ప్రాచీనకాల సాంకేతికశాస్త్రం—ఆధునికకాల ఆశ్చర్యం
“భూమిపైన అత్యంత వేడిగల, నిలువవీలుకాని ప్రాంతంలోని ఆ పట్టణం (టుర్ఫాన్), ఎడారిలోని పచ్చని ఒయాసిస్లావుంది. రెండువేలసంవత్సరాల సాంకేతిక పరిజ్ఞానానికి జోహార్లు,” అని ది గ్లోబ్ అండ్ మెయిల్ ఆఫ్ టొరొంటో, కెనడా నివేదించింది.
టుర్ఫాన్ చైనాలో అత్యంత ఉష్ణోగ్రతగల పట్టణంగానే కాకుండా, అసలు ప్రపంచంలోనే అత్యంత వేడిగల ప్రాంతంగాకూడా పేరుగాంచింది. టక్లా మాకన్ ప్రాంతంలో భాగమైన ఈ టుర్ఫాన్ పల్లపు ప్రదేశపు ఉత్తరంచున, 1,80,000 మంది జనాబా నివసిస్తున్నారు. వర్షపాతం అన్నదే లేదు, విపరీతమైన వేడి వలన కొద్దిగా కురిసే వర్షం కూడా భూమికి చేరేలోపే ఆవిరైపోతుంది. సహజంగా వేసవి నెలల్లో, ఆ ప్రాంతపు ఉష్ణోగ్రత నీడలోనే 54 డిగ్రీల సెంటీగ్రేడుకు చేరుతుంది.
అయినప్పటికీ, టుర్ఫాన్ చుట్టూ 8,000 ఎకరాల ప్రాంతమంతా చెట్లు, పొందలతో నిండివుంది. దాని చుట్టు సుడి గాలిలా హోరెత్తే ఇసుక తిన్నెల ఈదురు గాలులువీచినప్పుడు దానిలో నివసించేవారిని ఇవే కాపాడుతాయి. బంగళాలను, మెత్తని సారవంతమైన పొలాలను పూర్తిగా ఇసుకతో ముంచెత్తే యీ ఈదురు గాలులు టాక్లా మాకన్ ఎడారిలో ప్రారంభమౌతాయి. అలా చెట్లు, పొదలు యీ ఎడారి పట్టణాన్ని ఎడారిలోని విపత్కర శక్తులనుండి కాపాడతాయి.
ప్రచండమైన ఈదురు గాలుల ప్రతికూల వాతావరణం, కాల్చేసే ఉష్ణోగ్రతలున్నప్పటికీ, టుర్ఫాన్ వ్యవసాయానికి కేంద్రంగా వర్ధిల్లుతోంది. చైనాలో పండే సన్నని పొడవైన పీచుగల ప్రత్తి మాట అటుంచి, ఈ ప్రాంతం ప్రత్యేకమైన ఆహారాన్ని అంటే ఎడారి ఈతపండ్లు, ద్రాక్షలు, కరబుజ, దానిమ్మ, అత్తిపండ్లు, జల్దరుపండ్లు, ఆపిల్పండ్లు, వంగ మొక్క, ఉల్లి, గోధుమ మరి ఇతర విత్తనాలను ఉత్పత్తిచేసే పలు వస్తువులుగల సూపర్మార్కెట్వంటిది. జ్ఞాపకం తెచ్చుకోగలిగినంత వరకు, టుర్ఫాన్, వ్యావసాయిక ఉత్పత్తులలోని నాణ్యతకు, రకాలకు పేరుగాంచింది. సారవంతమైన ఒయాసిస్లో అది వేల సంవత్సరాలుగా ప్రవృద్ధినొందుతున్న ఒక సమాజం.
ప్రతికూల పరిస్థితులలో సహితం అంతటి మహోన్నత విజయ ఘట్టాన్ని మోస్తున్న ఆ 2,000 సంవత్సరాల నాటి సాంకేతిక శాస్త్రమేమిటి? “మానవునికి అత్యంత గౌరవప్రద, చిరకాలం నిలిచే యాంత్రిక పనులైన పురాతన నీటి పారుదలా విధానానికి” ఈ పట్టణం అచ్చివుంటుందని ది గ్లోబ్ అండ్ మెయిల్ పేర్కొంటోంది. ఆ పత్రిక ఇంకా ఇలా అంటోంది: “[టుర్న్] సజీవంగా వుండడానికిగల రహస్యం, వాయవ్యంగా 80 కిలోమీటర్ల [50 మైళ్లు] దూరంలో మంచుతో కప్పబడిన టైయన్ షాన్ పర్వతాలనుండి నీటిని తీసుకువచ్చేటటు వంటిది, ప్రాంతీయ వీగుర్ భాషలో కారెట్జ్ అనబడే నమ్మశక్యంకాని వ్యవసాయ నీటి భూగర్భ గొట్టాల, బావుల క్లిష్టమైన అమరికే.” పెద్ద నీటి పారుదల విధానమైన ఈ వందలకొలది గొట్టాల ద్వారా నీటిని రప్పించకపోయివుంటే ఆ నీరు ఈ ఊరు చేరకముందే ఆవిరైవుండేది.
వీగుర్ ప్రాంతీయులు వారి వ్యవసాయ నీటి పారుదలా విధానాన్ని వృద్ధిపరచకముందు, పురాతన పర్షియా దేశీయులు ఇలాంటి చిక్కు విధానాన్నే ఉపయోగించేవారు. “పర్వతాల క్రిందికి కొన్ని వందల అడుగుల లోతునకును, 12 మైళ్ల (19 కిలోమీటర్ల) వరకు పొడవున్న గొట్టాలను లేక కానాట్స్ తవ్వడంద్వారా పర్షియావారు భూగర్భ నీటి సదుపాయాన్ని వృద్ధిచేశారు,” అని ఎన్సైక్లోపీడియా బ్రిటానికా అంటోంది. వాస్తవానికి, అది భూమిపైనే అత్యంత వేడిగా, ఎండుగావున్న ప్రాంతంలో కూడా ఒయాసిస్ని కలిగివున్నందుకు ఆధునిక కాలాలలో సహితం ఈ ప్రాచీన సాంకేతిక నైపుణ్యం ఆశ్చర్యకారకమైంది.
పాతక్రొత్తల సాంకేతిక పరిజ్ఞానం ఎడారులను అందమైన ఉద్యాన వనాలుగా మార్చగలిగినప్పుడు, మానవ జాతికంతటికి ఆహ్లాదకరంగా, యెహోవా తన రాజ్యం ద్వారా త్వరలో భూమిలోని అన్ని ఎడారుల్లోను పుష్పింపజేస్తాడు. “అరణ్యమును ఎండిన భూమియు సంతోషించును అడవి ఉల్లసించి కస్తూరిపుష్పమువలె పూయును. అది బహుగా పూయుచు ఉల్లసించును. ఉల్లసించి సంగీతములు పాడును. లెబానోను సౌందర్యము దానికి కలుగును. కర్మెలు షారోనులకున్న సొగసు దానికుండును. అవి యెహోవా మహిమను మన దేవుని తేజస్సును చూచును” అని యెహోవా ప్రవక్త అంటున్నాడు.—యెషయా 35:1, 2. (g93 2/22)