జీవము—విలువైందిగా పరిగణించవలసిన ఒక బహుమానం
యెహోవా దేవుడు మానవులకు పిల్లలను కల్గియుండే ఆధిక్యతను ప్రసాదించినపుడు, అది ఒక బహుమానమే కదా! ఒకరినొకరు ప్రేమించుకున్న సంతోషభరితులైన జంట ఒక అందమైన బిడ్డను తమ చేతుల్లోకి స్వీకరించి, తమ వివాహబంధం వల్ల ఏర్పడిన ఈ చిన్నారిని పెంచి పోషించడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ బిడ్డ జీవం వికసిస్తూండగా కేవలం ఆనందం మాత్రమే వెల్లివిరుస్తుంది.
కాని మానవజాతిలో పుట్టిన బిడ్డలకు ఆదాము, హవ్వలు చేసిన పాపం విషాద ఫలితాలను తీసుకువచ్చింది. పాప ఫలితంగా, మన మొట్టమొదటి తల్లి వ్యసనంతోను, శరీరసంబంధ బాధతోను పిల్లలను కనునట్లు శపించబడింది. ఆ పాపమయ వాతావరణంలోకి వచ్చిన వారి సంతానం, పిల్లలు కనడాన్ని ఒక మహత్తైన సవాలుగా చేసింది. కాబట్టి, ఈనాటి మిశ్రిత ప్రపంచంలో, గర్భధారణ తరచూ సంతోషంలేనిదై యున్నదనుటలో ఆశ్చర్యంలేదు. అయినను, జన్మించని శిశువు గురించి సృష్టికర్త దృక్పథమేమి? మారుతున్న నైతిక ధోరణులతోపాటు ఆయన దృక్పథం మారిపోయిందా? నిశ్చయంగా లేదు. ప్రపంచమందలి జన్మించని శిశువుల యెడల ఆయన దృక్పథము, శ్రద్ధ స్థిరంగానే వుంటాయి.
తల్లిగర్భంలోనే ఒక ప్రత్యేక మానవుడు వృద్ధియగుచున్నాడని లేఖనాలు వివరిస్తున్నాయి. గర్భధారణలోనే జీవమనేది ఆరంభమవుతుంది. లోకంలో జన్మించుట అనేది శిశువును కేవలం మానవునికి మాత్రమే బహిరంగం చేస్తుంది, అది దేవుడు ముందుగానే చూశాడు. “గర్భము చీల్చుకు వచ్చిన ప్రతి శిశువు” గూర్చి యెహెజ్కేలు మాట్లాడుతున్నాడు. (యెహెజ్కేలు 20:26 NW) “నా తల్లి గర్భద్వారము” అని వర్ణిస్తూ, అకాలసంభవమైన శిశువులను “వెలుగు చూడని బిడ్డలవలె” యోబు పిలుస్తున్నాడు.—యోబు 3:10, 16.
గర్భంలో పెరుగుతున్న సున్నితమైన జీవం యెడల యెహోవా దేవుని మృదువైన ఆదరణను గమనించండి. ఆయన యిర్మీయాకు యిలా చెప్పాడు: “గర్భములో నేను నిన్ను రూపింపక మునుపే నిన్నెరిగితిని, నీవు గర్భమునుండి బయలుపడక మునుపే నేను నిన్ను ప్రతిష్ఠించితిని.” (యిర్మీయా 1:5) దావీదు యిలా చెప్పాడు: “నేను రహస్యమందు పుట్టిననాడు భూమియొక్క అగాధస్థలములలో విచిత్రముగా నిర్మింపబడిననాడు, నాకు కలిగిన యెముకలును నీకు మరుగై యుండలేదు. నేను పిండమునై యుండగా నీ కన్నులు నన్ను చూచెను.” (కీర్తన 139:15, 16) “గర్భమున నన్ను పుట్టించినవాడు,” “గర్భములో మమ్ము రూపించినవాడు” అని యోబు దేవుని సంబోధిస్తున్నాడు.—యోబు 31:15.
కాని నిరుత్సాహంతో, కనుటకు ఎదురుచూస్తూ, బిడ్డను వద్దనుకొనే తల్లిని గూర్చి దేవుని శ్రద్ధ ఏమిటి? తలిదండ్రులుగా అందరియొక్క గంభీర బాధ్యతను సృష్టికర్త గుర్తిస్తాడు. ఒకవేళ కననైయున్న తల్లి, కష్టమైన పరిస్థితుల్లో కూడ దైవిక బాధ్యతల యెడల గౌరవంతో తన బిడ్డను కనడానికే నిర్ణయించుకుంటే, ఆయన ఆమె నిర్ణయాన్ని ఆశీర్వదించడా? మంచి బిడ్డను పెంచుటకై, తలిదండ్రులు ఆయన సహాయం కొరకు వెంటనే ప్రార్థించాలి. ఆయన వాక్యంలో పిల్లలను పెంచుటను గూర్చి దేవుడు శ్రేష్ఠమైన సలహా ఇచ్చియున్నాడు. కుటుంబ జీవితంలో బైబిలు సూత్రాలను పాటించడంద్వారా ఆశీర్వాదకరమైన ఫలితాలు ఫలిస్తాయి. దైవభక్తిగల పిల్లలను పెంచుటలో వచ్చే ఆనందం, దీవెనలు త్యాగాలన్నిటికంటే ఎక్కువ ప్రాధాన్యత గల్గివుంటాయని సగర్వంగా పెంచే ఏ తలిదండ్రులైనా రుజువు చేయవచ్చును.
ఒకవేళ ఆ శిశువు అత్యాచారం లేదా వావి తప్పిన వారితో వ్యభిచారం చేయడం వల్ల పుట్టినట్లైతే, విషయాలను యెహోవా వేరేవిధంగా దృష్టిస్తాడా? తల్లికి జరిగినది నేరమే అయినప్పటికి, నిందించవలసింది బిడ్డను కాదు. దాని ప్రాణం తీసివేయడమనేది కేవలం ఒక దౌర్జన్యకాండను మరొక దౌర్జన్యంతో ఎదిరించినట్లవుతుంది. అలాంటి బాధితులు అనుభవించే మానసిక వ్యథను యెహోవా నిజంగా గుర్తిస్తూ, తర్వాతి పరిణామాన్ని సమతూకమైన పద్ధతిలో తల్లి, బిడ్డ ఎదుర్కొనేటట్లు సహాయం చేయగలడు.
గర్భిణీ స్త్రీతో ఆమె తన బిడ్డను పూర్తికాలం మోయడం తన జీవితం అపాయంలో ముంచగలదని ఒకవేళ వైద్యుడు తెలియజేసినట్లైతే అప్పుడేమిటి? డా. ఆలెన్ గట్‌మాకర్ యిలా వివరించాడు: “ఒకవేళ ఆమె క్యాన్సరు లేదా లుకేమియా వంటి గర్భకోశ సంబంధిత వ్యాధితో బాధపడుతుంటే తప్ప, ఈనాడు దాదాపు గర్భంతోనున్న వారినెవరినైనా జీవంతో కాపాడటం సులభం, ఒకవేళ అలాంటి వ్యాధే వున్నట్లైతే, గర్భస్రావం కూడ సాధారణంగా జీవితాన్ని పొడిగించలేదు, జీవితాన్ని కాపాడలేదు.” ది ఎన్‌సైక్లోపీడియా అమెరికానా యిలా వివరిస్తున్నది: “గర్భం ధరించిన చాలామంది స్త్రీలను గంభీరమైన వైద్య సమస్యలున్నప్పటికి క్షేమంగా కాపాడవచ్చు గనుక, తల్లి ఆరోగ్యం సంరక్షించడానికి కొన్ని గర్భస్రావాలు మాత్రమే చేయవలసిన అగత్యత ఉంటుంది. చాలా గర్భస్రావాలు శిశువు పుట్టకుండా ఉండటానికి చేస్తున్నవే.” కాబట్టి అలాంటి పరిస్థితులు చాలా అరుదు. అయినప్పటికి, అలాంటి పరిస్థితి కాన్పు సమయంలో సంభవించితే, అప్పుడు తల్లి జీవితం కావాలా, బిడ్డ జీవితం కావాలా అనేది తలిదండ్రులే ఎన్నుకోవాలి. అది వారి నిర్ణయమే.
మనకున్నటువంటి పిల్లలనుకనే శక్తులను ఉపయోగించుటలో సృష్టికర్త సవివరమైన మార్గదర్శకాలను పెట్టాడంటే ఆశ్చర్యపడాలా? ఆయన దృష్టిలో, జీవాన్ని తీసివేయడం ఎలాగైతే పాపమో, అలాగే సంరక్షించడానికి ఉద్దేశించని జీవాన్ని ఇవ్వడం కూడా పాపమే.
గర్భస్రావమనేది తప్పా లేక ఒప్పా అనే వాదము ఈ వ్యవస్థ అంతమయ్యే వరకూ కొనసాగుతుంది. కాని జీవాన్ని సృష్టించిన యెహోవా దేవునికి, ఆయన సూత్రాలను హత్తుకొనేవారికి ఏ విధమైన వాదమూ లేదు. జీవమనేది విలువైనది—అది దాని ఆరంభంనుండి కూడ పోషించి, విలువైందిగా పరిగణించదగినది. (g93 5/22)
[11వ పేజీలోని బాక్సు]
దేవుని పద్ధతి ప్రకారం గర్భస్రావాన్ని దృష్టించుట
వివాహబంధం లేకుండా, తల్లిపాత్రను నిర్వహించడానికి పూర్తిగా సిద్ధపడకుండా గర్భం ధరించిన యౌవన బాలిక విషయమేమి? లోకంలోకి ఒక శిశువును తీసుకురావడానికి ఆమెను అనుమతించాలా? కేవలం దాని తల్లి అనైతికంగా, తెలివితక్కువతనంగా ప్రవర్తించిందని ఆ బాలికకు పుట్టే శిశువు విషయంలో దేవుని భావాలు మారిపోలేదు. శిశువు పుట్టుక మూలంగా ఒకవేళ నిజంగా దాని తల్లి తన అనైతికతవల్ల సహజంగావచ్చే ఫలితాలను గుర్తింపజేయవచ్చును, తద్వారా దేవుని నియమాలలో ఉన్న జ్ఞానం ఆమెపై ప్రభావంచూపుటకు సహాయపడవచ్చును. ఆమె తన అక్రమ లైంగికచర్య యొక్క సాక్ష్యాధారం లేకుండా చేయడమనేది పాపంచేశాననే బాధను ఆమెకు కలుగజేయవచ్చు, లేదా అది యింకా తాను అనైతిక క్రియలు చేయడానికి ఆమెను ప్రోత్సహించవచ్చును.
ఒకవేళ భారాన్ని పంచుకోడానికి తండ్రి లేనట్లైతే, బిడ్డను పెంచడం సులభంకాదు. కాని మన పరలోకపు తండ్రితో గల దృఢమైన సంబంధమనేది తల్లికి నైతిక, మానసిక బలాన్ని, ఆధారాన్ని, బిడ్డను పెంచడానికి మార్గాన్ని దయచేయగలదు. తల్లి భారాన్ని సౌలభ్యం చేయడానికి ఆయన క్రైస్తవ సంఘాన్ని కూడా దయచేశాడు.