యౌవనస్థులు ఇట్లు అడుగుదురు . . .
సరదా పనుల విషయమేమి?
సరదాపనులు ఆనందమును కలిగించును. “ఒక వ్యక్తి తన ఖాళీ సమయంలో చేయగోరు ఏ పనైనా” అని అవి నిర్వచించబడినవి. కొందరు యౌవనులు తమ ఖాళీ సమయంలో ఈత కొడుతూ, ఫుట్‌బాల్ ఆడుతూ, లేక పరుగెడుతూ వుంటారు. క్రీడలపై తక్కువ ఆసక్తిగల యౌవనులు, సంగీతం వినుటకు, ఎక్కువ దూరం నడుచుటకు. లేక కేవలము ఇంటి యందు కూర్చొని చదువుటకే ఎక్కువగా ఇష్టపడవచ్చు. ఇంకా కొందరు తమ ప్రతిభను పెంపొందించు కొనుటకు లేక వస్తువులు సేకరించుటకు ఇష్టపడుదురు. నేటలీ యొక్క సరదా ఏమంటే పిల్లన గ్రోవి ఊదటమే. ఆమె చిన్న చెల్లి, నిక్కీ, బొమ్మలు సేకరిస్తుంది.
సరదా పనులు, పనికి ఆటకు మధ్య సమతుల్యం ఏర్పరుస్తూ, తీరిక వేళ్లలో విసుగును తొలగిస్తాయి. మీరు విశ్రమించుటకు అవి సహాయము చేస్తాయి. సరియైన విశ్రాంతి మంచి మానసిక, శారీరక ఆరోగ్యము కల్గిస్తుంది. కెనడా దేశ వైద్యుడు సర్ విలియమ్ ఒస్లర్ ఇట్లు చెప్పెను: “ఏ సరదా లేకుండా ఏ మనిషి కూడా నిజంగా సంతోషంగా లేక సురక్షితంగా ఉండడు,” ఆయన ఇంకా యిలా చెప్పాడు: “తనకు సరదా అనిపించింది ఏదైనా తేడా లేదు . . . అతనికొక సరదా పని అంటూ ఒకటి వుంటే, దానిమీద పూర్తి అవధానము నిలిపితే ఏదైనా చేయవచ్చును.” అయితే ఒక మంచి రౌతు తన రణరంగపు గుర్రమును అదుపు చేయునట్లు, నీ సరదాపని నిన్ను అదుపు చేయుటకు అనుమతించే బదులు నీవు నీ సరదాను అదుపు చేయవలెను. ఎట్లు?
మొట్టమొదట క్రైస్తవ కూటములకు హాజరగుట, నీ స్కూలు పని ఇంటిదగ్గర చేయుట, గృహమునందు అప్పగించబడిన పనులు చేయుటవంటి జీవితంలో అతి ప్రాముఖ్యమైన విషయములకు నీవు ప్రాధాన్యత ఇస్తున్నావో లేదో నీవు నిశ్చయ పరచుకోవాలి. (ఫిలిప్పీయులు 1:10) అప్పుడు నీకున్న ఖాళీ సమయములో ఎంత సమయం సరదా పని కొరకు వినియోగించ వలెనో నీవు నిర్ణయించుకోగలవు.
యోగ్యమైన సరదాపనులు
వంటింటి పనులు, దుస్తులు తయారు చేయుట, కుట్టుపని వంటి విలువైన కౌశల్యాలను అభివృద్ధి పరచుకొనుటకు కొన్ని సరదా పనులు నీకు సహాయము చేయును. నిజమే, యిటువంటి సరదాలంటే ప్రత్యేకంగా ఆడపిల్లలకే ఇష్టం. అయినను, వంట వండుట మగవారికి తప్పేమి కాదు. (యోహాను 21:9-12 పోల్చుము.) నీవు వంట శాస్త్ర నిపుణుల స్థాయికి ఎదగ నవసరము లేదు. కానీ వంటలో కొంత ప్రయోగం చేయుట వలన లాభదాయకమగు సామర్థ్యములను నీవు అభివృద్ధిపరచుకొనగలవు. ఇంకోవైపు, ఆడ పిల్లలు, ఇంటి మరమత్తులు లేక ఆటో మెకానిక్ పనులు చేయుటకు ప్రయత్నించుట ద్వారా లాభము పొందవచ్చును.
ఒక భాషను నేర్చుకొనుట సమయాన్ని సద్వినియోగం చేసే మరో యోగ్యమైన పనియే. యౌవనుడైన జేమ్స్, ప్రస్తుతం రష్యన్ భాషను నేర్చుకుంటున్నాడు. బహుశా రెండవ భాష నొకదాన్ని నీవు నేర్చుకొనుట వలన పరాయి దేశములో ఇతరులకు బైబిలు సత్యము నేర్పుటకు ఏదొక రోజున అది నీకు సహాయపడవచ్చును! వాస్తవానికి, సరదాగా చేసే పనులు తరచూ ఇతర ప్రజలకు సహాయపడు సాధనములుగా ఉపయోగపడవచ్చును.
ఉదాహరణకు, తోటపని చేయుట నీ సరదానా? దానిని సరిగ్గా సంరక్షించుట కష్టమని తలంచు నీ తాతయ్య అమ్మమ్మలకు లేక వేరే ఇతర వయస్సు మళ్లిన పెద్దలకు చెందిన ఒక తోటపై నీ ఉద్యానవన శాస్త్ర కళను ఎందుకు ఉపయోగించకూడదు? నీవు స్వయంగా చేయు పనిని ఇష్టపడుదువా? అయితే, ఒక వయస్సు మీరిన వ్యక్తి లేక విధవరాలి ఇంటి మరమత్తు కొరకు సహాయపడుటకు ఎందుకు పూనుకొనకూడదు? వంట నీ సరదా పని అయినప్పుడు, నీకు ఇష్టమైన వంటవండే విధానము తెలిసినపుడు అవసరతలో ఉన్న ఎవరికైనా దాన్ని బహుమతిగా ఇచ్చుటకు దానిని ఎందుకు సిద్ధపరచ కూడదు? గుర్తుంచుకొనండి, “పుచ్చుకొనుట కంటె ఇచ్చుట ధన్యము” అని యేసు చెప్పెను.—అపొస్తలుల కార్యములు 20:35.
నీవు ఆత్మీయముగా ముందంజ వేయుటకు కూడా ఈ సరదా పని నీకు సహాయపడగలదు. ఉదాహరణకు నీవు నమూనాలు చేయుటకు ఇష్టపడుచున్నట్లైన నీవు ఒక చిన్న ఓడను నిర్మించితే నోవహు విశ్వాసము యొక్క బలముపట్ల నీ గుణగ్రహణ వృద్ధిచెందదా? (బాక్స్ చూడుము.) అట్లే నమూనా గుడారమును లేక ఆలయమును నిర్మించుట పూర్వకాలము దేవుని సేవకులు ఆరాధించిన పద్ధతిని గూర్చిన నీ జ్ఞానము మెరుగు పడును. బైబిలు కాలాల్లో గొర్రెల కాపరి పిల్లవాడగు దావీదు తన ఖాళీ సమయంలో తంతి వాయిద్యం వాయించే వాడు. తరువాత అతడు యెహోవాను స్తుతించుటకు మనోహరమైన పాటలు స్వరకల్పన చేశాడు. నీకైనీవే ఒక వాయిద్యాన్ని వాయించుటకు నేర్చుకొనగలవా? అలాగైతే, సింగ్ ప్రెయజస్ టు జెహోవాa అను పాటల పుస్తకములోని కొన్ని గీతాలను నేర్చుకొని యెహోవాను స్తుతించుటకు నీ ప్రతిభను ఎందుకు ఉపయోగించకూడదు? నీవు సంగీతం వాయించునప్పుడు. గేయములు తెలియజేస్తున్న భావాలను ధ్యానించుము. నీవు సేకరించే వ్యక్తివా? అయితే బైబిలుకు సంబంధించిన వస్తువులను సేకరించుము, లేక బైబిలు స్థలాల చిత్రాలతో ఖాళీ పుస్తకం నింపుటకు ప్రయత్నించుము.
లెక్క చూచుకోండి
సరదా పని ఎంత యోగ్యమైనదైనను, దాని మూల్యమెంత? అని మనలను మనము అడుగుకొనుట చాలా వివేకము గలపని. (లూకా 14:28) ఆ సరదాపని నీ ఆర్థిక స్తోమతకు తగినదా? ఒకవేళ అది పోస్ట్ స్టాంపులేగానీ, పురాతన వస్తువులు లేక బొమ్మలు సేకరించడమే గానీ ఏదైనను ఆ సరదా పని సేకరించే పనే అయితే అది ప్రత్యేకంగా సవాలుతో కూడినదై వుంటుంది.
గుర్తుంచుకోండి, నీవు నీ రాబడిని ఎలా ఖర్చు పెడుతున్నావు అనేది నీవు నిత్య జీవం పొందే విషయంలో కూడా ప్రభావం చూపుతుంది. యేసు ఇట్లు అన్నాడు: “అన్యాయపు సిరి వలన [మీ డబ్బు] మీకు స్నేహితులను సంపాదించుకొనుడి; ఎందుకనగా ఆ సిరి మిమ్మును వదిలి పోవునప్పుడు వారు [యెహోవా దేవుడు మరియు యేసుక్రీస్తు] నిత్యమైన నివాసములలో మిమ్మును చేర్చుకొందురు.” (లూకా 16:9) “నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యెహోవాను ఘనపరచు” టకు ఏమికూడా మిగల కుండ వుండేంత డబ్బు ఆ సరదా పని కొరకు ఖర్చవు తుందా? (సామెతలు 3:9) బహుశా నీ ఆత్మీయ విషయాలను వదిలేస్తు, నీ సరదా పనికి కావలసిన డబ్బు కొరకు అదనంగా పార్ట్ టైం పని చేయవలసివస్తుందా?
దాన్ని సమతూకంలో ఉంచండి!
కొన్ని సమయములందు తమ సరదాపనిని గంభీరంగా తీసుకునే వాళ్లు అదే సరదా కలవారితో ఉండుటకు ఇష్టపడతారు. ఇది అనేక అపాయములను తేగలదు, అయితే నిన్ను నీవే ఇట్లు అడుగుకొనుము: అటువంటి స్నేహము యోగ్యమైనదా? వారి దుస్తులు, తల దువ్వుకొను పద్ధతి, వారి వినోదం యొక్క ఎంపిక, మరియు వారి సంభాషణ నాపై చెడు ప్రభావం చూపిస్తుందా? నీ క్రైస్తవ సహచరులు మరియు కుటుంబ సభ్యుల కంటే వారి స్నేహమును నీవు ఎక్కువ ఇష్టపడుతున్నావా? ఏది ఏమైనను; నీ ఆసక్తి నిన్ను చెడు స్నేహమునకు నడుపుట నీవు అనుమతిస్తావా? గుర్తుంచుకొనుము, “దుష్టసాంగత్యము మంచి నడవడిని చెరుపును.”—1 కొరింథీయులు 15:33.
అవధానముంచ వలసిన ఇంకొక విషయం: నీవు చేసే సరదాపని ఎటువంటి అభిప్రాయమును ప్రోత్సహిస్తున్నది? అది అనారోగ్యకరమైన పోటీ తత్వాన్ని పురికొల్పుతుందా? అది విపరీతమైన ఆరోగ్య సమస్య తెస్తుందా? అలాగైతే అపొస్తలుడైన పౌలు చెప్పిన మాటలు నీవు మదిలో ఉంచుకొనుట మంచిది: “శరీర సంబంధమైన సాధకము కొంచెము మట్టుకే ప్రయోజన కరమవును గాని దైవభక్తి అన్ని విషయములలో ప్రయోజనకరమవును.”—1 తిమోతి 4:8; గలతీయులు 5:26.
మరోవైపు సొలొమోను ఇట్లనెను. “ప్రతిదానికి సమయము కలదు, ఆకాశము క్రింద ప్రతి ప్రయత్నమునకు సమయము కలదు.” అందులో “నవ్వుటకు” కూడా సమయం ఉంది. అవును సరదా పనులకు, మరియు వినోదానికి వాటివాటి స్థానములున్నవి. కచ్చితంగా, సొలొమోను అటు తరువాత చెప్పిన మాటలు మరిచి పోయేంతగా నీ సరదా పని నీ ఆసక్తినంతటిని హరించి వేసేదిగా వుండకుండ చూచుకొనుము: “దేవుని యందు భయభక్తులు కలిగియుండి ఆయన కట్టడలను అనుసరించి నడుచు చుండవలెను, మానవకోటికి ఇదే విధి.”—ప్రసంగి 3:1, 4; 12:13. (g91 11/22)
[అధస్సూచీలు]
a వాచ్‌టవర్ బైబిల్ అండ్ ట్రాక్ట్ సొసైటీచే ప్రచురింపబడినది
[18వ పేజీలోని బాక్సు]
నేను నోవహు ఓడను నిర్మించాను
నా చేతులతో పనిచేయడం నాకెంతో ఆనందం. ఒకనాడు, నోవహు ఓడను చూచి ఎక్కువగా తెలుసుకోవాలనే కోరిక నాకు కలిగినప్పుడు దాని రూపాన్ని చిన్న పరిమాణంలో తయారు చేయాలని నిర్ణయించుకున్నాను.
వాచ్‌టవర్ సొసైటీ ప్రచురించిన పరిశోధనా ప్రచురణల సహాయముతో, ఆదికాండము 6:14-16 లోని బైబిల్ దృష్టాంతమును జాగ్రత్తగా పరిశీలించడంతో మొదలు పెట్టాను. ఆ ఓడ ఆధునిక కాల సముద్రపు ఓడ వంటిది కానే కాదని నేను వెంటనే గ్రహించాను. అలాకాక, అది ఒక పెద్ద పెట్టెలా వుంది: 300 × 50 × 30 క్యూబిట్లు. దీన్ని మీటర్లలోనికి మారిస్తే 133.5 మీటర్ల పొడవు, 22.3 మీటర్ల వెడల్పు, 13.4 మీటర్ల ఎత్తువుంటుంది. కాబట్టి మొత్తం 134 మీటర్ల పొడవు—అంటే, దాదాపు అమెరికా ఫుట్‌బాల్ ఆటస్థలం మొత్తం పొడవుకు ఒకటిన్నర రెట్లు ఎక్కువ. ఉనికిలోనున్నవని వైజ్ఞానికులు చెప్పుచున్న 10,00,000 కంటే ఎక్కువ జంతుజాలములు అంతటి బారీ నిర్మాణంలో కూడా పట్టవు. అయితే, పరిశోధకులలో కొందరు నమ్మినట్లు 43 “రకాల” సస్తన జంతువులు, 74 “రకాల” పక్షులు, మరియు 10 “రకాల” సరీసృపములే ఈనాడున్న అనేక రకాలైన జంతువులను ఉత్పత్తి చేసాయని నేను తెలుసుకున్నాను.
నా పరిశోధన నోవహు పనియొక్క గొప్పతనాన్ని గుణగ్రహించుటకు కూడ సహాయపడింది: విద్యుత్ రంపాలు లేకుండా చెట్లను నరకడం, ట్రాక్టర్లు లేకుండానే మొద్దులను నిర్మాణ స్థలానికి ఈడ్చుకు పోవడం, క్రేన్లు లేకుండానే బరువైన పైకప్పు దూలాలను ఎత్తడం వంటివి ఇమిడివున్నాయి. నోవహు పనితో పోలిస్తే నాపని సులభమే! “చెక్కకు” బదులు నేను వూరికే కొన్ని ఎండిన కొమ్మలను విరిచి వాడాను. “జంతువులను” బంకమన్నుతో చేసాను. లోపలి భాగపు నమూనా కొరకు నేను కొంత ఊహించ వలసివచ్చింది. బహుశ నోవహు తన కుటుంబము పైఅంతస్తులో వుండటానికి నిర్ణయించుకున్నారని నేను దృష్టించుకున్నాను, అక్కడ వారు మంచి గాలి వెలుతురును అనుభవించి యుంటారు. ఓడ క్రింది అంతస్తులలో జంతువులనుంచాను.
అనేక గంటలు శ్రమపడిన తరువాత నా ఓడ తయారయింది. అది చూడముచ్చటగా ఉన్నదని కొందరన్ననూ, అసలు ఓడ, నేను తయారు చేసిన ఓడ కంటె కొన్ని వందలరెట్లు పొడవు, వెడల్పు, మరియు ఎత్తువుంది. మరోమాటలో చెప్పాలంటే, నేను చేసిన నమూనాల వంటివి ఒక 10,00,000 కలిపితే అసలు ఓడకు సమానమౌతుంది. నా ఈ నిర్మాణపని అసలు ఓడను గూర్చి ఎక్కువగా తెలుసుకోవాలన్న కోరికను బలపర్చిందనుటలో ఆశ్చర్యము లేదు. ఒకవేళ దేవుని నూతన లోకంలో జీవించి మృతుల పునరుత్థానాన్ని చూసే ఆధిక్యత నాకు కలిగితే, క్రొత్త నమూనాను చేయడంలో నోవహు సహాయాన్నర్థించే అవకాశం బహుశ నాకు దొరక వచ్చును—అది వివరాలన్నింటిలో సరిగా వుంటుంది.—ఉచితవ్యాసం.
[19వ పేజీలోని చిత్రాలు]
నీ సరదాపని నీకును ఇతరులకును ఆనందాన్నిస్తుందా?
బైబిలులోని దేశాల పటములను సేకరించుట వలన అవి నీకు లేఖనములలోని సంఘటనలను మానసికంగా ఊహించుకొనుటకు సహాయపడగలవు