“ఓ, యెహోవా, నా చిన్నారి కూతురును నమ్మకస్థురాలిగా ఉంచుము!”
నేను 1930లో ఫ్రాన్సులోని అల్సెస్లో ఒక కళాకారుల కుటుంబంలో పుట్టాను. సాయంకాలాల్లో, మా నాన్న, వాలు కుర్చీలో కూర్చుని భౌగోళిక శాస్త్రం, ఖగోళశాస్త్రాన్ని గూర్చిన కొన్ని పుస్తకాలు చదివేవారు. నా ప్రియమైన కుక్క నాన్నగారి కాళ్ళ మీద పడుకొని నిద్రపోయేది, మా అమ్మ కుటుంబానికి అవసరమైనవి కుట్టే సమయంలో నాన్న అమ్మతో తాను చదివేదాని నుండి ప్రాముఖ్యమైన విషయాలు చెప్పేవాడు. నేనా సాయంకాలాల్లో ఎంత సంతోషం అనుభవించేదాన్నో!
మతం మా జీవితాల్లో పెద్ద పాత్ర వహించింది. మేము సిసలైన కాథోలిక్లము, మేము ప్రతి ఆదివారం ఉదయాన చర్చీకి వెళ్ళడం చూసే ప్రజలు ఇలా అనేవారు: “ఇప్పుడు తొమ్మిది గంటలయ్యింది. అర్నోల్డ్ వాళ్ళ కుటుంబం చర్చికి వెళ్తుంది.” ప్రతిరోజు బడికి వెళ్ళే ముందు, నేను చర్చికి వెళ్ళేదాన్ని. కాని మతగురువు చెడుప్రవర్తన వలన, అమ్మ నన్ను ఒంటరిగా చర్చికి వెళ్ళవద్దంది. నాకు అప్పుడు ఆరేండ్ల వయస్సు.
బైబల్ఫొర్షర్ (ఇప్పుడు యెహోవాసాక్షులు అని పిలువబడే బైబిలు విద్యార్థులు) యిచ్చిన మూడు చిన్న పుస్తకాలను చదివిన తర్వాత మా అమ్మ ఇంటింట ప్రకటించడం మొదలు పెట్టింది. మా నాన్న దాని వలన కలత చెందాడు. తన ఎదుట మతపరమైన చర్చలేమి జరుపకూడదని ఆజ్ఞాపించాడు. ‘ఆ చెత్త చదవద్దు!” అన్నాడు. కాని అమ్మ సత్యంయెడల అమితమైన ఉత్సాహం కలదై నాతో కొంచెం సేపు బైబిలు చదవాలని తీర్మానించింది. ఆమె ఒక కాథోలిక్ బైబిలు భాషాంతరం సంపాదించి దాన్ని ప్రతి రోజు ఉదయం చదివేది, కాని మా నాన్న చెప్పినట్లు దాన్ని గూర్చి చర్చించేది కాదు.
ఒక రోజు ఆమె కీర్తన 115:4-8 చదివింది: “వారి విగ్రహములు వెండి బంగారువి అవి మనుష్యుల చేతిపనులు . . . వాటిని చేయువారు వాటియందు నమ్మికయుంచు వారందరును వాటివంటివారై యున్నారు.” ఆమె దానిని రెండవ ఆజ్ఞతో జోడించింది, అందులో ఇలా ఉంది: “విగ్రహమునైనను నీవు చేసికొనకూడదు.” (నిర్గమకాండము 20:4-6) నేను వెంటనే లేచి నా గదిలో నాకున్న విగ్రహపీఠాన్ని పగలకొట్టాను.
నేను బడికి వెళ్ళి నా తోటి విద్యార్థులతో నేను అనుదినం చదివే బైబిలు విషయాలను గూర్చి చెప్పేదాన్ని. అది బడిలో అలజడి రేపింది. పిల్లలు తరచూ వీథిలో నా వెంబడి పడి “చెడ్డ యూదురాలు!” అని పిలిచేవారు. అది 1937లో జరిగింది. నేను ఏమి నేర్చుకుంటున్నానో మా నాన్న తనిఖీ చేయుటకు ఈ పరిస్థితే కారణమైంది. ఆయన యెహోవాసాక్షులు ప్రచురించిన క్రియేషన్ అనే పుస్తకం స్వయంగా తెప్పించుకున్నాడు. ఆయన అది చదివి తానే ఒక సాక్షి అయ్యాడు!
జర్మనీ సైన్యం బెల్జియం సరిహద్దు ద్వారా ఫ్రాన్సులో ప్రవేశించగానే, పురపాలక మందిరంపై ఫ్రెంచ్ పతాక ఎగురుతున్నప్పటికీ చర్చీల పైభాగాన జెండాలమీద స్వస్తిక్ గుర్తులను మేము చూడడం మొదలు పెట్టాం. ఫ్రెంచ్ ప్రభుత్వం మన రాజ్యమందిరాలను మూసివేయించి, యెహోవాసాక్షుల రాజ్యపరిచర్యను నిషేధించింది. జర్మన్ సైన్యం వచ్చినప్పటికే మేము రహస్యంగా సువార్త ప్రకటిస్తున్నాం. కాని యెహోవాసాక్షులను నలుగగొట్టే ప్రయత్నం తీవ్రస్థాయికి చేరుకుంది. రెండు సంవత్సరాల తర్వాత, 11 ఏండ్లప్పుడు, నేను బాప్తిస్మం పొందాను.
ఒక నెల తర్వాత, సెప్టెంబరు 4, 1941, మధ్యాహ్నం ఒంటి గంటప్పుడు, బెల్ మ్రోగింది. నాన్న పనినుండి ఇంటికి వచ్చే వేళ. నేను పరుగెత్తుకు వెళ్ళి, తలుపు తెరిచి, ఆయన కౌగిట్లో చేరాను. ఆయన వెనుకనున్న వ్యక్తి, “హేల్ హిట్లర్!” అని అరిచాడు. వెంటనే ఆయన కౌగిటనుండి విడిపోయాను, అప్పుడు నేను కౌగిలించుకున్న వ్యక్తి నాజీ సైనికుడని గుర్తించాను! వారు నన్ను నా గదికి పంపి, మా అమ్మను నాలుగు గంటలు ప్రశ్నించారు. వెళ్తూ వెళ్తూ, వారిలో ఒకరు “నువ్వు నీ భర్తను ఇక ఎన్నటికీ చూడలేవు! నీకు నీ కూతురుకు అదే గతి పడుతుంది!” అని అరిచారు.
ఆ రోజు ఉదయం మా నాన్నను అరెస్టు చేశారు. తన నెల జీతం ఆయన జేబులోనే ఉండిపోయింది. నాజీలు బ్యాంకు ఖాతాను మూసివేసి, ఒక ఉద్యోగం సంపాదించుకునేందుకు అవసరమయ్యే వర్కింగ్ కార్డు మా అమ్మకు ఇవ్వడానికి నిరాకరించారు. “నీచులకు బ్రతుకుతెరువు ఉండకూడదు!” అన్నదే అప్పటి వారి ఉద్దేశం.
స్కూల్లో హింస
ఈ సమయంలో నేను వెళ్ళే స్కూల్లో వత్తిడులు పెరిగాయి. ఉపాధ్యాయురాలు తరగతికి వచ్చినప్పుడు, 58 మంది విద్యార్థులు లేచి నిలబడి చేతులు చాపి “హేల్ హిట్లర్” అని చెప్పాలి. మతగురువు మతపరమైన విద్యాబోధనకు వచ్చినప్పుడు, ఆయన లోపలికి ప్రవేశించి, “హేల్ హిట్లర్—ప్రభువు నామమున వచ్చువాడు ఆశీర్వదించబడును గాక” అనేవాడు. అప్పుడు తరగతిలో అందరూ “హేల్ హిట్లర్—ఆమెన్!” అని ప్రత్యుత్తరమిచ్చేవారు.
నేను “హేల్ హిట్లర్” అని అనడానికి ఒప్పుకోలేదు, ఈ వార్త స్కూల్ డైరెక్టర్‌కు చేరింది. “ఒక విద్యార్థిని స్కూల్ నియమాలను పాటించడం లేదు, ఒక వారంలోగా మారకపోతే, ఈ విద్యార్థిని స్కూల్ వదిలి పెట్టవలసి వస్తుంది” అనే హెచ్చరికా లేఖ వ్రాయబడింది. ఆ లేఖ చివరి భాగాన దీన్ని 20 కన్నా ఎక్కువ తరగతులలో చదవాలని సూచించబడింది.
నేను తరగతి ముందు నా తీర్మానం తెలుపవలసిన రోజు వచ్చింది. అలా వందనం చేయడానికి లేదా నా స్కూల్ సర్టిఫికెట్ తీసుకుని బయటికి వెళ్ళడానికి నాకు ఆ డైరెక్టర్ మరో ఐదు నిమిషాలిచ్చారు. ఐదు నిమిషాలు నాకు దీర్ఘకాలం అనిపించింది. నా కాళ్ళు కృంగిపోయి, నా తల మొద్దుబారి, నా గుండె బరువెక్కింది. తరగతి అంతటా భయంకరమైన నిశ్శబ్దం ఆవరించియుండగా, దాన్ని కఠోరంగా చీలుస్తూ “హేల్ హిట్లర్,” అని తరగతి అంతా మూడు సార్లు పదే పదే పలికింది. నేను బల్ల దగ్గరికి పరుగెత్తుకు వెళ్ళి, నా సర్టిఫికెట్లు తీసుకుని, బయటికి పరుగెత్తాను.
తరువాతి సోమవారం, మరొక స్కూల్లో చదువడానికి అనుమతించబడ్డాను. అక్కడి డైరెక్టర్ నేను వేరొక స్కూల్‌నుండి ఎందుకు వెళ్ళగొట్టబడ్డానో ఎవ్వరితో చెప్పకూడదనే షరతు మీద నన్ను చేర్చుకోగలనన్నాడు. నా తోటివిద్యార్థులు నన్ను శత్రుభావంతో, దొంగ, నేరస్తురాలు అని పిలుస్తూ, అందుకే నన్ను స్కూల్ నుండి వెళ్ళ గొట్టారని అనేవారు. నేను నిజమైన కారణాన్ని వారికి వివరించలేదు.
నేను తరగతిలో వెనుక భాగాన కూర్చున్నాను. నా ప్రక్కన కూర్చున్న అమ్మాయి నేను వందనం చేయడం లేదని గమనించింది. ఆమె నేను హిట్లర్ని ఎదురించే ఫ్రెంచ్ రహస్య సంస్థ సభ్యురాలననుకుంది. నేను హిట్లర్ని ఎందుకు పొగడడంలేదో ఆ అమ్మాయికి ఇలా వివరించవలసి వచ్చింది: “అపొస్తలుల కార్యములు 4:12 ప్రకారం, ‘ఎవనివలనను రక్షణ కలుగదు; ఈ నామముననే మనము రక్షణ పొందవలెను గాని, ఆకాశము క్రింద మనుష్యులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము.’ క్రీస్తు మాత్రమే మన రక్షకుడు ‘హేల్’ అనే మాట ఎవరి వలన రక్షణ దొరుకుతుందో వారికే చెందుతుంది అని అర్థమిస్తున్నందువల్ల నేను అలాంటి వందనమును హిట్లర్‌తో సహా, ఏ మానవునికి చెల్లించను.” ఈ బాలిక, వాళ్ళ అమ్మ యెహోవాసాక్షులతో బైబిలు పఠించి, వారు కూడా సాక్షులయ్యారు!
రహస్య పరిచర్య
ఈ సమయమంతా, మేము రహస్యంగా ప్రకటించడం కొనసాగించాం. ప్రతి నెల మొదటి ఆదివారం పర్వతాల్లోని ఒక ప్రాంతానికి వెళ్ళేవాళ్ళం, అక్కడ మాకు ఫ్రెంచ్ ది వాచ్‌టవర్ సంపుటి జర్మనీ భాషలోకి తర్జుమా చేయుటకు లభించేది. మా అమ్మ ది వాచ్‌టవర్ పెట్టుకోడానికి ఒక జేబు కుట్టి అది జారి పోకుండా ఉండేందుకు లోదుస్తులకు ప్రత్యేకమైన బెల్ట్ తయారు చేసింది. ఒక రోజు మమ్మల్ని ఇద్దరు సైనికులు ఆపి, పర్వతప్రాంతాల్లోని పొలానికి తీసుకు వెళ్ళారు, అక్కడ మమ్మల్ని పరిశోధించారు. నాకు జ్వరం వచ్చింది కాబట్టి, వారు నన్ను వెళ్ళి గడ్డిమీద పడుకోమన్నారు, ఈ విధంగా వారు ది వాచ్టవర్ని కనుక్కోలేకపోయారు. ఏదో ఒక విధంగా, యెహోవా నన్ను ఎల్లప్పుడు రక్షిస్తున్నట్లు అన్పించింది.
ఒక రోజు నేను “మానసిక వైద్యుడి” దగ్గరికి వెళ్ళాల్సివచ్చింది. అక్కడున్న ఇద్దరూ నాజీలే అని తెలిసింది. ఇతర సాక్షుల పిల్లలు కూడా అక్కడ ఉన్నారు. నేనే చివరగా పిలువబడ్డాను. ఇద్దరు “డాక్టర్లు” బల్లకు ఒక వైపున కూర్చున్నారు, నేను తేజోవంతమైన ముఖంతో కూర్చున్నాను, ప్రశ్నలపరంపర మొదలైంది. ఒక “డాక్టర్” భౌగోళిక శాస్త్రం, చరిత్రకు సంబంధించిన ప్రశ్నలు అడిగేవాడు, నేను జవాబు చెప్పకముందే, మరో డాక్టర్ రహస్యమైన పనిని గూర్చిన ప్రశ్నలు అడిగేవాడే. ఆయన ఇతర సాక్షుల పేర్లను కూడ అడిగి ఉండేవాడు. ఎవరో ఫోను చేసినందున వారి ప్రశ్నలకు ఆటంకమేర్పడడంతో నేను ఆ అపాయం నుండి తప్పించుకున్నాను. అన్నివేళల యెహోవా ఎంత అద్భుతంగా సహాయం అందించాడు!
నేను మన నమ్మకాలను ఒక తోటి విద్యార్థితో వివరిస్తున్నానని మా స్కూల్ డైరెక్టర్ తెలుసుకున్నప్పుడు, నేను అరెస్టు చేయబడ్డాను, కోర్టులో విచారణ చేయబడ్డాను, “నేరస్తుల స్కూల్లో” నన్ను ఉంచాలని జడ్జి ఆజ్ఞ జారీ చేశారు. ఆ తీర్పు చెప్పిందేమంటే ‘ఆమె అంతర్జాతీయ బైబిలు విద్యార్థుల సంస్థ బోధలలో పెరిగింది, ఆ బోధలను చట్టం నిషేధించింది, ఆమె చెడ్డ వ్యక్తిగా, ఇతరులకు అపాయకరంగా మారగలదు.’ నా 12 ఏండ్ల వయస్సులో, ఆ కోర్టు గదిలో అది నాకొక భయంకర అగ్నిపరీక్ష! అయినను, న్యాయనిర్వాహణ మండలిలో సానుభూతి కల ఒక స్నేహితుని సహాయం వలన శిక్షావిధిని వెంటనే అమలు జరుపలేదు.
దాదాపు ఒక నెల తర్వాత, బడిలో మా తరగతి రెండు వారాల హిట్లర్ యూత్ ట్రెయినింగ్ క్యాంప్‌కి పంపడానికి ఎంపిక చేయబడింది. నేను దాన్ని గూర్చి మా అమ్మతో చెప్పనేలేదు. అక్కడికి పోవద్దన్న నా తీర్మానానికి మా అమ్మ బాధ్యత వహించకూడదని నేను ఆశించాను. వెళ్ళడానికి ముందటి రోజు, స్కూల్ డైరెక్టర్ ఇలా హెచ్చరించాడు: “నువ్వు సోమవారం రైల్వే స్టేషన్‌కి లేదా నా ఆఫీసుకి రాకపోతే, నేను నిన్ను పోలీసులకు అప్పజెప్తాను!”
కాబట్టి సోమవారం ఉదయం మా స్కూలుకి వెళ్ళే దారిలో ఉన్న రైల్వే స్టేషన్ దాటి వెళ్ళిపోయాను. నా తోటి విద్యార్థులంతా నన్ను వారితో పాటు వెళ్ళడానికి పిలిచారు, కాని నేను డైరెక్టర్‌గారి ఆఫీసుకి వెళ్ళడానికే తీర్మానించుకున్నాను. నేను అక్కడికి ఆలస్యంగా వెళ్ళాను, కాబట్టి నేను ఇతరులతో పాటు రైల్లో వెళ్ళి ఉండవచ్చని ఆయన ఊహించాడు. ఆయన నన్ను చూసి ఉగ్రుడయ్యాడు. నన్ను తన తరగతికి తీసుకువెళ్ళి, తరగతిలోని పిల్లలనందరిని నాలుగు గంటలపాటు పీడించాడు. ఉదాహరణకు, ఒక్కో పిల్లవాడిని తరగతి ముందు భాగానికి పిలిచి, వారి నోటు పుస్తకాలు వారి చేతికి యిచ్చే బదులు, వాటితో వారి ముఖం మీద కొట్టాడు. నన్ను చూపిస్తూ “ఈ అమ్మాయే బాధ్యురాలు!” అన్నాడు. నన్ను మార్చడానికొరకు ఆయన కేవలం పది ఏండ్ల వయస్సున్న 45 మంది పిల్లలను కొట్టాడు. కాని క్లాస్ అయిపోయిన తర్వాత నేను యుద్ధగేయాలను పాడడానికి తిరస్కరించినందుకు వారు వచ్చి నన్ను అభినందించారు.
తర్వాత కాగితాలను, లోహపాత్రలను, ఎముకలతో చేసిన వస్తువులను వేరుచేయడానికి నన్ను నియమించారు. లోహపాత్రలు యుద్ధ అవసరాలకు ఉపయోగించేవి కనుక, నేను ఆ పని చేయడానికి ఒప్పుకోలేదు. నన్ను స్పృహ తప్పేటట్లు కొట్టి, వదిలిపోయారు. తర్వాత నా తోటి విద్యార్థులు లేచి నిలబడడానికి సహాయం చేశారు.
నేను స్కూల్‌కు తిరిగి వెళ్ళినప్పుడు, అన్ని తరగతులలోని 800 మంది పిల్లలు పతాక స్తంభము చూట్టూ నిలబడడం చూసి ఆశ్చర్యపోయాను. నన్ను మధ్యలో నిలబెట్టారు. స్వాతంత్ర్యాన్ని గూర్చి, దేశద్రోహుల రాకను గూర్చి చాలా సేపు వివరించిన తర్వాత, జేజ్ హేల్! (విజయం, రక్షణ) అని మూడు సార్లు అరిచారు. నాతో ఉన్నవారందరూ జాతీయగీతం ఆలపిస్తుండగా నేను లొంగిపోకుండా, భయపడుతూ నిలబడ్డాను. యెహోవా నాకు మద్దతునిచ్చాడు; నేను చిత్తశుద్ధితో ఉన్నాను. తర్వాత, నేను మా గదికి వచ్చేసరికి, నా బట్టలన్నీ పడక మీద ఉండడం, “సిమోను అర్నోల్డ్ రేపు ఉదయం రైల్వే స్టేషన్ దగ్గర ఉండాలి” అని ఒక లేఖ ఉండడం చూశాను.
నేరస్థుల పాఠశాల
మరుసటి రోజు అమ్మా, నేను రైల్వే స్టేషన్లో ఉన్నాము. ఇద్దరు స్త్రీలు నన్ను అధీనంలోకి తీసుకున్నారు. రైలులో మా అమ్మ నేను ప్రవర్తించవలసిన విధానాన్ని గూర్చి మళ్ళీ మళ్ళీ ఉపదేశించింది. “అన్యాయాన్ని అనుభవిస్తున్నప్పటికీ, ఎల్లవేళల వినయంగా, దయగా, నెమ్మదిగా ఉండాలి. ఎప్పుడూ మొండిగా ప్రవర్తించకూడదు. అగౌరవంగా మాట్లాడకూడదు, నిర్లక్ష్యంగా జవాబు చెప్పకూడదు. దృఢంగా ఉండడమంటే తలబిరుసుగా ఉండడం కాదని గుర్తుంచుకో. ఇది నీ భవిష్యత్తుకు ఒక ఉపదేశంలా ఉంటుంది. భవిష్యత్తులో ప్రయోజనం అనుభవించడానికి ఇప్పుడు మనం శ్రమలు అనుభవించాలన్నది యెహోవా చిత్తము. నువ్వు దానికి సిద్ధంగా ఉన్నావు. ఎలా కుట్టాలి, వండాలి, ఉతకాలి, తోటను పెంచాలి అని నీకు తెలుసు. నువ్వు ఇప్పుడు యువతివి.”
ఆ సాయంకాలం, మా హోటల్‌కు బయట ద్రాక్షాతోటలో అమ్మా, నేను మోకాళ్ళూని పునరుత్థాన నిరీక్షణను గూర్చిన పాటలు పాడుకుని రాజ్యగీతములు ఆలపించి ప్రార్థన చేసుకున్నాం. దృఢమైన స్వరంతో, మా అమ్మ నా కొరకు ప్రార్థన చేసింది: “ఓ యెహోవా, నా చిన్నారి కూతురును నమ్మకస్థురాలిగా ఉంచుము!” చివరి సారిగా అమ్మ నన్ను పడక మీదికి లాక్కుని ముద్దు పెట్టింది.
మేము మరుసటి రోజు నేరస్థుల పాఠశాలకు చేరుకున్నప్పుడు, నాకు అమ్మకు వీడ్కోలు చెప్పే అవకాశం కూడా దొరకనంతగా అన్నీ త్వరగా జరిగిపోయాయి. ఒక బాలిక గోధుమ ఊకతో చేయబడిన బొంతను చాపను చూపించింది. నా చెప్పులు తీసివేయబడ్డాయి. నవంబరు ఒకటి వరకు మేము కాళ్ళకు చెప్పులు లేకుండా నడవాలి. మొదటి మధ్యాహ్నం భోజనం మింగుడు పోలేదు. ఆరు జతల సాక్సులు బాగుచేయడానికి నాకిచ్చారు; అవి బాగు చేయకపోతే నాకు తిండి పెట్టరు. మొదటిసారిగా, నేను ఏడ్వడం మొదలు పెట్టాను. కన్నీళ్ళు ఆ సాక్సులను తడిపేశాయి. నేను దాదాపు రాత్రంతా ఏడ్చాను.
మరుసటి రోజు, నేను ఉదయం 5:30 గంటలకు లేచాను. నా పడకంతా రక్త మరకలయ్యాయి—కొంచెం ముందు నాకు రుతుస్రావం మొదలైంది. నేను భయంతో, మొదట పరిచయం చేసుకున్న మిస్ మెసింజర్ టీచర్ దగ్గరకు వెళ్ళాను. ఆమె ఒక బాలికను పిలిచింది. ఆ అమ్మాయి నా దుప్పటిని చల్ల నీళ్ళలో ఎలా ఉతకాలో చూపించింది. రాతినేల చాలా చల్లగా ఉంది, విపరీతమైన నొప్పులు వచ్చాయి. నేను మళ్ళీ ఏడ్వడం మొదలు పెట్టాను. అప్పుడు మిస్ మెసింజర్ వ్యంగ్యంగా నవ్వుతూ ఇలా అనింది: “నీ యెహోవాతో నీ దుప్పటి ఉతకమని చెప్పు!” అదే నేను వినవలసిన మాట, నేను నా కళ్ళు తుడుచుకున్నాను, మళ్ళీ వారు నేనెన్నడూ కన్నీరు కార్చడం చూడలేదు.
మేము ప్రతిరోజూ ఉదయాన్నే 5:30 గంటలకు లేచి నాస్తరూపంలో ఉదయం 8 గంటలకు ఒక గిన్నెడు సూపు తాగేముందే ఇల్లంతా శుభ్రం చేయాలి. ఇంట్లోనే 6 నుండి 14 ఏండ్ల ప్రాయమున్న 37 మంది పిల్లలకొరకు బడి నడపబడేది. మధ్యాహ్నం మేము బట్టలు ఉతికేవాళ్ళం, కుట్టేవాళ్ళం, తోటపని చేసే వాళ్ళం. నేను, ఇంకొక అమ్మాయి కలిసి 1944⁄45 సంవత్సరాల్లోని చలికాలంలో రెండండుగుల మందం గల వృక్షాలను రంపాలతో కోసివేయవలసి వచ్చింది. ఒకరితో ఒకరు మాట్లాడుకోవడానికి పిల్లల్ని అనుమతించే వారేకాదు, కనీసం దొడ్లోకి కూడా ఒంటరిగా పోనిచ్చేవారు కాదు. మేము సంవత్సరంలో రెండు సార్లు స్నానం చేసేవాళ్ళం, సంవత్సరానికి ఒక సారి తలస్నానం చేసేవాళ్ళం. అలాకాకపోతే శిక్ష ఏమిటంటే తిండి పెట్టకపోవడం, కొట్టడం.
నన్ను మిస్ మెసింజర్ గది శుభ్రం చేయడానికి నియమించారు. ప్రతిరోజు ఆమె పడక క్రిందకు వెళ్ళి స్ప్రింగ్ శుభ్రం చేయాలని పురమాయించేది. నేనొక బైబిలు ఇంట్లోకి దొంగతనంగా తెచ్చాను, దాన్ని చిన్న భాగాలుగా చేసి స్ప్రింగ్‌లో దూర్చాను. అటుతర్వాత, నేను ప్రతిరోజు బైబిలు భాగాలను చదవగల్గాను. అక్కడికి వచ్చిన అందరిలో నేనే నెమ్మదిగా పనిచేసే అమ్మాయినని అందరూ అనడంలో ఆశ్చర్యం లేదు!
ప్రొటెస్టెంట్ అమ్మాయిలు ప్రతి ఆదివారం వారి చర్చీలకు వెళ్ళేవారు, ముగ్గురు కాథోలిక్ అమ్మాయిలు వారి చర్చీకి వెళ్ళేవారు, కాని నేను మాత్రం 37 మందికి వంట చేసి పెట్టాలి. నేను చాలా చిన్న దాన్ని కనుక బెంచీ మీద నిలబడి రెండు చేతులతో చెంచాను పట్టుకొని సూపు కలపవలసివచ్చేది. మా నలుగురు టీచర్ల కొరకు, రొట్టెలు కాల్చాలి, మాంసం, కూరగాయలు వండిపెట్టాలి. ఆదివారం మధ్యాహ్నం మేము రుమాల్లపై పూలు కుట్టాలి. ఆడుకోడానికి సమయం దొరికేది కాదు.
చాలా నెలల తర్వాత, గొప్ప సంతోషంతో మిస్ మెసింజర్ మా అమ్మకూడ అరెస్టు చేయబడి, కాన్సెన్ట్రేషన్ క్యాంపులో ఉందన్న వార్త నాకు తెలిపింది.
యుద్ధం 1945లో ముగిసింది. కాన్సెన్ట్రేషన్ క్యాంపులన్నీ మటుమాయమయ్యాయి, దేశంలోని పీడితులైన వేలాదిమంది ఖైదీలనందరిని వారి వారి బ్రతికి ఉన్న కుటుంబ సభ్యులను వెదుక్కునేలా చేశాయి.
హృదయానందకరంగా తిరిగి కలిసికొనుట
కనీసం మా అమ్మకన్నా నేనెక్కడున్నానో తెలుసు, కాని ఆమె నా దగ్గరికి వచ్చినప్పుడు, నేను ఆమెను గుర్తుపట్టలేక పోయాను. ఆమె ఎంత కష్టమనుభవించిందో, ఆశ్చర్యం లేదు! ఆమెను అరెస్టు చేసినప్పుడు, షర్మక్ అనే క్యాంపులో మానాన్నను ఉంచిన చోట స్త్రీలున్నచోటుకే ఆమెను పంపారు. ఆమె సైనికుల దుస్తులను బాగుచేయడానికి ఒప్పుకోనందుకే, ఆమెను భూగర్భంలోని ఒక గదిలో ఏకాంతంగా కొన్నినెలలు ఉంచారు. తర్వాత ఆమెకు రోగం సోకాలని, ఆమెను సిఫిలిస్ రోగం సోకిన ఆడవాళ్ళ దగ్గరికి మార్చారు. రావన్బ్రక్కి ఆమెను తరలిస్తుండగా ఆమె దగ్గువలన చాలా కృశించిపోయింది. ఆ సమయంలో, జర్మన్లు పారిపోయారు, ఖైదీలు రావెన్స్బ్రాక్లోకి వెళ్తుండగా, అకస్మాత్తుగా స్వతంత్రులయ్యారు, వారిలో మా అమ్మ కూడ ఉంది. ఆమె జర్మనీకి, నేనున్నదగ్గరికి ప్రయాణిస్తుండగా విమాన ముట్టడిలో జరిగిన ప్రేలుడులో ఆమె ముఖం గాయపడి, రక్తం కారింది.
నన్ను ఆమె ముందుకు తీసుకు వెళ్ళినప్పుడు, ఆమె చాలా మారి పోయింది—ఆహారం లేకపోవడం వలన శుష్కించి, రోగిలా ఉంది. ఆమె ముఖం చితికిపోయి, రక్తమయమైంది, ఆమె చాలా మెల్లగా మాట్లాడుతుంది. అక్కడికి వచ్చే అతిథులకు వంగి నమస్కరించి నా పనులు అంటే ఎంబ్రాయిడరీలు, కుట్టుపనులు చూపించడానికి నాకు తర్ఫీదిచ్చారు, ఎందుకంటే చాలా మంది మహిళలు పనిమనిషి కావాలని అక్కడికి వచ్చేవారు. పాపం మా అమ్మను కూడా నేను అలాగే అనుకున్నాను! ఆమె నన్ను ఇంటికి తీసుకు వెళ్ళడానికి చట్టరీత్యా అనుమతిపొందడానికై జడ్జి దగ్గరికి నన్ను తీసుకు వెళ్ళేటప్పుడే మా అమ్మను గుర్తుపట్టాను! గత 22 నెలలుగా నాలో దాచుకొన్న కన్నీళ్ళు ఒక్కసారిగా పొంగిపొర్లాయి.
మేము వెళ్తుండగా, డైరెక్టరైన మిస్ లెడర్లే చెప్పిన మాటలు అమ్మకు శాంతిని కల్గించే ఔషధంలా పనిచేసింది. ఆమె ఇలా అన్నది: “నేను మీ పాపను ఆమె వచ్చినప్పటి అదే మానసిక వైఖరితోటే పంపుతున్నాను.” నా చిత్తశుద్ధి ఇప్పటికీ స్థిరంగా ఉంది. మేము మా ఇంటిని కనుక్కొని, దానిలో స్థిరనివాసం చేయడం మొదలుపెట్టాం. మాకు ఇప్పటికీ దుఃఖం కల్గించే ఒకే ఒక సంగతేమంటే మా నాన్న లేకపోవడమే. రెడ్‌క్రాస్ వారి చనిపోయినవారి పట్టికలో మా నాన్న పేరు ఉంది.
మే 1945 మధ్యలో, ఒకరోజు తలుపు చప్పుడైంది. మళ్ళీ నేను తెరవడానికి పరుగెత్తాను. మరియా కోల్ అనే ఒక స్నేహితురాలు తలుపు దగ్గర ఉంది, ఆమె ఇలా అన్నది: “సైమన్, నేను మాత్రమే కాదు. మీ నాన్నగారు కూడ మెట్లకింద ఉన్నారు.” నాన్న మెట్లు చాలా కష్టంగా ఎక్కుతున్నాడు, ఆయన వినే శక్తి కోల్పోయాడు. ఆయన నా పక్కనుండే నేరుగా అమ్మ దగ్గరకు వెళ్ళాడు! ఆయనకు తెలిసిన 11-ఏండ్ల చలాకీ అమ్మాయి కొన్ని నెలల్లో సిగ్గుపడే కౌమార దశలోకి ఎదిగిపోయింది. ఈ కొత్త అమ్మాయిని ఆయన గుర్తుపట్ట లేకపోయాడు.
ఆయన అనుభవించినవన్నీ ఆయనను యీ స్థితికి తెచ్చాయి. ఆయనను మొదట షిర్మెక్లో ప్రత్యేక క్యాంపుకి, తర్వాత డాచుకు తీసుకువెళ్ళారు, అక్కడ ఆయనను టైఫస్ వ్యాధి బాధించింది, దాని వలన 14 రోజులు స్పృహ లేకుండా పడిపోయారు. తర్వాత ఆయనను వైద్య పరిశోధనలకు ఉపయోగించారు. డాచ్ నుండి ఆయనను వినాశనకర మాత్వాసెన్కు పంపారు, అది డాచుకన్నా హీనమైనది, అక్కడ ఆయన చాలా కష్టపడి పని చేశాడు, దెబ్బలు తిన్నాడు, ఆయనను పోలీసు కుక్కలు దాడి చేశాయి. అయినప్పటికీ, ఆయన బ్రతికాడు, చివరికి మరొక సారి యింటికి చేరుకున్నాడు.
నాకు 17 ఏండ్లయినప్పుడు, నేను యెహోవాసాక్షుల పూర్తికాల సేవలో చేరాను, తర్వాత అమెరికాలో వాచ్‌టవర్ సొసైటీ, మిషనరీల కొరకు ఏర్పాటు చేసిన గిలాదు స్కూల్లో చేరాను. సొసైటీ ప్రపంచ ప్రధాన కార్యాలయంలో ఒకప్పుడు యూదుడై, హిట్లర్ కాన్సెన్ట్రేషన్ క్యాంపులలో ఒకదానిలో ఉన్నప్పుడు సాక్షియైన మాక్స్ లెబ్స్టర్ను కలిసాను. మేము 1956లో పెళ్ళి చేసుకున్నాం, దేవుని సహాయం వలన, ఇప్పటి వరకూ ఫ్రాన్సులోనే పూర్తికాల సేవలో స్పెషల్ పయినీర్లుగా ఉన్నాము.
అనేక సంవత్సరముల క్రితం మా అమ్మ నన్ను నేరస్థుల పాఠశాలలో వదిలిపెట్టక ముందటి సాయంకాలం చేసిన ప్రార్థనలో ఆమె చెప్పిన మాటలు ఎంత నిజమయ్యాయి: “ఓ, యెహోవా, నా చిన్నారి కూతురుని నమ్మకస్థురాలిగా ఉంచుము అని నీకు విజ్ఞప్తి చేస్తున్నాను!”
ఈ రోజు వరకు, యెహోవా అలాగే చేశాడు!—సైమన్ అర్నోల్డ్ లెబ్స్టర్ చెప్పినది. (g93 9/22)
[26వ పేజీలోని చిత్రం]
సైమన్ అర్నోల్డ్ లెబ్స్టర్, ఆమె భర్త మాక్స్ లెబ్స్టర్