ప్రపంచ పరిశీలన
సంశ్లిష్టత ఎక్కడినుండి ఆరంభమయ్యింది?
చాలామంది పరిణామ శాస్త్రజ్ఞులు ఊహించేదేమంటే ప్రాచీన జీవరాసులు అసంశ్లిష్టమైనవి గానీ ఆ తర్వాత బహుశ అవి ప్రాకృతిక వరణంవల్ల వృద్ధిచెంది తరాలు గడచేకొలది అత్యంత సంశ్లిష్టమైనవిగా మారాయి. అత్యంత సంశ్లిష్టతవైపు పురోగమించే అలాంటి వృద్ధిని కనుగొనుటయందు ఇటీవల అధ్యయనాలు విఫలమయ్యాయి. డా. డాన్ మేక్‌షా అనే శిలాజజీవశాస్త్రవేత్త, వివిధ రకాల స్తన్యజాతికి చెందిన జంతువుల వెన్నెముక యొక్క శిలాజరూపాలను పరిశీలించాడు; మరొక అధ్యయనం, మొలస్కా జాతి (నత్త మొదలైనవి) జంతువుల శిలాజాలపై కేంద్రీకరించబడింది. ఏ అధ్యయనం కూడా సంశ్లిష్టతవైపు జరిగిన పరిణామాభివృద్ధికి సంబంధించిన ఎలాంటి ఆధారాలను కనుగొనలేదు. అలాగని అత్యంత సంశ్లిష్టతవల్ల భద్రపరచబడ్డాయని చెప్పే ప్రయోజనాలను కూడ వారు కనుగొనలేదు. ది న్యూయార్క్ టైమ్స్ ప్రకారంగా నిపుణులు చెప్పేదేమంటే, ఈ అన్వేషణలు, “అలాంటి ధోరణిలో వాడుకగా ఆలోచించే అనేకమంది జీవశాస్త్రజ్ఞులను ఆశ్చర్యచకితులను చేస్తాయి.” టైమ్స్ పత్రిక యిలా పేర్కొంటుంది: “డా. మేక్‌షా ప్రకారం, సంశ్లిష్టతవైపు అభివృద్ధి జరిగిందనే ఈ జ్ఞానం, జీవశాస్త్ర సంబంధమైన వాస్తవంకంటే పరిణామంలో ఏదోరకమైన అభివృద్ధిని చూడాలనే శాస్త్రజ్ఞుల కోరికనే అధికంగా ప్రతిబింబిస్తుంది.” (g93 9/22)
వయస్సు, వ్యాయామం
వ్యాయామం చేయడానికి ఎన్నడూ వయస్సుతో పనిలేదా? పశ్చిమ అమెరికాలో ఇటీవల జరిపిన అధ్యయనం ప్రకారం లేదనే తేలింది. వయస్సుతో పనిలేకుండా “తగుమాత్రంగా చురుగ్గా” వ్యాయామం చేసిన 10,000 మంది పురుషులు తమ ఆయుష్కాలాన్ని వృద్ధిచేసుకున్నట్లు, వారిపై జరిపిన సర్వేలో కనుగొన్నారు. నలభై ఐదు, ఏభై నాలుగు ఏండ్ల మధ్య వయస్కులు వ్యాయామం మొదలుపెట్టినప్పుడు, తమ ఆయుష్కాలాన్ని 10 నెలలు పొడిగించుకుని అత్యంత ప్రయోజనం పొందారు. అరవై ఐదు నుండి డెభ్బై నాలుగేండ్ల గుంపు 6 నెలలు పొడిగించుకున్నారు, మరి 75 నుండి 84 యేండ్లున్నవారు రెండు మాసాలు మెరుగుపడ్డారు. ఈ అధ్యయన కార్యదర్శి డా. రాల్ఫ్ ఎస్. పఫెన్‌బార్గర్, ఇవి సరాసరి లెక్కలేనని నొక్కిచెప్పాడు; తద్వారా, అధ్యయనం జరుపబడిన కొందరు, వ్యాయామంవల్ల ఇతరులకంటే ఎక్కువ ప్రయోజనం పొందారు. దీనివల్ల హృద్రోగం రాకుండా కాపాడుకోవడానికి ముఖ్య ప్రయోజనంగా ఉన్నట్లు కన్పించింది. అయినను, వ్యాయామం చేసేవారు వేరే కారణాలవల్ల చనిపోయే ప్రమాదం కూడా తక్కువగానే ఉంది.
(g93 9/22)
పులి ఎముకలు
సాంప్రదాయిక విదేశీ మందుల్లో పులి ఎముకలు ఉపయోగించే గిరాకీవల్ల, ప్రపంచంలోని పులుల సంఖ్య తగ్గిపోయే ప్రమాదాన్ని ముందుంచిందని ది లాన్సెట్ అనే బ్రిటీష్ పత్రిక వివరిస్తుంది. పులి ఉత్పత్తుల వ్యాపారాన్ని అణచివేసేందుకు అంతర్జాతీయ ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ, వైన్‌లలో, ఔషధాలలో, తినుబండారాల్లో (తేనె లేదా పానకముతో కలిపిన ఔషధ పొడి) పులి ఎముక విస్తృతంగా అమ్ముడుపోతుంది. కేవలం 1991లోనే, 15,079 పెట్టెల మందు బిళ్లలు, 5,250 కిలోల తినుబండారాలు, పులి ఎముకపొడి కలిపిన 31,500 సీసాల వైన్‌ను ఒక ఆసియా దేశం ఎగుమతి చేసినట్లు ఆరోపించబడింది. ప్రపంచ వ్యాప్తంగా మిగిలివున్న పులుల సంఖ్య షుమారు 6,000 మాత్రమేనని అంచనా వేయబడింది. (g93 9/22)
లింగ వైకల్యత
“అలీన దేశాల్లో తరచూ, స్త్రీజాతి జీవించడానికి నోచుకోవడంలేదు,” అని చెబుతూ ఇటీవల ది వాషింగ్టన్ పోస్ట్ పత్రికలో నివేదికల ధారావాహిక ఆరంభమయ్యింది. ఈ పోస్ట్ పత్రికా విలేఖరులు, ఆఫ్రికా, ఆసియా, దక్షిణ అమెరికా దేశాల్లోని బీద ప్రాంతాల స్త్రీలను అనేకమందిని పరిచయం చేసిన తర్వాత “సంస్కృతి, మతం, చట్టం అనేవి స్త్రీల ప్రాథమిక హక్కులను హరిస్తున్నాయి, కొన్నిసార్లు తక్కువజాతి మానవులుగా దృష్టిస్తున్నార”ని కనుగొన్నారు. ఉదాహరణకు, హిమాలయాల్లోని ఒక గ్రామంలో, 59 శాతం పనిని స్త్రీలే చేస్తూ, రోజుకు 14 గంటలు కష్టించి పనిచేస్తూ తరచు తమ బరువుకంటే 1.5 రెట్లు ఎక్కువ బరువును మోస్తున్నారు. ఒక అధ్యయనం గుర్తించిందేమంటే, “రెండు లేక మూడు . . . కాన్పుల తర్వాత, వారి శక్తి హరించుకు పోతుంది, వాళ్లు బలహీనులౌతారు, మరి 36 ఏండ్లు దాటేసరికి శుష్కించి, వృద్ధులై కృషించి, త్వరలో చనిపోతారు.” ఆడ పిల్లలకు సామాన్యంగా తక్కువగా ఆహారం ఇస్తారు. పాఠశాల్లో నుండి తీసేస్తారు, పసితనంలోనే పనికి పంపిస్తారు, మగాళ్లకంటే తక్కువ వైద్య సదుపాయాలు కల్పిస్తారు. అనేకమంది స్త్రీలు ఖర్చుతో కూడిన ఆస్తియని దృష్టించి, ఆడశిశువుల ప్రాణం తీస్తారు. విలేఖరులు పేర్కొన్నదేమంటే, దక్షిణ భారతదేశంలోని గ్రామీణప్రాంతాల్లో, కోడిమాంసంతో చేసిన కషాయం బాగా కాచి, బిడ్డ గొంతులో పోయడమే పిల్లలను చంపే సాధారణ పద్ధతి. అలాంటి వారిని శిక్షిస్తారా అని ఒక పోలీసు అధికారిని అడిగినప్పుడు, యిలా సమాధానమిచ్చాడు: “ఇందులో అనేకమైన ఒత్తిడి కల్గించే సమస్యలున్నాయి. చాలా కొద్ది కేసులు మాత్రమే మా దృష్టికి తేబడతాయి. అతి తక్కువమందే పట్టించుకుంటారు.” (g93 9/22)
ప్రాముఖ్యమైన చంద్రుడు
భూగ్రహం ప్రత్యేకంగా జీవానికి అనువైనదిగా చేస్తున్న గగుర్పాటు కల్గించే కారకాలకు, మరొక దానిని అంటే చంద్రుని కూడ ఖగోళశాస్త్రవేత్తలు జతచేయాల్సి ఉంటుంది. మన ఉపగ్రహం ఆకాశానికి రాత్రి దీపంలా ఉండడం, సముద్ర ఆటుపోటులను కల్గించడం కంటే ఎక్కువే చేస్తుంది. ఫ్రెంచి ఖగోళశాస్త్రవేత్తల కంప్యూటర్ అధ్యయనాల ప్రకారం, ఇది భూమియొక్క వంపును, అంటే, దాని కక్ష్యలో వంగి తిరిగే డిగ్రీల కోణాన్ని క్రమభరితం చేస్తుంది. ఉపగ్రహం లేనటువంటి అంగారక గ్రహం, యుగాలు గడచిన కొలది దాని వంపు కోణం 10 నుండి 50 డిగ్రీల మధ్యలో బహుశ మారి ఉండవచ్చు. ఈ అస్థిరత బహుశ ధ్రువప్రాంతం కరిగిపోవడం, మరలా గడ్డకట్టుకుపోవడం అనే ఫలితాలవల్లవచ్చే వాతావరణ మార్పులకు కారణమైయ్యుండవచ్చు. కంప్యూటర్ అధ్యయనాలు వెల్లడిచేసిందేమంటే, పటిష్టమైన ప్రభావం కలుగజేసే చంద్రుడు లేకపోతే, భూమియొక్క వంపు కోణం 85 డిగ్రీలకు మారిపోయుండేదే. కాబట్టి, ఫ్రెంచి ఖగోళశాస్త్రవేత్త యిలా ముగింపులో చెప్పాడు: “భూమిపై వాతావరణాన్ని క్రమబద్ధం చేయుటలో సామర్థ్యంగల సాధనంగా చంద్రుని పరిగణించవచ్చు.” (g93 9/22)
అదృశ్యమౌతున్న స్త్రీలు
బ్రిటన్, ఫ్రాన్స్, స్విట్జర్లాండ్, అమెరికా వంటి అభివృద్ధి చెందిన దేశాల్లో 100 మంది పురుషులకుగాను 105 మంది స్త్రీలున్నారు. కాని యుఎన్ లెక్కలు చూపించేదేమంటే ఆసియాలో లక్షల కొలదిగా స్త్రీలు అదృశ్యమౌతున్నారు. ఉదాహరణకు, ప్రతి 100 మంది పురుషులకు ఆఫ్ఘనిస్తాన్ మరియు బంగ్లాదేశ్‌లలో 94 మంది స్త్రీలు, ఇండియాలో 93 మంది, పాకిస్తాన్‌లో కేవలం 92 మంది మాత్రమే ఉన్నారు. చైనాలో అధికారుల లెక్కలు చూపిందేమంటే ప్రతి 100 మంది ఆడపిల్లలకు 114 మంది ఒకటి లేదా రెండేండ్ల వయస్సుగల మగపిల్లలున్నారు. ఎందుకింత తేడా? “పురుషులకంటే తక్కువగా జీవించే అవకాశాలవల్లనే: అనగా ఆడ శిశువులను గర్భస్రావం చేయడానికి, ఆడపిల్లలను చంపడానికీ ఎన్నుకోవడం, పోషణ, ఆరోగ్యజాగ్రత్తలు సరిగా తీసుకొనకపోవడం, అనేక కాన్పులు, వెన్ను విరిగేలా కష్టించడంలాంటి వాటిని స్త్రీలు ఓర్చుకోవాల్సి వచ్చినందున వారి మనుగడకే ముప్పువాటిల్లిందని నిపుణులు పేర్కొన్నారు,” అని ది వాషింగ్టన్ పోస్ట్ చెబుతుంది. దీనికితోడు, కొన్ని సంస్కృతులలో, మగాళ్ల జనాబా లెక్కలు వేసేవారు స్త్రీలను లెక్కించరు లేదా స్త్రీలతో మాట్లాడడానికి అనుమతించబడరు. కొంతమంది తండ్రులు, మగపిల్లల కంటే ఆడపిల్లలే ఎక్కువగా ఉన్నారని చెప్పడానికి సిగ్గుపడి, వారి విషయంలో అబద్ధమాడతారు. (g93 10/8)
జనన సంఖ్య పడిపోతున్న చైనా
చైనాలో ఎన్నడూ లిఖించని విధంగా జనన సంఖ్య 1,000 మందికి 18.2 చొప్పున తగ్గుముఖం పట్టిందని 1992లో లెక్కలు చూపించాయి, ఇది 1987లో 23.33 నుండి తగ్గుతూ వచ్చిందని ది న్యూయార్క్ టైమ్స్ నివేదిస్తుంది. ఆ గురిని 2010వ సంవత్సరం వరకూ కూడ చేరుకోలేమని అనుకున్నప్పటికి, దాన్ని సాధించాము “ఎందుకంటే రాజకీయ పార్టీలు, అన్ని పదవులలోని ప్రభుత్వ అధికారులు కూడ కుటుంబ నియంత్రణా కార్యక్రమానికి అత్యధిక అవధానమిచ్చి, ప్రభావవంతమైన చర్యలు తీసుకున్నారు,” అని కుటుంబ నియంత్రణ సహాయ సంఘానికి మంత్రియైన పెంగ్ పేయున్ అనునామె చెబుతుంది. ఈ కార్యక్రమం క్రింద జిల్లా పరిధిలో జననాల సంఖ్యను తగ్గించడానికి ప్రాంతీయ అధికారులే వ్యక్తిగతంగా బాధ్యులు, మరియు ఆ విధంగా చేయుటలో విఫలమైతే శిక్షింపబడతారు. అంటే స్త్రీలు ఇప్పటికే ఒక బిడ్డను కల్గివుంటే కచ్ఛితంగా కుటుంబ నియంత్రణ చేయించుకోవాలని, మరి అనుమతిలేకుండా పిల్లలను కంటే చాలా ఎక్కువ జరిమానా చెల్లించాలని దీని భావం. పల్లె ప్రజలు జరిమానా చెల్లించలేనప్పుడు, వారి ఆస్తులను జప్తుచేయడంగాని లేదా ధ్వంసం చేయడంగాని జరిగేది, తరచూ వాళ్ల ఇళ్లను కూలద్రోసేవారు. ఇప్పటికే 117 కోట్లు ఉన్న చైనా జనాబా ప్రపంచ జనాబాలో దాదాపు 22 శాతం ఉంది. (g93 10/8)
కంప్యూటర్ ద్వారా అనువదించబడింది
జపాన్, జర్మనీ, అమెరికా దేశాల్లో శాస్త్రవేత్తల మధ్య టెలిఫోన్‌లో జరిగే సంభాషణను అనువదించడానికి ఇటీవల ఒక కంప్యూటర్ మొట్టమొదటి సారిగా వీలుకల్పించిందని చెప్పవచ్చు. కియోటో, మ్యూనిచ్, పిట్స్‌బర్గ్‌లలో శాస్త్రవేత్తలు మాట్లాడుతున్నప్పుడు, తమ పదజాలాన్ని 550కు నిర్ధిష్టంచేసి, సమావేశాలు, హోటల్ బుకింగ్‌లకు సంబంధించిన క్షేత్రంనుండి 150 ప్రత్యేకమైన పదాలను దీనికి జతకూర్చారు. ఈ మాటలను మాత్రమే కంప్యూటర్ ప్రోగ్రామ్ అర్థంచేసికొని, అనువదించగలదు. స్యూడెయిస్టి జెయిథంగ్ అనే మ్యూనిచ్ వార్తాపత్రిక నివేదించేదేమంటే, శాస్త్రవేత్తలు “వేర్వేరు దేశాలనుండి వచ్చిన భాగస్వాముల సమావేశ బుకింగ్‌లకు సంబంధించిన విషయాలను చూడగలిగేటటువంటి, తేలికైన ప్రశ్నలకు సమాధానమీయగలిగే కంప్యూటర్ అనువాదాన్ని గూర్చి కలిసికట్టుగా పనిచేస్తున్నారు.” (g93 9/22)
బౌద్ధమత బార్
బౌద్ధమతాన్ని పునఃస్థాపించాలనే ప్రయత్నంలో, బౌద్ధమత మతగురువులు జపాన్ నందలి ఓసాకాలో ఒక బార్‌ను తెరిచారు. “ప్రాచీన కాలాల్లో, అన్ని రకాల ప్రజలు దేవాలయాల దగ్గర సమకూడి, తింటూ త్రాగుతూ మాట్లాడేవారు. వందలాది సంవత్సరాలు గడిచిన కొలదీ, బౌద్ధమతం ప్రజలనుండి విడిపోయింది,” అంటూ మతగురువుల్లో ఒకరు చెబుతున్నారని ఆసాహి ఈవెనింగ్ న్యూస్ ఉటంకించింది. పదిహేను మంది మతగురువులు, ఒకరి తర్వాత ఒకరు ఈ బార్ దగ్గర అతిథులుగా నటిస్తూ, వచ్చిపోయే వారితో త్రాగుతున్నారు. వీరిలో ఎక్కువమంది యౌవనులే. “నిజమైన భావంగల మాటలో మా బార్ ఒక దేవాలయమే, అక్కడే మీరు మతగురువుతో మొహమాటం లేకుండా మాట్లాడవచ్చు,” అని హోటల్ యజమాని చెబుతున్నాడు. మండుతున్న ధూపాలను, మత సంబంధమైన బొమ్మలను గోడకు తగిలించారు. తెరవెనుక వినబడేది రాక్‌సంగీతమే. (g93 9/22)
మీ గుండెకు కొంచెం ద్రాక్షారసం
మితంగా ఎర్రని ద్రాక్షారసం తీసుకుంటే హృద్రోగం వచ్చే ప్రమాదాన్ని తగ్గించవచ్చు. ఈ “ఫ్రెంచి విరోధాబాస” అనేది ఎలా వచ్చిందోనని కొంతకాలం శాస్త్రవేత్తలు మల్లగుల్లాలు పడ్డారు. ఫ్రెంచిదేశస్థుని ఆహారంలో రక్తప్రసరణా సమస్యలను తెచ్చిపెట్టే సంతృప్తమైన క్రొవ్వులు తక్కువగా లేనప్పటికి, హృద్రోగ దుర్మరణాలవల్ల చనిపోయేవారి సంఖ్య తక్కువగా ఉన్న దేశాల్లో ఫ్రెంచి యొక్క పారిశ్రామిక పశ్చిమ ప్రాంతమొకటైయుంది. ది లాన్సెట్ అనే బ్రిటీష్ వైద్య పత్రికలో ప్రచురించిన నివేదికలను సూచిస్తూ వివరించిన లీ ఫిగారో అనే పారిస్ వార్తాపత్రిక ప్రకారం, ఫ్రెంచి దేశస్థులు సాధారణంగా భోజనంతోపాటు సేవించే ఎర్రని ద్రాక్షారసానికి దీనితో సంబంధముందని శాస్త్రజ్ఞులు నమ్ముతున్నారు. ఫినాల్స్ అని పిలువబడే ఎర్రని ద్రాక్షారసంలో ఉండే క్షార పదార్థాలు, గుండెపోటుకు కారణమైన క్రొవ్వుపదార్థాలు రక్తనాళాల్లో పేరుకుపోకుండా ఉండేందుకు చెడు కొలెస్ట్రాల్ (ఎల్‌డియల్) అనే పదార్థాన్ని నిరోధిస్తాయి. లీ ఫిగారో యింకా చెప్పేదేమంటే, ఈ ఫినాల్స్ అనేవి ద్రాక్షారసంలో ఉండే మత్తు పదార్థాలు కావు, అయితే రోజుకు పావు లీటర్ కంటే ఎక్కువ తీసుకుంటే, మత్తుపానీయాలు మేలుకంటే కీడునే ఎక్కువ తెచ్చిపెడతాయి. (g93 9/22)