మృదువైన రెక్కలపై మరణం
అది ప్రజల అవధానాన్నిపొందే యుద్ధం కాదు; అయినా దానివల్ల లక్షల ప్రజలు చనిపోయారు. అది బాంబులు, తూటాలతో జరిగే యుద్ధం కాదు; అయినా దుఃఖం, మరియు బలిగొన్న ప్రాణాల విషయంలో యుద్ధాలైన వాటికి తీసిపోదు లేక మించిపోతుంది కూడా. ఈ యుద్ధంలో మరణం, బాంబులు వేసే శత్రువు విమానంనుండి కాక, ఆడ దోమ సున్నితమైన రెక్కలపైనుండి వస్తుంది.
నైజీరియాలోని అవేక్! ప్రతినిధి
అది రాత్రి; ఇంటివారంతా నిద్రపోతున్నారు. తన రెక్కలు క్షణానికి 200 నుండి 500 సార్లు కొట్టుకుంటుండగా, పడక గదిలోనికి ఒక దోమ ఎగురుకుంటూ వస్తుంది. అది మానవ రక్తానికై ఆకలిగొని ఉంది. అది ఒక పిల్లవాని చేయి మీద సుకుమారంగా కూర్చుంటుంది. దాని బరువు కేవలం 3/1,000గ్రాము కనుక పిల్లవాడు కదలడు. దాని నోటిభాగంలో ఉన్న ముండ్ల కొనలోని రంపపుపల్ల కొండీని ఒరలో నుండి తీసి, దాంతో ఆ పిల్లవాని రక్తనాళంపై ఉన్న చర్మాన్ని కుడుతుంది. దాని తలలో ఉన్న రెండు పంపులు వాని రక్తాన్ని పిలుస్తాయి. అదే సమయంలో, దోమ లాలాజల గ్రంథిలో నుండి మలేరియా పరాన్నజీవులు పిల్లవాని రక్తప్రవాహంలోకి జారుతాయి. అది వచ్చిన పని తొందరగా అయిపోయింది; వాడికి నొప్పేమి కలుగదు. తన శరీర బరువుకంటే ఇంచుమించు మూడంతల రక్తంతో నిండుకొని దోమ ఎగిరిపోతుంది. ఎన్నో రోజులు గడవక ముందే, ఆ పిల్లవాడు మరణించేంత వ్యాధిగ్రస్తుడయ్యాడు. వానికి మలేరియా సోకింది.
ఇది కోట్లసార్లు జరిగిన సంఘటన. దాని ఫలితం, అత్యధిక సంఖ్యలో ప్రజలు చనిపోవడం, బహువేదనకు గురికావడం. నిస్సందేహంగా, మలేరియా మానవజాతి యొక్క క్రూరమైన, దయలేని శత్రువు.
శత్రువుకొరకు సహనంతోకూడిన పరిశోధన
మలేరియాను అరికట్టటానికి చేసే పోరాటంలోని ప్రాథమిక వాస్తవాలు ఐరోపాలోని గొప్ప వైజ్ఞానికులచే కాదుగాని, భారతదేశంలో ఉండిన బ్రిటీష్ ఆర్మీ వైద్యుని ద్వారా కనుగొనబడ్డాయి. గత రెండు వేల సంవత్సరాల ఆలోచన ప్రకారం, అపరిశుభ్రమైన గాలినిa పీల్చుకోవడంవల్ల ఆ వ్యాధి ప్రజలకు వస్తుందని 19వ శతాబ్దపు వైజ్ఞానికులు, వైద్యులు ఊహించారు. దానికి విరుద్ధంగా, ఆ వ్యాధి దోమ ద్వారా మనిషి నుండి మనిషికి వస్తుందని డా. రొనాల్డ్ రాస్ నమ్మాడు. మలేరియా వచ్చినప్పుడు మానవ రక్త ప్రవాహంలో మలేరియా పరాన్నజీవులు ఉంటాయన్న విషయం తెలిసినా, పరిశోధకులు మాత్రం చిత్తడినేలలోని గాలి, నీళ్లలో వాటి జాడకొరకు వెదకడం కొనసాగించారు. అంతలో, రాస్ దోమల కడుపులను పరీక్షించాడు.
అతడు పనిచేసే పాతకాలంనాటి ప్రయోగశాల ఉపకరణాలను గమనిస్తే దోమల కడుపులోకి చూడడం అంత సులభమేమి కాదు. రాస్ చెప్తున్నట్లు, తను పనిచేస్తుండగా, “తమ స్నేహితుల మరణానికై” కక్ష తీర్చుకోడానికి నిశ్చయించుకుని, జోరీగలు, దోమల సమూహాలు అతని చూట్టూ మూగేవి.
ఆఖరుకు, ఆగష్టు 16, 1897న అనాఫిలస్ అనే దోమ కడుపులో, ఒక్క రాత్రికే చాలా పెద్దగా పెరిగిన గుండ్రని జీవులను రాస్ కనుగొన్నాడు. అవే మలేరియా పరాన్నజీవులు!
ఆనందంతో నిండినవాడై, “పదివేల మంది మనుష్యుల్ని” రక్షించగల రహస్యాన్ని కనుగొన్నానని రాస్ తన పుస్తకంలో వ్రాశాడు. బైబిలు పుస్తకమైన కొరింథీయులనుండి ఆయన ఒక వచనం కూడా ఎత్తి వ్రాసాడు: “ఓ మరణమా, నీ విజయమెక్కడ? ఓ మరణమా, నీ ముల్లెక్కడ?”—1 కొరింథీయులు 15:55ను పోల్చండి.
మలేరియా చేసిన విధ్వంసకాండ
మలేరియాను అరికట్టే ప్రయత్నంలో రాస్ చేసిన పరిశోధన, ఆ వ్యాధిని, దానికి సంబంధించిన కీటకాలను నిరోధించడానికి మానవజాతి యొక్క తొలి పెద్ద ఆయుధానికి మార్గం ఏర్పరచటానికి సహాయపడిన మైలురాయి.
గడిచిన చరిత్రంతటిలో చాలా మట్టుకు, మానవజాతి మలేరియావల్ల దీర్ఘకాలంగా, అధికంగా నష్టపోయింది. ఐగుప్తీయుల చిత్రలిపి, వ్రాతప్రతులు క్రీస్తు భూమిపై జీవించిన కాలానికి 1,500 ఏండ్ల ముందు మలేరియా చేసిన మారణహోమానికి అద్దంపడుతున్నాయి. అవి ప్రాచీన గ్రీసు యొక్క అందమైన పల్లపు ప్రాంత పట్టణాలను సర్వనాశనం చేసి, తన యౌవనదశలో ఉన్న అలెగ్జాండర్‌ను సహితం చంపేసింది. రోమా పట్టణాలలోని విశేషజనాన్ని నాశనం చేసి ధనిక వర్గాన్ని ఎగువ ప్రాంతాలకు తరిమింది. మతయుద్ధాల్లోను, అమెరికా అంతర్యుద్ధంలోను, రెండు ప్రపంచ యుద్ధాల్లోను, ఇంకెన్నో పెద్ద పోరాటాలలో చనిపోయిన వారికంటే ఇదే ఎక్కువమందిని చంపింది.
పశ్చిమ ఆఫ్రికా “తెల్లవాని సమాధి” అనే విశేషణాన్ని సంపాదించడానికి మలేరియా ఆఫ్రికాఖండానికి సహాయం చేసింది. వాస్తవానికి, ఆఫ్రికాలో ఐరోపా దేశస్థులు వలసరాజ్యస్థాపనకై చేసిన సంఘర్షణను ఈ వ్యాధి ఎంతగా అడ్డుకుందంటే దక్షిణాఫ్రికా యొక్క ఒక విశ్వవిద్యాలయం దోమను జాతీయ కధానాయకుడని వర్ణించింది! మధ్య అమెరికాలో, పనామా కాలువ నిర్మించాలన్న ఫ్రెంచిదేశీయుల ప్రయత్నాన్ని విఫలం చేయడానికి మలేరియా సహాయం చేసింది. దక్షిణ అమెరికాలోని, బ్రెజిల్‌లో మమోరే-మడైరా రైలుకట్టను నిర్మించడంలో, మలేరియా ప్రతి అడ్డు కట్టకు ఒక మానవ ప్రాణం చొప్పున బలిగొన్నదని చెప్పబడుతుంది.
గెలవడానికి పోరాటం
మలేరియాకు విరుద్ధంగా పని చేస్తున్నట్లు తెలియకుండానే దోమల బారినుండి తప్పించుకోవాలని చేస్తున్న సంరక్షణా ప్రయత్నాలు వేల సంవత్సరాల నుండి కొనసాగుతున్నాయి. సా.శ.పూ., 16వ శతాబ్దంలో దోమలను తరమడానికి ఐగుప్తీయులు బలనైటెస్ విల్‌సోనియానా చెట్టు నూనెను ఉపయోగించే వారు. ఓ వెయ్యేండ్ల తర్వాత, ఐగుప్తులోని చేపలు పట్టేవారు ఈ కీటకాలను దూరంగా ఉంచడానికి రాత్రివేళ తమ పడకల చుట్టూ తమ వలలను చుట్టుకునే వారని హెరెడోటస్ వ్రాశాడు. పదిహేడు శతాబ్దాల తర్వాత, భారతదేశంలోని ధనికులు, రాత్రివేళ మూయగల సంరక్షణాకరమైన దోమ తెరలను ఉపయోగించి నిద్రించేవారని మార్కో పోలో నివేదించాడు.
వేరే ప్రాంతాల్లో, ప్రజలు నిజమైన విలువగల ప్రకృతి సంబంధమైన నివారణలను కనుగొన్నారు. చైనాలో 2,000 సంవత్సరాలకు పైగా, మలేరియాను క్విన్‌గాసూ అని పిలవబడే చెట్టు ద్వారానే విజయవంతంగా నయం చేసేవారు. దాన్ని ఈ మధ్య సంవత్సరాలలో తిరిగి కనుగొన్నారు. దక్షిణ అమెరికాలో, పెరూవియన్ ఇండియన్లు చించోనా చెట్టుబెరడును ఉపయోగించే వారు. చించోనా 17వ శతాబ్దంలో, ఐరోపాకు తీసుకురాబడింది, మరియు 1820లో పారిస్‌లోని మందులు తయారు చేసేవాళ్లు ఇద్దరు దానినుండి క్వినైన్ అనబడే ఆల్కలాయిడ్‌ను తీసారు.
క్రొత్త ఆయుధాలు
మలేరియాను తగ్గించి, దాన్ని నయం చేయడంలో క్వినైన్ విలువను ఆలస్యంగా గ్రహించారు, దాన్ని గ్రహించిన తర్వాత, ఓ వందేళ్ల వరకు అందరు దాన్నే వాడేవారు. తర్వాత, రెండవ ప్రపంచ యుద్ధ ప్రారంభంలో, జపాను సైన్యాలు దూర ప్రాచ్యంలోని ప్రాముఖ్యమైన చించోనా మొక్కలున్న క్షేత్రాన్ని స్వాధీనం చేసుకున్నాయి. అమెరికాలో క్వినైన్ యొక్క తీవ్రకొరత మూలంగా మలేరియాను అరికట్టే ఒక కృత్రిమ మందును తయారు చేయడానికి తీవ్ర పరిశోధనలు జరపవలసి వచ్చింది. తత్ఫలితంగా, చౌకగా తయారు చేయగల, చాలా శక్తివంతమైన, సురక్షితమైన క్లోరోక్విన్ ఉత్పత్తియైంది.
క్లోరోక్విన్ త్వరగా మలేరియాను అరికట్టే ముఖ్యమైన ఆయుధంగా తయారైంది. ఇంకా 1940లో దోమలను శక్తివంతంగా చంపగల డీడీటీ అనే క్రిమిసంహారక మందు ప్రవేశపెట్టబడింది. డీడీటీ చల్లినపుడు దోమలు చావడమే కాకుండా చల్లబడిన గోడల మీద మిగిలి ఉన్న మందు కీటకాలను కూడా నాశనం చేస్తుంది.b
ఆశతో ప్రతిఘటించుట
రెండవ ప్రపంచ యుద్ధానంతరం, డీడీటీ, క్లోరోక్విన్‌తో సాయుధులైన వైజ్ఞానికులు మలేరియాకు, దోమలకు విరుద్ధంగా ప్రపంచ వ్యాప్త ప్రతిఘటనను వ్యవస్థీకరించారు. పోరాటం రెండు రంగాల ద్వారా పోరాడవలసి ఉండెను—మానవ శరీరంలో ఉన్న పరాన్నజీవులను చంపడానికి మందులు ఉపయోగించబడతాయి, అలాగే క్రిమిసంహారక మందులను అధికంగా చల్లడం దోమలను రూపుమాపుతుంది.
పూర్తి విజయాన్ని సాధించాలన్నదే లక్ష్యం. మలేరియాను ఉనికిలో లేకుండా తుడిచివేయాలి. నిర్మూలనా కార్యక్రమాన్ని తన ప్రథమ ధ్యేయంగా పెట్టుకున్న, క్రొత్తగా రూపుదిద్దుకున్న ప్రపంచ ఆరోగ్య సంస్థే ఈ విధ్వంసకాండలో నాయకత్వం వహించింది. సంస్థ పట్టుదలకు ధనం వంతపలికింది. 1957 నుండి 1967 మధ్యలో, ఈ ప్రపంచ వ్యాప్త దండయాత్రలో ప్రపంచ దేశాలు 104 కోట్ల డాలర్లు ఖర్చుపెట్టాయి. తొలి ఫలితాలు అద్భుతంగా ఉన్నాయి. ఐరోపా, ఉత్తర అమెరికా, సోవియట్, ఆస్ట్రేలియాలలో, మరియు దక్షిణ అమెరికాలోని కొన్ని దేశాల్లో ఈ వ్యాధి నిర్మూలింపబడింది. “ఆ శాంతిమయ కాలాల్లో మలేరియా నిర్మూలనా దృక్పథం ప్రపంచ వ్యాప్తంగా రేపిన మహత్తర ఉత్సాహాన్ని నేడు వర్ణించడం కష్టం” అని మలేరియాకు వ్యతిరేకంగా పోరాడటంలో ఎంతో అనుభవంగల ప్రొఫెసర్ ఎల్. జే. బ్రూస్-ష్వాట్ వివరించాడు. మలేరియా ఊగిసలాడుతోంది! “మలేరియాను నిర్మూలించడం మన పరిధికందుబాటులో ఉన్న వాస్తవం” అని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రగల్భం పలికింది.
మలేరియా తిరిగి ప్రబలుతుంది
కాని విజయం దొరకలేదు. రసాయనిక దాడిని తప్పించుకున్న కొన్ని తరాల దోమలు కీటకనాశినులను ఎదుర్కొని జీవించగలిగాయి. డీడీటీ వాటిని ముందు చంపినంత సుళువుగా ఇప్పుడు చంపటం లేదు. అదే విధంగా, మానవులలోని మలేరియా పరాన్నజీవులు క్లోరోక్విన్‌ను ఎదిరించగలిగాయి. ఇవి మరియు ఇతర సమస్యలు, విజయం తధ్యమని అనుకున్న దేశాల్లోని పరిస్థితిని తారుమారు చేశాయి. ఉదాహరణకు, 1963లో మలేరియా పూర్తిగా తుడిచిపెట్ట బడిందని భావించిన శ్రీలంకలో, కేవలం ఐదేళ్ల తర్వాత లక్షలాది మంది దాని వాతపడ్డారు.
మలేరియా ఒక జయించలేని శత్రువన్న విషయం 1969కల్లా బాగా స్థిరపడిపోయింది. “నిర్మూలం” అనే మాటకు బదులు “అదుపు చేయు” అను పదం ప్రచలితమైంది. “అదుపు చేయడం” అంటే అర్థమేమిటీ? ప్రపంచ ఆరోగ్య సంస్థ మలేరియా విభాగం యొక్క అధ్యక్షుడు, డా. బ్రేన్ డోబెర్‌స్టెన్ ఇలా వివరిస్తున్నాడు: “ఇప్పుడు మనం చేయగలిగిందల్లా మరణాలను, కష్టాలను కొంతమేరకు తగ్గించడానికి ప్రయత్నించడమే.”
ప్రపంచ ఆరోగ్య సంస్థ యొక్క ఇంకొక అధికారి ఇలా బాధపడ్డాడు: “మలేరియా నిర్మూలనకు 1950లో ప్రయత్నాలు జరిపి మరియు ఆ కీటకాలను చంపడానికి డిడిటీని ఉపయోగించిన తర్వాత, అంతర్జాతీయ సమాజం నిష్క్రమించింది. బీదరికం, సేవాసౌకర్యాలు లేకపోవడం, మందులను, కీటకనాశినులను ఎదురించగల శక్తిలభించడం వ్యాధిని తీవ్రతరం చేశాయి. వాస్తవానికి, అదే మనల్ని ఓడించింది.”
మందుల సంస్థలు తమ పరిశోధన నుండి తిరోగమించడమే ఇంకొక కారణం. ఒక మలేరియా వైజ్ఞానికుడు ఇలా చెప్పాడు: “సమస్యేమంటే దాంట్లో చాలా పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది, కాని లాభం ఎంత మాత్రం ఉండదు, ప్రోత్సాహం శూన్యం.” అవును, ఎన్ని యుద్ధాలను గెలిచినా, మలేరియాకు విరుద్ధంగా జరుగుతున్న పోరాటం మాత్రం ఎప్పుడూ ఆగేటట్టులేదు. అయితే, “నాకు దేహములో బాగులేదని అందులో నివసించు వాడెవడును” అనని కాలమొకటి త్వరలో రాబోతుందని బైబిల్ చెబుతుంది. (యెషయా 33:24) అప్పటి వరకూ, వ్యాధి మరణం కూడా మృదువైన రెక్కలపైనే వస్తాయి. (g93 5/8)
[అధస్సూచీలు]
a “మలేరియా” అను పదం ఇటాలియన్ మల (చెడ్డ) ఏరియా (గాలి) నుండి వచ్చింది.
b డీడీటీ వాతావరణానికి హానికరమైనదని కనుగొనబడింది, మరియు అది 45 దేశాల్లో తీవ్రంగా నిర్భంధించబడటమో లేక నిషేధించబడటమో జరిగింది.
[25వ పేజీలోని బాక్సు]
దోమకు మనిషికి మధ్య పోటీ
అది మానవజాతిలో దాదాపు సగం మందిని, వంద కంటే ఎక్కువ దేశాలలోని ప్రజలను, ఎక్కువగా ఉష్ణదేశాలలోని వారిని భయపెడుతుంది. ప్రాముఖ్యంగా ఆఫ్రికా దీనికి ముఖ్య కేంద్రమైయుంది.
దోమలు ఉష్ణమండల ప్రాంతాలనుండి విమానాలలో ప్రయాణం చేసి అంతర్జాతీయ విమానాశ్రయాల సమీపంలో జీవిస్తున్న ప్రజలను రోగగ్రస్తులను చేస్తున్నాయి.
హతుల సంఖ్య. అది ప్రతి ఏటా 27 కోట్లమందికి సోకి, 20 లక్షల మందిని చంపుతుంది. పిల్లలు, గర్భిణీ స్త్రీల పట్ల ప్రాముఖ్యంగా నిర్దయగా ప్రవర్తిస్తుంది, ప్రతి నిమిషానికి సగటున ఇద్దరు యౌవనులను హతమారుస్తుంది.
అది ఉష్ణదేశాలకు వచ్చిన సందర్శకులకు సోకుతుంది. ప్రతి సంవత్సరం ఐరోపా 10,000 మందిని, దక్షిణ అమెరికా 1,000 మంది మలేరియా వ్యాధిగ్రస్తులను “దిగుమతి” చేసుకుంటున్నాయని నివేదించబడింది.
ఉపాయాలు. ఆడ అనాఫిలస్ దోమ మానవులను చాలా మట్టుకు రాత్రులలోనే కుడుతుంది. మలేరియా రక్తాన్ని ఎక్కించుకొనడం ద్వారాను, చాలా అరుదుగా అశుభ్రమైన సూదుల ద్వారాను అది సోకుతుంది.
ఎదురొడ్డి పోరాడటానికి మానవజాతికి ఈ మధ్యే పరిజ్ఞానం, మూలధనం లభించాయి. ఈ విపత్తును ఎదుర్కొనాలని 105 దేశాలు సంఘటిత ప్రయత్నాలు చేస్తున్నా, ఈ పోరాటంలో మానవజాతి ఓడిపోవలసి వస్తోంది.
[26వ పేజీలోని బాక్సు/చిత్రం]
దోమ కాట్లనుండి జాగ్రత్త పడండి
మీ పడకచుట్టూ దోమతెర వేసుకొని నిద్రపొండి. కీటకనాశినులు ఉన్న దోమతెరలు మంచివి.
ఎయిర్ కండీషనర్ ఉంటే అది ఉపయోగించండి, లేదా తలుపులకు, కిటికీలకు తెరలు వేసి ఉన్న గదులలో నిద్రపొండి. ఒకవేళ తెరలు లేకపోతే, తలుపులను, కిటికీలను గట్టిగా మూసివేసుకొనండి.
సూర్యాస్తమయం తర్వాత, పెద్ద చేతులున్న బట్టలను, పొడవు పైజామాలను ధరించడం మంచిది. నల్లని రంగుల దుస్తులు దోమలను ఆకర్షిస్తాయి.
దుస్తులచే కప్పబడని శరీర భాగాలకు కీటకాలను తరిమే మందులను పూసుకొనండి. డైఈతైల్‌టాల్యుమైడ్ (డీట్) లేక డైమీతైల్ తాలాట్ ఉన్న వాటిని ఎన్నుకొనండి.
దోమలను పోగొట్టే మందులను, చల్లే క్రిమిసంహారక మందులను, లేక దోమలను తరమడానికి కాల్చినప్పుడు పొగవచ్చే కాయిల్స్ ఉపయోగించండి.
Source: World Health Organization.
[క్రెడిట్ లైను]
H. Armstrong Roberts
హెచ్. ఆర్మ్‌స్ట్రాంగ్ రాబర్ట్స్
[27వ పేజీలోని బాక్సు]
“‘మంత్రించే మందేమి’ లేదు”
మలేరియాపై పూర్తి విజయమనేది కనుచూపు మేరలో లేకున్నా, మలేరియాకు విరుద్ధంగా జరుగుతున్న పోరాటం కొనసాగుతూనే ఉంది. “అంతటా వ్యాపించి ఉన్న కర్మ సిద్ధాంతపు వైఖరిని వదలిపెట్టి ప్రపంచ వ్యాప్తంగా మలేరియాను అరికట్టడానికి క్రొత్తగా ప్రయత్నాలు మొదలుపెట్టాలని” 1991 అక్టోబర్‌లో, కాంగోలోని, బ్రాజావిల్లినందు మలేరియాపై జరిగిన ఒక అంతర్జాతీయ సమావేశంలో, ప్రపంచ ఆరోగ్యసంస్థ ప్రతినిధులు సిఫారసు చేశారు. అటువంటి ప్రయత్నాలు ఎంతవరకూ విజయవంతమౌతాయి?
“మలేరియాను తొలగించడానికి ‘మంత్రించే మందేమి’ లేదని,” ప్రపంచ ఆరోగ్యసంస్థ ప్రధాన నిర్దేశకుడైన హిరోషే నకాజీమా ఈ మధ్యే చెప్పాడు. “మనం దానికి విరుద్ధంగా అనేక వైపులనుండి పోరాడాలి.” ఈ మధ్యే చాలా ప్రజాదరణ పొందిన మూడు యుద్ధరంగాలు ఇక్కడున్నాయి:
టీకాలు. మలేరియాను నయంచేసే టీకాను కనుగొనడానికి వైజ్ఞానికులు చాలా సంవత్సరాలుగా పనిచేస్తున్నారు, పరిశోధనలో “కనుగొనబడ్డ క్రొత్త విషయాలను” గురించి వార్తాపత్రికలు ఎప్పటికప్పుడు తెలియజేస్తుంటాయి. అనవసరమైన అనుకూల దృక్పథాన్ని త్రోసిపుచ్చుతూ, “మలేరియాను నిరోధించే టీకా భవిష్యత్తులో దొరకవచ్చనే భ్రమనుండి” వైదొలగమని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తుంది.
మలేరియా పరాన్నజీవి, దాన్ని నాశనం చేయాలని మానవ రోగనివారణా వ్యవస్థ చేస్తున్న ప్రయత్నాలను తప్పించుకొనడంలో విజయవంతం కావడం, టీకాను కనిపెట్టడంలో ఉన్న సమస్యలలో ఒకటి. చాలా సంవత్సరాలుగా వ్యాధి సోకుతున్నా, ప్రజలు చాలా తక్కువ వ్యాధి నిరోధక శక్తిని పెంచుకుంటున్నారు. “కొన్నిసార్లు కుట్టడం ద్వారా మీరు వ్యాధి నిరోధకతను అభివృద్ధి చేసుకోరు [టీకాను కనిపెట్టడానికి ప్రయత్నించడంలో] మీరు ప్రకృతిని మెరుగు పరచడానికి ప్రయత్నిస్తున్నారని” అట్లాంటా, అమెరికాలోని వ్యాధి నిరోధక కేంద్రంలో పనిచేస్తున్న ఎపిడెమియాలజిస్ట్ అయిన డా. హాన్స్ లోబెల్ వ్యాఖ్యానించాడు.
మందులు. ఇప్పుడున్న మందులను యీ మలేరియా పరాన్నజీవి ఎక్కువగా తట్టుకొనడం వల్ల, చైనా చెట్టు నుండి తీయబడిన క్విన్‌గాసూతో* తయారయిన ఆర్టీతర్ అని పిలువబడే ఒక క్రొత్త మందును ప్రపంచ ఆరోగ్య సంస్థ తయారు చేస్తుంది. క్విన్‌గాసూ సరిక్రొత్త శ్రేణికి చెందిన ప్రకృతి సంబంధమైన మందులకు మూలం కాగలదని, ప్రపంచ ప్రజలకు బహుశా పదేళ్లలో అది అందుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ నమ్ముతుంది.
దోమ తెరలు. దోమల బారినుండి తప్పించుకొనడానికి రెండు-వేల-సంవత్సరాల నుండి వాడుకలో ఉన్న యీ రక్షణకవచం ఈనాటికి కూడా పనిచేస్తుంది. మలేరియా దోమలు సాధారణంగా రాత్రివేళ కుడతాయి కాబట్టి, దోమతెర వాటినుండి కాపాడుతుంది. పెర్మెత్రిన్ వంటి క్రిమిసంహారక మందులో ముంచబడిన దోమ తెరలు చాలా ప్రభావితంగా ఉంటాయి. మందులో ముంచబడిన దోమ తెరలు ప్రవేశపెట్టబడిన గ్రామాల్లో మలేరియాకు సంబంధించిన మరణాలు 60 శాతం తగ్గాయని ఆఫ్రికానందలి పరిశోధనలు వెల్లడి చేస్తున్నాయి.
*క్విన్‌గాసూ అనేది అర్టెమీసియా యాన్నువా అను మాచిపత్రి చెట్టు నుండి తీయబడింది.
[28వ పేజీలోని బాక్సు/చిత్రం]
ఉష్ణమండలానికి ప్రయాణిస్తున్నారా?
మలేరియా భయమున్న ప్రాంతానికి మీరు వెళ్లాలనుకుంటే ఈ క్రింది వాటిని చేయాలి:
1. మీ డాక్టర్‌ను గానీ లేక టీకాలువేసే కేంద్రాన్ని గానీ సంప్రదించండి.
2. మీకివ్వబడిన సూచనలను తూచా తప్పకుండా పాటించాలి. మరి మీరు ఒకవేళ మలేరియా విరుగుడు మందును తీసుకుంటున్నట్లైతే, మలేరియా ప్రాంతాన్ని వదిలిన నాలుగు వారాల వరకు కూడా దాన్ని తీసుకుంటూనే వుండాలి.
3. దోమలు కుట్టకుండా మిమ్మల్ని మీరు సంరక్షించుకోండి
4. మలేరియా వ్యాధి సూచనలను తెలుసుకోండి: అంటే జ్వరం, తలనొప్పి, కండరాల నొప్పి, వాంతులు, మరియు/లేక అతిసారవ్యాధి మొదలైనవి. మలేరియాకున్న విరుగుడు మందులను ఉపయోగించినప్పటికీ, మలేరియా ప్రాంతాన్ని విడిచిన ఒక సంవత్సరం వరకూ మలేరియా మరల తన వికృతరూపాన్ని చూపవచ్చునన్న విషయాన్ని మరువకండి.
5. ఒకవేళ మీకు అటువంటి సూచనలు వుంటే డాక్టర్‌ను సంప్రదించండి. మలేరియా చాలా త్వరగా తీవ్రమై, మొదటి సూచనలు కనబడిన 48 గంటలలోపే మరణం సంభవించవచ్చు.
మూలము: ప్రపంచ ఆరోగ్య సంస్థ.
[Picture Credit Line on page 28]
H. Armstrong Roberts