“నయంకాగల” వ్యాధులు మళ్ళీ ఎందుకొస్తున్నాయి?
ఒక ఇల్లు అంతకు ముందే బాగా శుభ్రం చేయబడింది. అయినను, రోజులు, వారాలు, నెలలు గడిచేకొలది, మళ్ళీ దుమ్ము ధూళి క్రమంగా ప్రత్యక్షమౌతుంది. కాబట్టి ఒక్కసారి శుభ్రం చేస్తే సరిపోదు. తరచూ శుభ్రం చేయవలసిన అవసరముంది.
కొంతకాలంగా ఆధునిక వైద్యం మలేరియా, టి.బి. (క్షయవ్యాధి), సిఫిలిస్ అనే రోగాలను పూర్తిగా తుడిచివేసిందని అనిపించింది. అయితే అవసరమైన పరిశోధనలు, చికిత్స తరచూ నిర్లక్ష్యం చేయబడ్డాయి. ఇప్పుడు “దుమ్ము, ధూళి” మళ్ళీ ప్రత్యక్షమయ్యాయి. “ప్రపంచవ్యాప్తంగా, మలేరియా మరింత తీవ్రంగా, ఉద్ధృతంగా మారింది,” అని ప్రపంచ ఆరోగ్య సంస్థలోని డా. హిరోషి నాకాజెమ అంటున్నారు. క్షయవ్యాధి చికిత్సలో నిపుణుడైన డా. లి రిక్మ్యాన్ యిలా హెచ్చరిస్తున్నారు, “టి.బి.—ప్రతీకారజ్వాలతో మళ్ళీ వచ్చిందని ప్రజలు గుర్తించాలి.” మరి యీ దశాబ్దపు తొలి భాగంలో ది న్యూయార్క్ టైమ్స్ ఇలా ప్రకటించింది: “ఇప్పుడు సిఫిలిస్ వల్ల బాధపడే క్రొత్తవారి సంఖ్య 1949 కంటె అత్యధికంగా ఉంది.”
మలేరియా—దాదాపు ప్రపంచ సగ భాగాన్ని భయపెడుతుంది
ఇప్పటికి, దాదాపు 40 సంవత్సరాల నుండి మలేరియా దాదాపుగా తుడిచివేయబడిందని ప్రకటించబడినప్పటికి, ఆఫ్ఘనిస్తాన్, ఇండియా, ఇండోనేషియా, కంబోడియా, చైనా, థాయిలాండ్, బ్రెజిల్, వియత్నామ్, శ్రీలంక, మరియు ఆఫ్రికాలోని ఇతర భాగాల్లో మలేరియా మరీ ఎక్కువగా భయపెడుతుంది. ఫ్రెంచ్ వార్తాపత్రికయైన లీ ఫెగారో యిలా నివేదిస్తుంది, “మలేరియా సోకడం వలన ప్రతి నిమిషానికి ఇద్దరు పిల్లలు చనిపోతున్నారు.” సంవత్సర మరణ రేటు 20 లక్షలు—అంటే ఇది ఎయిడ్స్ మూలాన చనిపోయే వారి సంఖ్యకన్నా చాలా ఎక్కువే.
దాదాపు 27 కోట్లమంది వ్యక్తులకు మలేరియా పరాన్నజీవులు సోకాయి, అయితే 220 కోట్లమందికి మలేరియా సోకే ప్రమాదం ఉందంటున్నారు. న్యూ సైంటిస్ట్ అనే పత్రికలో ఫిలిడా బ్రౌన్ యిలా అడుగుతుంది, “ఒకప్పుడు పూర్తిగా తీసివేయబడిన లేదా ప్రపంచంలోని దాదాపు 90 శాతం మందిని అదుపులో ఉంచిన మలేరియా, ఇప్పుడు మనలో 40 శాతం మందిని ఎలా భయపెట్టగల్గుతుంది?” ఇందుకు అనేక కారణాలున్నాయి.
అడవులను నరికి, స్థిరనివాసమేర్పరచుకోవడం. దోమలతో నిండివున్న, వర్షపాత-అడవుల్లో ప్రజలు నివాసమేర్పరచుకోవడమే బ్రెజిల్లో మలేరియా విజృంభించడానికి కారణమైంది. “జరిగిందేమంటే మేము దోమల నివాసస్థలంపై దాడి చేశాము,” అని అంటువ్యాధుల నివారణా పరిశోధకుడైన క్లాడియో రెబారో చెబుతున్నారు. ఆయన యిలా కూడ అంటున్నారు, “వలస వచ్చినవారికి ఇంతకు ముందు మలేరియా సోకలేదు, వారిలో ఆ రోగ నిరోధక శక్తి లేదు.”
వలస వెళ్ళడం. మ్యాన్మార్ నుండి ఉద్యోగాన్వేషణకై వచ్చిన శరణార్థులు థాయిలాండ్‌లోని చిన్న పట్టణమైన బోరిలోని రత్నాల గనుల దగ్గరకు చేరిపోతారు. న్యూస్‌వీక్ యిలా నివేదిస్తుంది, “వారు తరచూ ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి తరలి వెళ్ళడం వలన మలేరియాను అదుపు చేయడం అసాధ్యమౌతుంది.” కేవలం గని కార్మికుల్లోనే ప్రతి నెల 10,000 మందికి మలేరియా సోకుతుంది!
వినోదయాత్ర. మలేరియాతో నిండిన ప్రాంతాలను సందర్శించేవారు మలేరియాతో తిరిగి ఇంటికి వెళ్తారు. అలా, 1991లో అమెరికాలో 1,000 మందికి, ఐరోపాలో 10,000 మందికి మలేరియా సోకిందని పరిశీలనలో తేలింది. ప్రతి సంవత్సరం వందలాదిమంది వినోద యాత్రికులు, విదేశాల్లో పనిచేసేవారు మలేరియా రోగంతో కెనడాకు తిరిగి వెళ్తున్నారు. ఒక విషాదకరమైన ఉదాహరణ ఏమంటే, ఇద్దరు పిల్లలకు వారి కుటుంబం ఆఫ్రికా నుండి రాగానే జ్వరం వచ్చింది. డాక్టరు అది మలేరియా అని అనుకోలేదు. “తల్లిదండ్రులు వారిని ఆసుపత్రికి తీసుకెళ్ళేటప్పటికే ఆలస్యమైపోయింది. వారిద్దరూ గంట తేడాలో చనిపోయారు,” అని టొరొంటో గ్లోబ్ అండ్ మెయిల్ నివేదిస్తుంది.
మందును తట్టుకొని నిలువగల మలేరియా రకాలు. ఆఫ్రికాలోని ఉష్ణమండల ప్రదేశాల్లో, అంతటా, మందుకు తట్టుకొని నిలువగలిగే మలేరియా వ్యాపించిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిస్తుంది. ఆగ్నేయాసియాలోని న్యూస్‌వీక్ యిలా చెబుతుంది, “సూక్ష్మక్రిములు మందును ఎంతవరకు ఎదిరించి నిలువగలుగుతున్నాయంటే వీటిలో కొన్ని రోగాలకు చికిత్స చేయలేని పరిస్థితి వస్తుంది.”
సౌకర్యాలు లేకపోవడం. కొన్ని ప్రదేశాల్లోని రోగ పరిశోధనలు జరిపే క్లినిక్‌లలో మామూలుగా రక్తపరీక్షలు చేయడానికి కావలసిన పరికరాలు కూడా లేవు. కొన్ని ప్రదేశాల్లో వైద్య రంగంలోని నిధుల కొరత వలన క్రిమిసంహారకాలకు, మందులకు కొరత ఏర్పడింది. కొన్నిసార్లు లాభం గడించాలనే తపనే కావచ్చు. “ఉష్ణ ప్రదేశంలోని వ్యాధులవలన లాభమేమీ దొరకడం లేదు,” అని న్యూ సైంటిస్ట్ ఒప్పుకుంటుంది, “ఎందుకంటే, సామాన్యంగా వ్యాధి సోకినవారు మందు కొనుక్కోలేకపోతున్నారు.”
క్షయరోగం—క్రొత్త పంథాలతో వస్తున్న పాత మహమ్మారి
క్షయవ్యాధిని అదుపులో ఉంచగల స్ట్రెప్టోమైసిన్ అనే మందు 1947లో ప్రవేశపెట్టబడింది. ఆ కాలంలో, క్షయవ్యాధిని ఒక్కసారిగా శాశ్వతంగా తొలగించవచ్చని తలంచబడింది. కాని కొన్ని దేశాల్లో పరిస్థితి విషమించిపోయిందని అకస్మాత్తుగా గుర్తించబడింది: ఇటీవలి సంవత్సరాల్లో క్షయవ్యాధి రేటు చాలా పెరిగిపోయింది. ది వాషింగ్టన్ పోస్ట్ ఇలా నివేదిస్తుంది, “అమెరికాలో దారిద్ర్యము ప్రబలివున్న ప్రాంతాల్లోని క్షయవ్యాధి రేటు, ఆఫ్రికాలోని దక్షిణ సహార భాగంలో అధిక దారిద్ర్యమున్న ప్రాంతాల్లోకన్నా తీవ్రంగా వుంది.” కోటె డి ఐవొరిలోని ఒక పత్రిక దీన్ని “మరల విప్పిన విషపుకోరల క్షయవ్యాధి” అని పిలుస్తుంది.
డా. మిఖాయేల్ ఇస్మ్యాన్ ఇలా విలపిస్తున్నాడు: “దాన్నెలా నివారించాలో మాకు తెలుసు. అది మా అదుపులో ఉండేది. కాని దాన్ని నిర్మూలించడానికి చేయవలసిన పనిని ముగించడంలో ఓడిపోయాం.” క్షయవ్యాధిని ఎదుర్కొనడంలో ఏది అడ్డగించింది?
ఎయిడ్స్. ఇది వ్యక్తి యొక్క రోగ ప్రతినిరోధక శక్తిని క్షీణింపజేస్తుంది గనుక, క్షయవ్యాధి తిరిగి రావడానికి ఎయిడ్స్ ముఖ్య కారణంగా పరిగణించబడుతుంది. డా. ఇస్మ్యాన్ యిలా అంటున్నారు, “ఒక వేళ వారు వేరే కారణాల వలన చనిపోకుండావుంటే, క్షయవ్యాధి సూక్ష్మక్రిములను కల్గివున్న 100 శాతం మంది ఎయిడ్స్ బాధితులకు సామాన్యంగా క్షయవ్యాధి సోకుతుంది.”
పరిసర ప్రాంతాలు. జైళ్ళు, నర్సింగ్ హోమ్‌లు, నిరాశ్రయుల ఆశ్రయపురాలు, ఆసుపత్రులు, ఇతర సంస్థలు క్షయవ్యాధికి జన్మస్థలాలు కాగలవు. డా. మార్వెన్ పామెరంట్స్ తెల్పేదేమంటే ఆసుపత్రుల్లో ఏరోసోలైజ్డ్ చికిత్స నిమ్మోనియా రోగుల్లో దగ్గును పెంచి, అలాగే ఆసుపత్రి సిబ్బందికి క్షయవ్యాధిని తెచ్చింది.
పెట్టుబడి కొరత. క్షయవ్యాధి అదుపులో ఉంచబడిందని అనుకునేసరికి పెట్టుబడి తగ్గిపోయింది, మరి ప్రజల శ్రద్ధ ఎటో పోయింది. డా. లీ రిక్మ్యాన్ ఇలా చెబుతున్నారు, “టి.బి.ని తొలగించడానికి బదులుగా మనం దాన్ని రూపుమాపే కార్యక్రమాన్నే తొలగించాం.” జీవరసాయన శాస్త్రజ్ఞుడైన పాట్రిక్ బ్రెన్నన్ ఇలా అంటున్నారు, “నేను 1960 తొలి భాగంలో క్షయవ్యాధిని నివారించే మందులను కనుక్కోడానికి తీవ్రంగా కృషిచేసేవాన్ని, కాని అది నిర్మూలించబడిందనుకొని పరిశోధనా పనిని విడిచి పెట్టాలని తీర్మానించుకున్నాను.” అలా డాక్టర్లు నిరీక్షించని విధంగా క్షయవ్యాధి మళ్ళీ వచ్చింది. ఒక డాక్టరు ఈ విధంగా చెప్పారు, “ఒక్క వారంలోనే [1989లో] నేను నలుగురు రోగులను చూశాను ఇలా ఇక ఎన్నడూ మళ్ళీ చూడనని మా మెడికల్ స్కూల్ టీచర్ చెప్పింది.”
సిఫిలిస్—మహమ్మారి మళ్ళీ వస్తుంది
పెన్సిలిన్ ఎంతో ప్రభావం గలదైనప్పటికీ, సిఫిలిస్ వ్యాధి ఆఫ్రికాలో యింకా విస్తారంగా ఉంది. అమెరికాలో, గత 40 సంవత్సరాల తర్వాత ఇది మరింత శక్తిమంతంగా తిరిగి వస్తుంది. ది న్యూయార్క్ టైమ్స్ ప్రకారం సిఫిలిస్ ఇప్పుడు “దాన్ని ఎన్నడూ చూడని డాక్టర్ల తరాన్ని బెంబేలెత్తిస్తుంది.” ఎందుకిది మళ్ళీ వచ్చింది?
క్రాక్. ఒక డాక్టరు చెబుతున్నట్లుగా క్రాక్నకు దాసులవడం “అమితంగా కొకైన్ ఉపయోగించడానికి, లైంగికతకు” నడిపిస్తుంది. మగవారు తమ వ్యసనం కొరకు తరచూ దొంగతనం చేస్తుంటే, బహుశా, స్త్రీలు మాదక ద్రవ్యాల కొరకు వ్యభిచారం చేస్తున్నారు. అమెరికాలోని సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్లోని డా. విల్లార్డ్ కాట్స్, జూనియర్., చెప్పేదేమంటే “క్రాక్స్ ఉన్న ఇండ్లలో లైంగిక అవినీతి ఉంది, వారికి అనేక భాగస్వాములున్నారు. ఆ పరిస్థితుల్లో ఏయే అంటువ్యాధులు ప్రబలివుంటాయో అవి ఇతరులకు కూడా సోకుతాయి.”
సంరక్షణ లేకపోవడం. డిస్కవర్ అనే పత్రిక నివేదించేదేమంటే “‘సురక్షితమైన లైంగికతను గూర్చిన ప్రచారం ఉన్నప్పటికి’ కౌమారదశలోని పిల్లలు తమకు వ్యాధి సోకకుండా కాపాడుకోడానికి కండోమ్‌లను ఉపయోగించేందుకు శ్రద్ధ చూపడం లేదు.” అపాయకారులైన భాగస్వాములు గలవారిలో 12.6 శాతం మంది మాత్రమే ఎల్లప్పుడూ కండోమ్‌లను ఉపయోగించినట్లు అమెరికాలోని ఒక అధ్యయనం తెలియజేసింది.
పరిమితమైన ఆర్థిక వనరులు. ది నూయార్క్ టైమ్స్ యిలా చెబుతుంది: “సిఫిలిస్ వ్యాధిని, ఇతర సుఖవ్యాధులను ఎక్కువగా పరిశోధించి తీర్మానించే ప్రజాక్లినిక్లను ఆర్ధిక ఇబ్బందులు అడ్డగిస్తున్నాయి.” అంతేకాక, పరిశోధనా పద్ధతులు ఎల్లవేళలా ఖచ్చితమైనవి కావు. ఒక ఆసుపత్రిలో చాలామంది తల్లులు సిఫిలిస్ సోకిన పిల్లలకు జన్మనిచ్చారు, కాని ముందు జరిపిన తల్లుల రక్త పరిశోధనలో సిఫిలిస్ సోకిన రుజువే లేదు.
నిర్మూలన సమీపిస్తుందా?
వ్యాధికి వ్యతిరేకంగా మానవుడు జరిపిన పోరాటం సుదీర్ఘమైనది, నిరాశాజనకమైనది. కొన్ని రోగాలకు వ్యతిరేకంగా జరిపిన పోరాటాల్లో సాధించిన విజయం ఇతర వ్యాధులకు వ్యతిరేకంగా జరిపిన పోరాటాల్లోని పరాజయానికి సరిపోతుంది. ఎన్నటికీ జయించలేని ఒక శాశ్వతమైన పోరాటానికి మానవుడు శాసించబడ్డాడా? వ్యాధిలేని ఒక లోకం ఎన్నడైనా వస్తుందా?
[7వ పేజీలోని బాక్సు/చిత్రం]
సిఫిలిస్ చేసే నాశనము
ట్రెపోనెమ పాల్లిడమ్, స్ప్రింగ్వంటి స్పిరోకేట్ అనే సూక్ష్మక్రిమిద్వారా సిఫిలిస్ వ్యాధి వస్తుంది, లైంగిక అవయవాల ద్వారా కూడ ఆ వ్యాధి సోకుతుంది. స్పిరోకేట్ రక్తప్రవాహంలో ప్రవేశించి శరీరమంతా వ్యాపిస్తుంది.
అది సోకిన అనేక వారాల తర్వాత, కొరుకుడువ్యాధి అని పిలువబడే పుండు ప్రత్యక్షమౌతుంది. సాధారణంగా అది లైంగిక అవయవాల మీద ఏర్పడుతుందిగానీ, పెదవులపైన, గళగ్రంథిపైన, లేదా వ్రేళ్ళపైన కూడ అది ప్రత్యక్షం కావచ్చు. చివరికి ఈ కొరుకుడు వ్యాధి ఒక్క మచ్చ కూడా లేకుండా మానుతుంది. అయితే, శరీరంపై దద్దుర్లు, గొంతులో కురుపులు, కీళ్ళ నొప్పులు, జుట్టు ఊడడం, గాయాలు, కళ్ళు వాచిపోవడం వంటి ఇతర లక్షణాలు కన్పించేవరకు సూక్ష్మక్రిములు శరీరమంతటా వ్యాపిస్తూనే ఉంటాయి.
చికిత్స చేయకపోతే, సిఫిలిస్ జీవిత కాలమంతా ఉండేలాగున గుప్తంగా శరీరంలోనే నిలిచివుంటుంది. ఈ పరిస్థితిలో ఒక స్త్రీ గర్భం ధరించినట్లయితే, ఆమె బిడ్డ అంధత్వంతోనో, వికృతంగానో పుట్టవచ్చు, లేదా చనిపోవచ్చు.
దశాబ్దాల తర్వాత, కొంతమంది సిఫిలిస్ తదుపరి స్థాయికి చేరుతారు, అప్పుడు స్పిరోకేట్ హృదయంలో, మెదడులో, వెన్నుపాములో, లేదా శరీరంలోని ఇతర భాగాల్లో నివాసం చేయవచ్చు. స్పిరోకేట్ మెదడులో నివాసం చేస్తున్నట్లయితే వణుకుడు రోగం, పక్షవాతం, పిచ్చి మొదలైనవి రావచ్చు. చివరికి యీ వ్యాధి ప్రాణాంతకం కావచ్చు.
[క్రెడిట్ లైను]
Biophoto Associates/Science Source/Photo Researchers
[7వ పేజీలోని బాక్సు/చిత్రం]
“గొప్ప హాస్యగాడు”
డా. లీ రిక్మ్యాన్ క్షయవ్యాధిని అలాగే పిలుస్తాడు. ఆయన ఇలా అంటున్నారు, “అది జలుబులా, శ్వాసనాళ వాపులా, విషజ్వరంలా కనబడగలదు. కాబట్టి ఒక డాక్టరు దాన్ని క్షయవ్యాధి అని తలంచనట్లయితే, ఆమెగాని, ఆయనగాని, రోగాన్ని పరిశోధించి నిర్ణయించలేకపోవచ్చు.” ఈ వ్యాధి సోకిందా లేదా అని నిర్ధారించడానికి గుండె ఎక్స్‌రే తీయవలసిన అవసరముంది.
క్షయవ్యాధి ఒక వ్యక్తి నుండి మరొక వ్యక్తికి గాలి ద్వారా సోకుతుంది. ఊపిరితిత్తుల్లోకి ప్రవేశించేంతటి అతి చిన్న రేణువులను దగ్గు సృష్టించగలదు. అయినను, శరీరంలోని రక్షక దళాలు వ్యాధి వ్యాపించకుండా కాపాడే సామర్థ్యం కలిగి ఉన్నాయి. డా. రిక్మ్యాన్ ఇలా వివరిస్తున్నారు: “గుండె లోతున అనేకమైన సూక్ష్మక్రిములున్నవారు—అంటే, 10,000 సూక్ష్మక్రిములుగల వారికన్నా, 10 కోట్ల సూక్ష్మక్రిములున్న రోగులే యీ వ్యాధిని ఇతరులకు అంటించగలరు.”
[క్రెడిట్ లైను]
SPL/Photo Researchers
[7వ పేజీలోని బాక్సు/చిత్రం]
భౌగోళిక ఉష్ణోగ్రత, మలేరియా
రోగాన్ని వ్యాపింపజేసే యనోఫీలియస్ గాంబియా అనే దోమ లేకుండా మలేరియా వ్యాపించదు. ది ఎకనోమిస్ట్ అనే పత్రిక యిలా చెబుతుంది, “మీరు సూక్ష్మక్రిములను తొలగిస్తే, వ్యాధిని నివారించగలరు.”
ఉష్ణోగ్రతలోని కొద్దిపాటి పెరుగుదల యీ క్రిముల సంఖ్యను అధికం చేయగలవని పరిశోధనశాలలోని ప్రయోగాలు చూపిస్తున్నాయి. అందుకే, భౌగోళిక ఉష్ణోగ్రత మలేరియాపై చాలా ఎక్కువ ప్రభావం చూపుతుందని కొందరు నిపుణులు అనుకుంటున్నారు. డా. వాలస్ పీటర్జ్ ఇలా చెబుతున్నారు, “భూమ్యంతటా ఉన్న ఉష్ణోగ్రత అంతా కేవలం ఒకటి రెండు డిగ్రీల సెల్సియస్ వరకు పెరిగినట్లయితే, అది దోమలు పెరిగే ప్రాంతాలను పెంచి, తద్వారా, మలేరియాను ఇప్పటికన్నా మరి ఎక్కువ విస్తృతంగా వ్యాపింపజేయగలదు.”
[క్రెడిట్ లైను]
Dr. Tony Brain/SPL/Photo Researchers
[6వ పేజీలోని చిత్రం]
నిరాశ్రయుల కొరకైన ఆశ్రయపురాలు క్షయవ్యాధికి జన్మస్థలాలు కాగలవు
[క్రెడిట్ లైను]
Melchior DiGiacomo