నా బాల్యంనుండి యెహోవా కొరకు ఓర్పుతో కనిపెట్టుకుని ఉన్నాను
రూడాల్ఫ్ గ్రైఖెన్ చెప్పినది
నేను కేవలం 12 సంవత్సరాలవాడిగా ఉన్నప్పుడు కొన్ని దుఃఖకర సంఘటనలు మా కుటుంబంపైన పిడుగుపాటులా అకస్మాత్తుగా పడ్డాయి. మొదట, మా నాన్నను జైల్లో వేసేశారు. తర్వాత, నా కవల సహోదరినీ నన్నూ అపరిచయస్థులతో జీవించడానికి మా ఇంటికి దూరంగా బలవంతంగా తీసుకెళ్లిపోయారు. అటుతర్వాత, మా అమ్మనీ నన్నూ గెస్టాపో అరెస్టు చేసింది. నన్ను జైలుకి పంపించారు, అమ్మనేమో చివరికి ఒక కాన్సన్ట్రేషన్ క్యాంపులో వేశారు.
నేను ఒక యెహోవాసాక్షిగా యౌవనంలో అనుభవించిన బాధాకరమైన హింసా కాలంలో, వరసగా జరిగిన ఈ సంఘటనలు కేవలం ప్రారంభం మాత్రమే. దేవుని ఎడల నా యథార్థతను భంగపర్చేందుకు నీచచరితగల నాజీ గెస్టాపో, తర్వాత తూర్పు జర్మనీకి చెందిన ష్టాజీ ప్రయత్నించాయి. ఇప్పుడు, ఆయనకు చేసిన 50 ఏళ్ల సమర్పిత సేవ అనంతరం, నేను కీర్తనల రచయిత చెప్పినట్లే చెప్పగలను: “నా యౌవనకాలము మొదలుకొని నాకు అధిక బాధలు కలుగజేయుచు వచ్చిరి. అయినను వారు నన్ను జయింపలేకపోయిరి.” (కీర్తన 129:2) నేను యెహోవాకు ఎంత కృతజ్ఞుడను!
నేను 1925, జూన్ 2న జర్మనీలో లైప్జిగ్దగ్గరున్న లూకా అనే చిన్న పట్టణంలో జన్మించాను. నేను పుట్టకముందే నా తలిదండ్రులైన ఆల్‌ఫ్రేట్ టెరేజాలు బైబిలు విద్యార్థుల ప్రచురణల్లో బైబిలు సత్యాన్ని కనుగొన్నారు—అప్పట్లో యెహోవాసాక్షులు బైబిలు విద్యార్థులని పిలువబడ్డారు. మా ఇంట్లోని గోడలమీద వ్రేలాడదీయబడిన బైబిలు సన్నివేశాల చిత్రాల్ని నేను ప్రతిరోజూ చూడడం నాకు బాగా గుర్తు. ఒక చిత్రంలోనైతే తోడేలూ గొర్రెపిల్ల, మేకపిల్లా చిరుతపులి, దూడా కొదమసింహము—అన్నీ ప్రశాంతంగా జీవిస్తున్నాయి, మరి వీటిని ఒక చిన్న పిల్లవాడు నడిపిస్తున్నాడు. (యెషయా 11:6-9) అటువంటి చిత్రాలు నా మనస్సుపైన చెరగని ముద్ర వేశాయి.
సాధ్యమైనప్పుడల్లా నా తలిదండ్రులు నన్ను సంఘ కార్యకలాపాల్లో భాగం వహించేలా చేశారు. ఉదాహరణకు, హిట్లర్ అధికారంలోకి వచ్చిన తర్వాత కొద్ది రోజులకే, 1933 ఫిబ్రవరి నెలలో స్లైడులూ, చలన చిత్రాలూ, రికార్డు చేయబడిన వ్యాఖ్యానంతో కూడిన “ఫోటో-డ్రామా ఆఫ్ క్రియేషన్” మా చిన్న పట్టణంలో చూపించబడింది. కేవలం ఏడేళ్ల పిల్లవానిగావున్న నేను “ఫోటో-డ్రామా” గురించి ప్రచారం చేయడంలో భాగంగా పికప్ ట్రక్కులో పట్టణంగుండా వెళ్తూవున్నప్పుడు నేనెంతగా ఉత్తేజంతో నిండివున్నానో! ఈ సందర్భంలోనూ మరితర సందర్భాల్లోనూ, నా చిన్న వయస్సును పట్టించుకోకుండా సహోదరులు నేను సంఘంలో ఒక ఉపయుక్తమైన సభ్యునిగా భావించేలా చేశారు. అలా చాలా పిన్న వయస్సునుండే నేను యెహోవాచేత బోధించబడ్తూ, ఆయన వాక్యంచే ప్రభావితం చెందుతూ ఉన్నాను.
యెహోవాయందు నమ్మకముంచడంలో శిక్షణనుపొందాను
కచ్చితమైన క్రైస్తవ తటస్థత మూలాన యెహోవాసాక్షులు నాజీ రాజకీయాల్లో తలదూర్చలేదు. తత్ఫలితంగా, 1933లో నాజీలు మేము ప్రకటించడాన్నీ, కూడుకోవడాన్నీ, చివరికి మా స్వంత బైబిలు సాహిత్యాన్ని చదవడాన్ని కూడా నిషేధిస్తూ చట్టాల్ని చేశారు. 1937 సెప్టెంబరులో మా నాన్నతో సహా మా సంఘంలోని సహోదరులందర్నీ గెస్టాపో అరెస్టు చేసింది. అది నన్ను చాలా విషాదానికి గురిచేసింది. మా నాన్నకు ఐదు సంవత్సరాల కారాగార శిక్షను విధించారు.
మా ఇంట్లో క్లిష్ట పరిస్థితులు ఏర్పడ్డాయి. కానీ మేము త్వరలోనే యెహోవాయందు నమ్మకముంచడాన్ని నేర్చుకున్నాము. ఒకరోజు నేను స్కూలు నుండి ఇంటికి తిరిగి వచ్చేసరికి, మా అమ్మ కావలికోట చదువుతూ ఉంది. నాకోసం తినడానికి త్వరగా ఏదైనా చేద్దామనుకుని, ఆ పత్రికను చిన్న బీరువాపైన ఉంచింది. భోజనం తర్వాత మేము వంట సామాన్లని సర్దుతూవుంటే తలుపుబాదిన శబ్దమైంది. ఆ వచ్చింది, మా అపార్ట్మెంటులో బైబిలు సాహిత్యం ఉందేమోనని వెదకడానికి వచ్చిన పోలీసు. నాకు చాలా భయమేసింది.
ఆరోజు చాలా వేడిగా ఉంది. అందుకని ఆ పోలీసు ఇంట్లోకి వచ్చీ రాగానే తన హెల్మెట్‌ను తీసేసి ఒక టేబుల్ మీద పెట్టాడు. తర్వాత తన అన్వేషణను ప్రారంభించాడు. ఆయన టేబుల్క్రింద చూస్తుండగా ఆయన హెల్మెట్ జారిపోసాగింది. అందుకని మా అమ్మ హెల్మెట్‌ను లాఘవంగా పట్టుకుని దాన్ని సరీగ్గా ఆ చిన్న బీరువాపైనున్న కావలికోట మీద పెట్టేసింది! ఆ పోలీసు మా ఇల్లంతా కిందా పైనా క్షుణ్ణంగా గాలించాడు, కానీ ఆయనకు ఎలాంటి సాహిత్యమూ కనబడలేదు. తన హెల్మెట్ క్రింద చూద్దామన్న తలంపే ఆయనకు రాలేదు మరి. ఆయన వెళ్లడానికి ఉద్యుక్తుడై తన హెల్మెట్‌ని తీసుకోవడానికి తిరగకుండానే వెనక్కి చెయ్యిచాపుతూ మా అమ్మకి క్షమాపణగా అస్పష్టంగా కొన్ని మాటలు గబగబా అన్నాడు. అప్పుడు ఊపిరిపీల్చుకున్నాను నేను!
అటువంటి అనుభవాలు నన్ను మరింత కష్టతరమైన పరీక్షల కొరకు సిద్ధం చేశాయి. ఉదాహరణకు, స్కూల్లో నన్ను హిట్లర్ యూత్ సంస్థలో చేరమని వత్తిడిచేశారు, ఇందులో సైనిక క్రమశిక్షణలో పిల్లలకు శిక్షణనిస్తూ నాజీ తత్త్వజ్ఞానాన్ని వారికి నూరిపోసేవారు. తమ విద్యార్థులందర్నీ ఇందులో పాల్గొనేలా చేసి 100 శాతాన్ని సాధించాలన్న వ్యక్తిగత లక్ష్యం కొంతమంది టీచర్లకు ఉండేది. మా టీచరైన హెర్ర్ ష్నైడర్ మా స్కూల్లోని ఇతర టీచర్లలాకాక తాను పూర్తిగా ఓటమికి గురైనట్లు భావించివుంటాడు, ఎందుకంటే ఆయన 100 శాతం సాధించడానికి వీల్లేకుండా చేస్తూ ఒక్క విద్యార్థి తక్కువయ్యాడు. ఆ ఒక్క విద్యార్థిని నేనే.
ఒకరోజు హెర్ర్ ష్నైడర్ పూర్తి క్లాసంతటికీ ఒక ప్రకటన చేశాడు: “అబ్బాయిలూ, రేపు మనమందరం కల్సి విహారయాత్రకి వెళ్దాం.” అందరికీ ఆ ఆలోచన నచ్చింది. తర్వాత ఆయనింకా ఇలా అన్నాడు: “మీరందరూ హిట్లర్ యూత్ యూనిఫారంలు వేసుకుని రావాలి, ఆవిధంగా మనం వీధులగుండా మార్చ్ చేస్తున్నప్పుడు మీరంతా చక్కని హిట్లర్ అబ్బాయిలని అందరూ చూడగల్గుతారు.” మర్నాటి ఉదయం నేను తప్ప మిగతా అబ్బాయిలందరూ తమతమ యూనిఫారాలలో వచ్చేశారు. టీచరు క్లాసురూంలో అందరి ముందుకి నన్ను పిల్చి ఇలా అడిగాడు: “మిగతా అబ్బాయిలందరివైపూ చూడు, తర్వాత నిన్ను నువ్వు చూసుకో.” ఆయన ఇంకా ఇలా అన్నాడు: “నీ తలిదండ్రులు బీదవారని నాకు తెల్సు, నీకొక యూనిఫారం కొనివ్వలేరనీ తెల్సు, కానీ నేనొకటి చూపిస్తానుండు.” నన్ను తన బల్ల దగ్గరికి తీసుకెళ్లి, ఒక సొరుగు తీసి ఇలా అన్నాడు: “నేన్నీకు ఈ సరిక్రొత్త యూనిఫారం ఇవ్వాలనుకుంటున్నాను. ఎంత బాగుంది కదూ?”
నేను చావనన్నా చస్తాను గానీ నాజీ యూనిఫారం మాత్రం ధరించను. నాకు దాన్ని వేసుకునే ఉద్దేశమేమాత్రం లేదని గమనించినప్పుడు, మా టీచరుకి కోపం వచ్చేసింది, క్లాసు పిల్లలంతా నన్ను గేలి చేశారు. తర్వాత ఆయన మమ్మల్ని విహారయాత్రకి తీసుకెళ్లాడు, కానీ నన్ను మిగతా అందరు పిల్లల మధ్యలో ఉండి నడిచేలా చేస్తూ ఆ విధంగా నేను ఎవరికీ కనబడకుండా ఉండేలా చేయడానికి ప్రయత్నించాడు. అయితే, ఆ పట్టణంలో చాలామంది నన్ను చూడగల్గారు, ఎందుకంటే నేను నా తోటివిద్యార్థులందర్లోకీ భిన్నంగా కన్పిస్తున్నాను మరి. నేనూ నా తలిదండ్రులు యెహోవాసాక్షులమని అందరికి తెలుసు. నేను యౌవనునిగా ఉన్నప్పుడే నాకు అవసరమైన ఆత్మీయ శక్తిని ఇచ్చినందుకు నేను యెహోవాకు కృతజ్ఞుడ్ని.
హింస తీవ్రతరం కావడం
1938 తొలిభాగంలో ఒకరోజు నన్నూ నా సహోదరిని ఒక పోలీసు కారులో స్కూలునుండి తీసుకెళ్లిపోయి 80 కిలోమీటర్లవతల ఉన్న ష్టాట్రోడలోని ఒక సంస్కరణ స్కూల్లో వేశారు. ఎందుకు? మమ్మల్ని మా తలిదండ్రుల ప్రభావంనుండి దూరంగా తీసుకెళ్లి మమ్మల్ని నాజీ పిల్లలుగా మార్చేయాలని కోర్టులు నిర్ణయించాయి. త్వరలోనే సంస్కరణ స్కూల్లోని పర్యవేక్షకులు నేనూ నా సహోదరీ క్రైస్తవ తటస్థత విషయంలో స్థిరంగా ఉన్నా, మేము ఇతరులను గౌరవించేవారిగానూ, విధేయతచూపేవారిగానూ ఉన్నట్లు గమనించారు. అక్కడి డైరెక్టర్‌ను మేము ఎంతగా ఆకట్టుకున్నామంటే ఆమె మా అమ్మని వ్యక్తిగతంగా కలవాలని ఇష్టపడింది. ఒక మినహాయింపు ఇవ్వబడింది, మా అమ్మ మమ్మల్ని కలిసేందుకు అనుమతించబడింది. నేనూ, నా సహోదరీ, మా అమ్మా ఎంత సంతోషించామో, ఒక రోజంతా ఒకరినొకరం పరస్పరం ప్రోత్సహించుకోవడానికి కలుసుకునే అవకాశాన్ని అందజేసినందుకు మేము యెహోవాకు కృతజ్ఞతలు చెల్లించాము. మాకు అది నిజంగా అవసరమైంది.
మేము సంస్కరణ స్కూల్లో దాదాపు నాలుగు నెలలపాటు ఉన్నాము. తర్వాత మమ్మల్ని పానాలో ఒక కుటుంబంతోపాటు ఉండడానికి పంపించారు. మమ్మల్ని మా బంధువులకు దూరంగా ఉంచమని వారికి ఆదేశాలు అందాయి. మమ్మల్ని కలవడానికి కూడా మా అమ్మని అనుమతించలేదు. అయినా, రెండుమూడు సందర్భాల్లో ఏదోకవిధంగా మమ్మల్ని కల్సుకోగల్గింది. ఆ అరుదైన సందర్భాల్ని ఉపయోగించుకుంటూ, యెహోవా ఎటువంటి పరీక్షల్నీ, పరిస్థితుల్నీ అనుమతించినా, ఆయనకు విశ్వసనీయంగా ఉండాలన్న దృఢ తీర్మానం మా మనస్సుల్లో నాటుకునేలా చేయడానికి ఆమె తాను చేయగల్గినదంతా చేసింది.—1 కొరింథీయులు 10:13.
పరీక్షలు రానే వచ్చాయి. 1942, డిశంబరు 15న, నేను కేవలం 17 ఏండ్లవానిగా ఉన్నప్పుడే గెస్టాపో నన్ను పట్టుకుని గేరాలోని ఒక నిర్బంధ కేంద్రంలో పెట్టింది. దాదాపు ఒక వారం తర్వాత మా అమ్మని కూడా అరెస్టుచేసి నేనున్న జైల్లోనే పెట్టారు. నేనప్పటికీ మైనరునే కాబట్టి కోర్టులు నాపై విచారణ చేయలేకపోయాయి. అందుకని కోర్టులు నా 18వ పుట్టిన రోజు కొరకు వేచివుండగా నేనూ మా అమ్మా ఆ నిర్బంధ కేంద్రంలో ఆరు నెలలు గడిపాము. నాకు 18 ఏండ్లు నిండిన రోజునే మా అమ్మనీ నన్నూ విచారణకు పిలిపించారు.
నేను గ్రహించేలోపలే అంతా అయిపోయింది. నేను మా అమ్మని మళ్లీ చూడలేనని అప్పుడు నేనేమాత్రమూ ఊహించలేకపోయాను. నాకు జ్ఞాపకం ఉన్నంతమట్టుకు, నేనామెను ఆఖరుసారి చూసింది కోర్టులో ఒక నల్లని చెక్క బెంచీపైన నాప్రక్కన కూర్చుని ఉన్నప్పుడే. మేమిద్దరం దోషులమని తీర్పుచెప్పారు. నాకు నాలుగేళ్లూ, మా అమ్మకు ఒకటిన్నర సంవత్సరాలు జైలు శిక్షపడింది.
ఆ రోజుల్లో వేలాదిమంది యెహోవాసాక్షుల్ని జైళ్లలోనూ క్యాంపుల్లోనూ ఉంచేవారు. అయితే, నన్ను ష్టోల్బెర్గ్లోని ఒక జైలుకి పంపించారు, అక్కడ నేనొక్కడినే సాక్షిని. నేను ఒక సంవత్సరంపైగా ఏకాంత నిర్బంధంలో గడిపాను, అయితేనేమి యెహోవా నాతో ఉన్నాడు. నా యౌవనంలో నేను ఆయన ఎడల పెంపొందించుకున్న ప్రేమే నేను ఆత్మీయంగా జీవించివుండడానికి మూలమైంది.
నేను జైల్లో రెండున్నర సంవత్సరాలున్న తర్వాత 1945, మే 9న మాకొక మంచి వార్త—యుద్ధం ముగిసిందనే వార్త అందింది! అదేరోజు నన్ను విడుదల చేశారు. 110 కిలోమీటర్లు నడిచిన తర్వాత నేను పూర్తిగా డస్సిపోయి, ఆకలితో అలమటిస్తూ ఇంటికి అక్షరార్థంగానే రోగగ్రస్తునిగా చేరుకున్నాను. నా ఆరోగ్యాన్ని పుంజుకోవడానికి నాకు చాలా నెలలు పట్టింది.
నేను ఇల్లు చేరుకున్న వెంటనే నన్ను మరింత క్షోభకు గురిచేసిన వార్తను విన్నాను. మొదట, మా అమ్మ గురించి. ఆమె జైల్లో ఒకటిన్నర సంవత్సరాలున్న తర్వాత, యెహోవాయందు తన విశ్వాసాన్ని త్యజిస్తున్నట్లు ఒక పత్రంపైన సంతకం చేయమని నాజీలు అడిగారు. ఆమె నిరాకరించింది. అందుకని గెస్టాపో ఆమెను రావెన్స్‌బ్రూక్‌లోని స్త్రీల కాన్సంట్రేషన్ క్యాంపుకి తరలించారు. ఇక యుద్ధం ముగుస్తుందనగా ఆమె అక్కడ టైఫస్ మూలాన మరణించింది. ఆమె చాలా ధైర్యంగల క్రైస్తవురాలు—గొప్ప పోరాటం పోరాడింది, ఎన్నడూ ఓటమిని అంగీకరించలేదు. యెహోవా ఆమెను దయతో జ్ఞాపకముంచుకొనునుగాక.
రెండో వార్త మా అన్న వెర్నర్‌ను గూర్చినది, ఆయనెన్నడూ యెహోవాకు సమర్పించుకోలేదు. ఆయన జర్మను సైన్యంలో చేరాడు, రష్యాలో హతుడయ్యాడు. మా నాన్నగారు? ఆయన ఇంటికైతే తిరిగివచ్చారు, కానీ విషాదకరంగా, తమ విశ్వాసాన్ని త్యజిస్తున్నట్లు ఆ నీచ పత్రంపైన సంతకం పెట్టిన అతి కొద్దిమంది సాక్షుల్లో ఆయన ఒకరు. నేనాయన్ని చూసినప్పుడు ఆయన చాలా విషాదవదనంతో, మానసికంగా బాగా కలవరానికి గురైనట్లు కనిపించారు.—2 పేతురు 2:20.
ఆసక్తిగా జరిపిన ఆత్మీయ కార్యకలాపాల క్లుప్త కాలం
1946, మార్చి 10న నేను లైప్జిగ్లో నా మొదటి యుద్ధానంతర సమావేశానికి హాజరయ్యాను. అదేరోజు బాప్తిస్మం ఇవ్వబడుతుందన్న ప్రకటనను వినడం ఎంత ఉత్తేజకరంగా ఉండిందో! నేను ఎన్నో సంవత్సరాల క్రితమే నా జీవితాన్ని యెహోవాకు సమర్పించుకున్నప్పటికీ, బాప్తిస్మం తీసుకునే అవకాశం నాకు లభించడం ఇదే మొదటిసారి. నేనారోజును ఎన్నటికీ మర్చిపోను.
ఒక నెలపాటు పయినీరు సేవ చేసిన తర్వాత 1947, మార్చి 1న నన్ను మాగ్డెబర్గ్‌లోని బేతేలుకు ఆహ్వానించారు. బాంబుల మూలాన సొసైటీ కార్యాలయాలు చాలా దెబ్బతిన్నాయి. మరమ్మతు పనిలో సహాయం చేయడం ఎంతటి ఆధిక్యత! ఆ వేసవి తర్వాత నన్ను విటన్బెర్గ్ నగరంలో ఒక ప్రత్యేక పయినీరుగా నియమించారు. కొన్ని నెలలపాటు నేను దేవుని రాజ్యాన్ని గురించిన సువార్తను ఇతరులకు ప్రకటిస్తూ నెలకు 200 కన్నా ఎక్కువ గంటల్ని గడిపాను. స్వతంత్రునిగా ఉండడం ఎంత ఆహ్లాదకరంగా ఉందో—యుద్ధం లేదు, హింస లేదు, జైళ్లు లేవు!
విషాదకరంగా ఆ స్వేచ్ఛ అట్టే నిలువలేదు. యుద్ధం తర్వాత జర్మనీ విభజన జరిగింది, నేను నివసించే ప్రాంతం కమ్యూనిస్టుల అధికారం క్రిందికి వచ్చింది. 1950 సెప్టెంబరులో ష్టాజీ అని పిలువబడే తూర్పు జర్మనీ రహస్య పోలీసులు సహోదరుల్ని ఒక పద్ధతి ప్రకారం అరెస్టు చేయనారంభించారు. నాకు విరుద్ధంగా చేయబడిన ఆరోపణలు హాస్యాస్పదంగా ఉన్నాయి. నేను అమెరికా ప్రభుత్వం తరఫున గూఢచారిగా పనిచేస్తున్నానని నిందారోపణలు చేయబడ్డాయి. వాళ్లు నన్ను దేశంలోనే అత్యంత ఘోరమైన ష్టాజీ జైల్లోకి అంటే బ్రాండెన్‌బర్గ్‌లోని ఒక జైల్లోకి పంపించారు.
నా ఆత్మీయ సహోదరులనుండి మద్దతు
అక్కడ ష్టాజీ నన్ను పగటిపూట నిద్రపోనివ్వలేదు. తర్వాత రాత్రంతా నన్ను ఇంటరాగేట్ చేసేవారు. ఈ చిత్రహింసను నాపై కొన్ని రోజులపాటు కొనసాగించే సరికి పరిస్థితులు మరీ ఘోరంగా తయారయ్యాయి. ఒకరోజు ఉదయం నన్ను నా జైలు గదిలోనికి పంపించడానికి బదులుగా వాళ్లు తమ నీచమైన యూ-బోట్ త్సెలన్లలో (నేలమాళిగలో ఎక్కడో క్రింద ఉండడం మూలాన జలాంతర్గామి జైలుగదులు అని పిలువబడేవి) ఒకదానిలోకి తీసుకెళ్లారు. తుప్పుపట్టివున్న ఒక పాత తలుపును తెరిచి నన్ను లోపలికి వెళ్లమన్నారు. నేనొక ఎత్తైన గుమ్మం దాటి లోనికి వెళ్లాల్సివచ్చింది. నా కాలిని క్రింద ఆనించినప్పుడు నేలంతా పూర్తిగా నీటితో నిండివుందని నేను గ్రహించాను. భయంకరమైన కీచుమనే శబ్దంచేస్తూ గట్టిగా తలుపు మూసేశారు. వెల్తురు లేదు, కిటికీ లేదు. అంతా కటిక చీకటిగా ఉంది.
నేలపైన నీళ్లు కొన్ని అంగుళాల ఎత్తువరకు ఉండడంతో నేను కూర్చోలేను, పడుకోలేను, లేదా నిద్రపోలేను. కాలం స్తంభించిపోయినట్లనిపించింది. కొద్దికాలం తర్వాత నన్ను శక్తిమంతమైన లైట్ల క్రింద ఇంకా ఇంటరాగేషన్ చేయడాన్కి తీసుకెళ్లారు. ఈ రెంటిలో ఏది ఘోరమైనదో నాకు తెలియట్లేదు—దాదాపు పూర్తి అంధకారంలో రోజంతా నీట్లో నిలబడ్డమా లేకపోతే చాలా బాధాకరంగా ఉన్న ప్రకాశమానమైన ఫ్లడ్‌లైట్లు రాత్రంతా తిన్నగా నామీదే పడుతుండడాన్ని సహించడమా.
అనేక సందర్భాల్లో వాళ్లు నన్ను కాల్చివేస్తామని బెదిరించారు. కొన్ని రాత్రులు ఇంటరాగేషన్ చేసిన తర్వాత, నన్ను ఒక ఉదయం ఉన్నత పదవిలో ఉన్న ఒక రష్యన్ సైనిక అధికారి కలిశాడు. నాపట్ల జర్మన్ ష్టాజీ, నాజీ గెస్టాపో కన్నా ఘోరంగా ప్రవర్తిస్తుందని చెప్పుకోవడానికి అవకాశం కల్గింది. నాజీ ప్రభుత్వం క్రింద యెహోవాసాక్షులు తటస్థంగా ఉన్నారనీ, కమ్యూనిస్టు ప్రభుత్వం క్రింద కూడా తటస్థంగానే ఉంటారనీ, ప్రపంచంలో ఎక్కడైనా మేము రాజకీయ కార్యకలాపాల్లో తలదూర్చమనీ ఆయనకు చెప్పాను. దానికి విరుద్ధంగా, నేడు ష్టాజీ అధికారులుగా ఉన్న అనేకమంది మునుపు హిట్లర్ యూత్ సంస్థలో సభ్యులుగా ఉన్నవారనీ, అమాయకులైన ప్రజల్ని క్రూరంగా హింసించడం వారు బహుశ అక్కడే నేర్చుకుని ఉంటారనీ నేను చెప్పాను. నేను మాట్లాడుతుండగా నా శరీరం చలికీ, ఆకలికీ, నిస్సత్తువతోనూ వణుకుతూ ఉంది.
ఆశ్చర్యకరంగా, ఆ రష్యన్ అధికారి నా మీద కోప్పడలేదు. దానికి బదులుగా ఆయన నామీద ఒక రగ్గు కప్పి నా ఎడల దయగా వ్యవహరించాడు. ఆయన సందర్శించిన అనతికాలంలోనే నేను మరింత సౌకర్యవంతమైన గదిలోనికి మారాను. కొన్ని రోజుల తర్వాత నన్ను జర్మన్ కోర్టులకు అప్పగించారు. నా కేసు ఇంకా విచారణలో ఉండగానే నేను నా జైలుగదిని వేరే ఐదుగురు సాక్షులతో పంచుకునే చక్కని ఆధిక్యత లభించింది. ఎంతో క్రూరంగా చూడబడడాన్ని సహించిన తర్వాత, నా ఆత్మీయ సహోదరుల సహవాసాన్ని అనుభవించడం ఎంత సేదదీర్పుగా ఉందో!—కీర్తన 133:1.
కోర్టులు నేను గూఢచర్యం చేసినట్లు తీర్పుచెబుతూ దోషిగా తీర్మానించి సంస్కరణ జైలులో నాలుగేళ్ల శిక్షను విధించాయి. అది చాలా తేలికైన శిక్షగా పరిగణించబడేది. కొంతమంది సహోదరులకైతే పది సంవత్సరాలకన్నా ఎక్కువ శిక్ష విధించబడింది. నన్ను అత్యధిక భద్రతా జైలుకి పంపించారు. నన్నడిగితే ఒక్క ఎలక కూడా ఆ జైలు నుండి బయటికి గానీ లోపలికి గానీ వెళ్లలేదేమో—అంత గట్టి భద్రత దానికి ఉంది. అయినా యెహోవా సహాయంతో కొంతమంది సహోదరులు ఒక పూర్తి బైబిలుని లోపలికి స్మగుల్ చేయగల్గారు. దాన్ని ఒక్కొక్క పుస్తకం ప్రకారం విడివిడి భాగాలుగా చేసి ఖైదీలుగా ఉన్న సహోదరులకు పంపిణీ చేసేవాళ్లం.
మేము దాన్నెలా చేశాం? అది చాలా కష్టంగా ఉండేది. మేము ఒకర్నొకరం కలుసుకునేది రెండువారాలకు ఒకసారి స్నానాలు చేసేందుకు మమ్మల్ని తీసుకెళ్లినప్పుడు మాత్రమే. ఒక సందర్భంలో నేను స్నానం చేస్తుండగా ఒక సహోదరుడు తన తువాలులో కొన్ని బైబిలు పేజీలను పెట్టినట్లు నా చెవిలో గుసగుసలాడాడు. నా స్నానం తర్వాత నేను నా తువాలుకు బదులుగా ఆయన తువాలు తీసుకొనివెళ్లాను.
ఆ సహోదరుడు నా చెవిలో గుసగుసలాడ్డం ఒక గార్డు చూసి ఆయన్ని ఒక దుడ్డుకర్రతో చాలా ఘోరంగా కొట్టాడు. నేను నా తువాలుని తీసుకుని మిగతా ఖైదీల్లో త్వరగా కలిసిపోవల్సివచ్చింది. నా దగ్గర బైబిలు పేజీలు ఉండగా నన్నెవరూ పట్టుకోలేదు, అందుకు నేను కృతజ్ఞుడ్ని. లేకపోతే మా ఆత్మీయ ఆహార కార్యక్రమం ప్రమాదంలో పడేది. మాకు అటువంటి అనేకమైన అనుభవాలు ఎదురయ్యాయి. మేము ఎప్పుడూ దాక్కుని బైబిలు పఠనం చేసేవాళ్లం, పట్టుబడితే గొప్ప ప్రమాదం కలిగివుండేది. “నిబ్బరమైన బుద్ధిగలవారై మెలకువగా ఉండుడి” అన్న అపొస్తలుడైన పేతురు మాటలు నిజంగా చాలా యుక్తమైనవిగా ఉన్నాయి.—1 పేతురు 5:8.
ఏదో కారణంచేత అధికారులు మాలో కొందర్ని ఒక జైలునుండి మరో జైలుకి తరచూ మారుస్తూ ఉండాలని నిర్ణయించుకున్నారు. నాలుగు సంవత్సరాల కాలంలో నన్ను పది వేర్వేరు సంస్కరణా జైళ్లల్లోకి మార్చారు. అయినా, నేను ప్రతీసారి సహోదరుల్ని కనుగొనేవాడిని. నేను ఈ సహోదరులందరి ఎడలా గాఢమైన ప్రేమను కనపర్చసాగాను, అందుకనే నన్ను బదిలీ చేసిన ప్రతీసారి నేను వారిని విడిచివెళ్లడం ఎంతో విషాదకరంగా ఉండేది.
చివరికి నన్ను లైప్జిగ్కి పంపించారు, నేను జైలునుండి విడుదలైంది అక్కడ్నుంచే. నన్ను బయటికి వదిలిన జైలు గార్డు నాకు వీడ్కోలు చెప్పలేదు గానీ, “మేము నిన్ను మళ్లీ చూస్తాం” అన్నాడు. ఆతని దుష్ట మనస్సు నేను మళ్లీ చువ్వలవెనక్కి వెళ్లాలని కోరుకుంది. నేను తరచూ కీర్తన 124:2, 3 గురించి తలస్తూ ఉంటాను, అక్కడిలా ఉంది: “వారి ఆగ్రహము మనపైని రగులుకొనినప్పుడు యెహోవా మనకు తోడైయుండనియెడల వారు మనలను ప్రాణముతోనే మ్రింగివేసియుందురు.”
యెహోవా తన యథార్థతగల సేవకుల్ని విమోచిస్తాడు
నేనిప్పుడు మళ్లీ స్వేచ్ఛాజీవిని. నా కవల సహోదరియైన రూత్, ఆమెతోపాటు సిస్టర్ హెర్టా ష్లెన్జోగ్ గేటు దగ్గర నాకోసం ఎదురుచూస్తున్నారు. నేను జైల్లో ఉన్న ఈ సంవత్సరాలన్నింట్లో ప్రతి నెలా హెర్టా నాకోసం చిన్న ఆహారం పొట్లాల్ని పంపించింది. ఈ చిన్న ఆహారం పొట్లాలే గనుక లేకపోయి ఉండుంటే నేను జైల్లోనే చనిపోయివుండేవాడినని నేను నిజంగా నమ్ముతున్నాను. యెహోవా ఆమెను దయతో జ్ఞాపకముంచుకొనును గాక.
నేను విడుదలైనప్పటినుండీ యెహోవా నన్ను ఎన్నో సేవాధిక్యతలతో ఆశీర్వదించాడు. నేను మళ్లీ ప్రత్యేక పయినీరుగా జర్మనీలోని గ్రోనావులో సేవ చేశాను, ప్రాంతీయ పైవిచారణకర్తగా జర్మనీలోని ఆల్ప్స్లో సేవ చేశాను. తర్వాత మిషనరీల కొరకైన వాచ్‌టవర్ బైబిల్ స్కూల్ ఆఫ్ గిలియడ్ యొక్క 31వ తరగతిలో ప్రవేశించమని నన్ను ఆహ్వానించారు. మా స్నాతకోత్సవం 1958లో యాంకీ స్టేడియంవద్ద జరిగిన యెహోవాసాక్షుల అంతర్జాతీయ సమావేశంలో జరిగింది. అక్కడి సహోదర సహోదరీల గొప్ప సమూహాన్ని ఉద్దేశించి మాట్లాడే ఆధిక్యతా, నా అనుభవాలను తెలియజేసే ఆధిక్యతా నాకు లభించింది.
స్నాతకోత్సవం తర్వాత నేను మిషనరీగా సేవ చేయడానికి చీలీకి ప్రయాణించాను. అక్కడ నేను మళ్లీ సర్క్యూట్ పైవిచారణకర్తగా చీలీలో దిగువ దక్షిణ ప్రాంతంలో సేవచేశాను—నన్ను అక్షరార్థంగానే భూదిగంతములకి పంపించారు. 1962లో, నేను అమెరికా, టెక్సస్‌లోని సాన్ ఆంటోన్యోనుండి వచ్చిన పాట్సీ బోయిట్నాగల్ అనే ఒక చక్కని మిషనరీని పెళ్లిచేసుకున్నాను. ఆమె నాప్రక్కనుండగా ఎన్నో అద్భుతమైన సంవత్సరాలు నేను యెహోవాకు సేవ చేశాను.
70 సంవత్సరాలకుపైగానున్న నా జీవితంలో నేను అనేక ఆనందకరమైన క్షణాలనూ అనేక విపత్కరమైన పరిస్థితుల్నీ అనుభవించాను. కీర్తనల గ్రంథకర్త ఇలా అన్నాడు: “నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు. వాటి అన్నిటిలోనుండి యెహోవా వానిని విడిపించును.” (కీర్తన 34:19) 1963లో నేనూ పాట్సీ ఇంకా చీలీలో ఉండగానే దుఃఖకరమైన మా పాప మరణాన్ని అనుభవించాము. అటుతర్వాత పాట్సీ చాలా రోగగ్రస్తురాలైంది, దాంతో మేము టెక్సస్‌కి తరలిపోయాము. ఆమెకు కేవలం 43 ఏండ్ల వయస్సున్నప్పుడే ఆమె చనిపోయింది, అదీ విషాదకరమైన పరిస్థితులలో. నా ప్రియమైన భార్యను దయతో జ్ఞాపకముంచుకోవాలని యెహోవాకు తరచూ ప్రార్థిస్తుంటాను.
నేనిప్పుడు వ్యాధితోనూ వార్థక్యంతోనూ ఉన్నప్పటికీ టెక్సస్‌లోని బ్రేడీలో ఒక క్రమ పయినీరుగానూ ఒక పెద్దగానూ సేవచేసే ఆధిక్యతను కల్గివుండడంలో ఆనందిస్తున్నాను. నిజమే, జీవితం ఎల్లప్పుడూ సాఫీగానే సాగిపోలేదు, నేను ఇంకా ఎదుర్కోవల్సిన ఇతర పరీక్షలు ఉండివుండవచ్చు. అయినా, కీర్తనల గ్రంథకర్తలాగా నేనూ ఇలా చెప్పగలను: “దేవా, బాల్యమునుండి నీవు నాకు బోధించుచు వచ్చితివి. ఇంతవరకు నీ ఆశ్చర్యకార్యములు నేను తెలుపుచునే వచ్చితిని.”—కీర్తన 71:17.
[23వ పేజీలోని చిత్రం]
(1) నేడు ఒక పెద్దగానూ, క్రమ పయినీరుగానూ సేవచేస్తూ, (2) మా పెళ్లికి కాస్త ముందు, పాట్సీతో, (3) హెర్ర్ ష్నైడర్ తరగతిగదిలో, (4) రావెన్స్బ్రూక్లో చనిపోయిన మా అమ్మ, టెరేజా