నేను బరువు తగ్గానంటే, ఎవరైనా తగ్గవచ్చు!
మీ స్నానాల గదిలోని బరువు చూపే యంత్రాన్ని మీరు ద్వేషిస్తున్నారా? నేను ద్వేషించాను. గడచిన సంవత్సరం యంత్రంలోని ముల్లు ఇంకోక్రొత్త ఎత్తుకు—ఇంచుమించు 110 కిలోగ్రాములు పెరగడం చూసి విసుక్కోవడం నాకు జ్ఞాపకముంది. నాలోనేను ఇలా అనుకున్నాను, ‘నేను ప్రపంచ హెవీవెయిట్ బాక్సింగ్ ఛాంపియన్‌కన్నా, చాలామంది అమెరికా ప్రొఫెషనల్ ఫుట్‌బాల్ ఆటగాళ్లకన్నా ఎక్కువ బరువున్నాను. ఇది పరిహాసాస్పదంకన్నా ఎక్కువైందే. ఇది అపాయకరంగా తయారౌతోంది!’
బహుశా మీకు నాలాంటి వాళ్లు తెలిసియుండ వచ్చు—ఆఫీసులో పనిచేసే నడివయస్కుడైన పురుషుడు, యౌవనంలో వున్నప్పుడు చురుకుగా ఉన్నా ఇప్పుడు మాత్రం అతడు, వార్తాపత్రికను క్రమంగా చదవలేనపుడు, ఒక క్రమం లేకుండా వ్యాయామం చేస్తుంటాడు. రక్తపోటు ఎక్కువ, సెరం కొలెస్ట్రాల్ కొంత ఎక్కువ, 20 కిలోల అదనపు బరువు, ఇవన్నీ ఉన్ననూ ఇంకనూ సమస్య అంత గంభీరమైనది కాదని విశ్వసిస్తున్నాను.
అయితే, సమస్య గంభీరంగానే ఉంది. ప్రతిరోజు నాలాంటి వాళ్లు గుండెపోటువల్ల చనిపోతున్నారు—చాలా మందికి గుండెపోటు వస్తుంది. ప్రతి అదనపు కిలోగ్రాంవల్ల వచ్చే అపాయాల గురించిన వివరాలను నేను సూచించగలను, కాని సమస్య వివరాలది కాదు. నిర్మొహమాటంగా చెప్పాలంటే, సమస్య, విధవరాండ్లు మరియు అనాధలదే. నా ఇద్దరు చిన్న కూతుర్లవలె, తండ్రి లేకుండా పెరిగిపెద్దయ్యే పిల్లలదే సమస్య.
నాన్నలారా, దీన్ని గురించి ఆలోచించండి.
బరువు తగ్గించుకోవాలని నేను తీర్మానించుకున్న తరువాత, మే 22, 1989 నాటి అవేక్! సంచికలోని “ఈజ్ లూజింగ్ వెయిట్ ఏ లూజింగ్ బ్యాటిల్?”—ముఖ్యంగా కండలు కరిగించుకొనుటకు సలుపు సమరాన్ని గూర్చి “ఫోర్ వేస్ టు విన్” నందున్న శ్రేష్ఠమైన సమాచారాన్ని జ్ఞాపకం చేసుకున్నాను. సూచించబడిన నాలుగు మార్గాలేవంటే: (1) సరైన ఆహారాన్ని, (2) సరైన వేళకు, (3) తగిన మోతాదులో, (4) సరైన వ్యాయామంతో తీసుకోవాలి.
ఆ సూత్రాలు పనిచేస్తాయి! వాటిని పాటించుట ద్వారా నేను 30 కిలోల బరువు తగ్గాను, మీరు కూడా బరువు తగ్గవచ్చు. ఈ ప్రక్రియలో, నేను కొన్ని విషయాలు నేర్చుకున్నాను అవి మీకు సహాయకరంగా ఉండవచ్చు.
బరువుతగ్గడం మీ ఆలోచనా విధానంతో మొదలౌతుంది
అధిక బరువున్న మనలో చాలామందికి ఆ బరువు, చాలామట్టుకు 30వ దశకంలో మొదలై, సంవత్సరానికి కొన్ని కిలోల చొప్పున్న నిదానంగా పెరిగింది. అప్పుడప్పుడూ, ఆహారనియమాలు పాటించి కొన్ని కిలోలు తగ్గించుకుంటాం, కాని తగ్గించుకున్న దానికంటె ఎక్కువే తిరిగిపొందుతాం. ఇది నాకు సంభవించినప్పుడు, ఏది పనిచేయదు, ఇంకెందుకు ప్రయత్నించాలి? అనే ఒక తరహా నిస్సహాయతా భావానికి అలవాటు పడ్డాను.
ఈ అలవాటైన నిస్సహాయతా వలయాన్ని ఛేదించాలంటే మీ ఆహారనియమం మీ కడుపు దగ్గరనుండి కాక మీ చెవుల మధ్యనుండి మొదలవ్వాలి, అంటే ఆహార విషయంలో మీ ఆలోచనను మార్చుకోవాలి. ఇందుకై కొంత కఠినమైన నియమాన్ని పాటించవలసి వుండవచ్చు, కాని అట్టి కఠినచర్య లేకుండా మీ ఆహారనియమం బహుశా ప్రారంభం నుంచే పాడుకావచ్చును.
నేనేమి తింటున్నాను ఏమి త్రాగుతున్నాను అని నిశితంగా ఓ వారంపాటు గమనించడం నా విషయంలో కనువిప్పుదాయకంగా ఉండింది. నిజమే, సహజంగా భోజన సమయంలో నేను తక్కువే తినేవాన్ని, కాని సాయంకాలం ఆపకుండా తిన్న తినుబండారాలవల్ల దినంలో పాటించిన ఆశానిగ్రహంవల్ల పొందిన లాభంకూడా వృధా అయింది. నేను భోజనం చేసిన తరువాత జున్ను, శెనగకాయలు, వెన్న, మరియు బిస్కెట్లు తిన్న తరువాత, నేను విస్మయం చెందాను. ఆ తినుబండారాలలో క్రొవ్వు, చక్కెర ఉండడం ఇంకా ఘోరం. నేను సాయంకాలం తినుబండారాలను తినడం మానకపోతే ఏ ఆహారనియమం కూడా నాకు పనిచేయలేదు. మీకూ ఇదే సమస్య ఉందా?
సమస్త మద్యాన్ని తీసుకునే అలవాటును నేను నా ఆహారంలో నుండి తొలగించకపోతే నేను నా బరువు తగ్గించుకోలేనను ఇంకొక చేదునిజాన్ని తెలుసుకున్నాను. మత్తుపానీయంలో ఎక్కువ కాలరీలు ఉండడం, అది సులభంగా క్రొవ్వుగా మారడమే కాదు సాయంకాలం తీసుకునే ఒక గ్లాసుడు ద్రాక్షారసం నా ఆశానిగ్రహాన్ని, తినుబండారాలను తినకూడదన్న నా నిర్ణయాన్ని బలహీనపరుస్తుంది. ఒక గ్లాసుడు ద్రాక్షారసం కేవలం ఒక గ్లాసుడు ద్రాక్షారసమే కాదు. చెప్పాలంటే, నాకు ఒక గ్లాసుడు ద్రాక్షారసంతో పాటు ఆరు బిస్కట్లు, ఒక గిన్నె నిండా శెనగలు కావాలి. వీటికి బదులు వనమూలికల కషాయమే అమోఘంగా వుంటుందని నేను గ్రహించాను. ఇప్పుడు, నేను అనుకున్నంత బరువు తగ్గిన తరువాత కూడా, మునుపటికంటె తక్కువ మద్యం తీసుకుంటున్నాను.
ఈ యథార్థమైన విలువలు, నేను ఆహార నియమం పాటించి బరువు తగ్గించుకుంటున్న సమయంలో రెండు స్థిరమైన సూత్రాల విలువను నేను ఒప్పుకునేలా చేశాయి.
1. సాయంత్రంపూట ఫలహారాలన్నింటిని మానివేయాలి.
2. మత్తుపదార్థాలన్నింటిని మానివేయాలి.
మీ ఆహారనియమాలను వృధాపరిచే వాటిని తెలుసుకోండి
ఫ్రెంచివాళ్లకు ఎన్ మాన్‌జెన్, లెపేటే వ్యాన్ అనే నానుడి ఉంది, అంటే మీరు ఎంత ఎక్కువ తింటే మీకు అంత ఆకలి అవుతుంది అని దాని అర్థం. మనలో చాలామంది విషయంలో ఇది అక్షరాలా నిజం. మనం మనకిష్టమైన భోజనం ముందు కూర్చున్నప్పుడు మనకు ఆకలిగా అనిపించదు, కాని మనం తినడానికి ప్రారంభిస్తుండగా మనలో ఏదో మార్పువస్తుంది, హఠాత్తుగా మనం పస్తులున్నట్లు తింటాం. అదంతా అయిపోయేంత వరకు లేదా నాలుగుసార్లు వడ్డించుకున్న తరువాత, ఆవురావురంటూ మన కడుపులు నిండి చివరకు వద్దనేంత వరకు మనం తింటూనే ఉంటాం. ఏమైంది?
నా విషయంలో రొట్టె, ప్రాముఖ్యంగా ఇంట్లో తయారు చేయబడిన రొట్టె సమస్య. రుచికరమైన రొట్టె తయారుచేసే దీర్ఘశాంతంగల నా భార్య, కొద్దికాలం వరకు రొట్టెచేయడం మానివేసింది. ఒక మనిషి కొంత శోధననే సహించగలడు! మీ విషయంలో చాక్లెట్ లేక ఇంకేదైనా సమస్య అయిండవచ్చు. అసలు విషయమేమంటే, మీ శత్రువేమిటో తెలుసుకొనండి. ఏ పదార్థాలు తిన్నప్పుడు మీకు ఎక్కువ ఆకలి వేస్తుందో వాటి పట్టిక వేసుకొని ఆ పదార్థాలను మానివేయండి. వేరే ఎంపికలు అనేకం ఉన్నాయి. పచ్చి కూరగాయలు ఆవిరితో వండిన కూరగాయలు మంచి రుచికరంగా ఉంటాయి మరియు ఇంకా ఎక్కువ తినాలన్న వాంఛలూ కలిగించకుండా కడుపు నింపుతాయని నేను తెలుసుకున్నాను.
క్లిష్ట పరిస్థితిని అధిగమించుట
యొ-యొ ఆహారనియమం వల్ల, బరువు తగ్గడం మళ్లీ దాన్ని తిరిగి పొందడానికే. ఈ బూటకపు ఆటవల్ల అభివృద్ధిచెందిన పాశ్చాత్య దేశాలలో విస్తరిస్తున్న ఆహారనియమ కార్యక్రమాలను ప్రతిపాదిస్తున్న వారు ధనికులవ్వడం మినహా ఇంకే లాభం కలగదు. కావల్సినంత యొ-యొ ఆహారనియమాన్ని పాటించిన తరువాత, ఈసారి పరిస్థితి వేరుగా ఉంటుందని నేను తీర్మానించుకున్నాను. కాని ఎలా?
సహాయం అడగడానికి సిగ్గుపడవద్దు. మీ వైద్యునితో మాట్లాడండి. మీరు కిలోలచొప్పున తగ్గుతుండడంవల్ల మిమ్మల్ని అభినందించి మెచ్చుకునే మనుష్యులను కనుగొనండి. అది ఆహారనియమాలను పాటిస్తున్న మీ స్నేహితుడో, మీ కుటుంబ సభ్యుడో, లేక పేరుపొందిన బరువుతగ్గించే క్లీనిక్‌లోని ప్రజలైయుండ వచ్చు. క్లిష్ట పరిస్థితిని అధిగమించడానికి జట్టుగా పనిచేయడం ఆసరా పొందడం మీకు సహాయం చేస్తుంది. బరువుతగ్గుటకు మీరు ముందు చేసిన ప్రయత్నాలు విఫలమైన పరిస్థితి పోయింది. ఈ సమయానికల్లా మీకెంతో హాయిగా ఉన్నట్లనిపిస్తుంది, మీ ఆకారాన్ని చూసి ప్రజలు మిమ్మల్ని మెచ్చుకోవడం మొదలుపెడతారు. అప్పటినుండి మానసికాంశాలు కూడా మీకు ప్రతికూలంగా కాక అనుకూలంగా పనిచేస్తాయి.
మీరు ఆకలిగొన్నట్టు లేమికలిగి ఉన్నట్లు అనిపించక కారణసహితమైన ఆహార నియమాలను కలిగి ఉండడం, క్లిష్ట పరిస్థితిని అధిగమించడానికి ఇంకొక కీలకం. మే 22, 1989 నాటి అవేక్!లో సరైన ఆహారాన్ని గురించి చెప్పబడిన అంశమునందు ఆహార నియమాలను గూర్చిన వివరణతో కూడిన శ్రేష్ఠమైన సలహా నేను కనుగొన్నాను బరువుతగ్గించుకొనే నా ఆహారంలో ఉదయంపూట ఫలహారానికై క్రొవ్వు తక్కువగా ఉండే పప్పుదినుసులు లేక తక్కువ కాలరీలు ఉండే పదార్థాలతో నింపబడిన మఫిన్‌లతో పాటు కొన్ని ద్రాక్షాపళ్లు, మధ్యాహ్నానికై తక్కువ క్రొవ్వుతో కొన్ని కూరగాయలు, రాత్రి భోజనానికి రొట్టె లేదా పండ్లు అనేవేమి లేకుండానే ఆవిరితో వండిన కూరగాయలు మరియు తక్కువ క్రొవ్వుగల మాంసం ఉంటాయి. రోజుకు 1,200 నుండి 1,500 కాలరీలున్న, యీ ఆహారనియమం ఖచ్చితమైనదే కాని కఠినమైనది కాదు. మధ్యాహ్న తినుబండారంలా ఒక ఆపిల్ చాలు, మరియు ఆకలి బాధ కలిగే ఆ అరుదైన సందర్భాలను అలక్ష్యం చేయలేము, నేను అతిగా తినకుండటానికి నా దగ్గిర ఉన్న రహస్య చిట్కాలలో ఒకదాన్ని ఉపయోగిస్తాను, మీరు కూడా తెలుసుకో వలసిన ఆహారనియమానికి సంబంధించిన అద్భుతమైన రహస్యమది.
రహస్య అస్త్రాలు
ఆ రహస్యమేమిటీ? అది మీకు చాలా మంచిది, ఇంచుమించు తక్షణమే మీ కడుపు నింపుతుంది, అందులో కాలరీలు అసలుండవు, మరియు చౌకైనది! నీళ్లు. మీ ఆహారనియమాన్ని సఫలం చేయడానికి రోజుకు ఆరునుండి ఎనిమిది గ్లాసుల నీళ్లు చాలంటే అదెంత ఆశ్చర్యకరం. కాలే కడుపుకు ఒక గ్లాసుడు నీళ్లే మీరిచ్చే దృఢసమాధానమని మీ శరీరం ఒక్కసారి తెలుసుకుంటే, ఆకలి మంటలు తగ్గిపోవడం ప్రారంభిస్తాయి. సాయంకాలం తినుబండారాలు తినే నా జీవితకాల అలవాటును అధిగమించడానికి అన్నింటికంటే ఎక్కువగా నీళ్లే నాకు సహాయం చేశాయి.
దీర్ఘకాల బరువు నియంత్రణకు క్రమమైన వ్యాయామం ఇంకొక రహస్యాస్త్రం. నిజమే, బరువుతగ్గించుటలో వ్యాయామం సహాయం చేస్తుందన్నది అందరికీ తెలిసిందే, మరైతే ఇందులో రహస్యమేమిటి? ఈ విషయంలో, నీవు హాయిగా ఉన్నావని, చక్కగా కనిపిస్తున్నావని కలిగే మహత్తరమైన మానసిక సంతృప్తే రహస్యం. ఆ ఫలితం మీరు వదులుకునే కొన్ని ఆహార పదార్థాలకన్నా ఎక్కువైనది. మీ చుట్టు ఉన్నవాళ్లు మెత్తని చాక్లెట్ తింటునప్పుడు మీరు మాత్రం చల్లటి ద్రాక్షాపండ్లు తింటూ, ఈర్ష్యపడకుండా ఉండటానికి అది మీకు సహాయం చేస్తుంది.
ఆహారనియమాలు మరియు వ్యాయామం ఒకదానికొకటి అమోఘంగా సహాకరించుకుంటాయి. బరువు తగ్గడమంటే మీరు అనారోగ్యంగా కనిపించాలని కాదు. క్రమమైన వ్యాయామం మీ ముఖారవిందానికి కాంతినిచ్చి మీ కండరాలకు గట్టి బలాన్నిస్తుంది. వాస్తవానికి, మెరుగుపడ్డ నా కండరాల ఆకారం నేను నిజానికి తగ్గుతున్నదాని కంటే వేగంగా బరువు తగ్గుతున్నానన్న భ్రమను ఇతరులకు కలిగించింది! టెన్నిస్ వంటి ఆటను, ఇతరులతో కలిసి ఆడుటకు మరియు నా సమయంలో నేనే స్వయంగా వ్యాయామం చేసికొనుటకు, వెయిట్ లిఫ్టింగ్ వంటి వ్యాయామాల కలయిక నాకు అవసరమని నేను గ్రహించాను. పదేళ్లనుండి పేరుకుపోయి ఉన్న కండలను తొలగించుట ద్వారా వ్యాయామం ఆహారనియమాలు లాభసాధకమైనవిగా కనిపించేలా చేసింది, అలాగే ఆహారనియమాలు కూడా వ్యాయామం లాభసాధకమైనదిగా కనిపించేలా చేశాయి. నా బరువు 110 కిలోలనుండి 80 కిలోలకు తగ్గడంతో, ఆరోగ్యవంతులైన స్థానిక యౌవనులు నా వ్యాయామవేగంతో పోటీపడి సమానంగా రాగలరో లేదో తేల్చుకొనుటకు ఎదురుచూస్తునట్టు నాకనిపించింది.
నా మాదిరే మీరు ఎంతోకాలంగా అధిక బరువుతో ఉన్నట్లైతే, ప్రతి ఉదయం లేచేటప్పుడు బరువుతో అలసిపోయినట్లు అనిపించడం, రోజంతా నెమ్మదిగా తిరగడం, రాత్రుల్లో పడక కుర్చీలో కూర్చుని అలాగే నిద్రపోవడానికి అలవాటైపోయుండవచ్చు. అదనంగా, 20 లేక 30 కిలోల బరువునుకలిగి ఉండడం ఒక పెద్ద ఇనుపగుండు తగిలించి ఉన్న సంకెళ్లు వేసుకుని జీవితం గడిపినట్లుంది. రోజంతా ఉల్లాసంగా ఉండడానికి ఎక్కువ శక్తిని కలిగివుండి, పడకలోనుండి హుషారుగా క్రిందకుదూకడం ఎలా ఉంటుందో నేను నిజంగా మర్చిపోయాను. కానీ నాకిప్పుడు తెలిసింది.
ఎప్పుడూ అంతం కాని యుద్ధం
మీరనుకున్నంత బరువు తగ్గించడం, దీర్ఘకాలం వరకుచేసే యుద్ధంలాంటిది. ఆ తొలి యుద్ధం అంతమైనను, అసలైన యుద్ధం ఇప్పుడే మొదలైయింది. మనలో ఎల్లప్పుడూ కూర్చుని ఉండే ఉద్యోగాలున్న నడి వయస్కులు పోరాడి తొలగించుకొన్న బరువు తిరిగిరాకుండా ఉండాలంటే మనం ఏ విధమైన ఆహారాన్ని తింటున్నామనే సంగతిని గమనించాలి. దీనికి కిటుకేమంటే మీ ఆహారనియమాలు ఓ జీవితకాల పథకాలని భావించడమే. అది బరువును తగ్గించు కొనుటకన్న బరువును నియంత్రించడంగా సవరించినను, వాస్తవానికి అదెప్పటికీ ఆగిపోదు. మీరు మీ పాత ఆహార అలవాట్లను మొదలుపెడితే, మీ పాత బరువు మళ్లీ పెరుగుతుంది.
మీరనుకున్నంత బరువు తగ్గిన తరువాత, క్రొత్త బట్టలు కొనుక్కొని ఎందుకు వేడుక చేసుకో కూడదు? మరి పాత బట్టలను తీసేయడాన్ని గురించి ఆలోచించండి. మళ్లీ అవసరమౌతాయని ఆ పాత బట్టలను ఉంచుకొనడం భవిష్యత్తు కొరకు పథకం వేయడమని అర్థం. మరీ ఒదులుగా లేని దుస్తులను ధరించండి, మీరు లావవుతున్నట్టుంటే అవి మీకు వెంటనే తెలియజేస్తాయి. మీరు బరువు తగ్గుటకు తీసుకున్న ఆహారరకాలకన్నా, నియంత్రించబడిన మీ ఆహారనియమంలోని రకాలే ఎక్కువగా ఉండవచ్చు, కాని మీరు, జీవితాంతం శాశ్వతంగా తక్కువ క్రొవ్వు, తక్కువ చక్కెరవున్న పదార్థాలను తినడానికి మార్చుకొనండి. మీరు క్రమంగా చేసే వ్యాయామాన్ని మానివేయకండి. మంచిగా ఉండడానికి ఇదొక కీలకం.—ఉచిత వ్యాసం.