జీవిత కథ
నా మొదటి ప్రేమను గుర్తుంచుకోవడం వల్ల సహించగలిగాను
అమెరికాలోని పెన్సిల్వేనియాలో ఉన్న ఫీనిక్స్విల్ పట్టణంలోని, వాలీ ఫోర్జ్ జనరల్ హాస్పిటల్ మంచం మీద నేను పడుకొనివున్నాను. అది 1970వ సంవత్సరం, వేసవికాలం ప్రారంభం. నాకప్పుడు 20 సంవత్సరాలు. నేను ఓ సైనికుణ్ణి, తీవ్రమైన ఇన్ఫెక్షన్తో బాధపడుతున్నాను. ఒక నర్సు అరగంటకు ఓసారి నా బి.పి. చూస్తున్నాడు. నాకన్నా కొన్ని సంవత్సరాలు పెద్దవాడైన ఆ నర్సు కాస్త ఆందోళనగా ఉన్నాడు. నా బి.పి. అంతకంతకు తగ్గిపోతుండడంతో నేను ఆయన్ను ఇలా అడిగాను, “ఇంతకుముందు మీ కళ్లముందు ఎవరూ చనిపోలేదా?” ఆ మాట వినగానే ఆయన మొహం పాలిపోయింది. ‘లేదు’ అని ఆయన జవాబిచ్చాడు.
నేనిక జీవితం మీద ఆశ వదులుకున్నాను. ఇంతకీ నేను హాస్పిటల్లో ఉండాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? నా జీవితంలో జరిగిన కొన్ని విషయాలు మీకు చెప్తాను.
యుద్ధంతో నా మొదటి అనుభవం
వియత్నాం యుద్ధ సమయంలో ఆపరేషన్ గది టెక్నీషియన్‌గా పని చేస్తుండగా నేను అనారోగ్యం పాలయ్యాను. నేను, ఆ యుద్ధంలో గాయపడినవాళ్లకు, ఆరోగ్యం బాగోలేనివాళ్లకు సంతోషంగా సేవలు చేసేవాణ్ణి. సర్జన్ అవ్వాలనేది నా కోరిక. నేను 1969, జూలై నెలలో వియత్నాంకు వచ్చాను. అక్కడికి కొత్తగా వచ్చిన మిగతా వాళ్లలాగే నాకు కూడా ఆ ప్రాంతానికి, తీవ్రమైన వేడికి అలవాటుపడడానికి ఓ వారంపాటు శిక్షణ ఇచ్చారు.
ఆ తర్వాత, డోంగ్ టామ్లోని మెకాంగ్ డెల్టాలో ఉన్న ఓ సర్జికల్ హాస్పిటల్లో డ్యూటీలో చేరాను. చేరిన వెంటనే, యుద్ధంలో గాయపడిన, చనిపోయిన ఎంతోమందిని హెలికాప్టర్లలో అక్కడికి తీసుకొచ్చారు. నాకు దేశభక్తి చాలా ఎక్కువ, పైగా పని చేయడం అంటే ఇష్టం అందుకే వాళ్లకు వెంటనే సేవలు అందించడం మొదలుపెట్టాను. గాయపడినవాళ్లను ఆపరేషన్ కోసం సిద్ధం చేసి ఆపరేషన్ గదుల్లోకి తీసుకెళ్లాం. ఏ.సి ఉన్న చిన్న మెటల్ కంటెయినర్లనే ఆపరేషన్ గదులుగా ఉపయోగించేవాళ్లు. వాళ్ల ప్రాణాలు కాపాడడానికి ఒక సర్జన్, ఒక మత్తు డాక్టర్, ఇద్దరు నర్సులు ఆ ఇరుకు గదుల్లోనే ఎంతో ప్రయాసపడేవాళ్లు. అయితే, హెలికాప్టర్లలో నుండి కొన్ని పెద్దపెద్ద నల్ల బ్యాగులను దించకుండా అలానే వదిలేశారని నేను గమనించాను. యుద్ధంలో బాంబు దాడిలో ముక్కలైన సైనికుల శరీర భాగాలు ఆ బ్యాగుల్లో ఉన్నాయని నాకు చెప్పారు. అది యుద్ధంతో నా మొదటి అనుభవం.
దేవుణ్ణి తెలుసుకోవడం కోసం నా ప్రయత్నం
యౌవనంలో ఉన్నప్పుడు, నాకు సత్యం గురించి కొంత తెలుసు
నేను యౌవనంలో ఉన్నప్పుడు, యెహోవాసాక్షులు చెప్పే సత్యం గురించి కొంత తెలుసు. మా అమ్మ బైబిలు స్టడీ తీసుకుంది కానీ బాప్తిస్మం తీసుకోలేదు. అమ్మతోపాటు స్టడీలో కూర్చోవడమంటే నాకు చాలా ఇష్టం. ఒకరోజు, నా మారుటి తండ్రితో కలిసి ఓ రాజ్యమందిరం వైపుగా వెళ్తూ, “అదేంటి?” అని అడిగాను. అందుకు ఆయన, “వాళ్ల దగ్గరకు ఎప్పుడూ వెళ్లొద్దు” అని నాకు చెప్పాడు. నాకు ఆయన మీద ఉన్న ప్రేమ, నమ్మకం వల్ల ఆ మాటకు విలువిచ్చాను. అలా యెహోవాసాక్షులకు దూరమయ్యాను.
అయితే వియత్నాం నుండి తిరిగొచ్చాక, దేవుని గురించి తెలుసుకోవాలనే ఆసక్తి నాలో కలిగింది. యుద్ధానికి సంబంధించిన చేదు జ్ఞాపకాలవల్ల నా మనసు అప్పటికే మొద్దుబారిపోయింది. అసలు ఆ దేశంలో ఏమి జరుగుతుందో చాలామందికి తెలీదనిపించింది. యుద్ధంలో చిన్నపిల్లలు కూడా చనిపోతున్నారనే వార్తలు విని, నిరసనకారులు అమెరికా సైనికుల్ని పసిపిల్లల హంతకులుగా వర్ణిస్తూ ప్రదర్శనలు చేయడం నాకు గుర్తుంది.
దేవుని గురించి తెలుసుకోవాలనే కోరికతో నేను చాలా చర్చీలు తిరిగాను. నాకు దేవుని మీద ఎప్పుడూ ప్రేమ ఉండేది కానీ చర్చీల్లో జరిగేవి నచ్చేవి కాదు. చివరికి 1971, ఫిబ్రవరి నెలలో ఓ ఆదివారం, ఫ్లోరిడాలోని డెల్రే బీచ్‌లో ఉన్న యెహోవాసాక్షుల రాజ్యమందిరానికి వెళ్లాను. అక్కడితో దేవుని కోసం వెదికే నా ప్రయత్నం ముగిసింది.
ఆ రోజు నేను వెళ్లే సమయానికి బహిరంగ ప్రసంగం అయిపోవచ్చింది. దాంతో అక్కడే ఉండి, ఆ తర్వాత జరిగే కావలికోట అధ్యయనాన్ని విన్నాను. ఆ రోజు దేనిగురించి చర్చించారో గుర్తులేదుగానీ, అక్కడున్న చిన్న పిల్లలు బైబిలు తెరిచి లేఖనాలు చూడడం మాత్రం ఇప్పటికీ గుర్తుంది. అది నా మనసుకు నిజంగా హత్తుకుంది. అక్కడ జరుగుతున్నదంతా శ్రద్ధగా వింటూ గమనించాను. మీటింగ్ అయ్యాక వెళ్లిపోతుండగా, జిమ్ గార్డనర్ అనే 80 ఏళ్ల సహోదరుడు నా దగ్గరకు వచ్చాడు. నిత్యజీవమునకు నడుపు సత్యము అనే పుస్తకాన్ని చూపించి, “దయచేసి దీన్ని చదువుతారా?” అని అడిగాడు. మేమిద్దరం బైబిలు స్టడీ కోసం గురువారం ఉదయం కలుద్దామని అనుకున్నాం.
ఆ ఆదివారం రాత్రి నాకు డ్యూటీ ఉంది. ఫ్లోరిడాలో బొకా రాటన్లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో ఎమర్జెన్సీ వార్డులో నేను పని చేస్తున్నాను. నా డ్యూటీ, రాత్రి 11 నుండి ఉదయం 7 వరకు. రాత్రి పూట నిశ్శబ్దంగా ఉండడంతో సహోదరుడిచ్చిన ఆ పుస్తకం చదవడం మొదలుపెట్టాను. ఇంతలో ఓ సీనియర్ నర్సు నా చేతిలో ఉన్న పుస్తకాన్ని లాక్కొని, కవరు పేజీ చూసి, ‘నువ్వు వాళ్లలో ఒకడివి అవ్వాలనుకోవట్లేదు కదా?’ అని గట్టిగా అరిచింది. ఆమె చేతిలో నుండి పుస్తకాన్ని తిరిగి లాక్కొని, ‘నేను సగమే చదివాను. కానీ మీరన్నదే జరిగేలా ఉంది’ అని అన్నాను. దాంతో ఆమె అక్కడినుండి వెళ్లిపోయింది. ఆ రాత్రే పుస్తకం మొత్తం చదివేశాను.
ఛార్లెస్ తేజ్ రస్సెల్‌తో పరిచయమున్న జిమ్ గార్డనర్ అనే అభిషిక్త సహోదరుడు నాతో బైబిలు స్టడీ చేశాడు
సహోదరుడు గార్డనర్ స్టడీ చేయడానికి నా దగ్గరికి వచ్చినప్పుడు, ‘ఇప్పుడు మనం దేన్ని స్టడీ చేయబోతున్నాం?’ అని అడిగాను. ‘నేను మీకిచ్చిన పుస్తకాన్ని’ అని ఆయన జవాబిచ్చాడు. ‘నేను ఆ పుస్తకం మొత్తం చదివేశాను’ అని ఆయనతో చెప్పాను. దానికి ఆయన ఎంతో దయగా ‘సరే, మనం మొదటి అధ్యాయం పరిశీలిద్దాం’ అని అన్నాడు. ఆ పుస్తకంలోని విషయాలను ఆయన వివరించేటప్పుడు, ఇవన్నీ నాకెందుకు అర్థంకాలేదా అని ఆశ్చర్యపోయాను. ఆయన చెప్తున్నప్పుడు, నా దగ్గరున్న కింగ్ జేమ్స్ వర్షన్ బైబిల్లో లేఖనాలను తీసి చూశాను. అలా చివరికి నిజమైన దేవుడైన యెహోవా గురించి తెలుసుకునే అవకాశం వచ్చింది. జిమ్ అని నేను ప్రేమతో పిలిచే సహోదరుడు గార్డనర్ ఆరోజు ఉదయం, ఆ పుస్తకంలోని మూడు అధ్యాయాలను నాతో చర్చించాడు. అప్పటినుండి మేము ప్రతి గురువారం ఉదయం కలుసుకుని, మూడు అధ్యాయాలను చర్చించేవాళ్లం. ఆయన చెప్పే విషయాలు నాకు చాలా నచ్చేవి. ఛార్లెస్ టి. రస్సెల్‌తో పరిచయం ఉన్న ఆ అభిషిక్త సహోదరుని దగ్గర నేర్చుకోవడం నాకు దొరికిన గొప్ప అవకాశం.
కొన్ని వారాల తర్వాత, నేను ప్రచారకుణ్ణి అయ్యాను. ఇంటింటి పరిచర్యలో, అలాగే చాలా విషయాల్లో జిమ్ నాకు సహాయం చేశాడు. (అపొ. 20:20) జిమ్ నా పక్కనే ఉండేవాడు కాబట్టి, ఆనందంగా పరిచర్య చేసేవాణ్ణి. పరిచర్య చేయడం ఇప్పటికీ ఓ గొప్ప అవకాశంగా భావిస్తాను. నిజంగా దేవుని ‘జతపనివారిగా’ పని చేయడం ఎంత సంతోషాన్నిస్తుందో!—1 కొరిం. 3:9.
యెహోవామీద నాకు మొదటిసారి కలిగిన ప్రేమ
ఇప్పుడు మీకు నా వ్యక్తిగత విషయం గురించి, అంటే యెహోవామీద నాకు మొదటిసారి కలిగిన ప్రేమ గురించి చెప్తాను. (ప్రక. 2:4) ఆ ప్రేమే, యుద్ధానికి సంబంధించిన చేదు జ్ఞాపకాలనూ ఎన్నో ఇతర కష్టాలనూ దిగమింగడానికి నాకు సహాయం చేసింది.—యెష. 65:17.
యెహోవామీద నాకున్న ప్రేమవల్ల యుద్ధం తాలూకు చేదు జ్ఞాపకాలను, ఇతర కష్టాలను తట్టుకోగలిగాను
1971, జూలై నెలలో యాంకీ స్టేడియంలో జరిగిన “దైవిక నామం” అనే జిల్లా సమావేశంలో నేను బాప్తిస్మం తీసుకున్నాను
అది 1971 సంవత్సరం, చలికాలం. అప్పటిదాకా నేను ఉంటున్న ఫ్లాట్ నుండి నా మారుటి తండ్రి నన్ను వెళ్లిపొమ్మన్నాడు. ఒక యెహోవాసాక్షి తన అపార్ట్మెంట్లో ఉండడం ఆయనకు ఇష్టంలేదు. ఆ సమయంలో నా దగ్గర ఎక్కువ డబ్బులు కూడా లేవు. నేను పని చేసే హాస్పిటల్లో, రెండు వారాలకొకసారి మాత్రమే జీతం ఇస్తారు. వచ్చిన జీతాన్ని చాలావరకు, బట్టలు కొనుక్కోవడానికే ఖర్చుపెట్టేశాను. పరిచర్యకు వెళ్లాలన్నా, యెహోవాకు మహిమ తీసుకురావాలన్నా హుందాగా కనిపించాలి కదా. నేను దాచుకున్న డబ్బులు కొన్ని ఉన్నాయి కానీ, అవి నేను పెరిగిన మిచిగాన్ రాష్ట్రంలోని బ్యాంక్‌లోనే ఉండిపోయాయి. ఇక తప్పని పరిస్థితుల్లో, కొన్ని రోజులపాటు నేను నా కారులోనే ఉండాల్సి వచ్చింది. షేవింగ్, స్నానం వంటివి పెట్రోల్ బంకుల్లో ఉండే టాయిలెట్స్‌లో చేసేవాణ్ణి.
అలా ఓ రోజు, డ్యూటీ అయిపోగానే హాస్పిటల్ నుండి నేరుగా రాజ్యమందిరానికి వచ్చాను. క్షేత్రసేవా కూటానికి ఇంకా రెండు గంటల సమయం ఉండడంతో, రాజ్యమందిరం వెనుక ఎవ్వరికీ కనిపించని చోటకు వెళ్లి కూర్చున్నాను. ఆ సమయంలో, వియత్నాంలో చూసిన దృశ్యాలు, కాలిన శరీరం వాసన, అక్కడ చిందిన రక్తం వీటన్నిటి తాలూకు జ్ఞాపకాలు నన్ను చుట్టుముట్టాయి. కొన ఊపిరితో ఉన్న యౌవనులు, “నేను బ్రతుకుతానా? నేను బ్రతుకుతానా?” అని నన్ను దీనంగా అడిగిన మాటలు నాకింకా వినబడుతున్నాయి. వాళ్లింకా నా కళ్ల ముందే మెదులుతున్నారు. వాళ్లు బ్రతకరని నాకు తెలిసినా, ఆ నిజాన్ని దాచిపెట్టి, వాళ్లకు ఏమీకాదని ధైర్యం చెప్పడానికి శాయశక్తులా ప్రయత్నించాను. ఇవన్నీ గుర్తొచ్చి నాకు దుఃఖం పొంగుకొచ్చింది.
యెహోవాపట్ల నా మొదటి ప్రేమను కాపాడుకోవడానికి, ముఖ్యంగా కష్టాలూ ఇబ్బందులూ వచ్చినప్పుడు అలా చేయడానికి నేను చేయగలిగినదంతా చేశాను
నేను ఏడుస్తూ యెహోవాకు ప్రార్థించాను. (కీర్త. 56:8) పునరుత్థాన నిరీక్షణ గురించి లోతుగా ఆలోచించడం మొదలుపెట్టాను. అప్పుడు ఒక విషయం నా మనసుకు హత్తుకుంది. అదేంటంటే, యుద్ధం వల్ల జరిగిన నష్టాన్నంతటినీ యెహోవా సరిచేస్తాడు, చనిపోయిన వాళ్లను మళ్లీ బ్రతికించి, నేనూ ఇతరులూ పడ్డ వేదనను పూర్తిగా తీసేస్తాడు. ఆ యౌవనుల్ని కూడా యెహోవా తిరిగి బ్రతికిస్తాడు, అప్పుడు వాళ్లకు దేవుని గురించిన సత్యం నేర్చుకునే అవకాశం దొరుకుతుంది. (అపొ. 24:14, 15) ఆ క్షణం, యెహోవా మీద ప్రేమతో నా హృదయం ఉప్పొంగింది. ఆ ప్రేమ నా మనసు లోతుల్లోకి వెళ్లి నన్ను పులకరింపజేసింది. ఆ ప్రత్యేకమైన రోజును నేను ఎప్పటికీ మర్చిపోను. అప్పటినుండి, ఎన్ని కష్టాలూ ఇబ్బందులూ వచ్చినా నాకు యెహోవా పట్ల మొదటిసారి కలిగిన ఆ ప్రేమను కాపాడుకోవడానికి చేయగలిగినదంతా చేస్తున్నాను.
యెహోవా నాకు మేలు చేస్తూనే ఉన్నాడు
యుద్ధంలో పాల్గొనేవాళ్లు చాలా దారుణమైన పనులు చేస్తారు, నేను కూడా చేయాల్సి వచ్చింది. అయితే నాకెంతో ఇష్టమైన రెండు లేఖనాల గురించి ఆలోచించడం వల్ల నేను ఊరట పొందాను. మొదటిది, ప్రకటన 12:10, 11. మనమిచ్చే సాక్ష్యం వల్ల మాత్రమే కాదుగానీ గొర్రెపిల్ల రక్తం వల్ల కూడా సాతానును జయిస్తామని ఆ వచనాల్లో ఉంది. రెండవది, గలతీయులు 2:20. యేసుక్రీస్తు ‘నా కోసం’ చనిపోయాడని ఆ లేఖనం వల్ల అర్థం చేసుకున్నాను. యేసుక్రీస్తు చిందించిన రక్తాన్ని యెహోవా నాకు అన్వయించి నేను చేసిన పాపాలన్నిటినీ క్షమించాడు. ఆ సత్యం తెలుసుకోవడం, నిర్మలమైన మనస్సాక్షితో ఉండడానికి నాకు సహాయం చేసింది. అంతేకాదు, ఎంతో కనికరంగల యెహోవా గురించి ఇతరులకు చెప్పడానికి చేయగలిగినదంతా చేసేలా అది నన్ను ప్రోత్సహించింది.—హెబ్రీ. 9:14.
ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే, యెహోవా నాపట్ల చూపించిన శ్రద్ధకు నా మనసు కృతజ్ఞతతో నిండిపోతుంది. ఉదాహరణకు, నేను కారులోనే ఉంటున్నానని జిమ్‌కు తెలిసిన వెంటనే, నన్ను ఇళ్లు అద్దెకిచ్చే ఓ సహోదరి దగ్గరకు తీసుకెళ్లాడు. యెహోవా వాళ్లిద్దరి ద్వారా నాకు ఓ మంచి వసతిని ఏర్పాటు చేశాడనడంలో ఎలాంటి సందేహం లేదు. యెహోవా ఎంతో దయగలవాడు. తనను నమ్మకంగా ఆరాధించే వాళ్లగురించి ఆయన శ్రద్ధ తీసుకుంటాడు.
వివేచనతో ప్రకటించడం నేర్చుకున్నాను
నేను 1971 మే నెలలో, ఓ పనిమీద మిచిగాన్ వెళ్లాల్సి వచ్చింది. మా సంఘానికి వెళ్లి నా కారు డిక్కీ మొత్తం సాహిత్యంతో నింపుకుని ఉత్తరం దిశగా ప్రయాణం సాగించాను. పక్క రాష్ట్రమైన జార్జీయా దాటేసరికల్లా కారు డిక్కీ ఖాళీ అయిపోయింది. దారిలో ఉన్న అన్ని ప్రాంతాల్లో ఉత్సాహంగా రాజ్యసువార్త ప్రకటిస్తూ ప్రయాణించాను. జైళ్లలో, ఆఖరికి విశ్రాంతి గదుల్లో ఉండే బాత్రూముల్లో కూడా కరపత్రాలను పంచిపెట్టాను. వాళ్లలో ఒక్కరైనా సత్యంలోకి వచ్చారో లేదోనని ఇప్పటికీ ఆలోచిస్తూ ఉంటాను.—1 కొరిం. 3:6, 7.
అయితే, నేను మొదట్లో ఇతరులకు, ముఖ్యంగా నా కుటుంబ సభ్యులకు సత్యం గురించి చెప్పేటప్పుడు వివేచన లేకుండా మాట్లాడేవాణ్ణి. యెహోవామీద నాకున్న మొదటి ప్రేమ వల్ల, చాలా ధైర్యంగా సువార్త ప్రకటించేవాణ్ణి, కాకపోతే ఆలోచించకుండా మాట్లాడేవాణ్ణి. మా అన్నయ్యలు జాన్, రోన్ అంటే నాకు చాలా ఇష్టం. వాళ్లు విన్నా వినకపోయినా బలవంతంగా బైబిలు విషయాలు చెప్పేవాణ్ణి. అలా ప్రవర్తించినందుకు వాళ్లను ఆ తర్వాత క్షమాపణ అడిగాను. అయితే, వాళ్లు సత్యం అంగీకరించాలని నేను ఇప్పటికీ ప్రార్థిస్తూనే ఉన్నాను. యెహోవా నాకు శిక్షణ ఇవ్వడంవల్ల నేను మరింత వివేచనతో ప్రకటించడం, బోధించడం నేర్చుకున్నాను.—కొలొ. 4:6.
నేను ప్రేమించిన ఇతర విషయాలు
యెహోవామీద నాకు మొదటిసారి కలిగిన ప్రేమను ఎప్పటికీ మర్చిపోలేను. అలాగే నేను ప్రేమించిన ఇతరులు కూడా నాకు విలువైనవాళ్లే. యెహోవా తర్వాత నేను ఎక్కువగా ప్రేమించింది నా భార్య సూజన్‌ను. ప్రకటనా పనిలో నాకు సహకరించే ఒక తోడు కావాలని కోరుకున్నాను. సూజన్ యెహోవాతో చాలా దగ్గరి సంబంధం ఉన్న అమ్మాయి. మేము డేటింగ్లో ఉన్నప్పుడు ఓ రోజు, రోడ్ ఐలాండ్‌లోని క్రాన్స్టన్లో ఉన్న వాళ్ల ఇంటికి వెళ్లడం నాకిప్పటికీ గుర్తే. అప్పుడు ఆమె వరండాలో కూర్చుని కావలికోట చదువుతూ ఉంది. నాకు బాగా నచ్చిన విషయమేమిటంటే, ఆమె ఓ సైడ్ ఆర్టికల్‌ని చదువుతూ బైబిల్లో లేఖనాలు తీసి చూస్తుంది. ‘తను నిజంగా ఆధ్యాత్మికమైన అమ్మాయి’ అని నాకు అనిపించింది. మేము 1971 డిసెంబరులో పెళ్లి చేసుకున్నాం. ఆ రోజు నుండి ఇప్పటివరకు, ఆమె నా పక్కనే ఉంటూ మద్దతిస్తున్నందుకు ఎంతో సంతోషిస్తున్నాను. ఆమెకు నామీద కన్నా యెహోవామీద ఎక్కువ ప్రేమ ఉంది, ఆ విషయం నాకు బాగా నచ్చింది.
నా భార్య సూజన్, పిల్లలు పాల్, జెసీలతో
మాకు జెసీ, పాల్ అని ఇద్దరు కొడుకులు ఉన్నారు. వాళ్లు పెరుగుతున్నప్పుడు యెహోవా వాళ్లకు తోడుగా ఉన్నాడు. (1 సమూ. 3:19) వాళ్లు సత్యాన్ని అంగీకరించి, తల్లిదండ్రులుగా మేము గర్వపడేలా చేశారు. వాళ్లు కూడా యెహోవా పట్ల మొదటిసారి తమకు కలిగిన ప్రేమను గుర్తుచేసుకుంటూ ఆయన సేవలో కొనసాగుతున్నారు. వాళ్లిద్దరూ 20 కన్నా ఎక్కువ సంవత్సరాలుగా పూర్తికాల సేవ చేస్తున్నారు. అంతేకాదు, నేను కూతుళ్లుగా భావించే మా ఇద్దరు కోడళ్లు స్టిఫానీ, రాకెల్ను చూసి నేను గర్వపడుతున్నాను. మా ఇద్దరు అబ్బాయిలూ యెహోవాను మనస్ఫూర్తిగా ప్రేమించే అమ్మాయిల్ని పెళ్లి చేసుకున్నారు.—ఎఫె. 6:6.
సువార్త ఎక్కువగా ప్రకటించని ప్రాంతాలకు కుటుంబమంతా వెళ్లి ప్రకటించడమంటే మాకు ఇష్టం
బాప్తిస్మం తీసుకున్న తర్వాత, నేను 16 ఏళ్లపాటు రోడ్ ఐలాండ్‌లో సేవ చేశాను. అక్కడ నేను ఎంతోమంది విలువైన స్నేహితుల్ని సంపాదించుకున్నాను. నేను కలిసి పనిచేసిన సంఘ పెద్దలతో ఎన్నో మరువలేని జ్ఞాపకాలున్నాయి. అంతేకాదు, నామీద మంచి ప్రభావం చూపించిన ఎంతోమంది ప్రయాణ పర్యవేక్షకులందరికీ నేను కృతజ్ఞుణ్ణి. యెహోవా పట్ల తమకు మొదటిసారి కలిగిన ప్రేమను చెక్కుచెదరనివ్వని ఆ సహోదరులతో కలిసి పనిచేయడం నాకు దొరికిన గొప్ప అవకాశం. అవసరం ఎక్కువున్న ప్రాంతంలో సేవ చేయడం కోసం మేము 1987లో ఉత్తర కరోలినాకు వెళ్లాం. అక్కడ కూడా ఎంతోమంది ఆత్మీయుల్ని సంపాదించుకున్నాం.a
ప్రయాణ సేవలో ఉన్నప్పుడు క్షేత్రసేవా కూటం నిర్వహిస్తూ
మేము 2002, ఆగస్టు నెలలో అమెరికాలోని ప్యాటర్సన్ బెతెల్ కుటుంబంలో సభ్యులమయ్యాం. నేను సేవా విభాగంలో, సూజన్ లాండ్రీలో పని చేశాం. ఆమె ఆ పనిని ఎంతో ప్రేమించింది. ఆ తర్వాత 2005, ఆగస్టు నెలలో పరిపాలక సభ సభ్యునిగా సేవ చేసే గొప్ప అవకాశం నాకు వచ్చింది. ఆ పనికి నేను సరిపోనని అనిపించింది. ఆ నియామకంతో వచ్చే బాధ్యత, పనులు, చేయాల్సిన ప్రయాణాల గురించి ఆలోచించి నా భార్య కంగారుపడింది. విమాన ప్రయాణమంటే తనకు ఇబ్బంది, కానీ మేము చాలాసార్లు విమానాల్లో ప్రయాణిస్తుంటాం. ఇతర పరిపాలక సభ సభ్యుల భార్యలు ప్రేమతో ఇచ్చిన సలహాలు, నాకు వీలైనంత ఎక్కువగా మద్దతిచ్చేలా తనకు సహాయం చేశాయని సూజన్ చెప్తుంది. ఆమె నిజంగా నాకు ఎంతో సహకరిస్తుంది, అందుకే నాకు తనంటే చాలా ఇష్టం.
నా ఆఫీసులో చాలా ఫొటోలు ఉంటాయి, అవి నాకెంతో విలువైనవి. నేను ఎంత అద్భుతమైన జీవితాన్ని గడిపానో అవి నాకు గుర్తుచేస్తుంటాయి. యెహోవా మీద నాకు మొదటిసారి కలిగిన ప్రేమను గుర్తుంచుకోవడానికి కృషి చేస్తున్నందుకు నేను ఇప్పటికే ఎన్నో గొప్ప ఆశీర్వాదాలు పొందాను.
నా కుటుంబంతో సమయం గడపడమంటే నాకు చాలా ఇష్టం