుంది. ప్రజలు సాధారణంగా వాటిని ట్యాంకుల్లో లేక ఉపయోగించిన నూనె క్యానుల్లో పట్టి ఉంచుకుంటారు.
జీపు అలా ఇంకా కొన్ని స్థలాల్లో ముక్కుతూ మూల్గుతూ ఆగుతుంది, మరి మేము దిగవలసిన సమయం వచ్చిందని మేము గ్రహించాము. మా కాళ్ల క్రింద ఉన్న గట్టి నేల మాకు చాలా వింతగా అనిపించింది, మరి మేము మా చుట్టుప్రక్కల ప్రాంతంతో పోల్చిచూస్తే ఎక్కడ ఉన్నామని గమనిస్తున్నాము.
కొండప్రాంతపు గృహాలు
ఇండ్లు ఇష్టమొచ్చినచోట, ఇష్టమొచ్చిన రీతిలో నిర్మించబడ్డాయి. కుటుంబాలు పెరుగుతున్న కొద్దీ అదనపు గదులు లేక అంతస్థులు వాటికి జోడిస్తూ పోతున్నట్లు అనిపిస్తుంది. కొన్ని టెర్రాకోటా ఇటుకలతో నిర్మించబడిన గట్టి చిన్న యిండ్లు. కాని ఇతర యిళ్లు చెక్కలతో, డబ్బారేకులతో, లేక ఆఖరుకు “దిస్ సైడ్ అప్” అనే మాటలు ఇంకా అలానే ఉన్న ప్యాకింగు అట్టలతో నిర్మించబడ్డాయి.
జీపు కనుచూపు మేరలో లేకుండా శబ్దం చేసుకుంటూ వెళ్లిపోయింది గనుక ఇప్పుడు చాలా నిశ్శబ్దంగా ఉంది. ఆ దృశ్యం ఆశ్చర్యజనకంగా ఉంది. అక్కడ, దూరాన క్రింద, కరాకాస్ మధ్యభాగం ఉంది. అకస్మాత్తుగా ఒక లౌడ్‌స్పీకర్ నుండి గర్రుమంటూ వచ్చిన స్వరం ద్వారా ఆ నిశ్శబ్దం బ్రద్దలౌతుంది: “అవును, ఇక్కడ ఉల్లిపాయలు ఉన్నాయి. అవును, ఇక్కడ బంగాళాదుంపలు, కర్రపెండలం, అరటికాయలు ఉన్నాయి.” ఇటువైపు తిరగ్గా, అంతవరకూ నిశ్శబ్దంగా దగ్గర్లో ఆపి ఉంచబడిన ఒక ట్రక్కుకు అకస్మాత్తుగా జీవం వచ్చినట్లు మేము చూశాము. ట్రక్కు వెనక వైపునుండి ఒక అబ్బాయి కొనుగోలుదారులకు అన్నీ అందిస్తున్నాడు.
కరాకాస్‌లో సరాసరి 500 వీధులు ఉన్నాయి. కొన్నింటికి “పరిశుద్ధుల,” పేర్లు మరి కొన్నిటికి చారిత్రాత్మక తేదీలు లేక రాజకీయ వ్యక్తుల పేర్లు పెట్టబడ్డాయి. ఇంకా కొన్ని వాస్తవాలకన్నా అక్కడి నివాసుల ఆకాంక్షలనే ప్రతిబింబిస్తాయి. ఉదాహరణకు: ఎల్ ప్రోగ్రెసో (అభివృద్ధి), న్యూవో ముండో (నూతన ప్రపంచం), ఎల్ ఎన్‌కాంటో (ఆనందం).
వీధుల్లోని జీవితం
ఇక్కడ సంఘీభావం వర్ధిల్లుతుంది. తరచూ, వీధుల్లోనుండి మాదక ద్రవ్యాలను లేక అరాచకాన్ని అరికట్టడానికి ఐకమత్యంతో కృషి సల్పబడుతుంది. చాలా వీధుల్లో కల్లుకొట్లు—అన్ని రకాల వస్తువులను అమ్మే కిరాణా దుకాణాలు—అలాగే ఒక స్కూలు, ఒక మందుల దుకాణం కూడా ఉంటాయి. అక్కడ మందులవాడు చిన్న జబ్బులను గుర్తించి మందులు ఇవ్వడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటాడు.
అయిననూ, ఇక్కడి జీవితం కష్టభరితంగా ఉంటుంది. నేరపరిశోధకుడైన డా. ఎలియో గోమెజ్ గ్రిలో ఆ సమస్యలను వివరిస్తున్నాడు: “ఈ క్షీణిస్తున్న పరిస్థితుల్లో, జీవితపు కనీస అవసరతలను కూడా కలిగియుండలేని ప్రజలు ప్రస్తుతం ఇరవై లక్షలమంది జీవిస్తున్నారు. బాల్య నేరాలు పెచ్చుపెరిగి పోతున్నాయి . . . ఆత్మహత్యలు, దోపిడి కొరకు చేసే హత్యలు, బ్యాంకు దోపిడీలు, మరియు హత్యలకు దారి తీస్తున్న సాయుధ దొంగతనాలు చాలా చింతను కలిగిస్తున్నాయి.” నీటి కొరత, విద్యుచ్ఛక్తి కోత అనుదిన జీవితంలో ఒక భాగమయ్యాయి.
వర్షాకాలంలో, లాస్ సీరోస్ పూర్తిగా మారిపోతుంది. నేల బురదగా మారుతుంది, మెట్లు చిన్న జలపాతాల్లా మారతాయి, దారి ప్రక్కల చెత్త నదుల్లా ప్రవహించే నీళ్లపై తేలుతూ వస్తుంది. రేకుల పైకప్పులపై వర్షంపడే శబ్దం చెవుడు కలిగించేంతగా ఉంటుంది; నీళ్లు కారుతున్న చోట్ల గిన్నెలు, బకెట్లు పెట్టడానికి వెతకటంలో యింటి సభ్యులు నిమగ్నం అయ్యే సరికి సంభాషణ ఆగిపోతుంది. కాని నానిన పైకప్పులను, దారులను ఎండబెడుతూ సూర్యుడు మళ్లీ వెంటనే బయటకు వస్తాడు. అలాగే, అణగార్చలేని వెనిజ్యులా స్ఫూర్తి పైకివస్తుంది. జీవితం కొనసాగుతుంది.
కాలినడకన పైకి మరియు ముందుకు
మా ప్రయాణం ఇంకా ముగియలేదు. మేము ఇంకా మా స్నేహితుల యిల్లు చేరాలి. రెండు యిళ్ల మధ్య ఏటవాలుగా, అస్తవ్యస్తంగా ఉన్న కాంక్రీటు మెట్లు కొండపైకి వెళ్లాయి. అంతరిక్షానికి పోటీపడుతున్న ఇరుకు యిళ్లపై ఉన్న పేర్లు మా అవధానం కొరకు పోటీపడుతున్నాయి: పెగో సీరెస్ (నేను బట్టలకు జిప్పులు కుడతాను); కోర్టెస్ డె పెలో (వెంట్రుకలు కత్తిరిస్తా); సె వెన్‌డెన్ హెలాడోస్ (ఐస్‌క్రీమ్ అమ్మబడును). ఉపాధి కొరకు ఇక్కడి నివాసులు అన్ని విధాలైన పనులూ చేపడతారు. కొందరు కార్లకు స్ప్రే పెయింట్ వేయడం, కారులో పెట్రోలు మార్చడం, మరియు మరమ్మత్తులు చేయడం వంటివి—అన్నీ వీధిలోనే చేస్తారు.
మేము మెట్లు ఎక్కిన తరువాత కొంచెం ఊపిరి పీల్చుకుని, యిళ్ల మధ్య ఉన్న చిన్న ఇరుకు సందులలోనుండి వెళ్లాము. మంచి ఎండలో కళ్లు మిటకరిస్తూ ఆ సందుగొందులోంచి బయటకు వచ్చాము. మా స్నేహితుని యిల్లు ఈ వరుసలోనే ఎక్కడో ఉంది. ఇక్కడ యింటి నంబర్లు గానీ—తపాలా సౌకర్యం గానీ లేదు. అప్పుడే తాజాగా తయారు చేసిన కాఫీ సువాసన అంతటా వ్యాపించి ఉంది. మా అతిథేయులు చిన్న కప్పులో కాఫీ, దానితోపాటు అరేపాను (రొట్టెలోపల రకరకాలైనవి పెట్టి రుచికరంగా చేసిన మెత్తని జొన్న రొట్టె) అందించడంతో మమ్మల్ని సాదరంగా ఆహ్వానిస్తారనడంలో సందేహం లేదు.
ఆహ్వానింపబడటం
మేము ఎదురు చూసినట్లే, ఆ కుటుంబం వారికి పరిపాటి అయిన సాంప్రదాయ ఆతిథ్యంతో సాధారణమైన కానీ శుభ్రమైన రాన్‌చిటో అని పిలువబడే తమ చిన్న యింట్లోనికి మమ్మల్ని ఆహ్వానించారు. “ఎస్తాన్ ఎన్ సూ కాసా” (మీ యిల్లే అనుకొని కులాసాగా ఉండండి) అనేది వారు చెప్పే మొదటి మాటల్లో ఒకటి.
రేకు పైకప్పులపై ఎండవేడి పడుతుంటే, అద్దాలు లేని కిటికీలోనుండి వీస్తున్న గాలికి మేము కృతజ్ఞత చెల్లించాము. అయితే అక్కడ దొంగతనాలు చాలా ఎక్కువ గనుక కిటికీలకు ఊచలు మాత్రం ఉన్నాయి. మేము వేడికి ఇబ్బంది పడుతున్నామని గమనించి, మా అతిథేయులు ఒక విద్యుత్ పంకాను బయటకు తీశారు, అది ఫ్రిజ్ మరియు దూరదర్శినిలా ఇక్కడ సాధారణ అవసరం. వారి నేల సిమ్మెంటుది. చాలామంది పొరుగు వారికి కేవలం మట్టి నేలలే ఉన్నాయి.
ఐదుగురు పిల్లల తండ్రియైన, ఆ యింటి యజమాని, పెద్ద పట్టణంలో మంచి ఉద్యోగ అవకాశాలు ఉంటాయని పల్లెటూరినుండి కరాకాస్‌కు తరలి వచ్చాడు. అతను వివాహితుడైన తన పెద్ద అన్న వద్ద జీవించడానికి వెళ్లాడు. అతని అన్న తనకు పూర్వం వారివలె, కొండప్రాంతంలో ఎవ్వరూ ఆక్రమించని భూమి యొక్క కొంత భాగాన్ని గుంజలు నాటి స్వాధీనం చేసుకున్నాడు. మా స్నేహితుడు తనకు కాబోయే భార్యను కలిసినప్పుడు, అతనొక తాత్కాలిక యిల్లు కట్టుకొనడానికి తన యింటి ప్రక్కన ఉన్న మిగిలిన స్థలాన్ని ఉపయోగించుకొన వచ్చని అతని అన్న ఉదారంగా చెప్పాడు. పొరుగువారు, అలాగే బంధువుల సహాయంతో ఈ జంట తమ ఇటుకల యింటిని ఆ స్థలంలోనే కొద్ది కొద్దిగా నిర్మించుకున్నారు.
ఆ స్థలం వారికి అనుకూలంగా లేదని ఆ కుటుంబం అంటున్నారు, కానీ వారు విధిలేక అక్కడ ఉంటున్నారు. వారు తమకున్న దానినే సరి చేసుకుంటున్నారు. “సీ డయోస్ క్యేరీ” (ఒకవేళ దేవుని చిత్తమైతే) ‘మేము ఎప్పుడైనా ఒకనాడు కొండ క్రిందకు వెళ్లి జీవించగలమేమో,’ అని వారంటారు.
పేదవారైనప్పటికి ఎంతో దయగల ఆ కుటుంబంతో చాలా ఆహ్లాదకరమైన మధ్యాహ్నం గడిచింది. ముందు కిటికీ వద్ద చాక్లెట్లు కొనుక్కోడానికి వచ్చే చిన్న పిల్లలతో సంభాషణ అడపాదడపా కుంటుబడేది. తన భర్త సంపాదనకు భార్య అందించే తన వంతు సహాయమది.
క్రిందికి దిగడం
చీకటి పడక ముందే మేము వెళ్లాలనుకున్నాము. ఈరోజు శుక్రవారం, మరి పురుషులు తమ జీతాలతో ఇంటికి వస్తారు గనుక వీధులంతా కోలాహలంతో నిండిపోతాయి. కల్లుకొట్లలో బీరు వ్యాపారం చేస్తున్నారు, మరి లాటిన్ సంగీతం యొక్క శబ్దం మరియు మెరెంజూ లయ సేదదీర్చుకుంటున్న వారాంతపు వాతావరణానికి తోడ్పడుతుంది.
మేము క్రిందికి దిగిన తరువాత, మేము దగ్గర్లోని రైల్వే స్టేషనుకు వెళ్లాము. అక్కడ ఒక చురుకైన లోకల్ రైలు మమ్మల్ని నగరం నడిబొడ్డుకు తీసుకువెళ్తుంది. మాకు బాగా అలవాటైన ప్రాంతానికి రావడం వలన మాకు కొంత హాయిగా ఉంది. కానీ వెనక్కి తిరిగి లాస్ సీరోస్ వైపు పైకి చూస్తే, ఇప్పుడు చీకట్లో మినుకు మినుకు మంటున్న వెలుగు సముదాయాన్ని చూచి కరాకాస్‌కున్న మరో దృక్కోణంతో బాగా పరిచితులం కాగలిగినందుకు మేము ఎంతో సంతోషిస్తున్నాము. (g93 12/8)