గర్భస్రావముల అపారసంఖ్య
గర్భస్రావంద్వారా ప్రతిసంవత్సరం 5నుండి 6కోట్ల శిశువులు జన్మించకుండానే ప్రాణాలు కోల్పోతున్నారు. ఆ సంఖ్యను మీరు గ్రహించగలరా? ఇది ప్రతీవారం హవాయి దీవుల్లోని మొత్తం జనాబాను ధ్వంసం చేయడంతో సమానంగా వుంది!
చాలా ప్రభుత్వాలు గర్భస్రావానికి సంబంధించిన వివరాలతో కూడిన జాబితాను దాచిపెట్టవు గనుక ఖచ్చితమైన సంఖ్యలను సమకూర్చడం కష్టం. గర్భస్రావం నిర్బంధించబడినచోట లేదా చట్టవిరుద్ధమైనచోట, నిపుణులు కేవలం ఊహించడానికే సాహసించగలరు. కాని భూవ్యాప్త గర్భస్రావాల ఓ భాగం ఈ క్రిందివిధంగా కనబడుతుంది:
అమెరికాలో, టాన్సిల్స్ తొలగించుటకు చేయు శస్త్రచికిత్స తర్వాత అతి సామాన్యమైన శస్త్రచికిత్సా పద్ధతులలో గర్భస్రావము రెండవదిగా వున్నది. సంవత్సరానికి, 15లక్షలకంటే ఎక్కువ గర్భస్రావాలు చేయబడుతున్నాయి. నిశ్చితంగా యీ స్త్రీలలో చాలామంది అంటే ఐదుగురిలో నలుగురు అవివాహితులే, సరాసరి వివాహిత స్త్రీలు ఒకసారి చేయించుకుని దానికి పదిరెట్లు పిల్లలకు జన్మనిస్తే, అదేసమయంలో, అవివాహిత స్త్రీలు మాత్రం ఒకసారికంటే దానికి రెండు రెట్లు గర్భస్రావం చేయించుకున్నారు.
కెథోలిక్కులు అధికంగానున్న—మధ్య, దక్షిణ అమెరికాలలో—గర్భస్రావానికి సంబంధించి ప్రపంచమొత్తంలోకెల్ల అత్యంత నిర్బంధం కల్గిన న్యాయవిధులున్నవి. అయినప్పటికి, చట్టవిరుద్ధ గర్భస్రావాలతో నిండిపోయి, స్త్రీలు గంభీరమైన ఆరోగ్య ప్రమాదాలకు గురౌతున్నారు. ఉదాహరణకు, గత సంవత్సరం, బ్రెజిల్‌లో స్త్రీలు దాదాపు 40లక్షల గర్భస్రావాలు చేయించుకున్నారు. దానిమూలంగా వచ్చిన చిక్కులనుబట్టి వారిలో 4లక్షలకుపైగా స్త్రీలు వైద్యచికిత్సను పొందవలసి వచ్చింది. లాటిన్ అమెరికాలో దాదాపు అన్ని గర్భధారణల్లో నాలుగింట ఒకవంతు అంతం చేయబడుతున్నాయి.
అట్లాంటిక్ ఆవలనున్న ఆఫ్రికా ఖండంలోకూడా, న్యాయవిధులు కఠినమైనవే. ప్రాముఖ్యంగా చట్టవిరుద్ధ వృత్తిలోనున్న వారినుండి సహాయంకోరిన బీదస్త్రీలలో గాయాలు, మరణాలు సాధారణమయ్యాయి.
మధ్య తూర్పుప్రాంత దేశాలన్నింటిలోనూ కఠినమైన న్యాయవిధులు వ్రాయబడిన పుస్తకాలున్నవి, అయినా ఎక్కువ మొత్తంలో ఫీజును యివ్వగలిగే స్త్రీలు గర్భస్రావాలను కోరుతున్నారు, మరి విస్తృతంగా గర్భస్రావాలు చేయించుకుంటున్నారు.
అనేక పశ్చిమ ఐరోపా దేశాలు కొన్ని గర్భస్రావాలను ఆమోదిస్తున్నాయి, స్కాండినేవియా అత్యంత స్వతంత్రమైనదిగా వుంది. గర్భస్రావపద్ధతి 1967లో చట్టబద్ధమైనప్పటినుండి బ్రిటన్‌లోని నేషనల్ హెల్త్ సర్వీస్ గర్భస్రావ జాబితాను తయారుచేసింది. న్యాయవిరుద్ధ జననాలు, లైంగికంగా సంక్రమించే సుఖవ్యాధులు, వ్యభిచారం, అసంఖ్యాకమైన ప్రత్యుత్పత్తి లోపాలతో పాటుగా గర్భస్రావాల సంఖ్య రెట్టింపైనట్లు ఈ సంస్థ గమనించింది.
తూర్పు ఐరోపా ప్రాంతం ఇటీవల చాలామార్పులను చవిచూసింది, అలాగే గర్భస్రావానికి సంబంధించిన చట్టాలలోను మార్పులు సంభవించాయి. వార్షికంగా 1.1 కోట్ల గర్భస్రావాలను అంచనా వేసిన ప్రాంతమైన సోవియట్ యూనియన్, ప్రపంచంలో అత్యధికంగా గర్భస్రావాల సంఖ్యగల ప్రాంతాల్లో ఒకటైయుంది. గర్భనిరోధక పద్ధతులు అరుదుగావున్నందునను, ఆర్థికపరిస్థితులు అల్పంగానున్న కారణంగాను, ఆ ప్రాంతంలో సరాసరి స్త్రీ తన జీవితకాలంలో ఆరునుండి తొమ్మిదిసార్లు గర్భస్రావం చేయించుకోవలసి వస్తున్నది.
తూర్పు ఐరోపా ప్రాంతమంతటిలోనూ సాధారణ ధోరణి స్వతంత్రతవైపు ఉన్నది. ఒక విచిత్ర ఉదాహరణ ఏమనగా రుమేనియా, జనసంఖ్య వృద్ధిచేయుటను ప్రోత్సహించేందుకు ఆ ప్రాంతమందలి మాజీ పాలకవర్గం చురుకుగా గర్భస్రావాన్ని నిషేధించి, గర్భనిరోధక పద్ధతులను నిలిపివేసింది. స్త్రీలు కనీసం నలుగురు పిల్లల కోటాను కల్గియుండాలని వత్తిడి చేయబడ్డారు, రుమేనియాలో 1988నాటికల్లా అనాథశరణాలయాలు విడువబడ్డ పిల్లలతో క్రిక్కిరిసిపోయాయి. కాబట్టి, 1989లో విప్లవాత్మక ప్రభుత్వం గర్భస్రావానికిగల ఈ హద్దులను విరమించుకున్నప్పటి నుండి నలుగురిలో ముగ్గురు శిశువులు గర్భస్రావం గావించబడ్డారు, ఇది ఐరోపాలో అత్యధిక నిష్పత్తియైయుంది.
ఆసియా అత్యధిక గర్భస్రావాల సంఖ్యను కల్గియుంది. ప్రజాతంత్ర రాజ్యమైన చైనా, కుటుంబానికి ఒకే శిశువు అనే దాని నియమంతోను అనివార్యమైన గర్భస్రావాలతో, సంవత్సరానికి 1.4కోట్ల అత్యధిక గర్భస్రావాల సంఖ్యను కల్గివుంది. జపానులో స్త్రీలు అతిచిన్న రాతిబొమ్మలను, ఆటబొమ్మలను గర్భస్రావం చేయబడిన వారి పిల్లల గుర్తుకొరకు బట్టలతో అలంకరిస్తారు. ప్రజలు గర్భనిరోధక మాత్రలనుగూర్చి ఎంతో ఆతురత కల్గియున్నారు, గర్భస్రావమే ప్రాథమిక కుటుంబనియంత్రణా పద్ధతియైయుంది.
ఆసియా అంతటిలోను, ప్రాముఖ్యంగా ఇండియాలో, స్త్రీహక్కులకోసం పోరాడే కార్యకర్తలకు వైద్య సాంకేతికవిద్య అనేది ఒక క్లిష్టపరిస్థితిని సృష్టించింది. ముందుగానే, అనగా గర్భధారణ ప్రాథమిక దశలోనే శిశువు లింగనిర్ధారణ చేయుటకు ఆమ్నియోసింటెసిస్, అల్ట్రాసౌండ్‌లాంటి సాంకేతికపరిజ్ఞానాన్ని ఉపయోగించవచ్చును. ప్రాచీన సాంప్రదాయం చాలాకాలం ఆడాళ్లకంటే మగాళ్లకే విలువనిచ్చింది. కాబట్టి లింగనిర్ధారణ పద్ధతులు, గర్భస్రావం, ఈ రెండూ సులభంగా అందుబాటులో ఉన్నచోట, మగ/ఆడపిల్లల జనన నిష్పత్తిని అస్థిరం చేసేవిధంగా, అధికసంఖ్యలో ఆడశిశు పిండాలు గర్భస్రావం చేయబడుతున్నాయి. ప్రస్తుతం స్త్రీ ఉద్యమం అనేది వైరుధ్యస్థాయిలో ఉండి, ఫలితంగా, స్త్రీలు తమ ఆడశిశు పిండాలను గర్భస్రావం చేయించుకొనేందుకు కావలసిన హక్కులకొరకు వత్తిడి చేస్తున్నారు.
తల్లి ఏమని భావిస్తుంది
ఇతర వైద్య పద్ధతుల వలెనే, కొంత పరిమాణంలో ప్రమాదం, బాధ అనేవి గర్భస్రావంతోపాటు వస్తాయి. గర్భధారణ సమయంలో గర్భాశయపు మూతిభాగం లేదా సెర్విక్స్ అనేది శిశువును సురక్షితంగానుంచుటకు బిగుతుగా మూసుకుని వుంటుంది. దాన్ని విప్పి, పరికరాలను లోనికిచొప్పడం నొప్పి పుట్టించి, గాయం చేయగలదు. సక్సన్ ఎబార్షన్ చేయుటకు 30నిమిషాలు పట్టవచ్చు, ఆ సమయంలో స్త్రీలు ఎంతో తీవ్రమైన బాధను, తిమ్మిరిని అనుభవించవచ్చును. సెలైన్ ఎబార్షన్‌తో, కొన్నిసార్లు నొప్పులు కల్గించే ప్రోస్టాగ్లేండిన్ అను పదార్థం సహాయంతో అకాల నొప్పులు కలిగింపజేస్తారు. దీనివల్ల వచ్చే ముకిళింపులు (కాంట్రాక్షన్స్) కొన్ని గంటలపాటు లేదా కొన్ని రోజులపాటు ఉండవచ్చు, ఇవి బాధతోకూడినవై, మానసికంగా ఆయాసకరంగా వుండవచ్చును.
గర్భస్రావం వలన రక్తస్రావం, గర్భాశయ ముఖ్యద్వారం పాడైపోవుట లేదా చీరిపోవుట, గర్భాశయ విచ్ఛిన్నం, రక్తం గడ్డకట్టుట, కళ్లుతిరుగుట, గగుర్పాట్లు, జ్వరం, వణుకు, వాంతులు మొదలైనవి తక్షణం సంభవించే చిక్కులలో ఇమిడియున్నవి. ఒకవేళ శిశువుకు సంబంధించిన అవయవాలు లేదా జరాయువు గర్భాశయంలో మిగిలిపోతే ప్రాముఖ్యంగా అంటురోగం వచ్చే అవకాశాలు అధికంగా ఉన్నవి. అసంపూర్ణ గర్భస్రావాలు సర్వసాధారణమే, ఆతర్వాత కుళ్లిపోతున్నటువంటి విడువబడిన కణజాలాన్ని లేదా గర్భాశయాన్నే పూర్తిగా తీసివేయడానికి శస్త్రచికిత్స అవసరమై యుండవచ్చును. గర్భస్రావంవల్ల భవిష్యత్తులో గొడ్రాలితనం, స్త్రీబీజవాహికలలోనే గర్భధారణ, గర్భవిచ్ఛిత్తి, అకాలజననం, జననలోపాలకు ఎక్కువగా దోహదం చేస్తుందని అమెరికా, బ్రిటన్, పూర్వోక్త జెకోస్లావేకియాల ప్రభుత్వ అధ్యయనాలు సలహానిస్తున్నవి.
అమెరికా మాజీ శస్త్రవైద్యుడైన ఎస్. ఎవ్‌రెట్ కూప్ పరిశీలించినదేమనగా “ఒకప్పుడు గర్భస్రావం చేయించుకొని, ప్రస్తుతం తాను పొందడం అసాధ్యమైన ఒక శిశువు కావాలని తీవ్రంగా కోరుకుంటున్న స్త్రీ మానసిక ప్రతిక్రియ లేదా ఆమె పొరపాటునుగూర్చి” ఏఒక్కరూ కూడా అధ్యయనం చేయలేదు.
దేవుని నియమాలు, జీవంయెడల గౌరవంగల కన్యలుగా వున్న నిష్కళంక క్రైస్తవ యువతులను గర్భస్రావానికి సంబంధించిన అధ్యయనాల నిర్బంధిత గుంపులలో చేర్చియుండవలసింది. వీరు ఆరోగ్యకరమైన సంబంధాలు, గొప్ప స్వాభిమానం, నిరంతర మానసిక సమాధానాన్ని అనుభవిస్తున్నారని వీరినిగూర్చి అలాంటి అధ్యయనాలు కనుగొనియుండేవి.
జన్మించని శిశువు ఏమని భావిస్తుంది
వెచ్చని తన తల్లి గర్భాశయంలో భద్రంగా గూడుకట్టుకుని హాయిగావుంటూన్న దానిపై అకస్మికంగా చావుదెబ్బతో దౌర్జన్యం చేస్తే, జన్మించని ఈ శిశువు ఏమని సంవేధిస్తుంది? మనం కేవలం ఊహించగలం, ఎందుకంటే తన అసలుకథ ఎన్నడూ వినలేము.
చాలామట్టుకు గర్భస్రావాలు మొదటి 12వారాలలోనే జరుపబడుతున్నాయి. ఈ దశకు చేరేసరికి చిన్నదిగానున్న పిండం శ్వాసించడం, గుటకలువేయడం అభ్యాసం చేస్తుంది, దాని హృదయం కొట్టుకుంటుంది. ఇది దాని చిన్న కాలివ్రేళ్లను ముడుచుకోవడం, పిడికిలి బిగించడం చేయగలదు, దాని జలప్రపంచంలో అది పైకి, క్రిందికి తిరుగబడగలదు—నొప్పిని స్పర్శించగలదు.
చాలా పిండాలు గర్భాశయంనుండి ఒక పదునైన అంచుగల గాలిగొట్టముద్వారా గట్టిగాలాగి ఒక బీకరులోనికి పీల్చబడతాయి. ఈ పద్ధతిని వాక్యూమ్ ఆస్పిరేషన్ అని పిలుస్తారు. శక్తివంతమైన ఈ పీల్చేసాధనం (ఇంటిలో ఉపయోగించే వాక్యూమ్ క్లీనర్ కంటే 29రెట్లు శక్తిగలది) చిన్నదైన శరీరాన్ని ముక్కలుగా చీల్చేస్తుంది. వేరే శిశువులు, డైలేషన్, క్యూరిటేజ్ ద్వారా అనగా ఒక తొడుగు ఆకారంలోనున్న కత్తి గర్భాశయ పొరను చీల్చి, శిశువును ముక్కలు ముక్కలుగా చేయడం ద్వారా గర్భస్రావం చేయబడుతున్నారు.
పదహారు వారాలకు పైబడ్డ పిండాలు సెలైన్ ఎబార్షన్, లేదా సాల్ట్ పాయిజనింగ్ పద్ధతులద్వారా చనిపోవచ్చును. ఒక పొడవాటి సూదితో ఉమ్మనీటి సంచిని పొడిచి, కొంత ఉమ్మనీటిని బయటకుతీసి, ఆ సంచిని చిక్కని ఉప్పుద్రావణంతో నింపడం జరుగుతుంది. శిశువు గుటకలువేస్తూ శ్వాసిస్తూ, దాని సున్నితమైన ఊపిరితిత్తులను విషపూరిత ద్రావణంతో నింపుతూ, అది బ్రతుకుకోసం పెనుగులాడుతు కొట్టుకుంటుంది. ఈ విషంయొక్క తీవ్రప్రభావం శరీరపు బాహ్యపొరను కాల్చివేస్తూ శిశువును పచ్చిగానేవుంచి కృషింపజేస్తుంది. దాని మెదడు నెత్తురు స్రవించడం ఆరంభించవచ్చును. మరణం కొన్నిగంటలలో సంభవించవచ్చు, అయినప్పటికి అప్పుడప్పుడు నొప్పులు ఒక్కరోజులోనే లేదా ఆతర్వాత ప్రారంభమై, జీవంతోనున్న ఒక శిశువు చనిపోతూ ప్రసవించబడుతుంది.
ఈ పద్ధతులద్వారా లేదా ఇలాంటి వేరే పద్ధతులద్వారా చంపడానికి ఒకవేళ శిశువు బాగా పెరిగివుంటే, ఒక ఎన్నిక మాత్రమే మిగిలివుంది—అదే హిస్టెరోటమి, జీవాన్ని కాపాడటానికి బదులుగా దానిని అంతమొందించే లక్ష్యంతో చేసే గర్భాశయ శస్త్రచికిత్స. తల్లి పొత్తికడుపును శస్త్రచికిత్సద్వారా తెరుస్తారు, దాదాపు అన్నిసందర్భాల్లో జీవంతోనున్న ఒక శిశువును బయటకు లాగుతారు. అది ఏడ్వవచ్చు కూడ. కాని అది చనిపోవుటకు విడువవలసివస్తుంది. శిశువులను బాహాటంగా గొంతుపిసికి, నీళ్లలోముంచి, మరితర మార్గాలద్వారా చంపుతారు.
వైద్యుడు ఏమని భావిస్తాడు
వైద్యులు ప్రాక్టీసు మొదలుపెట్టినప్పుడు తాము తీసుకుని పూజించిన ధృవీకరణపత్రంలో వ్యక్తంచేసిన విలువలను శతాబ్దాలుగా హత్తుకొన్నారు, దానిలో కొంతభాగం యిలా చెబుతున్నది: “ప్రాధేయపడి అడిగినప్పటికీ కూడ నేను ఎవరికీ మరణకర మాత్రలు యివ్వడంగానీ, లేదా అలాంటి మాత్రలు తీసుకోమనిగాని సలహా ఇవ్వను, శరీరసంబంధ ద్వారాలలో ప్రవేశపెట్టే నాశనకరమైన వైద్యపరికరాలను [గర్భస్రావం కలుగుటకు] ఏ స్త్రీకి కూడ నేనివ్వను. రోగులను బాగుచేసే ఈ కళను నేను పాపరహితంగాను, గౌరవప్రదంగాను అభ్యసిస్తాను.”
గర్భాశయంలో జీవాన్ని నిర్మూలించే వైద్యులకు ఏవిధమైన నైతిక పెనుగులాట ఎదురయ్యింది? డా. జార్జ్ ఫ్లెష్ దీన్ని ఈవిధంగా వర్ణిస్తున్నాడు: “నేను చేసిన మొదటి గర్భస్రావాలు, ఒక వైద్యవిద్యార్థిగా, వైద్యనిపుణునిగా, నాకేమీ మానసిక దురవస్థను తీసుకురాలేదు. . . . అనేక వందల గర్భస్రావాలు చేసిన తర్వాత నా అసంతృప్తి మొదలైంది. . . . నేనెందుకు మారిపోయాను? నా ప్రాక్టీసు తొలిసమయంలో, ఒక వివాహజంట నావద్దకువచ్చి, గర్భస్రావం కోరారు. రోగి గర్భాశయ ముఖ్యద్వారం దృఢంగా ఉండిన కారణంగా, నేను గర్భస్రావపద్ధతిని నిర్వహించుటకు దానిని వెడల్పు చేయలేక పోయాను. గర్భాశయ ముఖ్యద్వారం మృదువుగా తయారైనప్పుడు, ఒక వారంలోపులో నేను ఆమెను తిరిగి రమ్మని అడిగాను. ఆ జంట తిరిగివచ్చారు, వారి మనస్సు మార్చుకున్నామని చెప్పారు. ఏడుమాసాల తర్వాత నేను వారి బిడ్డకు కాన్పు చేశాను.
సంవత్సరాల తర్వాత, నేను టెన్నిస్ క్లబ్ స్విమ్మింగ్ పూల్‌లో వారి పిల్లవాడైన జెఫ్‌రీతో ఆడుకున్నాను, ఆ క్లబ్‌కు అతని తలిదండ్రులు, నేను సభ్యులుగా ఉండేవాళ్లం. అతను అందంగావుండి, సంతోషంగావున్నాడు. జెఫ్‌రీ ఫలవంతమైన జీవితాన్ని నిర్మూలించకుండా కేవలం ఒక సాంకేతిక ఆటంకం మాత్రమే అడ్డుకుందని ఆలోచించుటకు నేను భీతిచెందాను. . . . కేవలం తల్లి కోరికనుబట్టే, వృద్ధిచెందుతున్న పిండాన్ని క్రూరంగా ముక్కలుగా విడదీయడమనేది, ఒక అవినీతికరమైన క్రియ అని, దానిని సమాజం అనుమతించకూడదని నేను నమ్ము చున్నాను.”
గర్భస్రావ క్లినిక్‌లో గర్భస్రావాలు చేయుటలో సహకరించుటకు మానుకున్న ఒక నర్సు తన ఉద్యోగం గూర్చి యిలా చెప్పింది: “మేము చేయవలసిన పనులలో ఒకటేమనగా గర్భస్రావం చేయబడ్డ శిశువు అవయవాలను లెక్కించడమే. . . . ఒకవేళ ఏ అమ్మాయైనా తన గర్భంలో మిగిలిపోయిన శిశువు శరీరభాగాలతో ఇంటికి వెళ్లినట్లయితే, గంభీరమైన సమస్యలు రాగలవు. నేను భాగాలన్నీ తీసుకుని రెండు చేతులు, రెండు కాళ్లు, ఒక మొండెం, ఒక తల ఉన్నవాయని జాగ్రత్తగా పరిశీలిస్తాను. . . . నాకు నలుగురు పిల్లలున్నారు. . . . నేను సమాధానపడలేని నా ఉద్యోగ జీవితానికి, నా వ్యక్తిగత జీవితానికి మధ్య ఒక గొప్ప సంఘర్షణ జరిగేది. . . . గర్భస్రావమనేది చాలా కఠినమైన వ్యాపారం.”
[7వ పేజీలోని చిత్రం]
ఆసియాలో, మగపిల్లలు ఎన్నుకోబడతారు, వైద్యులు వేలకొలది ఆడశిశువులను గర్భస్రావం చేస్తున్నారు
[క్రెడిట్ లైను]
Photo: Jean-Luc Bitton/Sipa Press
[8వ పేజీలోని చిత్రం]
గర్భస్రావ వ్యతిరేక ప్రదర్శనవద్ద చట్టబద్ధంగా గర్భస్రావం చేయబడ్డ 20వారాల పిండాన్ని ఫోటోతీస్తున్న వార్తావిలేఖరి
[క్రెడిట్ లైను]
Photo: Nina Berman/Sipa Press
[9వ పేజీలోని చిత్రం]
గర్భస్రావ అనుకూల ప్రదర్శన, వాషింగ్‌టన్, డి. సి., అమెరికా
[క్రెడిట్ లైను]
Photo: Rose Marston/Sipa Press
[10వ పేజీలోని చిత్రం]
అమెరికాలో, గర్భస్రావం చేయించుకొనుటకు ఎదురుచూసే స్త్రీలలో ఐదుగురిలో నలుగురు అవివాహితులే