గర్భస్రావ సందిగ్ధావస్థ—ఆరు కోట్ల మరణాలు దీనికి పరిష్కారమా?
కలతతో, భయంతో, కన్నీటితోనున్న 15 సంవత్సరాల బాలిక చికాకుగా వెళ్లిపోతున్న తన ప్రియుణ్ని గమనిస్తున్నది. గర్భం ధరించినందుకు ఆమెనతడు మూర్ఖురాలని అన్నాడు. వాళ్లిద్దరూ ప్రేమించుకున్నారని ఆమె అనుకుంది.
ఒక స్త్రీ తాను ఆరవ బిడ్డను కనబోతుందని తెలిసికొనడంతో ఆమె నిరుత్సాహంతో నిండిపోయింది. ఆమె భర్తకు ఉద్యోగం లేదు, ప్రతి రాత్రి తన పసిబిడ్డలందరూ ఆకలితో నిద్రపోవలసిందే. మరిక వారెలా మరొక బిడ్డను పోషించగలరు?
“ఇలాంటి క్లిష్టసమయంలో గర్భం రాకుండావుంటే బాగుండేది,” అని వినయంగా దుస్తులు ధరించిన ఒక స్త్రీ తన వైద్యునికి వివరిస్తున్నది. ఎలాగైతేనేం చివరికామె ఇంజనీరుగా డిగ్రీ సంపాదించుకొని, తన క్రొత్త ఉద్యోగాన్ని ప్రారంభించనైయుంది. తన భర్త న్యాయవాది వృత్తిలో పూర్తిగా లీనమైపోయాడు. ఇకపోతే ఆ బిడ్డకోసం వారికి సమయమెక్కడ దొరుకుతుంది?
వీరంతా వారి జీవనపద్ధతిలో బహు వ్యత్యాసాన్ని కలిగి, వేర్వేరు సందిగ్ధావస్థలను ఎదుర్కొంటారు, గాని వారు ఒకేవిధమైన పరిష్కారాన్ని ఎన్నుకుంటారు: అది గర్భస్రావమే.
ఈ దశాబ్దంలోని రాజకీయ, సామాజిక, వైద్య, మతపరమైన క్షేత్రాలలో ఉద్వేగపూరిత వాదనలను రగిలించే అత్యంత ప్రమాదకరమైన వివాదాల్లో గర్భస్రావం ఒకటి. అమెరికాలో, గర్భస్రావ వ్యతిరేకులు జన్మించని వారి హక్కులకొరకు పోరాడుతున్నారు. గర్భస్రావ అభిమానులు అనే గుంపు గర్భస్రావం చేయించుకోడానికి స్త్రీకిగల చట్టబద్దమైన స్వాతంత్ర్యం, ఆమెకున్న హక్కులకోసం వారితో ఏకీభవిస్తున్నారు. గర్భస్రావ వ్యతిరేకులు ఎన్నికలలోను, న్యాయస్థానాల్లోను, చర్చీలలోను, వీధులలో కూడ గర్భస్రావ అభిమానులను ఎదుర్కొంటున్నారు.
లక్షలాది ప్రజలు ఈ పోరాటంలో చిక్కుకుపోయి, రెండు పక్షాల ఆవేశరహిత వాదనలతో చితికిపోతున్నారు. ఎటూ నిర్ణయించుకోలేని వారిని ఊరడించుటకు “గర్భస్రావ వ్యతిరేకులు,” “గర్భస్రావ అభిమానులు” అనే ఈ రెండు పదాలు జాగ్రత్తగా ఎన్నుకోబడ్డాయి. స్వతంత్రాన్ని దేవతగా కొలిచే ఈ యుగంలో, యీ ఎంపికను అభిమానించని వారెవరుంటారు? అయితే మరి, జీవాన్ని అభిమానించని వారెవరుంటారు? ప్రమాదకరమైన, చట్టవిరుద్ధ గర్భస్రావాలను చేయించుకుని బాధించబడు స్త్రీల ప్రాణాలతో చలగాటమాడుటకు గర్భస్రావ అభిమానులంతా కోటు హేంగర్లను జుళిపిస్తున్నారు. గర్భస్రావ వ్యతిరేకులైన వారు, జన్మించకుండా లక్షలాదిగా చనిపోయినవారి జ్ఞాపకాలుగా బీకర్ల నిండా గర్భస్రావమైన పిండాలను సాక్ష్యంగా చూపిస్తున్నారు.
లారెన్స్ హెచ్. ట్రైబ్ ఎబార్షన్: ది క్లాష్ ఆఫ్ అబ్సల్యూట్స్ అను తన పుస్తకంలో ఈ మరణకరమైన విషాధగాథను చక్కగా వర్ణించాడు. “పిండము ఖచ్చితంగా ఒక మానవుడేనని గుర్తించేవారు, చాలామంది దానికి ఉన్నతమైనదిగా విలువనిచ్చి ఏడ్చేవారు, పిండాన్ని మోస్తున్న స్త్రీని, ఆమె దుస్థితిని బహిరంగంగా చూస్తారు. . . . గర్భం ధరించిన స్త్రీని, ఆమె శరీరాన్ని సులభంగా గుర్తించగలిగేవారు, ఆమె హక్కును కాపాడుకోవాలని గోలచేసే మరికొందరైతే, ఆ స్త్రీగర్భంలోవుండే పిండాన్ని సరిగా గుర్తించరు, దానిని అనుమతిస్తే జీవించగలిగే ప్రాణియని ఊహించరు.”
ఈ నైతికహక్కుల పోరాటం రగులుతుండగనే, ఈ సంవత్సరం గర్భస్రావం వల్ల 5నుండి 6కోట్లమంది జన్మించని శిశువులు హతులౌతారు.
ఈ భావావేశ వివాదంలో మీరు ఏ పక్షాన నిలుస్తారు? ఈ కీలక ప్రశ్నలకు మీరేవిధంగా సమాధానమిస్తారు: నిర్ణయం తీసుకోవడమనేది స్త్రీయొక్క ప్రాథమిక హక్కైయుందా? ఏ పరిస్థితుల్లోనైనా గర్భస్రావమనేది న్యాయసమ్మతమైనదేనా? జీవం ఎప్పుడు ఆరంభమౌతుంది? ఎన్నడూ అడగకపోయిననూ, చివరి ప్రశ్న యేమనగా: జీవానికి, గర్భధారణకు కారకుడైన సృష్టికర్త గర్భస్రావాన్ని ఎలా దృష్టిస్తాడు?
గర్భస్రావానికి చాలా చరిత్ర ఉంది. ప్రాచీన గ్రీసు, రోములో గర్భస్రావమనేది సామాన్యమైన ఆచరణగా ఉండేది. ఐరోపాలో మధ్యయుగంలోనూ అన్వేషణాయుగంలోనూ చలనం కల్గే వరకూ అనగా గర్భాశయంలో ప్రాణి కదులుతున్నట్లు తల్లి భావించేవరకూ ఇది అనుమతించినట్లుగా పరిగణించబడింది. లైంగిక విప్లవం వల్ల వచ్చిన ఫలితమే—లక్షలకొలదిగా అక్కర్లేని గర్భధారణలు.
పందొమ్మిది వందల అరవై దశాబ్దం స్త్రీసమాజోద్ధరణ పోరాటానికి నాంది పలికింది. దానికి పునరుత్పత్తి హక్కు అనేదే ఒక పునాదిరాయి. అత్యాచార బాధితులు లేదా వావి తప్పి వ్యభిచరించినవారు లేదా తల్లి ఆరోగ్యం ప్రమాదస్థితిలో నున్నప్పుడు ఆమె గర్భం ధరిస్తే, గర్భస్రావ హక్కులకోసం కొందరు నినాదాలు చేస్తారు. సంభవించే జనన లోపాలను గుర్తించడానికి, లింగనిర్ధారణ చేయడానికి వైద్య సాంకేతిక విజ్ఞానం వీలుకల్పించింది. వైద్యుల నిరాశాపూరిత రోగనిర్ధారణలపై ఆధారపడి గర్భాలు అంతమయ్యాయి. నలభై సంవత్సరాలు దాటిన స్త్రీలు తమ సంతానం అంగవైకల్యంతో జన్మించ వచ్చునని ఆదుర్దా పడవచ్చును.
పేదరికం సంతరించుకున్న దేశాల్లో, గర్భనిరోధక సదుపాయాలు ఉపయోగించుకోలేని స్త్రీలు అధిక సంతానాన్ని పోషించలేమని భావిస్తున్నారు. గర్భస్రావ అభిమానుల నిర్వచనాన్ని హద్దులవరకూ వ్యాపింపజేస్తూ గర్భం ధరించడానికి అది తగిన సమయంకాదని లేదా లింగనిర్ధారణ తర్వాత తమకు ఆ బిడ్డ వద్దనిచెప్పి, కొందరు స్త్రీలు పిండాన్ని గర్భస్రావం చేయించడానికి ఎన్నుకుంటున్నారు.
జీవం ఎప్పుడు ఆరంభమైందనే ప్రశ్నకు సంబంధించిన ఈ వివాదంలో చాలామంది కలహపూరిత వాదనలను వ్యక్తం చేశారు. ఫలధీకరణం చెందిన అండకణం జీవిస్తున్నదనే విషయాన్ని చాలాకొద్దిమందే అనుమానిస్తున్నారు. కాని ప్రశ్న ఏమంటే, ఎలా జీవిస్తున్నది? ఫలధీకరణ చెందిన అండం ఒక వట్టి కణజాలం వంటిదా? లేక అది ఒక మానవుడేనా? సింధూరపుగింజ ఒక వృక్షమా? అయితే, పిండమనేది ఒక వ్యక్తియైయున్నదా? దానికి పౌర హక్కులున్నవా? ఇలా పదాలను గూర్చిన వాదన అంతంలేనిది. ఒకే ఆసుపత్రిలో వైద్యులు పరిణతి చెందని శిశువు ప్రాణాన్ని కాపాడటానికి సాహసోపేతంగా పనిచేయవచ్చు, అయినా అదేవయస్సులోనున్న పిండంయొక్క ప్రాణాన్ని తీయడం ఎంత పరిహాసంగా వుంది! గర్భంలోనున్న బిడ్డను చంపడానికి చట్టం అనుమతివ్వొచ్చు, కాని గర్భం వెలుపలున్న బిడ్డ ప్రాణం తీస్తే అది హత్య.
గర్భస్రావాలు చట్టబద్ధం కావాలని, గర్భాన్ని ప్రథమస్థాయిలోనే నిరోధించే గర్భనిరోధక పద్ధతులు అమితంగా అందుబాటులోనున్న “స్వతంత్రులైన” స్త్రీజాతియే కోరుతుంది. నిజానికి వారు వారికున్న గర్భధారణ, పునరుత్పత్తి సామర్ధ్యాన్ని ఉపయోగిస్తూనే తాము పునరుత్పత్తి హక్కులని పిలిచే వాటివిషయంలోనే తీవ్రంగా వాదిస్తున్నారు. వాస్తవానికి వారు కోరేదేమంటే పునరుత్పత్తిని ఆపడమే. వారెలా సమర్ధిస్తున్నారో తెలుసా? “ఇది నా శరీరం!” అయితే, నిజంగా అది వారిదేనా?
ఎబార్షన్—ఎ సిటిజన్స్ గైడ్ టు ది ఇష్యూస్ వివరించేదేమంటే, గర్భం ధరించిన మొదటి 12 వారాలలో, “జిగటగానున్న స్థితిలో సూక్ష్మ పరిమాణంలోనున్న కణజాలాన్ని తొలగించడం చాలా సులభం.” “ఒక బిందురూపంలోనున్న కణజాలాన్ని తొలగించినట్లని” లేదా “గర్భధారణ ఫలాన్ని అంతమొందించినట్లని గర్భస్రావాన్ని న్యాయంగా చెప్పగలమా? లేదా ఈ తీయటి మాటలను సృష్టించింది, చేదుసత్యాలను మధురంగా తీర్చిదిద్ది, మనస్సాక్షితో కలత చెందినవారిని నమ్మించడానికా?
అక్కర్లేని ఆ కొద్ది కణజాలం, దాని స్వంత క్రోమోజోములతో సంపూర్ణమై, వృద్ధిచెందుచూ వర్ధిల్లుచున్నటువంటి ఒక జీవం. ఒక ప్రవచనార్ధక స్వీయచరిత్ర వలే, అది ఒక ప్రత్యేకమైన వ్యక్తి నిర్మాణాన్నిగూర్చిన వివరణా వృత్తాంతాన్ని చెబుతుంది. పిండోత్పత్తిశాస్త్ర పరిశోధనలో ప్రఖ్యాతిగాంచిన ప్రొఫెసర్ ఎ. డబ్ల్యు. లిలే ఈవిధంగా వివరిస్తున్నాడు: “జీవశాస్త్ర సంబంధంగా, ఏ దశలో కూడా పిండం తల్లియొక్క ఒక వట్టి ఉపాంగమనే భావనను మేము అంగీకరించలేము. జన్యుసంబంధంగా, తల్లి, శిశువు యిద్దరూ గర్భధారణ జరిగినప్పటినుండి వేర్వేరు వ్యక్తులై యున్నారు.”
బాధ్యతారహిత ప్రవర్తన
అయినప్పటికి, గర్భస్రావానికి సులభంగా చొరవ తీసుకుంటూ, చాలామంది అక్కర్లేని గర్భధారణను గూర్చి ప్రత్యేకమైన జాగ్రత్త తీసుకోనవసరం లేదని భావిస్తున్నారు. రాబోయే “ప్రమాదాలను” తప్పించుకొనడానికి వారు గర్భస్రావమనేది ఒక సురక్షిత పంజరంలా ఉపయోగించుటకు ఎన్నుకొంటున్నారు.
ఈ శతాబ్దంలో యౌవనావస్థ అనేది చాలా తక్కువ వయస్సులోనే సంభవిస్తున్నదని గణాంకాలు చూపిస్తున్నవి. కాబట్టి, లేత వయస్కులు కూడా పిల్లలను కనగలిగే సామర్ధ్యం కల్గియున్నారు. ఆ యాధిక్యతతోపాటుగా వచ్చే గంభీరమైన బాధ్యతగురించి వారు బోధింపబడ్డారా? అమెరికా దేశస్థులలో సరాసరి బాలురు లేదా బాలికలు వారి కన్యత్వాన్ని 16 సంవత్సరాల వయస్సులోనే కోల్పోతున్నారు, వారిలో ప్రతి ఐదుగురిలో ఒకరు 13 సంవత్సరాలు రాకుండానే తమ కన్యత్వాన్ని కోల్పోతున్నారు. మూడింట ఒకవంతు పురుషులు, స్త్రీలు ప్రేమకలాపాలు కల్గివున్నారు లేదా గతంలో ఆ విధంగా చేసివుంటారు. లైంగిక అవినీతిపరులే, గర్భస్రావానికి యిష్టమైన లబ్దిదారులు. ఇది చాలామట్టుకు ఇది ఎయిడ్స్ వ్యాప్తిని అరికట్టేందుకుగాను వ్యభిచారాన్ని చట్టబద్ధం చేయమని అప్పుడప్పుడు కోరినట్లుగానే ఉన్నది, గర్భస్రావాన్ని చట్టబద్ధం చేయడంద్వారా ఈ పద్ధతి వైద్యపరంగా ఏదోకొంచెం సురక్షితమైనదిగా చేయవచ్చుగాని, నైతికవ్యాధి వృద్ధిచెందగల్గుటకు, వృద్ధిచెందుటకు అనువైన వాతావరణాన్ని సృష్టించడానికి ఎంతో దోహదం చేసింది.
అత్యాచార బాధితులా లేదా పరిస్థితుల బాధితులా?
ఆశ్చర్యకరంగా, అధ్యయనాలు చూపినట్లుగా అత్యాచారంవల్ల గర్భధారణ రావడం చాలా అరుదు. అమెరికాలోని మినియాపొలిస్‌లో జరిగిన ఒక సర్వేలో 3,500 క్రమబద్ధ అత్యాచార అభియోగాల్లో ఏ ఒక్కరూ గర్భధారణ పొందిన అభియోగానికి గురికాలేదు. ఒకనాటి జెకొస్లావేకియాలోని 86,000 గర్భస్రావాలలో, కేవలం 22 మాత్రమే అత్యాచారానికి సంబంధించినవి. కాబట్టి, గర్భస్రావం కావాలనే వారిలో, కేవలం చాలా కొద్దిమంది మాత్రమే అత్యాచార కారణాల్నిబట్టి గర్భస్రావం చేయించుకుంటున్నారు.
తప్పింపసాధ్యంగాని జననలోపంతో భయంకరమైన వికృతరూపంగల శిశువులు జన్మిస్తారని ముందుగానే భయంకరంగా ఊహించి చెప్పినవాటి విషయమేమి? జననలోపముంటుందని మొదటిగా గుర్తించిన వెంటనే, కొందరు వైద్యులు గర్భస్రావం చేయించుకోమని ఉద్బోధిస్తారు. వ్యాధిని నిర్ధారించుటలో వారు పూర్తిగా నిశ్చయత కల్గియున్నారా? అలాంటి దారుణ ప్రవచనాలు సంభవించలేదని చాలామంది తలిదండ్రులు ధృవీకరించగలరు, అది నిరూపించుటకు వారికి ఆయురారోగ్యాలతోనున్న పిల్లలున్నారు. ఇతరులైతే అంగవికలులుగా గుర్తించిన పిల్లలతో ఆనందంగా గడిపే తలిదండ్రులుగా ఉన్నారు. నిజంగా, లోపాలు సంభవించే ప్రమాదముందని వారికి చెప్పినందువల్ల అమెరికాలో కేవలం ఒక శాతంమంది మాత్రమే గర్భస్రావానికి ఎదురుచూస్తున్నారు.
అయినప్పటికి, మీరు ఈ శీర్షిక చదివేంత సమయంలోనే, వందలాది జన్మించని శిశువులు చంపబడియుంటారు. అది ఎక్కడ జరుగుచున్నది? దీనిలో మునిగియున్న వారి జీవితాలు ఏవిధంగా ప్రభావం చెందాయి?
[4వ పేజీలోని చిత్రం]
తల్లి: “ఇది నా శరీరం!”
శిశువు: “లేదు! ఇది నా శరీరం!”