మరలా విజృంభిస్తున్న మరణకరమైన వ్యాధులు
మార్గరెట్ తన కుమారుడైన టిటోకు మలేరియా సోకినప్పుడు చికిత్స కొరకు నిరాశతో వెదికింది. ఎక్కువగా ప్రచారంలోవున్న క్లోరోక్విన్ అనే మందుతో సహా మూడు రకాల మందులు అతనికివ్వబడ్డాయి. అయినప్పటికీ, టిటో కేవలం తొమ్మిది నెలల ప్రాయంలోనే చనిపోయాడు.
మార్గరెట్ స్వదేశమైన కెన్యాలో, ఇలాంటి దుస్సంఘటనలు సర్వసాధారణమే. “న్యూస్వీక్” ఇలా నివేదిస్తుంది: “ప్రపంచంలోని యీ ప్రాంతంలో మలేరియాను తెచ్చే ‘అనోఫిలిస్ గాంబియా’ అనే రాణి దోమ విస్తారంగా అభివృద్ధిచెందుతుంది. పిల్లలు మాత్రం పెరగడం లేదు. వారిలో ఐదు శాతం మంది బడికి వెళ్ళే వయస్సుకు ముందే మలేరియా వల్ల చనిపోతున్నారు.”
అమెరికాలోని న్యూయార్క్ రాష్ట్రంలో, 1991లో 12 మంది ఖైదీలు, ఒక గార్డు, క్షయవ్యాధి వలన చనిపోయారు. డా. .జార్జ్ డీఫర్నాన్డో, జూనియర్., ఇలా అంటున్నారు, “మేము జైళ్ళలో క్షయవ్యాధిని అణచివేయబోతున్నాం, అయితే, అసలు ప్రశ్న ఏమిటంటే, సమాజంలో నెలకొనియున్న ఈ సమస్యను యిప్పుడు మీరెలా పరిష్కరిస్తారు?”
ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదించేదేమంటే ప్రపంచంలోని దాదాపు మూడవ వంతు జనాబా, అంటే 170 కోట్లమంది క్షయవ్యాధికి కారకాలైన సూక్ష్మక్రిములను కల్గివున్నారు. ప్రతి సంవత్సరం, వీరిలో 80 లక్షలమందికి ఈ వ్యాధి ముదురుతుంది, 30 లక్షలమంది చనిపోతున్నారు.
న్యూయార్క్ ఆసుపత్రిలో, ఒక పసిపాప 11 వారాల ముందే పుట్టింది, అయితే, యిది కేవలం ఆమెకున్న సమస్యల్లో ఒకటి మాత్రమే. ఆమె చేతుల మీద చర్మం లేకపోవడం, ఆమె పాదాల మీది కురుపులు, కాలేయం, ప్లీహములవాపు, మొదలైనవన్నీ తన తల్లి గర్భంలో ఉన్నప్పుడే ఆమెకు సిఫిలిస్ అనే వ్యాధి సోకిందని స్పష్టంగా నిరూపిస్తున్నాయి.
“కొంతమంది బిడ్డలు తల్లి గర్భంలో ఉన్నప్పుడే, అంటే పుట్టకముందే ఈ వ్యాధి వలన బాగా దెబ్బతింటున్నారు,” అని “ది న్యూయార్క్ టైమ్స్” నివేదిస్తుంది. “మరి కొందరు పుట్టిన వెంటనే చనిపోయారు, కొంతమంది ప్రసవ సమయంలోనే శరీర చర్మం తీవ్రంగా చిట్లి పుడుతున్నారు.”
కొన్ని దశాబ్దాల క్రితం మలేరియా, క్షయం, సిఫిలిస్ అనే యీ మూడు వ్యాధులు అదుపులో ఉన్నాయన్నట్లు, పూర్తిగా నిర్మూలించబడ్డాయన్నట్లు తలంచబడింది. అవి మళ్ళీ ఎందుకు విజృంభిస్తున్నాయి? (g93 12/8)