అనంత విశ్వములోనికి పరికించుట
హవాయి నుండి అవేక్! ప్రతినిధి పంపినది
మీరు గతంలోకి చూడగోరుచున్నట్లైన అది సాధ్యమా? దాని సమాధానము, అవును!
వాస్తవానికి, తారలతో నిండిన నింగిని చూచినప్పుడల్లా మనము గతములోకి చూస్తున్నాము. కానీ, గతించిన కాలము యొక్క అందాలను అనుభవించుటకు మనమెక్కడికి వెళ్ళగలము? మరి, పూర్వమందున్న పోలినేసియా ద్వీపవాసులు నక్షత్రములను వెంబడించి హవాయి ద్వీపమును కనుగొన్నారు, అలాగే తారలను అనుసరించి వాటిని పరిశీలించగోరు వారనేకులు ఈ ద్వీపరాష్ట్రానికి వస్తుంటారు. అయితే, వారక్కడ అత్యున్నత ఖగోళశాస్త్ర సాంకేతిక నైపుణ్యము కనుగొందురు—అట్టి సాంకేతిక నైపుణ్యము మానవులకు సుదూర గతమును పరీక్షించుటకు సహాయపడును.
మనము హవాయి ద్వీపము లేక పెద్ద ద్వీపమునకు ప్రయాణిద్దాము. మనమక్కడ, గతములో అగ్ని పర్వతమైయుండిన మౌనా కీ పైకి ఎక్కుదుము. ప్రపంచములోకెల్లా శ్రేష్ఠమైన అంతరిక్ష పరిశీలనా కేంద్రమును సందర్శింతుము, ఇది 4,205 మీటర్ల ఎత్తులోవుండి, అనంత విశ్వములోకి పరికించుటకు సమర్పింపబడింది.
మౌనా కీని అధిరోహించుట
మౌనా కీ పైకి తొలి పొద్దున మొదలైన మా ప్రయాణము వంకలు తిరుగుతూ చాలా దూరముగావుంది. సంవత్సరమునకు 500 సెంటీమీటర్ల వర్షపాతముగల దిగువ ప్రాంత ఉష్ణమండల వాతావరణమునుండి, ఆరిపోయిన ఈ అగ్ని పర్వతము మీద సంవత్సరములో అనేక నెలలు మంచుకురిసే ఏటవాలు బంజరు భూమి మీదికి చేరుకున్నాము. చెట్ల వరుస దాటి పైకి వెళ్తుండగా, మేము నిటారైన మరియు బాగా మురికిగానున్న రోడ్డెక్కాము. ఫోర్ వీల్ డ్రైవ్‌గల వాహనము యొక్క అవసరము మాకిప్పుడు అర్థమైయింది.
చివరికి, పరిశీలనా కేంద్రాలతో నిండివున్న శిఖరమును చేరుకున్నాము. ఇక్కడి వాతావరణము కాంతివంతముగాను, స్ఫటికమువలె స్పష్టముగావుంది. వాహనమును నిలిపి బయటికి వచ్చాము. వేగముతో వీచే శీతల గాలులు మమ్ములను వెంటనే చల్లబరచినవి. అయినప్పటికీ మేము తేరి చూస్తుండగా, ఒక ఉత్తేజకరమైన ఉల్లాసము మాలో పెల్లుబికింది. మేఘావృతమైన ఆరిపోయిన అగ్నిపర్వతముపై నిలుచున్నపుడు మేము భూసముద్రములనుండి వేరు పరచబడినట్లనిపించింది.
ఇక్కడే ఎందుకు
ఖగోళశాస్త్రజ్ఞులు 1960 తొలిదశలో అంతరిక్షములోనికి మరియు గతములోనికి తేరిచూచుటకు పెద్ద ద్వీపములో వారి ప్రథమ పరిశీలనా కేంద్రమును నిర్మించనారంభించారు. కానీ పసిఫిక్ సముద్రములో ఎక్కడో ద్వీపములోనున్న అగ్నిపర్వతముపైనే ఎందుకు నిర్మించాలి?
తారలతో నిండిన నింగిని పరిశీలించుటకు ప్రయోజనకరమగు నిమిత్తం ఈ ప్రత్యేక ప్రదేశమునకు నాలుగు ప్రముఖ కారణములు కలవు (1) సంవత్సరములో స్పష్టమైన రాత్రులు కనబడే శాతము ఎక్కువ (2) గాలిలోని స్వచ్ఛత మరియు స్థిరత్వము చూచుటను సులభము చేయును. (3) ఈ పెద్ద ద్వీపముపై పట్టనపు వెలుగుపడకుండా సంరక్షించబడుతున్నది. కావున రాత్రులందు అతి తక్కువ వెలుగును కలిగివుంటుంది. (4) తేమ అతి తక్కువ. ఈ ఆఖరి అంశము ఎందుకంత ప్రధానము? ఎందుకంటే తేమ కొన్ని ఉపకరణములకు ఆటంకము కలిగించవచ్చును.
ఈ విశిష్ట వాతావరణ లక్షణాలను మన నేత్రాలతో సహితం చూడగలము గనుకనే అంతరిక్ష్యములోనికి తేరిచూచుటకు ఇది అత్యంత అనువైన ప్రాంతముగా వుంది. తారలను గమనించుటకు పరిపూర్ణతకు సమీపముగావున్న స్థానముగా దీన్ని ఎంచుటలో ఆశ్చర్యములేదు.
ఖగోళశాస్త్ర పరిశీలనా కేంద్రములోపల
మాగైడ్‌ని కలుసుకొని, ఆమెవెంబడి డబ్ల్యు. యం. కెక్ పరిశీలనా కేంద్రమునకు వెళ్లాం. ఇందులో ఇంతవరకూ నిర్మించబడిన వాటిలోకెల్ల శక్తివంతమైన అతిపెద్ద టెలిస్కోప్ ఒకటి ఉంది.
ఖగోళ శాస్త్రజ్ఞులు ఇక ఏమాత్రము వారి కన్నులతో టెలిస్కోప్‌లోంచి చూడటం లేదని దానిలోనికి ప్రవేశించిన వెంటనే మనం గ్రహించగలము. లేదు, ఆ రోజులిక పోయాయి! ఈనాడు శాస్త్రజ్ఞులు శక్తివంతమైన కంప్యూటర్లతోను, ఇతర ఆధునాతన ఉపకరణముల సహాయముతో టెలీస్కోప్‌లపై పనిచేస్తున్నారు. ఈ కంప్యూటర్ల సహాయంతో పనిచేయు ఉపకరణములను ఉపయోగించి చూచుట వలన, కండ్లతో చూసేదానికంటే కొన్ని కోట్లరెట్లు ఎక్కువ చూడవచ్చును.
మనస్సు విస్మయం చెందుతుంది, కాదా? ఈ సాంకేతిక నైపుణ్యత వలన ఖగోళశాస్త్రజ్ఞులు కొద్ది దినములలోనే చాలినంత సమాచారమును సేకరిస్తారు. సేకరించిన సమాచారమును అంచనా వేయుటలో వారు కొన్ని నెలలపాటు పనిరద్దీని కలిగియుంటారు.
ఖగోళ శాస్త్ర సాంకేతిక నైపుణ్యతలోకెల్లా డబ్ల్యు. యం. కెక్ పరిశీలనా కేంద్రము ఎందుకు అగ్రగామిగా ఉన్నదోయను విషయమునకు గైడ్ మా దృష్టిని మరల్చినది—అది టెలిస్కోప్ యొక్క ప్రత్యేకమైన నిర్మాణమే. దీనిలో ఒకొక్కటీ 1.8 మీటర్ల విశాలముగల 36 షడ్భుజ అద్దముల విభాగములను గమనించెదము. ఇవి 10 మీటర్ల వ్యాసముగల ఒక అద్దమునకు సమానము.
టెలిస్కోప్ పనిచేయు విధానమును వివరిస్తూ, ఖగోళ శాస్త్రములో పరిశోధనలు జరుపు కాలిఫోర్నియా అసోసియేషన్ ద్వారా వెలువడిన పత్రికా సమాచారము ఇలా తెలిపింది: “ఎలక్ట్రానిక్ పరికరములు ఉపయోగించి అంగుళములో 10 లక్షలలో ఒక వంతు నిర్దిష్టతలో టెలిస్కోప్ నడిపించబడుతునది—అనగా మానవుని వెంట్రుక మందంలో వెయ్యోవంతు,” మరియు అద్దములలో నాల్గవ భాగము మాత్రమే అమర్చబడినను కాలిఫోర్నియాలోని పాలోమార్ పరిశోధనా కేంద్రములోనున్న, 5 మీటర్ల హేల్ టెలిస్కోప్ శక్తికి సరిసమానముగా ఉంది.
ఇంతేకాదు, మొదటి దాని ప్రక్కనే నిలబెట్టాలని తయారు చేస్తున్న రెండవ టెలిస్కోప్ కొరకు ఇప్పుడే అందిన నిధిని గూర్చి గైడ్ మాకు తెలియ జేసింది. అంతరిక్షములో సుదూరములు చూచుట అసంభవమని అనుకున్న దానిని అంతరిక్ష బైనాక్యులర్‌లా పనిచేయు ఈ జంట టెలిస్కోప్‌లు సాధ్యపరుస్తాయి. నిజంగా ఇక్కడ ఉండటము ఉత్తేజకరమే!
అయితే ఈ ఎత్తులో శరీరాణువులలో తక్కువ ఆక్సిజన్ వలన హైపోక్త్సియా కలిగే ప్రమాదముందని మాకు తెలుసు గనుక మేము అధికంగా ఉత్తేజితులం కాదలుచుకోలేదు. ఆలోచనలపై కేంద్రీకరిస్తూ మాటలాడుతుండగా మా మనో సామర్థ్యములు అంత వేగంగా పనిచేయటం లేదని మేము గ్రహించాము. వాస్తవానికి, ఈ ఎత్తులో వడిగా కదలటము, తలనొప్పి, వికారం, మూర్ఛిల్లడం వంటి వాటిని కలుగజేస్తుంది. నిస్సందేహంగా, ఇక్కడ అనారోగ్యులకు స్థానం లేదు.
అందువలన, శిఖరముపైన ఐదు గంటలు గడిపి ఇక 2,800 మీటర్ల క్రిందికి దిగు సమయమైంది. ఇక్కడివరకు గుర్తుంచుకోదగిన ఉదయంగా గడిచింది.
తారలు మనకేమి చెబుతున్నవి?
సుమారు 50 మంది ఖగోళ శాస్త్రజ్ఞులకు మరియు సహాయ సిబ్బందికి, ఈ 2,800 మీటర్ల ఎత్తులో వసతి గృహాలు మరియు కావలసిన సౌకర్యములు ఉన్నవి. ఇక్కడ మౌనా కీ పరిశీలనా కేంద్రంపై ప్రసంగములను వినటానికి వీలుగా, సందర్శకుల కేంద్రము కూడా వున్నది.
వీటితో పాటు, ఇక్కడ వుండి రాత్రులలో నక్షత్రములను చూడటానికి ఇష్ట పడువారి నిమిత్తము, ఒక విశ్వవిద్యాలయము నుండి అర్హతగల విజ్ఞాన శాస్త్రవేత్తలలో ఒకరు చేసిన వ్యాఖ్యానముతోపాటు, 28 మీటర్ల టెలిస్కోప్ ఒకటి వుంచబడింది. మేమున్నట్లుగా మీరూ వుంటే నిరుత్సాహపరచబడరు. ఒక మాటలో చెప్పాలంటే, ఒక అసాధారణ దినమును గడుపుటకు మరియు తారలు మనకెంటువంటి సాక్ష్యమివ్వగలవో తెలుసుకొనటానికి, ఇది అత్యుత్తమ మార్గము.
గతములోకి చూడగలమని మునుపు మేము చెప్పిన కారణమేమని, మీరు ఆశ్చర్య పడగలరు. దీని భావాన్ని అర్థము చేసుకోవటానికి ఒక ఉదాహరణ మీకు సహాయము చేయగలదు. ఉదాహరణకు అండ్రోమీడా నక్షత్ర వీధిని తీసుకోండి. స్పష్టమైన రాత్రులలో దాని వెలుగు మన కన్నులకు కనపడగలదు. ఇక భూమికినీ, ఆ నక్షత్రవీధికి మధ్య చాలా దూరము ఉంది. మరియు వెలుగు క్షణానికి 2,99,792 కిలోమీటర్ల వేగముతో ప్రయాణించగలదని తెలుసుకొనిన విజ్ఞాన శాస్త్రజ్ఞులు ఆండ్రోమీడా నక్షత్ర వీధినుండి వెలువడు కాంతి, 15,00,000 సంవత్సరాల వెనుకటిదని నిర్దారించారు! అవును, నక్షత్రకాంతిని చూడటము నిజముగా గతములోనికి చూడటమే.
మౌనా కీ పైని క్రొత్త ఉన్నత టెలిస్కోప్‌ల సహాయంతో గతములోని మరియు అంతరిక్షములోని సమాచారములు చూచు సామర్థ్యమును మానవుడు ఈనాడు పొందియున్నాడు. దీని కారణము మానవ నేత్రములకంటే, ఆధునాతన టెలిస్కోప్‌లు ఎన్నోరెట్లు శక్తివంతమైనవి. నిజానికి, ఇప్పటి సాంకేతిక నైపుణ్యతచేత ఖగోళ శాస్త్రజ్ఞులు 800 కోట్ల సంవత్సరాల వెనుకటి నక్షత్ర కాంతిని చూడగలుగుచున్నారని అంచనా! ఇట్టి సమాచారమును సమకూర్చుట వలన నక్షత్రముల ఆరంభము మరియు విశ్వము విస్తరించిన విధమును గూర్చిన మేలైన గ్రహింపు పొందగలరని ఆశిస్తున్నారు.
నిశ్చయముగా సందర్శకులుగా మాకు ఇది ఇతర రోజులతో పోల్చలేని ప్రత్యేకమైన రోజు, మేమిక్కడ చూసినవన్నీ మరపులేనివి. ఖగోళ శాస్త్రజ్ఞులు చూచినవి, భవిష్యత్తులో చూడబోయేవి, మనం సృష్టి అద్భుతాలను గూర్చి ఆశ్చర్యపోవునట్లు చేస్తున్నవి. ఇకనుండి మేము తారలతో నిండిన నింగిపై వూరకే ఒక చూపు విసిరి ఊరుకోము. కాబట్టి, ఈ సందర్భము మరియు ఈ పర్వత పరిశీలనా కేంద్ర స్థానముల శోభ, మేము మరువలేము.
మనను ఆశ్చర్యచకితులను చేసినట్టి విశ్వాన్ని సృజించిన వానిని మనమందరం అభినందించుటకు అటువంటి అనుభవాలు మనలందరిని పురికొల్పవలెను.—యెషయా 40:26; 42:5. (g91 12/8)
[Picture Credit Line on page 25]
California Association for Research in Astronomy