మనం ఇల్లు అని పిలిచే స్థలాలను చూడండి
“సిరుల తులతూగి, గిరులెన్ని తిరిగినా ఎంత మిన్నైనా, కానరాదు లెస్సైనది ఇంటికన్నా.”—జాన్ హోవార్డ్ పెయిన్.
దేనిని మీరు ఇల్లని పిలుస్తారు? అధునాతన సామాగ్రిని ఉపయోగించి నిర్మాణకులు చక్కగా నిర్మించిన ఇల్లునా? స్థానికంగా లభించే సామాగ్రిని ఉపయోగించి ఇంటివారే నిర్మించుకొనిన ఇంటినా? ప్రపంచ వ్యాప్తంగా ప్రజలందరు ఇళ్లు అని పిలిచే స్థలాలను ఒక్క ఉదుటున చూసొద్దాం.
మొదట మనం ఎల్‌సాల్వడార్‌లో ఆగుదాం. అక్కడ మనం టాహేస్టాపాకా అనే చిన్న గ్రామంలో ఓర్హను, అతని తలిదండ్రులను కలుస్తాం. ఓర్హ ఇల్లంతా చూస్తే, క్రింద వట్టి నేల కనిపిస్తుంది. పైకప్పు ఆధారపడియున్న దూలాలు చెట్లమొద్దులతో చేయబడ్డాయి, అవి భూమిలో పాతబడి ఉన్నాయి. పచ్చి ఇటుక గోడలను మట్టితో పూతపూస్తారు. నీడ నివ్వటానికి, గోడలను వర్షం నుండి కాపాడడానికి, పెంకుల పైకప్పు, గోడల కంటే ముందుకు వచ్చివుంటుంది. అయితే, పెంకులకు బదులుగా, ఎల్‌సాల్వెడార్ ప్రజలు, 15 సెంటీమీటర్ల మందంలో పేర్చిన పొడవైన గడ్డితో పైకప్పులు తయారుచేస్తారు.
కొలంబియాలోని పేద గ్రామప్రజలు ఇంచుమించు ఇలాంటి ఇళ్లల్లోనే నివసిస్తారు. భూమిలో పాతిన మూల గుంజల మధ్య వెదురుబద్దలతో కట్టబడి మట్టితో పూయబడిన గోడలుంటాయి. తాటాకుతో వేయబడిన పైకప్పు రాటలపై నిలిచి యుంటుంది.
ఉరుగ్వేలోని టాక్వారెంబోలో కొన్ని ఇళ్లు, గుర్రం ఎరువు, మట్టి, నీళ్ల మిశ్రమంతో చేయబడిన పచ్చి ఇటుకతో నిర్మించబడతాయి. ఈ మిశ్రమాన్ని చెక్క అచ్చులలో పోసి సమతల ఉపరితలంపైన ఎండకు ఎండబెడతారు. గట్టిపడిన ఇటుకలు గోడలకుపయోగిస్తారు, తాటాకుల పైకప్పు వాటి గుంజలపై ఆధారపడి వుంటుంది. కిటికీ తలుపులకు అద్దాలుకాకుండా చెక్కలనుపెడతారు మరి ఇల్లంతా గచ్చులేని వట్టి నేలే.
ఉరుగ్వేలోని మారు మూల ప్రాంతాలలో కొన్ని పేద కుటుంబాలు, మట్టిళ్లలోనే నివసిస్తున్నారు. పచ్చి ఇటుక ఇళ్లలాగే, ఈ ఇళ్లు వేసవిలో చల్లగా, చలికాలంలో వెచ్చగా వుంటాయి. మట్టి ఇటుకలను అటు ఇటు ఒక దానిలో ఒకటి పేర్చి 0.6 మీటర్ల మందం, 1.8 మీటర్ల ఎత్తుగల గోడల్ని కడతారు. రెల్లు గడ్డిని పైకప్పు దూలాలకు గట్టిగా కట్టి, 18 సెంటీమీటర్ల మందంతో పైకప్పును తయారుచేస్తారు. కొందరు వాళ్ల ఇంటి వెలుపలి గోడల పైభాగం గట్టిగా, నున్నగా ఉండటానికి, పేడతో కలిపిన మట్టి మిశ్రమాన్ని దానిపైన పూస్తారు. గోనెసంచుల్ని కలిపి కుట్టి వాటిని అడ్డుగోడలుగా చేసుకుంటారు. కొన్నిసార్లు గోనె సంచీలపైన మట్టి పూస్తారు.
కాలువల, చిత్తడినేలలకు చేరువలో దేశము యొక్క మారుమూల ప్రాంతాలలోని కొందరు ఉరుగ్వేనీయులు పూరిళ్లలో నివసిస్తున్నారు. అప్పుడే కొట్టిన చెట్ల కొమ్మలకు రెల్లు గడ్డిని కట్టలు కట్టలుగా కట్టి గట్టిగా తయారు చేసుకున్న ఇళ్లలో నివసిస్తారు. అది ఎలా చేయబడుతుంది? రెల్లు గడ్డిని 1.5 నుండి 1.8 మీటర్ల పొడవులో కత్తరించి తడి పూర్తిగా పోయేంతవరకూ ఎండలో ఆరబెడతారు. ఇరవైమూడు సెంటీమీటర్ల మందంవున్న కట్టలుగా కట్టి, చివరికి వాటిని గోడలుగా మరియు పైకప్పుగా కలిపి కడతారు.
తేలియాడే ఇళ్లు
పెరూలోని ఐక్విటోస్ పట్టణం చేరువ ప్రాంతంలోని ఒక పేదవాడు తన ఇంటిని అమేజాను నది మీద కడతాడు. మరి, ఆ ఇళ్లు మునిగి పోకుండా ఎలా కాపాడుకుంటాడు? అతను, అడవి నుండి పెద్దపెద్ద తేలికగావుండే కొయ్యలను నరికి తెచ్చి, ఒక తెప్పను తయారుచేసి, దాన్ని నది గర్భంలో పాతిన దూలాలకు కట్టేస్తాడు. తెప్పను గట్టిగా దూలాలకు కట్టిన తరువాత, తన ఇంటిని దానిపై నిర్మిస్తాడు. అది వెదురు గోడలతో, గడ్డి పైకప్పుతో ఒకే గదివుంటుంది. ఈ ఇంటికి ఒక ప్రత్యేకమైన ఎయిర్ కండిషనింగ్ వుంటుంది. వెదురు ముక్కల సందులలో నుండి వీచేగాలి ఆ ఇళ్లను చల్లబరుస్తుంది. అనేక సార్లు ఉష్ణమండల వేడి తీవ్రతకు తాళలేక ఒక ప్రక్క గోడను కట్టరు.
సహజంగా చెక్కమంచం, వాలు కుర్చీలు లేక నేల మీద చాపలపైన పడుకుంటారు. ఐక్విటోస్‌లోని ఇతర ఇళ్లతో పోలిస్తే ఇది పాతదైనా, పేదలకు మాత్రం ఇదే ఇల్లు.
పెరూలోని అందమైన టిటికాక సరస్సుపై తేలే ద్వీపాలపై పూరిల్లు నిర్మించబడతాయి. ద్వీపాలుకూడా రెల్లు గడ్డితో అనేక పరిమాణాల్లో ఉంటాయి, కొన్నైయితే, టెన్నిస్ కోర్టంతే వుంటాయి. సముద్ర మట్టానికి ఉన్న 3,000 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ సరస్సులో జమ్ముగడ్డి సమృద్ధిగా లభిస్తుంది.
కుశాగ్రబుద్ధి గల ఈ వాస్తవ్యులు జమ్ముగడ్డి కట్టలను కలిపి కట్టి గోడలను, పైకప్పులను తయారుచేసుకుని, తేలే తిన్నెపై తమ ఇండ్లను నిర్మించుకుంటారు. సంవత్సరాని కొక్కసారి ప్రజలు నీటి పైబాగాన్ని పునర్నిర్మిస్తారు. ఇది కుళ్ళిపోతున్న క్రింది భాగానికి సరితూగుతుంది. ఈ తిన్నె దాదాపు 1.8 మీటర్ల మందం కలిగివుంటుంది, క్రమంగా దాని అడుగు భాగం కుళ్ళిపోతుంది.
ఇల్లు అని చైనా దేశీయులు పిలిచే మరో రకమైన తేలే ఇళ్లు హాం కాంగ్‌లో కనిపిస్తాయి. సహజంగా, హాంకాంగ్ అబెర్డీన్ నౌకాశయంలో డబ్బిచ్చే ప్రయాణికులను తీసుకు వెళ్ళే ప్రతి నీటి టాక్సీ, దాన్ని నడిపించే కుటుంబానికి ఇల్లయివుంటుంది. ఆ కుటుంబం వంట, భోజనం, పడక అన్నీ ఇక్కడే జరుగుతాయి. చైనా దేశంలోని ఇతర కుటుంబాలు, జంక్ అనే చేపలు పట్టే ఓడలోనే తమ జీవితం గడుపుతారు. ఆ ఓడే వారి ఇల్లు.
రవాణా పడవలు, యూరప్‌లోని అనేక నదులను, కాలువలను వ్యాపారార్థమై వినియోగిస్తున్నవి. ఈ ఓడలను నడిపించే కొన్ని కుటుంబాలు, ఓడలోని చివరి భాగాన్ని నివాస గృహంగా మలుచుకుంటారు. కాబట్టి, ఇక ఆ ఓడ వారికి తేలే ఇల్లుగా మారుతుంది.
బోర్నియో పద్ధతిలోని గదుల ఇళ్ళు
బోర్నియో ద్వీపంలోని ఐబన్ లేక సీ డయక్స్ అనబడే ప్రజలు పొడవైన ఇళ్లు కట్టుకుంటారు. వారి దృష్టిలో అవి అంతస్థుల ఇళ్లే. పొడవుగా, ఎత్తు తక్కువగా ఉండే ఈ కట్టడాలు భూమిలో పేర్చిన అనేక దూలాలపై నిర్మించబడి, నదీ తీరాలలోని ఎత్తైన ప్రదేశాలలో ఉంటాయి. ప్రతి పొడవాటి ఇంట్లో ఒక జాతిమొత్తం నివసిస్తుంది. అనగా ఒకే ఇంటిలో ఒక గ్రామమంతా ఉంటుందన్న మాట.
పది నుండి వందమంది ప్రజలు ఉండే జాతినిబట్టి ఇళ్ల పొడవు ఆధార పడుతుంది. పెళ్ళిల్ల ద్వారా కుటుంబాలు పెరిగే కొలది, ఇళ్ల పొడవు పెరుగుతుంది.
ప్రతి కుటుంబానికీ విడిగా ఓ భాగం వుంటుంది. కుటుంబ సభ్యులు తమ ఇంటిలోకి ఎలా వెళ్తారు? వారిళ్లగుండా వెళ్లే విశాలమైన వరాండా ద్వారా వెళ్తారు. వ్రేలాడే పైకప్పు, వరాండాకు నీడనిచ్చి, వర్షంనుండి కాపాడుతుంది. ఇంటివారు ఇంట్లో ఉన్నప్పుడు, వారి సమయాన్నంతా వరాండాలో సందర్శకులతోను, హస్తకళలపై పనిచేస్తూ, అంటే బుట్టలల్లటంలో లేక చారల లుంగీలను నేయటంలో గడుపుతారు.
కుటుంబాలు ఈ గదులలోనే వండుకుని, భోంచేసి, పడుకుంటారు. గదిలోపలిపై భాగాన, వరాండాపైన బియ్యం మరియు పొలం పనిముట్లను ఉంచుతారు. ఈ గదిలోని పై భాగం పెళ్ళికాని కన్యలకు పడకగదిగా కూడా ఉపయోగపడుతుంది. పెళ్ళికాని యువకులు బైట వరాండాలో చాపలపైన పడుకుంటారు.
పాశ్చాత్యదేశాలలోని అనేక అంతస్థుల భవనము వలే కాక ఈ పొడవు ఇళ్లకు స్నానపుగదులు, మరుగు దొడ్లు ఉండవు. ప్రక్కనే వున్న నదిలో స్నానం చేస్తారు, చెత్తచెదారాలను 4 మీటర్ల లోతు త్రవ్విన ప్రదేశంలో పారేస్తారు. అక్కడ పందులు, కోళ్లు వాటిని శుభ్రపరచడానికి సహాయంచేస్తాయి.
భూగర్భ ఇళ్లు
అమెరికాలో తమకు తాముగా నివాసము నేర్పర్చుకున్న వారు, 19వ శతాబ్ద కాలంలో దూలాలతో లేక మట్టితో తమ ఇళ్లను నిర్మించుకునేవారు కానీ కొందరు తమ ఇళ్లను భూగర్భంలో నిర్మించుకున్నారు. కొండ పగుళ్ళలోంచి పారే నదుల తీరంలో, ఇంటి పైకప్పు నది ఒడ్డుకు సరిసమానంగా వచ్చేటట్లు సొరంగంలో ఒక గదిని వారు నిర్మిస్తారు. వంట, నిప్పుల వేడి వల్ల వెలువడే పొగ పోవటానికి, ఒక పొగగొట్టాన్ని పైకప్పులోదూర్చి పెడతారు. నిజమే, ఈ భూగర్భ ఇళ్లు చీకటిగా వుంటాయి. అయితే, అవి చలికాలంలో వెచ్చగావుంటాయి. వాటిలో ఒంటరిగా నివసించే పురుషులు తమ సొరంగమును తమ గుర్రాలతో, ఎద్దులతో పంచుకొనడం సహజమే.
ఈనాడు తైవాన్ దగ్గరలోని ఆర్చిడ్ ద్వీపవాసులైన, యామీయులు ఇప్పటికీ పారంపర్య ఇళ్లను కడతారు. అయితే, ఆ ఇళ్లలో చాలా ఇళ్లు భూగర్భితం. సొరంగంలోని గోడలకు రాళ్ల వరుసవుంటుంది, మరియు వర్షాకాలంలో నీరు నిండకుండా కాలువలు కాపాడతాయి. ఇంటివాసాలు, పైకప్పు చెక్క దూలం మీద ఆధారపడి ఉంటాయి. భూమిపైన, ప్రతి ఇంటికి వేరుగా కొంచెం ఎత్తులో ఒక చిన్న ఇల్లు ఉంటుంది. అది తాటాకు పైకప్పుతో, కొంచెం ఎత్తులో, గోడలులేకుండా వుంటుంది. మధ్యాహ్నపు ఉష్ణమండల వేడిమిని తట్టుకోవడానికి, ఆ కుటుంబాలకు ఈ నీడనిచ్చే తిన్నె ఒక చలి వేంద్రముగా పని చేస్తుంది. అయితే, కొందరి ఇళ్లు మాత్రం పూర్తిగా భూగర్ఛితము.
కొన్నేళ్ల క్రితం ప్రపంచంలోని మరొక భాగంలో, గుహలను ఇళ్లుగా ఉపయోగించాలన్న ఆలోచన ఒక కొత్తమలుపు తిరిగింది. ఫ్రాన్స్‌లోని లోరీ లోయ ప్రాంతంలో, అనేక ధనిక కుటుంబాలకు గుహల్లో నివసించడం నాగరికమైపోయింది. అక్కడ ఒక గుహ వరాండాగా, భోజన గదిగా, వంటగదిగా మలచబడడం కనిపిస్తుంది. గదులన్నీ క్రమంగా ఒక దాని వెనుక ఒకటి ఎత్తైన కొండలోకి వుంటాయి. మరొక విధమైన ఇల్లు, ప్రక్క ప్రక్కనే వున్న కొన్ని గుహలతో నిర్మించబడివుంటాయి. ప్రతి గుహకు కిటికీలు మరియు వెలుగును లోనికి ప్రకాశింపజేయటానికి ప్రవేశం వద్ద అద్దాల ద్వారం వుంటాయి. వీటిలో నివసించే కుటుంబాలు, నీటిని, విద్యుచ్ఛక్తిని, ఇతర సౌకర్యాలను, తడిని మరియు పాచిని తీసివేసేందుకు యాంత్రిక గాలులతో తమ ఇళ్లలను సౌకర్యవంతం చేసుకోవడానికి అధికంగా ఖర్చుచేశారు.
ఇక్కడ మనం చూసిన ఇళ్లకి మీ ఇంటికి చాలా తేడా వుండియుండవచ్చును. కానీ, అనేక దేశాలలోని ప్రజలకు అదే తమ “ఇల్లు, ప్రియమైన ఇల్లు.” (g92 12/8)