జగత్తును మలచిన జిహ్వరుచి
ఇండియానుండి అవేక్! ప్రతినిధి ద్వారా
పదమూడవ శతాబ్దంలో మార్కో పోలో వాటిని సమృద్ధిగా చూశాడు. వాటిని కనుగొందామని క్రిస్టఫర్ కొలంబస్ సముద్ర ప్రయాణం చేశాడు, అయితే వాటికి బదులు ఒక నూతన లోకాన్ని కనిపెట్టాడు. చివరికి 15వ శతాబ్దంలో, వాస్కో డి గామా సముద్రం ద్వారా భారతావనిని చేరి, వాటిని తీసుకొని తిరిగి ఐరోపాలో కుతూహలంచూపిన కొనుగోలుదారులకు వాటినందించాడు. వాస్తవానికి, జనులు మసాలాదినుసులకు ఎంత విలువిచ్చేవారంటే, వారు వాటిని పొందడానికి తమ ప్రాణాలను సహితం అర్పించేవారు!
రాజకీయ మార్పులవలన వర్తకానికి నేలమీది రవాణా మార్గాలను మూసివేసినప్పుడు, వాస్కో డి గామా పోర్చుగల్‌నుండి ఆఫ్రికాను చుట్టి, భారతావనికి, అంటే 39,000 కిలోమీటర్ల చుట్టి సముద్రయానం చేయడానికి రెండు సంవత్సరాలు తీసుకున్నాడు. అతని రెండు ఓడలు సురక్షితంగా ప్రయాణించి, మొత్తం ప్రయాణం ఖర్చు కంటే 60 రెట్లు ఖరీదైన మసాలా దినుసులను, మరితర సరకును తీసుకొని తిరిగి వెళ్లినవి. అయితే అతని సముద్రయాన విజయం ఐరోపా దేశాలను పోరాటాల్లో ముంచెత్తింది. తర్వాతి మూడు శతాబ్దాలలో, పోర్చుగల్, స్పెయిన్, ఫ్రాన్స్, హాలాండ్, గ్రేట్ బ్రిటన్‌లు మసాలాదినుసుల అధీనానికై పోటీపడ్డాయి.
ఒక రచయిత క్లుప్తీకరించినట్లు, మసాలాదినుసుల చరిత్ర “సాహసం, అన్వేషణ, జయము, నావిక పోరాటాల భయముల కథయే.” ది బుక్ ఆఫ్ స్పైసెస్ అనే పుస్తకంలో ఫ్రెడ్రిక్ రోసెన్‌గార్‌టెన్ జూనియర్ ఇలా అన్నారు: “ఆర్థికంగాను రాజకీయంగా, ఈ దినుసులెంత ఆవశ్యకం ఉపయుక్తమైనవంటే, రాజులు వాటి అన్వేషణలో సాహస ప్రయాణాల్ని ఏర్పాటు చేసేవారు. వర్తకులు వారి వ్యాపారంలో తమ ధనప్రాణాలను ధారపోసేవారు, వాటికై యుద్ధాలు జరిగేవి, పూర్తి జనాబా దాని ఉరిలోపడింది, ప్రపంచమే అన్వేషించబడింది, మరి అట్టి అవిశ్రాంత, జాలిలేని పోటీలవలన పునరుద్ధరణవంటి సుదీర్ఘ మార్పులు తేబడినవి.”
మసాలాదినుసుల వ్యాపారం డచ్‌వారి అధీనంలోవున్న సమయంలో, బ్రిటన్‌కు మిరియాలను అమ్ముతూ వాటి ధరను పౌండుకు ఐయిదు షిల్లింగులు పెంచారు. అందుకు లండన్ వర్తకులు అగ్గిమీద గుగ్గిలమై, 1599లో వారొక కూటమిగా ఏర్పడి, తమ స్వంత వ్యాపార కంపెనీని స్థాపించుకున్నారు, అదే ఆ తర్వాత ఈస్ట్ ఇండియాకంపెనీగా తయారైంది. చివరికి కంపెనీ ప్రభావం వల్లనే, భారతావనిని బ్రిటీష్ పరిపాలన 300 సంవత్సరాలకంటే ఎక్కువగా పాలించింది.
భీకర పోరాటం అంతమొందినప్పటికీ, ప్రపంచవ్యాప్తంగా మసాలాదినుసుల మీది వ్యామోహం మాత్రం కొనసాగుతూనేవుంది. మరి బహుశ ఇక్కడ, భారతావనిలో అనుభవించినంతగా మరే దేశంలోకూడా ఈ మసాలాదినుసుల రుచి అనుభవించ లేదేమో!
దినుసులమీది మోజు
మసాలాదినుసులు, భారతీయ వంటకాలు ఎంతగా మిళితమయ్యాయంటే, కొందరు ఈ దేశానికే మసాలాదినుసుల మీద మోజుందని అనవచ్చును. రుచికరమైన మసాలాదినుసులతో కలిపి ఘమఘమలాడునట్లు వండే కూరగాయలు, గ్రుడ్లు, మాంసం, చేపలు, లేక కోడి మాంసం కూరల వంటి భారతీయ వంటలగురించి నిజానికి ఇంతవరకూ విననిదెవరు? “దినుసు” అంటే “మిరియాల కారం” కాదనడానికి, వాటి రుచులు తీపి వస్తువులలో సహితం కనబడతాయి. తియ్యని పాల టీ కూడా కొద్దిగా ఏలక్కాయ, లవంగ, అల్లం, లేక సుగంధ మసాలాదినుసుల మిళితం చేసి దాని రుచిని పెంచుతారు. అటువంటి మసాలా దినుసుల రుచిమరిగిన భారతదేశం వాటిని వినియోగించుటలో మొదటిస్థానం వహిస్తుందనడంలో ఆశ్చర్యంలేదు?
భారత దేశ వంటగదిని ఒకసారి సందర్శించండి, వెంటనే డజన్లకొలదిగావున్న వాటి వివిధ రంగులు, హంగులలోని మసాలాదినుసులపై మీ కనుదృష్టి పడుతుంది. చిన్నచిన్న ఆవాలు; సువాసనతోకూడిన గోధుమ రంగుతోవున్న దాల్చిన చెక్కలు; అల్లంముక్కలు; ఎర్రని మిరపకాయలు వాటిలో వుంటాయి. ఇన్ని రకాలుకలిసిన మొత్తానికి భిన్నంగా, అనేక దేశాలలోని కిరాణా కొట్లలో ఒక సీసాడు మసాల పొడి దొరుకుతుంది. ఈ మసాల పొడిలో అనేక రకాల మసాలాదినుసులున్నాయి, మరి అది ఉపయోగకరమైనదే గానీ, భారతదేశంలో ఉపయోగించే మసాలాదినుసుల కూడికకు అది ఏమాత్రం సరితూగదు.
ప్రత్యేకమైన రెడీమేడ్ మసాల మిశ్రమాలు, వేరు వేరు ఆహారాలకు, కాయగూరలు, చేపలు, కోడి, మరితర మాంసాలకు సహితం తయారు చేయబడివుంటాయి. అయితే తరచూ వంటకాన్ని బట్టి వండే సమయంలోనే వేర్వేరు వంటలకు మసాలాదినుసులు కలుపుతారు. వండేటప్పుడు ఒకొక్క దినుసు ఎప్పుడు ఎంత వేయాలన్నది ఒక నిపుణురాలైన భారతీయ గృహిణికి తెలుసు. వేయించడం, నూరడం, మొత్తాన్ని కాగే నూనెలో వేయడం, లేక ఇతర మసాలాతోకలిపి ఒకే మసాలాదినుసునుండి ఆమె రకరకాల రుచులను తెప్పించగలదు.
ఆహారాల తయారీలోని భిన్నత్వాన్ని చూసి భారతదేశాన్ని సందర్శించే సందర్శకులనేకులు సహజంగా ఆశ్చర్యపోతుంటారు. ఉత్తర, దక్షిణ భారతదేశ వంటకాలనే ప్రముఖ విభాగాలున్నా, బెంగాలీ, గోవానీయులు, గుజరాతీ, పంజాబీవంటి ప్రాంతాలకు తమదైన ఒక ప్రత్యేక వంట తయారీలున్నాయి. కాబట్టి, గుజరాత్ రాష్ట్రంలో ఒకతను పారంపర్య హిందు శాకాహార భోజనం చేయవచ్చు, అయితే ఉత్తర భారతంలో ముస్లింల విజయ చిహ్నంగా మిగిలిన మొగల్ భోజనాన్ని ఆస్వాదివచ్చు. కాబట్టి హిందు, ముస్లిం, సిఖ్, జైయిన్, పార్సి, క్రైస్తవ కుటుంబాలలో భోజనం చేసినా, భోజనంలో మాత్రం ఎక్కడా ఒకే విధానం కనబడదు.
మసాలాదినుసులకు సరైన స్థానం
ప్రపంచవ్యాప్తంగా మసాలాదినుసులు పండించబడుతున్నా, మరే ఇతర దేశంకన్నా అధికంగా, భారత దేశం 60 రకాల మసాలాదినుసులు పండిస్తోంది. మరి అది మసాలాదినుసులనూ, మసాలాదినుసులతో చేయబడిన వస్తువులను లేక పొడిని 160 దేశాలకంటే ఎక్కువ దేశాలకు ఎగుమతి చేస్తోంది. మసాలాదినుసుల ఉత్పత్తిలో దక్షిణ భారతదేశం అగ్రగామి. అందానికి, అనేక జలధారలకు ప్రసిద్ధి చెందినందున తరచూ “వెన్నీస్ ఆఫ్ ద ఈస్ట్” అని పేరుగాంచిన అరేబియా సముద్రతీరాన ఉన్న కొచ్చిన్, మలబార్ తీరానవున్న ఉష్ణమండల వాతావరణంలోని జలాలలో అనాదిగా సమృద్ధిగా పెరిగిన మసాలాదినుసులకు మంచి ఆధారాన్నిస్తోంది.
ఫోనీసీయులకు, ఐగుప్తీయులకు, పర్షియనులకు, చైనా, గ్రీకు, రోమీయులకు, అరబ్ దేశస్థులకు కొచ్చిన్ ఓడరేవు అనాదికాలంనుండే ఒక అంతర్జాతీయ వ్యాపారస్థానంగా పనిచేసింది. ఆసక్తికరంగా బైబిల్ పుస్తకమగు ప్రకటన, “లోకంలోని వర్తకుల” వ్యాపారంలో, “ప్రతి విధమైన దంతపు వస్తువులను, . . . భారతీయ మసాలాదినుసులు (దాల్చినచక్క)” ఉన్నట్లు తెలుపుతోంది—ప్రకటన 18:11-13.
“మసాలాదినుసులలో రాజు” అని ప్రఖ్యాతినొందిన మిరియాలు, వర్తకుల ప్రప్రథమ ఎంపికైవుండేది. అది ఆహారాన్ని రుచికరం చేయడమేగాకుండా, త్వరగా పాడైపోయే ఆహార పదార్థాలను నిలువచేయడాని వాడే ముఖ్యమైన దినుసు కూడా. రెఫ్రిజరేషన్ లేకుండా పాడైపోయే ఆహార పదార్థాలు, మసాలాదినుసులు వేయడంవలన ఒక సంవత్సరం పాటు లేదా అంతకంటే ఎక్కువకాలం నిలువ చేయవచ్చును. తర్వాత వచ్చిన వర్తకులు మిరియాలు యాలకులతోపాటు దనియాలు, సోపుగింజలు, మెంతుల వంటి ఇతర దినుసులెన్నెన్నో కొనడానికిష్టపడ్డారు.
భారత దేశంలో పండే అన్ని మసాలాదినుసులు ఇక్కడే పెరిగినవి కావు. ఉదాహరణకు ఎర్రని మిరపకాయలు దక్షిణమెరికానుండి ప్రవేశపెట్టబడ్డాయి. భారతీయ భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతి గ్రహీత, డా. సి. వి. రామన్ ఒకనాడు ఇలా అన్నాడు: “కారంలేకుండా ప్రతి ఆహారమూ రుచిలేనిది, తినలేనిది.” వేరే ఆహార అలవాట్లతో ఎదిగిన అనేకులు దీనితో ఏకీభవించకపోవచ్చు. అయితే బలమైన వివిధ రుచులను తీర్చేలా మన ప్రేమగల సృష్టికర్త, ఈ భూగృహాన్ని ఇటువంటి అనేక రకాల మసాలాదినుసులతో సమృద్ధిగా నింపాడు.
కేవలం ఆహార రుచికారకాలే కావు
మసాలాదినుసులకు అద్భుతమైన చరిత్రవుంది. అభిషేక తైలం, నూనె, ధూపం, సుగంధ పరిమళ ద్రవ్యాలలో మసాలాదినుసుల పాత్రను బైబిలు తెలుపుతోంది. యెరూషలేములోని యెహోవా ఆలయంలో వేసే ధూపంలో మసాలాదినుసులను, పవిత్ర అభిషేక తైలంలో వాటి వాడుకను గూర్చియు, ద్రాక్షారసంలో మసాలాదినుసుల ప్రయోగాలగురించి బైబిలు తెలుపుతోంది. (నిర్గమకాండము 30:23-25, 34-37; పరమగీతము 8:2) ఇంకా, యేసు శరీరాన్ని సమాధిచేయడానికి తయారుచేసేప్పుడు మొదటి శతాబ్ద క్రైస్తవులు, సుగంధ ద్రవ్యములను వాడారని బైబిలు వెల్లడి చేస్తోంది.—యోహాను 19:39, 40.
ఈ దేశంలో అల్లం జాతిమొక్కకు చెందిన బంగారు వర్ణంగల పసుపుకొమ్ములను తరతరాల భారతీయ యువతులు వాడుతున్నారు. చర్మ తత్వం మెరుగుపరచడానికి పసుపును శరీరానికి పూసుకుంటారు. ఈనాడు, సుగంధద్రవ్యాల, కాస్మెటిక్స్ కర్మాగారాలు ఆల్‌స్పైస్, కారవేగింజలు, దాల్చిన చెక్క, మైలుతుత్తము, లవంగ, జాజికాయ, జాపత్రి, రోస్‌మేరీ, యాలకులనుండి తీసిన తైలాలను అవిరైపోయే నూనె తయారీలో, మైమరపించే డజన్ల కొలది సుగంధద్రవ్యాలను చేసే ఆవిరికాని నూనె తయారీలో వాటినన్నింటిని మిళితంచేస్తారు. సబ్బులు, పౌడర్లు, ఆఫ్‌టర్ షేవ్ లోషన్, కలోన్, మౌత్ ఫ్రెష్‌నర్స్, లెక్కలేనన్ని ఇతర వస్తువులలో ఈ పదార్థాలు ఉపయోగించబడుతున్నాయి.
అంతే కాకుండా వైద్యపరంగాకూడా ఈ మసాలాదినుసులు అనాదిగా ఉపయోగించబడుతున్నవి. అల్లం, పసుపు, వెల్లుల్లి, యాలకులు, మిరప, లవంగ, కుంకుమపువ్వు వంటి మసాలాదినుసులలో కొన్ని హిందీ, సంస్కృత భాషల్లో వ్రాసిన వేదాలలోని ప్రఖ్యాత ఆయుర్వేద వైద్య శాస్త్రంలో సిఫారసు చేయబడినవి. భారతంలోని ఒక సందర్శకుడు ఒక మందుల కొట్లోకి వెళితే, తెగిన గాయాలలకు, కాలినందుకు పూయడానికి పసుపు మిశ్రమాన్ని, 13 దినుసులతో చేయబడిన టాత్‌పేస్ట్, రకరకాల రోగాలకు ఇరవై ఇతర దినుసులతో తయారుచేసిన మందులు కనబడతాయి.
కాబట్టి, మసాలాదినుసుల చరిత్ర పునఃపరిశీలనవలన, అవి లేకుండా ఆహార రుచులు వేరుగావుండేవని, మందులు మరొకలావుండేవని, చరిత్ర మరోలా వృద్ధిచెందివుండేదని సూచిస్తోంది. మసాలాదినుసుల కోరిక మన ప్రపంచాన్ని నిజంగా అనేక విధాలుగా మలచింది. (g93 2/22)
[25వ పేజీలోని చిత్రాలు]
భూవ్యాప్తంగా మన్నననొందిన ఎన్నో మసాలాదినుసుల చిన్న నమూనా
కొనుగోలుదారునికి మసాలాలను తూచి ఇచ్చే వీధి అమ్మకందారు
కొచ్చిన్ కొట్లో విక్రయానికి సిద్ధంగావున్న మసాలాదినుసులు