బరువు భారంగా తయారైనప్పుడు
“నా బట్టలు నాకు అసలు పట్టడం లేదు” 35 ఏళ్ల రోజా దుఃఖంతో పూడుకుపోయిన కంఠంతో అంది. “నేనిప్పుడు దాదాపు 86 కిలోలున్నాను, నేనింత బరువు పెరుగుతానని నేనెప్పుడూ అనుకోలేదు!”
పెరుగుతున్న బరువు గురించి కలతచెందుతున్నది రోజా ఒక్కర్తే కాదు. తానుంటున్న అమెరికాలో, దేశంలోని దాదాపు మూడవవంతు మంది స్థూలకాయంతో ఉన్నారు.a బ్రిటన్‌లోని స్థూలకాయులైన పెద్దవారి నిష్పత్తి పది సంవత్సరాల్లో రెండింతలైంది. ఎక్కువ బరువు అనేది అరుదుగా ఉంటూండే జపాన్‌లో స్థూలకాయం సర్వ సాధారణమైపోతోంది.
పిల్లలు ఉండవల్సిన దానికన్నా ఎక్కువ బరువుండడం అధికమైపోతోంది. 6 నుండి 17 సంవత్సరాల వయస్సు మధ్యనున్న దాదాపు 47 లక్షలమంది అమెరికా యౌవనులు ఉండాల్సినదానికన్నా చాలా ఎక్కువ బరువున్నారు, అయితే కెనడా పిల్లల్లో దాదాపు 20 శాతంమంది స్థూలకాయంతో ఉన్నారు. సింగపూర్‌లో ఇటీవలి సంవత్సరాల్లో బాల స్థూలకాయుల్లో మూడింతల పెరుగుదలను చూపించింది.
కొన్ని దేశాల్లో, బరువు ఎక్కువుండడంవలన భారీకాయంతో కన్పించడం ఆరోగ్య, ధన సంపదలతో తులతూగుతున్నట్లుగానూ, అది బీదరికంకన్నా కుపోషణకన్నా ఎంతో వాంఛనీయమైన స్థితిగానూ దృష్టించబడ్తోంది. కానీ ఆహారం తరచూ సుళువుగా అందుబాటులో ఉండే పశ్చిమ దేశాల్లో, బరువు ఎక్కువవ్వడం సాధారణంగా వాంఛనీయమైనదిగా పరిగణించబడదు. దానికి బదులుగా, అది సాధారణంగా తీవ్రమైన చింతకు కారణమౌతుంది. ఎందుకు?
“స్థూలకాయం రూపానికి సంబంధించిన సమస్యగా చాలామంది నమ్మినప్పటికీ, నిజానికది ఒక గంభీరమైన వ్యాధి” అని అమెరికా మాజీ సర్జన్ జనరలైన డా. సి. ఎవ్‌రెట్ కూప్ అంటున్నాడు. న్యూయార్క్‌కు చెందిన ఎండోక్రైనాలజిస్ట్ అయిన ఎఫ్. గ్జేవియర్ పీసన్యార్ ఇలా వివరిస్తున్నాడు: “[అమెరికావాసులు లావవ్వడం] మూలాన వారిలో ఎక్కువమంది మధుమేహం, హైబీపీ, గుండెపోటు, గుండె జబ్బు, చివరికి కొన్ని రకాల క్యాన్సర్‌లకు కూడా గురయ్యే ప్రమాదంలో పడుతున్నారు.”
ఎక్కువ బరువు, ఎక్కువ ప్రమాదం
16 సంవత్సరాలపాటు అమెరికాలోని 1,15,000 మంది స్త్రీ నర్సులను జాగ్రత్తగా ఫాలోచేసి అధ్యయనం చేసిన ఒక దృష్టాంతాన్ని పరిశీలించండి. పెద్దవయస్కుల బరువు కేవలం ఐదునుండి ఎనిమిది కిలోలు ఎక్కువ పెరగడంకూడా గుండె జబ్బులు ఎక్కువగా వచ్చే ప్రమాదానికి దారితీస్తుందని ఆ అధ్యయనంలో కనుగొనబడింది. క్యాన్సర్ మరణాల్లో మూడింట ఒక వంతూ, గుండెజబ్బు సంబంధిత మరణాల్లో సగం వంతూ బరువు ఎక్కువ ఉండడం మూలానేనని ద న్యూ ఇంగ్లాండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్ 1995, సెప్టెంబరు 14వ సంచికలో ప్రచురించబడిన ఆ అధ్యయనం సూచించింది. ద జర్నల్ ఆఫ్ ది అమెరికన్ మెడికల్ అసోసియేషన్ (జామా) 1996, మే 22/29 సంచికలో నివేదించబడిన ఒక రిపోర్టు ప్రకారం, “పురుషుల్లో 78% హైబీపీలకూ, స్త్రీల్లో 65% హైబీపీలకూ కారణం సూటిగా స్థూలకాయమే అని చెప్పవచ్చు.” “ప్రాముఖ్యంగా ఎక్కువ బరువు” (ఆదర్శ బరువుకన్నా 40 శాతం లేక అంతకు ఎక్కువ శాతం ఎక్కువ బరువు) “ఉన్నవారికి క్యాన్సరు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంది” అని అమెరికన్ క్యాన్సర్ సొసైటీ అంటుంది.
కానీ ప్రమాదకరమైనది కేవలం బరువు ఎక్కువవ్వడం మాత్రమే కాదు; శరీరంలోని క్రొవ్వు పంపిణీ కూడా వ్యాధివచ్చే ప్రమాదాన్ని ప్రభావితం చేస్తుంది. తుంటిభాగంలోనూ, తొడభాగంలోనూ లావుగావుండి ఎక్కువ బరువున్నవారికన్నా, పొత్తికడుపు దగ్గర అధిక క్రొవ్వున్నవారు నిజానికి ఎక్కువ ప్రమాదంలో ఉన్నారు. పొట్ట భాగంలో క్రొవ్వు మధుమేహం, గుండె జబ్బు, రొమ్ము క్యాన్సరు, గర్భాశయ క్యాన్సరు వంటివాటికి దోహదపడుతుంది.
అదేవిధంగా, ఎక్కువ బరువున్న యౌవనస్థులు హైబీపీ, కొలెస్ట్రాల్ మోతాదుల్లో పెరుగుదల, మధుమేహం రావడానికి ముందుండే పరిస్థితులతో బాధపడుతుంటారు. మరి వారు సాధారణంగా స్థూలకాయంగల వయోజనులుగా తయారౌతారు. బ్రిటన్‌లోని వైద్య పత్రికయైన ద లాన్సెట్‌లో ప్రచురించబడిన సమాచారాన్ని ఉపయోగిస్తూ, “చిన్నప్పుడు లావుగా ఉన్న ప్రజలు అకాలంగా చనిపోయారు, సాధారణ ప్రజలకన్నా చాలా పిన్నవయస్సుల్లోనే చాలా ఎక్కువ వ్యాధులకు గురయ్యారు” అని ద న్యూయార్క్ టైమ్స్ నివేదించింది.
క్రొత్త బరువు నిర్దేశకాలు
అమెరికా ప్రభుత్వం అధిక బరువు సంక్షోభాన్ని గుర్తించి తాను సిఫారసు చేసే బరువు నిర్దేశకాలను 1995లో మరింత కఠినతరం చేసింది. (తర్వాతి పేజీలో ఉన్న బాక్సును చూడండి.) సవరించబడిన నిర్దేశకాలు “ఆరోగ్యకరమైన బరువు,” “తగుమాత్రమైన అధిక బరువు,” “మరీ ఎక్కువ బరువు”లను గుర్తిస్తున్నాయి. ఈ నిర్దేశకాలు పెద్దవారైన స్త్రీలకూ, పురుషులకూ ఇద్దరికీ ఏ వయస్సులో ఉన్నప్పటికీ వర్తిస్తాయి.
1990లోని నిర్దేశకాలు మధ్యవయస్సులో శరీరంలోని మధ్యభాగంలోని పెరుగుదలను అనుమతించాయి, ఇది తరచూ మధ్యవయస్సులోని వ్యాప్తి అని పిలువబడుతుంది. కానీ క్రొత్త నిర్దేశకాలు దీన్ని అనుమతించడంలేదు, ఎందుకంటే వయస్సు పెరిగే కొలదీ పెద్దవారు బరువును పెంచుకోకూడదు అనే సూచనలు అందుతున్నాయి.b అందుకని సాధారణ బరువుగలవాడని మునుపు పరిగణించబడిన వ్యక్తి ఇప్పుడు తాను అధిక బరువున్న వ్యక్తుల వర్గంలో చేరిపోయినట్లు కనుగొనవచ్చు. ఉదాహరణకు, 35 నుండి 65 సంవత్సరాల మధ్య వయస్సులో, 168 సెంటీమీటర్ల ఎత్తున్న వ్యక్తి 75 కిలోల బరువుంటే ఆయన 1990లోని నిర్దేశకాల ప్రకారం ఆరోగ్యకరమైన బరువు పరిధిలోకే వచ్చి ఉండేవాడు. కానీ క్రొత్త నిర్దేశకాల ప్రకారం, ఆయనైనా ఆమె అయినా ఐదు కిలోలు ఎక్కువ బరువు ఉన్నట్లే!
మనకు భారీకాయం ఎలా వస్తుంది?
జన్యు సంబంధిత ప్రవృత్తులు స్థూలకాయంపట్ల ఒక వ్యక్తి వైఖరిపై ప్రభావం చూపవచ్చు. కానీ పాశ్చాత్య దేశాల్లో ప్రజలు బరువు పెరగడానికి కారణం ఇది కాదు. ఈ సమస్యకు కారణం వేరే ఉంది.
క్రొవ్వు తినడం మనం లావెక్కేలా చేయగలదని ఆరోగ్య రంగంలోని ప్రొఫెషనల్‌లు అంగీకరిస్తున్నారు. మాంసం ఉత్పత్తులూ, ఎన్నో రకాల పాల ఉత్పత్తులూ, బేక్ చేయబడిన పదార్థాలూ, ఫాస్ట్ ఫుడ్స్, అల్పాహారాలూ, వేయించిన ఆహార పదార్థాలూ, సాస్‌లూ, గ్రేవులూ, నూనెలూ ఇవన్నీ క్రొవ్వుతో నిండివుంటాయి, మరి వీటిని తింటే స్థూలకాయం రాగలదు. ఎలా?
మనం తినే ఆహారంలో, మన శరీరం ఖర్చు చేసే కేలరీల కన్నా ఎక్కువ కేలరీలను తీసుకోవడం బరువు పెరగడానికి కారణమౌతుంది. ప్రతి గ్రాము క్రొవ్వులో తొమ్మిది కేలరీలు ఉంటాయి, అదే ఒక గ్రాము ప్రోటీనులోనూ లేక ఒక గ్రాము కార్బోహైడ్రేటులోనూ అయితే నాలుగేసి కేలరీలే ఉంటాయి. కాబట్టి మనం క్రొవ్వు తిన్నప్పుడు ఎక్కువ కేలరీలను తీసుకుంటామన్నమాట. కానీ ప్రాముఖ్యమైన విషయం ఇంకొకటుంది—అదేమంటే కార్బోహైడ్రేట్లద్వారా, ప్రోటీన్లద్వారా, క్రొవ్వులద్వారా సరఫరా చేయబడిన శక్తిని మానవ శరీరం వినియోగించే రీతి. శరీరం మొదట కార్బోహైడ్రేట్లనూ, ప్రోటీన్లనూ దహిస్తుంది, ఆ తర్వాతే క్రొవ్వును దహిస్తుంది. వినియోగంకాని క్రొవ్వు కేలరీలు శరీర క్రొవ్వుగా పరివర్తనం చెందుతాయి. అందుకని క్రొవ్వున్న ఆహార పదార్థాలపై కోత విధించడం బరువు తగ్గించుకోవడానికి ఒక ప్రాముఖ్యమైన మార్గం.
అయితే, తాము క్రొవ్వు పదార్థాలు తీసుకోవడం తగ్గించినప్పటికీ తమ శరీరాలు ఇంకా పరిమాణంలో పెరుగుతూనే ఉన్నాయని కొంతమంది కనుగొంటారు. ఎందుకు? ఒక కారణం ఏమంటే వారు ఎక్కువ మొత్తాల్లో ఆహారం తీసుకుంటూ ఉంటారు. అమెరికాలోని ఒక పోషక సంబంధ నిపుణురాలు ఇలా అంటుంది: “మనం అతిగా తింటాము, ఎందుకంటే మనకు ఎక్కువగా వడ్డించబడుతుంది. అది అందుబాటులో ఉన్నప్పుడు మనం దాన్ని తింటాము.” తక్కువ-క్రొవ్వు లేదా క్రొవ్వు-లేని ఆహారాన్ని ప్రజలు అతిగా తీసుకునేందుకు కూడా మొగ్గు చూపుతారు. కానీ అమెరికాలోని ఆహార పరిశ్రమ సంబంధిత సలహా సంఘంలోని ఒక నిపుణురాలు ఇలా వివరిస్తోంది: “క్రొవ్వు తగ్గించబడిన ఆహార ఉత్పత్తుల రుచిని పెంచడానికి తరచూ [హెచ్చైన కేలరీలుగల] చక్కెర మోతాదును పెంచుతారు.” అందుకని, ద న్యూయార్క్ టైమ్స్ ఇలా నివేదిస్తోంది: “90లలోని రెండు వైఖరులు—ఖర్చుపెట్టిన డబ్బుకు ఎంత వీలైతే అంత ఎక్కువ విలువను పొందాలనుకోవడమూ, తక్కువ-క్రొవ్వు లేక క్రొవ్వు-లేని ఆహారాన్ని తినాలనుకోవడమూ—ప్రజలు తిండిబోతులుగా తయారయ్యేందుకు ప్రేరకాలయ్యాయి,” తద్వారా బరువు పెరగడానికి కారణమయ్యాయి.
తిని కూర్చునే జీవన విధానం కూడా బరువు పెరగడానికి కారణమౌతుంది. బ్రిటన్‌లో జరిపిన ఒక అధ్యయనం ఆ దేశంలోని పెద్దవారిలో మూడింట ఒక వంతుకంటే ఎక్కువమంది వారానికి కేవలం 20 నిమిషాలకన్నా తక్కువసేపు కాస్తంత మాత్రమే వ్యాయామం చేస్తారని కనుగొన్నది. దాదాపు సగం మంది క్రీడల్లో ఎన్నడూ చురుకుగా పాల్గొనరు. చాలా పాశ్చాత్య దేశాల్లో కారు ప్రయాణం నడకకు ప్రత్యామ్నాయమైపోయింది, మరి టీవీని అధికంగా చూడడం సోమరితనాన్నీ, తిండిబోతుతనాన్నీ రెండింటినీ ప్రోత్సహిస్తుంది. అమెరికాలో, పిల్లలు ప్రతివారం దాదాపు 26 గంటలు టీవీముందు కూర్చుని దాన్ని చూస్తూ సమయం గడుపుతారని అంచనా వేయబడుతుంది, వీడియో గేమ్‌లు ఆడుతూ గడిపే సమయం గురించి చెప్పనే అక్ఖర్లేదు. ఇదిలా ఉండగా, దాదాపు 36 శాతం స్కూళ్లలో మాత్రమే వ్యాయామ తరగతులు ఉన్నాయి.
ఎక్కువ బరువుండడానికి మనశ్శాస్త్ర సంబంధమైన కారణాలు కూడా ఉన్నాయి. “మనం భావోద్వేగ అవసరాల మూలాన తింటుంటాము” అని అంటున్నాడు జాన్స్ హాప్‌కిన్స్ వెయిట్ మానేజ్‌మెంట్ సెంటర్‌కి చెందిన డా. లారెన్స్ కెస్‌కిన్. “మనం సంతోషంగా ఉన్నప్పుడు తింటాము, విచారంగా ఉన్నప్పుడు తింటాము. చాలా ఇతర విషయాలకు ఆహారమే ప్రత్యామ్నాయం అని నమ్మేలా మనం పెరిగాము.”
మనం విజయం పొందగలమా?
బరువు ఎక్కువుండడంలో ఇమిడివున్న విషయాలు క్లిష్టమైనవి. ప్రతి సంవత్సరం దాదాపు ఎనిమిది కోట్లమంది అమెరికన్లు పథ్యం చేస్తారని అంచనా వేయబడింది. కానీ కాస్తంత బరువు కోల్పోగానే దాదాపు అందరూ మళ్లీ మునుపటి ఆహారపు అలవాట్లకు మరలుతారు. 95 శాతంమంది ఐదు సంవత్సరాల్లోనే తాము కోల్పోయిన బరువును తిరిగి పొందుతారు.
బరువును కోల్పోవడానికీ, అది తిరిగి పెరగకుండా చూసుకోవడానికీ అవసరమైనవి జీవనరీతుల్లో మార్పులే. అటువంటి మార్పులు చేసుకోవడానికి కృషి, పట్టుదలా అవసరం, వీటితోపాటు కుటుంబ మద్దతూ, స్నేహితుల మద్దతూ కూడా అవసరమే. కొన్ని సందర్భాల్లో ఆరోగ్య కార్యకర్తల సహాయం కూడా అవసరమౌతుండవచ్చు.c అయితే, శ్రమతో కూడిన మీ ప్రయత్నాలు విజయవంతమవ్వాలంటే అనుకూల దృక్పథంతోకూడిన ప్రేరణ ఉండాల్సిందే. ‘నేను బరువు కోల్పోవాలని ఎందుకు అనుకుంటున్నాను?’ అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవడం మంచిది. ఆరోగ్య ప్రమాదాల్ని నివారించాలన్న మీ కోరికతోపాటుగా, వంట్లో బాగుండాలనీ, బాగా కనపడాలనీ, మీ జీవిత నాణ్యతను మెరుగుపర్చుకోవాలనీ కోరుకుంటే బరువు కోల్పోవడానికి మీరు చేసే కృషి విజయవంతమయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
పోషక విలువలూ, తక్కువ కేలరీలూ ఉన్న నోరూరించే సంతృప్తికరమైన ఆహారాన్ని మీరు సమృద్ధిగా తినవచ్చు. కానీ మీరు బరువు తగ్గడానికి సహాయం చేసే ఆహారాల్ని పరిశీలించే ముందు, ఆహారపుటలవాట్లలోని కొన్ని అంశాలు ఆరోగ్య ప్రమాదాలకు ఎలా దారితీయగలవో మనం పరీక్షిద్దాము.
[అధస్సూచీలు]
a ఆదర్శ బరువు అని నమ్మబడుతున్నదానికన్నా 20 శాతం ఎక్కువ బరువుండడమే స్థూలకాయం అని సాధారణంగా నిర్వచించబడుతుంది.
b 1995 నిర్దేశకాలు దాదాపు అన్ని వయస్సుల వారికీ వర్తిస్తాయి కానీ కొన్ని వయస్సుల వారికి వర్తించవు. “క్రొత్త బరువు నిర్దేశకాలు 65 సంవత్సరాలకన్నా ఎక్కువ వయస్సున్న వారికి బహుశ వర్తించవన్నది సాధారణంగా అంగీకరించబడుతుంది” అని డా. రాబర్ట్ ఎమ్. రసెల్ జామా 1996, జూన్ 19వ సంచికలో అన్నాడు. “వృద్ధులు కాస్త ఎక్కువ బరువుండడం ప్రయోజనకరంగా ఉండవచ్చు కూడా, వారు అస్వస్థులుగా ఉన్న సమయాల్లో శక్తినివ్వడానికీ, కండరాలు ఎముకల ద్రవ్యరాశిని సంరక్షించడానికీ ఆ అధిక బరువు ఉపయోగపడుతుంది.”
c బరువు కోల్పోవడానికి సంబంధించిన సలహాల కొరకు, తేజరిల్లు! (ఆంగ్లం) మే 8, 1994, పేజీలు 20-2; జనవరి 22, 1993, పేజీలు 12-14; డిశంబరు 8, 1989, పేజీలు 3-12 చూడండి.
[6వ పేజీలోని చిత్రం]
మీరు “ఆరోగ్యకరమైన బరువు” పరిధిలో ఉన్నారా, “తగుమాత్రమైన అధిక బరువు” పరిధిలో ఉన్నారా, లేక “మరీ ఎక్కువ బరువు” పరిధిలో ఉన్నారా? ఆ ప్రశ్నకు సమాధానమివ్వడానికి ఇక్కడ ఇవ్వబడిన గ్రాఫు మీకు సహాయం చేస్తుంది
స్త్రీలకొరకూ, పురుషులకొరకూ 1995 బరువు నిర్దేశకాలు
(పూర్తిగా ఫార్మా చేయబడిన టెస్ట్ కోసం ప్రచురణ చూడండి)
ఎత్తు* సెం.మీ.
198
190
180 ఆరోగ్యకరమైన బరువు తగుమాత్రమైన అధిక బరువు మరీ ఎక్కువ బరువు
170
కిలోలు 30 40 50 60 70 80 90 100 110
బరువు†
గణాంకాల మూలం: U.S. Department of Agriculture, U.S. Department of Health and Human Services
* బూట్లు లేకుండా.
† దుస్తుల బరువు మినహాయించి. చాలామంది పురుషులకు ఉన్నట్లుగా ఎక్కువ కండరాలూ ఎముకలూ ఉన్నవారికి అధిక బరువులు వర్తిస్తాయి.