కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • g92 12/8 పేజీలు 20-24
  • “బుద్ధితక్కువ పని చేయకు లేదా చంపేస్తా”

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • “బుద్ధితక్కువ పని చేయకు లేదా చంపేస్తా”
  • తేజరిల్లు!—1992
  • ఇలాంటి మరితర సమాచారం
  • ఏనుగు తొండం
    సృష్టిలో అద్భుతాలు
  • సమస్యల నెదుర్కొనుటకు దేవునితోటి సన్నిహితత్వం నాకు సహాయపడింది
    తేజరిల్లు!—1993
  • నన్ను నిజంగా ప్రేమించిన కుటుంబం
    తేజరిల్లు!—1995
  • నా మొదటి ప్రేమను గుర్తుంచుకోవడం వల్ల సహించగలిగాను
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2015
తేజరిల్లు!—1992
g92 12/8 పేజీలు 20-24

“బుద్ధితక్కువ పని చేయకు లేదా చంపేస్తా”

తెరుచుకొనియున్న కారు కిటికీ నుండి ఒక తుపాకి చొచ్చుకొనివచ్చి నా తలకు గురిపెట్టబడింది. ఒక స్వరం యిలా అన్నది:

“నావైపు చూడకు, తలుపు తెరువు. ప్రక్కకు జరుగు.” నాకు చెప్పినట్లు చేశాను. ఆ వ్యక్తి లోనికి వచ్చి చక్రం వెనుక కూర్చున్నాడు. తుపాకి యింకా నావైపు గురిపెట్టబడే ఉంది.

“బ్యాంక్‌ తాళం చెవి నీదగ్గర ఉందా?”

“నా దగ్గర తాళం చెవి లేదు. తెరవడానికి ఎవరో ఒకరు ఏ నిమిషములోనైనా ఇక్కడకు రావచ్చు.”

“బుద్ధితక్కువ పని చెయ్యకు లేదా చంపేస్తా” అని అతడు హెచ్చరించాడు. అతడు నా కారును స్టార్ట్‌ చేసి పోనిచ్చాడు.

ఇది నాకు పరిపాటయ్యింది. ట్రస్ట్‌ కంపెనీ బ్యాంక్‌ బ్రాంచిలో నేను ఒక టెల్లర్‌గా పనిచేస్తుండేదాన్ని. గత ఏప్రిల్‌లో ఒక స్త్రీ తన పర్సును నావైపు గురిపెట్టి యిలా అన్నది: “ఇందులో తుపాకి ఉంది. డబ్బు యిలా యివ్వు.” నేనలా చేశాను.

కొన్ని వారాల తరువాత ఒక వ్యక్తి నా కౌంటర్‌ దగ్గరకు వచ్చాడు. అతని తుపాకి తిన్నగా గురిపెట్టబడింది. “డబ్బు నా కివ్వు,” అన్నాడు పేర్చబడియున్న నోట్లకట్టను అతనివైపు త్రోశాను.

నేను విసుగెత్తిపోయాను. మరో బ్రాంచికి బదిలీ చేయమని అడిగాను. నా అభ్యర్థన అంగీకరించబడింది. కావున నేనిప్పుడు జార్జియా, కొలంబస్‌లో పీచ్‌ట్రి మాల్‌ బ్రాంచి అనే క్రొత్త బ్రాంచియొక్క కార్లు నిలిపేచోట మే 23, గురువారం ఉదయం నా కారులో కూర్చొని ఉన్నాను. అది తెరుస్తారని వేచియున్నాను. అప్పుడు సమయం 8:25. నేను సర్వసాధారణంగా పనికి కొన్ని నిమిషాలు ముందుగావచ్చి ఆ రోజు కొరకైన బైబిలు వచనాన్ని చదువుతూ ఉంటాను. ఈ రోజు వచనమేమంటే మత్తయి 6:13, అందు యిలా ఉంది: “దుష్టునినుండి మమ్మును తప్పించుము.” అప్పటికి దానిని నేను గుణగ్రహించకపోయాను, కాని ఆ తరువాత రెండు దినాలలో నాకు ఆ వచనము ఎంతో ప్రాముఖ్యముకానై యున్నది.

నేను ఈ క్రొత్త బ్రాంచికి వచ్చి కేవలం రెండు వారాలయ్యింది కనుక నాకింకా దాని తాళం యివ్వలేదు. నా కారు కిటికీని కొంచెము క్రిందికి దింపి, నేను అప్పుడే చదివిన లేఖనాన్ని ధ్యానిస్తున్నాను, అప్పుడు ఒక తుపాకీ కొన కిటికీలో ప్రత్యక్షమయ్యింది. ఇంతకు ముందు రెండుసార్లు, దోపిడీదొంగలు బ్యాంకు డబ్బుతో పరారయ్యారు. ఈసారి నన్ను తీసుకువెళ్తున్నాడు.

అతడు వాహనాన్ని నడుపుతుండగా, నేను బిగ్గరగా ప్రార్థించుట మొదలుపెట్టాను: “ఓ యెహోవా దయచేసి నాకు సహాయం చేయుము!”

“యెహోవా ఎవరు?” అని నన్ను అపహరించుకు పోతున్నవాడు నిలదీశాడు.

“నేను ఆరాధిస్తున్న దేవుడాయనే.”

“నావైపు చూడకు! నీ కిటికీలోనుండి బయటకే చూస్తుండు! యెహోవా . . . అంటే వాచ్‌టవర్‌, యెహోవాసాక్షులు కదా?”

“అవును.”

“నేను న్యూయార్కు నగరంలో నివసించినప్పుడు వాళ్లు నాకు తెలుసు. నేను కాథోలిక్కును. ఏమైతేనే, నిశ్శబ్దంగా ప్రార్థించుకో. వినడానికి నాకిష్టం లేదు.” అయితే అతడిలా అన్నాడు: “ఇదిగో, నేను నీకు ఏ హానిచెయ్యను. నాకు కావల్సింది డబ్బు గాని నీవు కాదు. బుద్ధితక్కువ పని చెయ్యెద్దు, అప్పుడు నీకేహాని జరుగదు.”

మేము ప్రయాణిస్తున్నంతసేపు అతడు బ్యాంకునుగూర్చి నన్ను అడుగుతూ వచ్చాడు. ఎవరువచ్చి తెరుస్తారు? ప్రజాసౌకర్యార్థం దాన్ని ఎన్ని గంటలకు తెరుస్తారు? దానిలో ఎంత డబ్బు ఉంది? బ్యాంకును గూర్చి మరెన్నో ప్రశ్నలు వేశాడు. నాకు తెలిసినంతమట్టుకు నేను వాటికి సమాధానమిస్తూ వచ్చాను. ఆలాగే నిశ్శబ్దంగా ప్రార్థించాను. దీనినుండి సురక్షితంగా బయటపడేలా సహాయం చేయుమని నేను యెహోవాను వేడుకున్నాను.

పది నిమిషాల తర్వాత, అడవి లోనికి పోయే మట్టిరోడ్డుకు త్రిప్పాడు. బహుశ అతడు ఎవరినో కలుసుకోవాలని ఎదురుచూస్తున్నట్టున్నాడు. తనలోతాను యిలా గొణుక్కోవడం మొదలుపెట్టాడు: “వాడెక్కడున్నాడు? వాడెక్కడున్నాడు?” అతడు కారును ఆపి క్రిందికి దిగి నన్ను సీటులోనుండి నెమ్మదిగా జరిగి డ్రైవరు కూర్చొనే ప్రక్కనుండి బయటకు దిగమన్నాడు. ఎల్లప్పుడు అతనికి నా వెనుక భాగమే త్రిప్పి ఉంచమన్నాడు. అతన్ని చూడకుండా ఉండటానికి నా కళ్లు నేలవైపే ఉంచమని, నా ప్రక్కలో తుపాకీ గురిపెట్టి, నన్ను అడవిలోనికి తీసుకొనిపోయాడు. నా దుస్తులతోను ఎత్తు జోళ్లతోను ఆ దట్టమైన అడవిగుండా వెళ్లడం చాలా కష్టమైంది. అతడు నన్ను ఒక చెట్టువైపుకు తీసుకువెళ్లాడు. దాని కాండమువైపు నా ముఖమును పెట్టమన్నాడు, దళసరి జిగురు టేపును నా కళ్లకు, నోటికి అంటించాడు. నా చేతులను వెనక్కిపెట్టి కలిపి టేపుచుట్టి నన్ను ఆ చెట్టుకువేసి బంధించి నాకు, ఆ చెట్టు కాండానికి కలిపి టేపుచుట్టాడు.

అప్పటికే నేను విపరీతంగా వణుకుతున్నాను. ఆపెయ్‌, అని నన్ను ఆజ్ఞాపించాడు. నేను ఆపుకోలేకపోతున్నానని ఆ టేపులోనుండి గొణిగాను. “అయితే, ఆలాగేవుండు, ఒకడు నిన్ను గమనిస్తున్నాడు, నీవు విడిపించుకొనడానికి ప్రయత్నించావో, అతడు నిన్ను చంపేస్తాడు” అని చెప్పి నన్ను విడిచి వెళ్లిపోయాడు. “దుష్టుని నుండి మమ్మును తప్పించుము” అనే దినవచనాన్ని నేను జ్ఞాపకం చేసుకొన్నాను, ఈ సమయంలో నాకది ఎంతగా సరిపోయిందని అనుకున్నాను.

త్వరలోనే అతడు తిరిగి వచ్చాడు కాని వేరొక కారులో వచ్చాడు—ఇంజను శబ్దమును బట్టి నాకారును నేను గుర్తుపట్టగలను. బహుశ అతడు తన స్వంత కారును తెచ్చుకున్నట్టున్నాడు. నా నడుమునకు చెట్టుకు కలిపిచుట్టిన టేపును తీసివేశాడు కాని నా కళ్లకు, నోటికి ఉన్నవి మాత్రం ఉంచాడు, నా చేతులు యింకా వెనుకకే ఉంచి టేపు చుట్టబడి ఉన్నాయి. ఆ దట్టమైన అడవి నుండి తిరిగి నన్ను కారు దగ్గరకు తీసుకువచ్చాడు. డిక్కీ తెరిచి, నన్ను దానిలోనికి త్రోసి, మూతవేసి కారు నడుపుట కారంభించాడు.

నేను మరలా ప్రార్థించుట మొదలుపెట్టాను. మున్ముందు ఏమి జరుగనైయున్నను దానిని సహించుటకు నాకవసరమగు శక్తిని దయచేయుమని యెహోవాను అడుగుతూ ఆ దినములో ఎక్కువ భాగం ప్రార్థిస్తూ వచ్చాను. దాదాపు మేము 15 లేక 20 నిమిషాలు ప్రయాణించాము పిమ్మట అతడు కారును ఆపి డిక్కీని తెరచి, నానోటికున్న టేపును తీసి, బ్యాంకు ఫోన్‌ నంబరు ఎంత అని అడిగాడు. నేను చెప్పాను, మీ అధికారి ఎవరు అని అడిగాడు. నేను చెప్పాను, మరలా నానోటికి టేపు పెట్టేసాడు. అతడు బ్యాంకుకు ఫోనుచేసి 1,50,000 డాలర్లు కావాలని పట్టుబట్టాడని నేను పిదప తెలుసుకున్నాను.

అతడు జార్జితో—అది ఆ రోజు బ్యాంకులో ఉన్న అధికారి పేరు—అట్లాంటాకు దక్షిణాన ఉన్న ఫలాని టెలిఫోన్‌ బూత్‌వద్ద మధ్యాహ్నం రెండు గంటలకెల్లా డబ్బు పట్టుకొని ఉండమన్నాడు, అప్పుడు అతనికి తదుపరి సూచనలివ్వబడతాయి అని చెప్పాడు. ఈ పురోగమనములను నాకు తెల్పి త్వరలోనే నేను విడుదల కావచ్చునని నాకు అభయమిచ్చాడు. అయితే, రెండు గంటలు చాలా దూరంగా ఉంది, నేనింకా ఈ డిక్కీలో అణచబడి కట్టిపడేయబడి యున్నాను. అది క్రమేపి వేడెక్కుతుంది. గంటలు మెల్లిగా గడుస్తున్నాయి. అతడు ఒకటి రెండుసార్లువచ్చి నేను ఎలా ఉన్నానో చూశాడు. “నీ దేవుడైన యెహోవా నిన్నుగూర్చి శ్రద్ధ తీసుకుంటున్నాడు,” అని అతడు వ్యాఖ్యానించాడు. కాబట్టి నేను ఉదయాన యెహోవాకు చేసిన ప్రార్థనను అతడు జ్ఞాపకము పెట్టుకున్నాడు.

నా కుటుంబాన్ని గూర్చి ఆలోచించాను. నేను కనబడుట లేదని వారికి తెలుసా? ఒకవేళ తెలిస్తే, వారు ఎలా ప్రతిస్పందిస్తున్నారు? నాకంటె వారిని గూర్చియే నేను ఎక్కువ చింతించాను. వివిధ లేఖనములను గూర్చి నేను తలంచాను. అందులో ఒకటి ఏమంటే యెహోవా నామము ‘బలమైన దుర్గము నీతిమంతుడు అందులోనికి పరుగెత్తి సురక్షితముగా ఉండును.’ మరియు ‘నీవు యెహోవా నామమున ప్రార్థిస్తే, నీవు రక్షించబడుదువు.’ మరియు “ఎడతెగక ప్రార్థించండి” అని అపొస్తలుడైన పౌలుయిచ్చిన సలహాను నేను నిశ్చయంగా అన్వయించాను. (సామెతలు 18:10; రోమీయులు 10:13; 1 థెస్సలొనీకయులు 5:17) బైబిలు వచనములే కాకుండా, కింగ్‌డం సాంగ్స్‌ పదాల రాగాలు నామదిలో కదలాడాయి, వాటిలో ‘యెహోవా నా దుర్గము, నా బలము, నా శక్తి’ మరియు ‘యెహోవా నాకాశ్రయం,’ అనునవున్నవి.

ది వాచ్‌టవర్‌ లో చదివిన అనుభవాలనుబట్టి కొన్ని శ్రమలను సహించుటకు యెహోవా యితరులకు సహాయం చేసిన దానిని నేను జ్ఞాపకము చేసుకున్నాను. ఒక బ్యాంకు దోపిడిలో నిర్భందమందుండిపోయిన ఒక సాక్షిని గూర్చి అవేక్‌! లోవచ్చిన అనుభవం నా మదిలో నిలిచిపోయింది.a దోపిడి దొంగ ఆమె పీకను నొక్కిపట్టుకొని ఒక చేతిబాంబును చూపిస్తూ ఆమెను బెదిరించాడు. ఆమె కొన్ని గంటలపాటు ఆ సంకటములో పడివుంది. ఆమె, ఆ దొంగ, ఇద్దరు లోపల నిర్భందించబడియుండగా బయట పోలీసులు చుట్టిముట్టారు. ఆమెకూడ యెహోవాకు ప్రార్థిస్తు, లేఖనములను గుర్తుతెచ్చుకొంటూ ఆ కఠిన పరీక్షను సహించింది. ఆమె తన ధైర్యానికి ప్రతిఫలంగా తన యింటికి క్షేమంగా చేరుకుంది.

చివరకు కారు ఆగింది, డ్రైవరు క్రిందికి దిగాడు. నా వాచీని చూడలేకున్నాను. ఎందుకంటె నా వెనుకకు మడిచి టేప్‌ పెట్టిన చేతికి అది ఉన్నది, కాని అప్పుడు రెండయ్యిందని, బ్యాంక్‌లో ఉన్న జార్జితో అతడు మాట్లాడడానికి వెళ్లాడని నేను సరిగ్గా ఊహించగల్గాను. నాకు త్వరలో విడుదల దొరుకుతుందని నిరీక్షించాను. కాని అలా జరుగలేదు. అతని పథకాలు సాఫీగా సాగలేదు, మేము మరలా ప్రయాణించసాగాము.

అకస్మాత్తుగా, ఇంజన్‌ వేగం పెరిగింది, కారు అతివేగంగా ముందుకు దూసుకుపోసాగింది. అతడు అతివేగంగా నడపడమే కాదు ట్రాఫిక్‌ను తప్పించుటకు అటుయిటు త్రిప్పసాగాడు. నేను డిక్కిలో అటుయిటూ కొట్టుకుంటున్నాను. నేను లేచిపడుతున్నాను, డిక్కీప్రక్కలకు నా తల తగులుతూ ఉంది. నాచేతులు, హస్తాలు, వెనుకకు నిర్భందించబడినందున, నేను అటుఇటు ఊగుతున్నప్పుడు నన్ను నేను ఆపుకోలేని నిస్సహాయ స్థితిలో లేదా దెబ్బలు తగలకుండా కాపాడుకోలేని స్థితిలో ఉన్నాను. అలా పదినిమిషాల వరకు కొనసాగింది, కాని అది నాకు ఎంతో సమయమనిపించింది.

ఆ తరువాత కారు ఆగింది, నేనెలా ఉన్నానో చూడడానికి అతడు డిక్కీ తెరిచాడు. స్పష్టంగా, నేను తిన్న దెబ్బలనుబట్టి ఎంతగానో కుదిపివేయబడి, బాధపడుతూ ఉన్నాను. నా గుండె అతి వేగంగా కొట్టుకుంటుంది. ఊపిరి పీల్చుట కష్టమయింది. నా వళ్లంతా చెమటలు పట్టాయి, నాచేతులు వెనుకకు కట్టబడియున్నందున తుడుచుకోలేని దుస్థితిలో ఉన్నాను. నా కళ్లకు, నా నోటికి వేయబడిన టేపు మధ్య విడువబడిన నా ముక్కుద్వారానే ఊపిరి పీల్చుకొనుట కష్టమయింది. నేను సులభంగా ఊపిరి తీసుకొనుటకు, ఒకవేళ నేను కోరితే మాట్లాడేందుకు వీలుగా నా నోటికున్న టేపును కొంచెముసేపు అతడు తొలగించాడు.

పోలీసులు తన కారును గుర్తుపట్టారని అతడు నాతో చెప్పాడు, అతడు తరమబడ్డాడు, అందుకే అతడు అంత వేగంగా వెళ్తూ వేరే కారులను తాకకుండా ఉండేందుకు అటుయిటూ త్రిప్పాడు. పోలీసుల బారినుండి తప్పించుకొనుటలో అతడు సఫలుడయ్యాడని, తనకింకా డబ్బు దొరకలేదని, తాను మరో రీతిగా ప్రయత్నించనై యున్నాడని, మరికొంత సమయం పడుతుందని, అయితే నేనేమి చింతించ నవసరము లేదని అతడు వివరించాడు. తాను నాకు భౌతికంగా హానిచేయనని, అది తన ఉద్దేశము కాదని అతడు మరలా అభయమిచ్చాడు. అతనికి డబ్బు కావాలి, అతడు దానిని పొందడానికి నేను కీలకము. అతడలా అన్నప్పుడు నా మనస్సు కుదుటపడింది., ఎందుకంటే అతడు నాకు హానిచేయుట ప్రారంభిస్తే, యుక్తమైన రీతిగా నేను ప్రతిఘటించుటకు సహాయము చేయుమని యెహోవాకు ప్రార్థించాను.

గంటలు గడిచాయి. బహుశ ఫోను చేయడానికో లేదా డబ్బు సంపాదించుటకు ప్రయత్నించడానికో అతడు రెండుసార్లు ఆగాడు. ఒకసారి అతడు ఆగినప్పుడు, ట్యాంక్‌లో పెట్రోల్‌ నింపుట నేను విన్నాను. నేను ఎంతగానో అణచబడియున్నాను. వీలైనంత మట్టుకు అవతలి ప్రక్కకు తిరగడానికి నేను ప్రయత్నించాను కొంచెం శబ్దమయ్యింది. వెంటనే అతడు డిక్కీ తెరిచి శబ్దము చెయ్యొద్దని నన్ను హెచ్చరించాడు. అప్పుడు టైం ఎంతయ్యి ఉంటుదోనని నేను తలంచాను. మొదటిసారిగా, రెండు అయ్యినప్పుడు తప్ప మరింకెప్పుడు అతడు నిర్దిష్టంగా నాకు చెప్పలేదు. మేమింకా అట్లాంటా ప్రాంతములోనే ఉన్నామని నేను తెలుసుకున్నాను, ఎందుకంటె విమానాశ్రయంలో విమానాలు బయలు దేరడం, దిగడం నేను విన్నాను.

అటుపిమ్మట, అతడు డిక్కీ తెరిచి ‘మరోగంట పడుతుంది. మరోగంట తర్వాత నీవు విడిచిపెట్టబడతావు’ అని చెప్పాడు. అలా ఎన్నోసార్లు చెప్పాడు. అందుకు నేనతన్ని నమ్మలేదు. కేవలం నిరీక్షించాను. బయట అంత వేడిగా లేదుగాని, డిక్కీలో నేను మూయబడియున్నాను, ఇరుకుగా, గాలి ఆడకుండా ఉంది, వేడెక్కుతుంది. నాకు విపరీతంగా చెమటపట్టింది, ఊపిరిపీల్చుట నాకింకా కష్టమైపోతుంది. నేనిక ఎంతసేపు శ్వాసించగలనో నాకు తెలియదు గనుక పునరుత్థానము గూర్చి ప్రార్థించుట మొదలుపెట్టాను.

ఒకవేళ నేను చనిపోతే, నా కుటుంబము దానిని తట్టుకొనేలా యెహోవా సహాయము చేయగలడని నేను నిరీక్షించాను. నేను నా గూర్చే కాకుండా నా కుటుంబాన్ని గూర్చి కూడా చింతించాను. నేను గాని చనిపోతే, యెహోవా నన్ను పునరుత్థానము చేయునని, తాను వాగ్దానము చేసిన నీతియుక్తమైన నూతన లోకములో నా కుటుంబముతో నేను కలుసుకోగలనని నాకు తెలుసు. (యోహాను 5:28, 29; 2 పేతురు 3:13) యెహోవాను గూర్చి ఆయన వాగ్దానములను గూర్చిన నా తలంపులు నన్ను ఆదుకున్నవి.

డ్రైవరు డిక్కీని మరలా తెరిచాడు. చీకటిపడింది—చీకటిపడి కొన్ని గంటలయ్యింది. ఇంకా ఎన్నోసార్లు ఫోనుచేశాడు. విడిపించుటకై మూల్యాన్ని వసూలు చేయుటకు అతడు చేసిన ప్రయత్నమేదియు ఫలించలేదు. చేసిన ప్రయత్నాలతో విసుగెత్తిపోయాడని, నన్ను తిరిగి కొలంబస్‌కు తీసుకుపోయి విడిచిపెడతానని అతడు చెప్పాడు. మేము అక్కడికి చేరుకునేసరికి, నేను పూర్తిగా అలసిపోయాను. అంతా సక్రమంగా ముగుస్తుందని ఆశిస్తూ, నేను ఆ డిక్కీలో పడి ఉన్నాను. కానీ నన్ను నేను బలపర్చుకొని, ‘లేదు, నేను అప్రమత్తంగా ఉండాలి, నన్ను నేను మేల్కొనియుండునట్లు చేసుకోవాలి. ఇదంతా త్వరలో ముగిసిపోతుంది. అతడు ఆశవదలుకున్నాడు, నన్ను యింటికి తీసుకుపోతున్నాడు’ అని తలంచాను.

నన్ను నా కారువద్ద విడిచిపెట్టాలనుకున్నాడు, కాని అది తాననుకున్న స్థలంలో లేదు. యెహోవాసాక్షుల రాజ్యమందిరము నొక దానినొద్దకు నన్ను తీసుకొని వెళ్లాడు, అందులో లైట్లు వెలుగుతున్నాయి. మా ప్రయాణ కాపరులలో ఒకరు అందు నివసిస్తున్నారు. “ప్రజలున్న చోట నేను నిన్ను విడిచిపెట్టను!” అన్నాడు. అయితే డిక్కీలోనుండి మొదటిసారిగా నన్ను బయటకు రానిచ్చాడు. కళ్లకు యింకా గంతలున్నవి, నా చేతులు యింకా వెనక్కి కట్టే ఉన్నవి. అయితే నా నోటికున్న టేపు మాత్రం అతడు తీసివేశాడు. నా తల తేలిపోతున్నట్లనిపించింది, నేను నడవలేక పోయాను—నాకాళ్లు పూర్తిగా తిమ్మిరెక్కినవి. నన్ను మరలా డిక్కీలో వేసాడు, అదే మార్గమున తిన్నగా తీసుకొనిపోయి, ఒక బాపిస్టు చర్చి వెనుక నన్ను విడిచి వెళ్లిపోయాడు అప్పుడు రాత్రి 1:30 అయ్యింది.

నాకు నిజంగా తల తిరిగినట్లనిపించింది, క్రింద కూర్చున్నాను, సొమ్మసిల్లిపోయాను. నాకు జ్ఞాపకమున్న ఆఖరు సంగతి అతని కారు వెళ్లిపోవడం. మూడు గంటల తర్వాత నాకు స్పృహ వచ్చేసరికి నేను గడ్డిమీద బురదలో పడివున్నాను. నా చేతులకున్న టేపును వదిలించుకున్నాను, తరువాత కళ్లకున్న దాన్ని కూడా తీసివేశాను. నా గడియారాన్ని చూశాను, అప్పుడు సమయం 5 కావడానికి యింకా 15 నిమిషాలున్నది. నేను డిక్కీలో 17 గంటలున్నాను, నేలమీద 3 గంటలు స్పృహలేని స్థితిలో ఉన్నాను. వణుకుతూ, తిమ్మిరెక్కిన కాళ్లతో నేను రోడ్డుమీదకు నడిచాను. ఒక వ్యక్తి తన ట్రక్కును ఇంటినుండి బయటికి తీస్తూ కనిపించాడు. నేను అపహరించబడితినని, నా కుటుంబానికి, పోలీసులకు ఈ విషయం తెలుపగోరుతున్నానని అతనికి చెప్పాను. పది నిమిషాలలో పోలీసులు వచ్చారు. అంతటితో అది ముగిసింది.

పరీక్షింపబడు నిమిత్తం నేను వైద్య కేంద్రమునకు తీసుకొనిపోబడ్డాను. నేను 20 గంటలసేపు ఏమి తినకుండా, త్రాగకుండా ఉన్నాను, బాత్‌రూమ్‌ సౌకర్యాలు లేవు, కేవలం ఆఖరు మూడు గంటలుమాత్రమే నిద్రపోయాను. నా శరీరమంతా గాయాలయ్యాయి. నా దుస్తులు మురికైనాయి, నా తలవెంట్రుకలు చిందరవందరైనవి, నా ముఖం మలినమై, టేపుకున్న జిగురులతో వికారంగా తయారయ్యింది. అయితే నేను నా భర్త, బ్రాడ్‌, నాతల్లి గ్లెండా ఆలాగే నన్ను తిరిగి ఆహ్వానించుటకు అక్కడ సమకూడిన యితర అనేక ప్రియ బంధుమిత్రులతో కలిసికొనుటకు యివేమి నన్ను ఆటంకపర్చలేదు. వారు వేచియుండి చింతించే కఠిన పరీక్ష నా సమస్యకు వేరుగా ఉన్నది, అయితే ఒక విధంగా చెప్పాలంటే అది మరింత బాధ కల్గించి యుండవచ్చును.

వైద్య కేంద్రంనుండి, పోలీసువారడిగే ప్రశ్నలకు నేను సమాధానమిచ్చుటకు, వాగ్మూలమివ్వడానికి పోలీసు స్టేషన్‌కు వెళ్లాను. కొలంబస్‌ లెడ్జర్‌-ఎంక్వైరర్‌ మే 25, 1991 నందు నివేదించిన ప్రకారం నన్ను అపహరించుకు పోయినవాడు యిప్పుడు పట్టుబడ్డాడు. అతడు నన్ను బలత్కారంగా అపహరించుటకు ముందు అతనిపై “గత వారాంతములో సంభవించిన మానభంగము, విపరీత పురుష సంయోగమునకు కూడా సంబంధముందని నేరము మోపబడింది,” అని పోలీసు వారు చెప్పారు. “మేము లీసా ప్రాణాన్నిగూర్చి నిజంగా భయపడ్డాము” అందుకే ఈ విషయాన్ని పత్రికలవాళ్లు మరుగుగా ఉంచాలని పోలీసు ముఖ్యాధికారి వెథరిన్‌టన్‌ కోరినట్లు కూడ ఈ పత్రికలో నివేదించబడింది. నేను యెహోవా మీద ఆధారపడినందునే నేను కాపాడబడ్డానని ఇదంతా నాలో మరింత ఎక్కువ నమ్మకాన్ని కలుగజేసింది.

నేను యింటికి వెళ్లి నా జీవితంలో అతిచక్కని వేన్నీళ్ల స్నానంచేసి, కమ్మగా నిద్రపోయాను. ఈ హృదయరంజిత ఆలోచనతో గాఢనిద్రలోనికి జారుకున్నాను: ఆ రోజు దినవచనము మత్తయి 6:13 యింకనూ నాకు ఓదార్పుకరంగా ఉన్నది, ఆలాగే కీర్తన 146:7 ప్రకారం, ‘బంధింపబడినవారిని ఆయన విడుదల చేయును’ అన్న అనుభవాన్ని నేను పొందాను.—లీసా డేవిన్‌పోర్ట్‌ చెప్పిన వృత్తాంతం. (g91 11/22)

[అధస్సూచీలు]

a  డిశంబరు 8, 1990 అవేక్‌! (ఇంగ్లీషు) 17-19 పేజీలు చూడండి.

[21వ పేజీలోని చిత్రం]

“నిశ్శబ్దంగా ప్రార్థించుకో. వినడానికి నాకిష్టం లేదు”

[21వ పేజీలోని చిత్రం]

అతడు డిక్కీ తెరిచి, నన్ను దానిలోకి త్రోసి, మూతవేసి కారు నడుపుట కారంభించాడు

[22వ పేజీలోని చిత్రం]

నేను లేచిపడుతున్నాను, డిక్కీ ప్రక్కలకు నా తల తగులుతూ ఉంది

[23వ పేజీలోని చిత్రం]

అంతా సక్రమంగా ముగియునని ఆశిస్తూ నేను ఆ డిక్కీలో పడి ఉన్నాను

[24వ పేజీలోని చిత్రం]

మూడు గంటల తరువాత నాకు స్పృహ వచ్చేసరికి నేను గడ్డిమీద బురదలో పడి ఉన్నాను

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి