యౌవనస్థులు ఇట్లు అడుగుదురు . . .
నా సమస్యలను పరిష్కరించుకొనడానికి నాకు ఎవరు సహాయం చేయగలరు?
“నరులు శ్రమానుభవమునకే పుట్టుచున్నారు.” నాలుగు వేల సంవత్సరాల పూర్వం యోబు అనబడే కలతచెందిన వ్యక్తి ఆవిధంగా అన్నాడు. (యోబు 5:7) మీ జీవితం యోబు జీవితంలా దుఃఖభరితమైనది కాకపోవచ్చు. కానీ మీకు కూడ మీ స్వంత సమస్యలు అనేకం ఉండవచ్చు.
అమెరికాలోని యౌవనస్థుల గుంపును, “మిమ్మల్ని ఏది ఎక్కువగా కలతపరుస్తుంది?” అని అడిగినప్పుడు, చాలామంది పాఠశాల, తలిదండ్రులు, డబ్బు, స్నేహితులు, మరియు తోబుట్టువులు వారి కలతకు కారణమౌతున్నారని చెప్పారు. మరి మీ విషయమేంటి? మీరు స్నేహితుల ఒత్తిడిని, డబ్బు వ్యాకులతలను, లేక పాఠశాల సమస్యలను ఎదుర్కొంటున్నారా? యౌవనదశలో వచ్చే శారీరక, భావోద్రేక ఒడుదుడుకులను ఎదుర్కొనడం మీకు కష్టంగా ఉందా? మీరు మీ భవిష్యత్తు విషయమై వ్యాకులత చెంది ఉన్నారా?
ఇలాంటి సమస్యలన్నీ మీకుంటే, మీరు కృంగిపోయి, వ్యాకులత చెందడం సులభం. వాస్తవానికి, మీరు మీ సమస్యలను మీవరకే ఉంచుకుంటే, మీరు ఇతరులతో భావోద్రేకంగా దూరమైపోయినట్లు మీరు భావిస్తారు. (సామెతలు 18:1 పోల్చండి.) మరి మీ వ్యక్తిగత సమస్యలను పరిష్కరించుకొనడానికి మీరు ఏమి చేయాలి? మీరు నిజంగా వాటిని ఒంటరిగా ఎదుర్కోవాలా?
లేదు, ఎందుకంటే మీ సమస్యలు—పెద్దవిగా కనిపించవచ్చు—కాని అవి ప్రత్యేకమైనవేమీ కావు. మానవ ప్రవర్తనను జాగ్రత్తగా పఠించిన తర్వాత, జ్ఞానియైన సొలొమోను రాజు “సూర్యుని క్రింద నూతనమైన దేదియు లేదు” అన్న ముగింపుకు వచ్చాడు. (ప్రసంగి 1:9) అవును, ఇతరులు కూడ మీ సమస్యలవంటి వాటినే ఎదుర్కొన్నారు మరి విజయవంతంగా పరిష్కరించుకున్నారు. కాబట్టి మీరు ప్రతిసారి మీకైమీరే విషయాలను తెలుసుకొనడానికి ప్రయత్నించవలసిన అవసరం లేదు; కొన్నిసార్లు ఇంతకు ముందే తెలుసుకొన్న వారినుండి మీరు సహాయం పొందవచ్చు. ఎంతైనా, ఒకవేళ మీరు తెలియని ప్రాంతానికి వెళ్తున్నారనుకోండి, ఇంతకు ముందు అక్కడికి వెళ్లి వచ్చిన వారినుండి నడిపింపును తీసికొనడానికి మీరు ప్రయత్నించరా? ప్రశ్న ఏమిటంటే, అటువంటి సహాయం కొరకు మీరు ఎవరివైపు తిరగాలి?
స్నేహితులు—సలహా కొరకు మంచి మూలమా?
చాలామంది యౌవనులు తమ బాధలను తమ స్నేహితులతో చెప్పుకొనడానికి ఇష్టపడతారు. “కొన్నిసార్లు నేననుభవిస్తున్న మార్పులు చాలా వింతైనవని నాకు అనిపిస్తుంది,” అని యౌవన అనీటా వివరిస్తుంది. “‘వేరే ఎవరికైనా కూడా ఇలా జరుగుతుందా?’ అని నేను తలంచుతాను, నేనలా భావిస్తున్నందుకు నేను పిచ్చిదాన్నా అని నన్ను నేను ప్రశ్నించుకుంటూ ఉంటాను.” మీ తోటి వయస్కులు మీ సమస్యను అర్థం చేసుకొనగలరని మరి పెద్దవారైతే—ప్రాముఖ్యంగా తలిదండ్రులలో ఒకరైతే—తీర్పు తీరుస్తారని, లేక విమర్శిస్తారని మీరు భావించవచ్చు.
మీ స్నేహితులు అర్థం చేసుకొనవచ్చు, సానుభూతి చూపవచ్చు, జాలిపడవచ్చు, కానీ వారు ప్రతిసారీ కూడ అతి మంచి సలహాను ఇవ్వలేకపోవచ్చు. బైబిలు వివరిస్తున్న ప్రకారంగా “వయస్సు వచ్చిన వారు . . . మేలు కీడులను వివేచించుటకు సాధకముచేయబడిన జ్ఞానేంద్రియములు కలిగియున్నారు.” ఎలా? బైబిలిలా జవాబిస్తుంది: “అభ్యాసముచేత,” అదే, అనుభవము! (హెబ్రీయులు 5:14) అటువంటి అనుభవము లేనందున, యౌవనులు “లెస్సయైన జ్ఞానమును వివేచనను” పెద్దలంత స్థాయికి ఇంకా పెంపొందించుకొని ఉండరు. (సామెతలు 3:21) కావున తోటి స్నేహితుని సలహా వినుట ప్రమాదకరమే. సామెతలు 11:14 యిలా హెచ్చరిస్తుంది: “నాయకులు లేని జనులు చెడిపోవుదురు.”
దైవ-భక్తిగల తలిదండ్రుల విలువ
నైపుణ్యంగల నడిపింపునివ్వడానికి సాధారణంగా పెద్దలే మంచి స్థానంలో ఉన్నారు. నీతిమంతుడైన యోబు దీన్నిలా చెబుతున్నాడు: “వృద్ధులయొద్ద జ్ఞానమున్నది, దీర్ఘాయువువలన వివేచన కలుగుచున్నది.” (యోబు 12:12) బహుశా ఈ విషయంలో మీకు సహాయపడటానికి దేవునికి భయపడే మీ తలిదండ్రులే సరైన అర్హతను కలిగి ఉన్నారు. ఒక విషయమేమంటే, మీ గురించి ఇతరులకు తెలిసిన దానికంటే వారికే ఎంతో ఎక్కువ తెలుసు. మీరు ఇప్పుడు ఎదుర్కొంటున్న కొన్ని సందర్భాలను వారు ఇదివరకే ఎదుర్కొన్నారు గనుక, మిమ్మల్ని కష్టాలనుండి తప్పించడానికి వారు ఎంతో సహాయం చేయగలరు. ఒక తండ్రిగా మాట్లాడుతూ, సొలొమోను యిలా సలహా యిచ్చాడు: “కుమారులారా, తండ్రి యుపదేశము వినుడి మీరు వివేకమునొందునట్లు ఆలకించుడి. నేను మీకు సదుపదేశము చేసెదను నా బోధను త్రోసివేయకుడి.”—సామెతలు 4:1, 2.
ఘనా దేశస్థుడైన, సామ్యుల్ అనే పేరుగల ఒక యౌవనస్థున్ని గమనించండి. మాధ్యమిక పాఠశాలలో (ఉన్నత పాఠశాల) ఉన్నప్పుడు, లోకసంబంధమైన విద్యను చేపట్టాలా లేక యెహోవాసాక్షులలో పూర్తికాల పరిచారకుని వృత్తినా, దేన్ని ఎన్నుకోవాలి అనే విషయాన్ని తీర్మానించుకొనవలసి వచ్చింది. “మాది మంచిగా సంభాషించుకునే, ఒక సన్నిహితత్వంగల కుటుంబం గనుక, నా తలిదండ్రులకు చెప్పడం నాకు సులభమైంది.” అని అతను వివరిస్తున్నాడు. సామ్యుల్ తలిదండ్రులు అతన్ని పూర్తికాల పరిచర్య వైపుకే నడిపించారు—అతను ఇంకను ఆ వృత్తిలోనే కొనసాగుతున్నాడు. “వారు జీవితంలో ఎక్కువ అనుభవం గలవారు మరి అవే సమస్యలను ఎదుర్కొన్నారు . . . మరియు వారు ఒక విషయానికున్న రెండుకోణాలను గూర్చి మంచిగా చెప్పగల సరైన స్థానంలో ఉన్నారు” గనుక యౌవనులు వ్యక్తిగత సమస్యలను పరిష్కరించుకొనడానికి తమ తలిదండ్రుల సలహా తీసుకోవాలని సామ్యుల్ సిఫారసు చేస్తున్నాడు.
ఆసక్తికరమైన విషయమేమంటే, ఈమధ్యే జరిపిన ఒక మాదిరి సమీక్ష ప్రకారం, చాలామంది యౌవనస్థులకు మాదకద్రవ్యాలు, పాఠశాల, మరియు లైంగికత వంటి విషయాల్లో కూడ తమ తలిదండ్రుల నడిపింపు కావాలి.
‘వారు నన్ను అర్థం చేసుకోరు!’
దుఃఖకరమైన విషయమేంటంటే, చాలామంది యౌవనులు తమ యౌవనారంభ దశకు చేరుకుంటుంటే తమ తలిదండ్రులనుండి దూరం అవుతుంటారు. ఇలా చెప్పిన ఒక యౌవనునివలె చాలామంది భావిస్తారు: “నేను గ్రేడుల విషయమై ఎంతో భయపడుతున్నానని మరి ఈ పాఠశాల చాలా కష్టతరమైనదని నేను భావిస్తున్నానని నా తలిదండ్రులకు చెప్పడానికి నేను ప్రయత్నించాను, కానీ నేను సోమరినని, ఎక్కువ చదవాలని వారు నాకు చెప్తారు.” ఆఫ్రికాలోని ఒక యౌవన క్రైస్తవ బాలిక ఇలా చెప్పడం ద్వారా అటువంటి బాధనే వ్యక్తం చేసింది: “నాకు వ్యక్తిగతమైన సమస్యలు ఉన్నాయని, వాటి విషయంలో నాకు సహాయం అవసరమని నా ఆంతర్యంలో నాకు తెలుసు, కానీ నా తలిదండ్రులు నన్ను అర్థం చేసుకొనరని నేను భయపడుతున్నాను.”
అవును, కొన్నిసార్లు దేవునికి భయపడే తలిదండ్రులు కూడ తప్పిదం చేయవచ్చు. వారు మరీ విపరీతంగా ప్రతిస్పందించవచ్చు, వినుటకు తప్పిపోవచ్చు, మిమ్మల్ని అపార్థం చేసుకోవచ్చు, లేక సరైన నిర్ణయం తీసుకొనకపోవచ్చు. అయిననూ దాని అర్థం మీరిక వారిని మీ జీవితంలో నుండే ప్రక్కకు తొలగించాలని మాత్రం కాదు. యేసుక్రీస్తు అసంపూర్ణులైన తలిదండ్రులచేత పెంచబడ్డాడు. అయిననూ, యేసు “వారికి లోబడి యుండెను” అని బైబిలు చూపుతుంది. అతను “జ్ఞానమందును . . . దేవుని దయయందును, మనుష్యుల దయయందును” వర్థిల్లడానికి వారి ప్రభావం సహాయపడింది అనడంలో సందేహం లేదు.—లూకా 2:51, 52.
మీ స్వంత తలిదండ్రుల జ్ఞానము మరియు అనుభవము వలన మీరు లాభము పొందుతున్నారా? అలా కాకుంటే, యీస్ట్వుడ్ అట్వోటర్ వ్రాసిన అడోలసెన్స్ అనే పుస్తకంలో ఏమి చెప్పబడిందో గమనించండి: “యౌవనస్థులు తమ స్నేహితులచేత అనవసరంగా ప్రభావితం చెందితే, అది చాలావరకు స్నేహితుల అధిక ఆకర్షణకంటే, తలిదండ్రులు మరియు యౌవనస్థుల మధ్య మంచి సంబంధం ఉండకపోవడం వలననే.” మీకు మీ తలిదండ్రులతో ఏ విధమైన సంబంధం ఉంది? (గలతీయులు 6:5) ఈమధ్య మీరు వారితో సంభాషించడం మానుకుంటున్నారా? అలాగైతే, పరిస్థితులను చక్కదిద్దడానికి నీవు చేయగలిగినంత ఎందుకు చేయకూడదు?a తమ తలిదండ్రులకు నిజమైన “కుమారుడుగా” లేక కుమార్తెగా అవ్వడమని సొలొమోను చెప్పిన దాంట్లో ఇది ఒక భాగము.—సామెతలు 4:3.
ఇప్పుడు అమెరికాలో జీవిస్తున్న, ఘనా దేశపు యౌవనుడైన మాల్కమ్, తన తలిదండ్రులు తనను అర్థం చేసుకొనరని ఒకప్పుడు భావించేవాడు. కానీ వారు అతనికి తమ జీవిత అనుభవం అలాగే దేవుని వాక్యం యొక్క ఉపదేశాన్ని అందించడంలో పట్టుదలతో కొనసాగారు. ఈమధ్యే తన తలిదండ్రులకు వ్రాసిన లేఖలో, మాల్కమ్ యిలా వ్రాసాడు: “గతంలో మనము కొన్ని విభేదాలను కలిగి ఉంటిమని నాకు తెలుసు. మునుపటి విషయాలు ఆలోచించి చూస్తే, మీరు నా తలబిరుసుతనాన్ని సహించడం, నేను తీసుకున్న కొన్ని నిర్ణయాలను అంగీకరించడం నాకు చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. నన్ను నమ్మండి, ఇతర గృహాల్లో ఏమి జరుగుతుందో నాకు తెలుసు, మరి [మన దాంట్లో] బైబిలు తప్పక ప్రత్యేకతను తెచ్చింది. మరోసారి మీకు కృతజ్ఞతలు.”
మీకైమీరే ఆచరణాతక్మ జ్ఞానాన్ని సంపాదించండి!
మీ తలిదండ్రుల నడిపింపును అంగీకరించడం, మీ పెరుగుదలను కుంటుబర్చడానికి బదులు పరిపక్వత చెందిన పెద్దతనానికి దగ్గరి దారి కాగలదు. తగిన కాలంలో మీరు కూడ అదేవిధంగా ‘బుద్ధి, తెలివి, వివేచనను’ అభివృద్ధి పర్చుకొనవచ్చు. (సామెతలు 1:4) మీరు సమస్యలను విశ్లేషించి, వాటిని పరిష్కరించుకొనడానికి జ్ఞానవంతమైన తీర్మానాలను చేయడానికి మీరు శక్తివంతులౌతారు.
నిజమే, అందరు యౌవనులూ దేవునికి భయపడే తలిదండ్రులతో ఆశీర్వదింపబడలేదు. మీ తలిదండ్రులు క్రైస్తవులు కానందున మీరు వారు చెప్పేదానికి ఎక్కువ అవధానం యివ్వనవసరం లేదని మీరు నిర్ధారిస్తే అది తప్పుకాగలదు. వారు ఇంకా మీ తలిదండ్రులే, కాబట్టి వారికి అటువంటి గౌరవమే లభించాలి. (ఎఫెసీయులు 6:1-3) అంతేకాకుండా, ఒకవేళ మీరు వారికి అవకాశం యిస్తే, ఆచరణాత్మక సలహాలుగా మీకు చెప్పడానికి వారు ఎన్నో విషయాలను కలిగి ఉండవచ్చు. మీకు ఆత్మీయ నడిపింపు అవసరమైతే, క్రైస్తవ సంఘంలోని నమ్మకమైన సభ్యులలో ఒకరికి మీ సమస్యను చెప్పటానికి ప్రయత్నించవచ్చు. అక్కడ అర్థం చేసికొనగల మరియు దయచూపగల మనస్సుతో శ్రద్ధగా వినే, దేవునికి భయపడే పెద్ద వయస్కులను కనుగొనుట కష్టమవ్వ కూడదు.
యెహోవా ఆత్మ దానికొరకు అడిగే వారికి సహాయమును, శక్తిని ఇవ్వడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉండే మూలమని కూడ జ్ఞాపకముంచుకొనండి. (లూకా 11:13) యెహోవా సమాచారము యొక్క అపార సంపదను కూడా అనుగ్రహించాడు, అది బైబిలు మరియు వాచ్‌టవర్ సంస్థ యొక్క బైబిలు ఆధారిత ప్రచురణల్లో కనుగొనబడుతోంది. అంతెందుకు, ఈ శీర్షికల పరంపరే వేలకొలది మంది యౌవనులు తమ సమస్యలకు ఆచరణాత్మక జవాబులను కనుగొనడానికి సహాయం చేసింది! నేర్చుకొనడానికి శ్రమించి, పరిశోధించడం ద్వారా, మీకై మీరే అనేక సమస్యలను పరిష్కరించుకొనగలరు.—సామెతలు 2:4.
అవును, సమస్యలను అనుభవించడం జీవితంలో ఒక భాగమే. కానీ అది కీర్తనల గ్రంథకర్త కలిగి ఉండిన అనుకూల దృక్పథాన్ని కలిగి ఉండడానికి సహాయం చేస్తుంది. ఆయనిలా వ్రాసాడు: “నేను నీ కట్టడలను నేర్చుకొనునట్లు శ్రమనొంది యుండుట నాకు మేలాయెను.” (కీర్తన 119:71) అవును, సమస్యలను పరిష్కరించడం మిమ్మల్ని మలచి, తర్ఫీదు నివ్వగలదు. కానీ వాటినన్నిటినీ మీరే ఒంటరిగా ఎదుర్కొనవలసిన అవసరం లేదు. సహాయం కనుగొనండి. సర్వసాధారణంగా అది ఎవరు అడుగుతారా అని ఎదురు చూస్తుంటుంది. (g93 12/8)
[అధస్సూచీలు]
a ఈ విషయంలో ఇంకా అనేక సహాయకరమైన సలహాల కొరకు, ది వాచ్‌టవర్ బైబిల్ అండ్ ట్రాక్ట్ సొసైటి ఆఫ్ న్యూయార్క్, వారు ప్రచురించిన క్వశ్చన్స్ యంగ్ పీపుల్ ఆస్క్—ఆన్సర్స్ దట్ వర్క్ అనే పుస్తకం యొక్క 2వ అధ్యాయం చూడండి.
[19వ పేజీలోని చిత్రం]
తలిదండ్రుల నడిపింపును గైకొనుట పరిపక్వత చెందిన పెద్దతనానికి దగ్గరి దారి కాగలదు