ప్రపంచ పరిశీలన
ప్రశ్నార్థకమగు ప్రత్యేకత
అమెరికా 1990 లో అభివృద్ధిచెందుతున్న దేశాలకు అత్యధిక ఆయుధాలను సరఫరాచేసే దేశంగా తయారయింది, అంటే 1983 నుండి చూస్తే మొట్టమొదటిసారిగా రష్యాకంటె ఎక్కువే సరఫరాచేసింది. కాంగ్రిగేషనల్ రీసర్చి రిపోర్టు ప్రకారం, మధ్యప్రాశ్చ దేశాలకు ఆయుధాలను సరఫరా చేయుటలో కూడ అమెరికా అందెవేసిన చెయ్యి. గత ఎనిమిదేండ్లలోను కొన్న ఆయుధాలన్నింటిలో సగం కంటె ఎక్కువ ఈ ప్రాంతానికి చేరినవి. ఈ 1983 నుండి 1990 మధ్యకాలంలో అభివృద్ధిచెందుచున్న దేశాలు 30,170 కోట్ల డాలర్ల విలువచేసే ఆయుధాలను కొన్నవి. సరఫరాచేసే దేశాలన్నిటినుండి గత సంవత్సరం కొన్న 4,130 కోట్ల డాలర్ల విలువలో అమెరికా 1,850 కోట్ల డాలర్లు విలువగల ఆయుధాలను అమ్మింది—అంటే 1989 లో ఆ దేశం అమ్మిన దానికంటె రెట్టింపు అన్నమాట—అయితే సోవియట్ దేశం ఆయుధాల మార్పిడి విలువ 1,210 కోట్ల డాలర్లకు పడిపోయింది. పర్షియా గల్ఫ్ యుద్ధంలో అవి సాధించిన విజయవంతమైన పని తీరునుబట్టి అమెరికా తయారీ ఆయుధాల గిరాకి పెరిగింది. అమెరికా, సోవియట్ యూనియన్ తర్వాత చైనా, ఫ్రాన్స్ దేశాలే అత్యధికంగా ఆయుధాలను అమ్మే దేశాలయినవి. (g91 11/8)
పరిణామం పరీక్షింపబడుతోంది
జీవ శాస్త్రజ్ఞులు పరిణామ సిద్ధాంతాన్ని సమర్థించుకుంటున్న విధానాన్ని చూచి బెర్‌క్లేలోని కాలిఫోర్నియా యూనివర్శిటి నందలి ఒక నేర సంబంధమైన చట్టము యొక్క ప్రొఫెసర్ ఫిలిఫ్ జాన్‌సన్ దీర్ఘకాలంగా విస్తుబోతున్నాడు. ఆ విషయంపై వారెంతో మొండిగా సమర్థించుకొంటూ వున్నట్లు కనబడుతున్నారు, అందుకే జాన్‌సన్ “వారు సమర్థించుకొన చూస్తున్న లొసుగులుగల అంశాలనుగూర్చి” పరిశీలించుట కారంభించాడు. ఆయన పరిశోధనా ఫలితంగానే డార్విన్ ఆన్ ట్రైల్ అనే పుస్తకం తయారైంది, అది “పరిణామ సిద్ధాంతం వెనుకగల సహేతుక, సాక్ష్యాధారములను క్రమరూపంలో ఒక న్యాయవాది చేసే పరీక్ష” యని దాన్ని ది శాక్రమెంటో బీ అనే వార్తాపత్రిక అభివర్ణించింది. ఆ వార్తాపత్రిక యిలా సంక్షిప్తంగా తెల్పుతుంది: “డార్విన్ పరీక్షలో ఫెయిలవుతున్నాడు.” పరిణామ సిద్ధాంతాన్ని బహిరంగంగా వ్యతిరేకించుటకు భయపడే స్కాలర్లను, జీవశాస్త్రజ్ఞులతో సహా, అనేకమందిని తాను చూశాడని జాన్‌సన్ చెబుతున్నాడు. “ఈ అనుభవాన్నిబట్టి నేను నేర్చుకున్న దేమంటే మేధా సంపన్నమైన సాంప్రదాయాన్ని స్థిరపరచి, విమర్శకు దూరంగా వుంచాలంటే, ఒంటరి జైలు గదులు, రహస్య పోలీసు అక్కర్లేదు. నీవు చేయవలసినదంతా ఏమంటే ప్రజలు నిన్ను చూచి నవ్వుతారని నీ మర్యాద పోతుందని చెప్పు. ఇది పాండిత్య జీవితము మీద బ్రహ్మండమైన ఫలితాన్ని కల్గివుంటుంది” అని ఆయన శాన్‌ఫ్రాన్సిస్‌కో క్రానికల్ కిచ్చిన వ్యాసంలో తెలిపాడు. (g91 10/22)
పొగత్రాగుట మానుకొంటే పారితోషికం
“ఊపిరితిత్తుల క్యాన్సర్, గుండెనొప్పి, పోటు. ప్రమాదకరమైన కార్యాలను చేయజూసే కొందరు ప్రజలకు పొగత్రాగుటయనే మరణకరమగు అపాయాలు నిజంగా సిగరెట్ల ఆకర్షణను అధికం చేస్తాయని పరిశోధన తెల్పుతుందని” సైన్స్‌న్యూస్ పత్రిక వ్రాసింది. “అయితే, పొగత్రాగుటవల్ల తక్కువ ప్రమాదం కల్గించే కొన్నింటి మీద దృష్టి కేంద్రీకరించిన రెండు క్రొత్త వార్తలు, యీ అలక్ష్యపరులు సహితం నికొటిన్ అలవాటును మానుకొనేటట్లు చేయగల శక్తివంతమగు కారకములను అందించగలవు.” అందులో మొదటిది తెల్పునదేమనగా మూత్రవిసర్జన అదుపులో పెట్టుకోలేక బాధపడుతున్న స్త్రీలందరిలో మూడవ భాగం గతంలో గానీ ఇప్పుడుగానీ పొగత్రాగుటవల్లనేనని గుర్తెరుగవచ్చును. రెండవ అధ్యయనం తెల్పినదేమంటే పొగత్రాగే స్త్రీ, పురుషులకు ముఖచర్మం ముడతలు పడే అవకాశం అధికమని, సిగరెట్లు సంఖ్యనుబట్టి, త్రాగే కాలాన్ని బట్టి వయస్సురాకముందే చర్మం ముడతలు పడుతుంది. పొగత్రాగని వారికంటె పొగత్రాగేవారిలో ఐదురెట్లు చర్మము ముడతలు పడే అవకాశముంది. “చాలామంది పొగత్రాగేవారికి, ముఖ్యంగా యౌవనస్థులకు పొగత్రాగుట వలన మరణం సంభవిస్తుందనే భయం కంటే దానివల్ల ముడతలు వచ్చి నోరు దుర్వాసనకొట్టి, గారపట్లు అవుతాయనేదే బాధకల్గిస్తుందని” అమెరికాలోని మిన్నెసోటా, రోచెస్టర్‌లోని మాయోక్లినిక్ సంబంధించిన థామస్. ఇ. కోట్కె అంటున్నాడు. (g91 11/8)
అవివాహిత జీవితం యొక్క ప్రతిఫలం
మతగురువులను అవివాహితులుగా వుండుటకై బలవంతపెట్టుచున్నందువల్ల వారు “తండ్రులౌతున్నారని దావావేయుటకు, ఉంపుడుగత్తెలకు, మతగురువులు సెమినరీ చదివేవారిలో పురుషసంయోగం అధికమగుటకు, ఒంటరితనానికి, కొన్నిసార్లు శిశు సంపర్కములకు దారితీస్తుంది.” అది, ఇటీవలి జరిగిన వార్షికోత్సవ సభలో, అవివాహిత అనే అంశం మీద చికాగో ఆర్చి డయోసిస్ మాజీ కాథోలిక్ మతగురువు జో స్టర్నాక్ చేసిన హెచ్చరికయని దినేషనల్ కాథోలిక్ రిపోర్టర్ వార్తా పత్రిక నివేదించింది. శిశు సంపర్క ప్రవృత్తిపై స్టర్నాక్ ప్రస్తుతం వ్రాస్తున్న పుస్తకంలో ఆయన అమెరికా లోని 20 రాష్ట్రాల్లోవున్న డయోసిస్‌లు, శిశువుల లైంగిక పర దుర్వినియోగము కొరకు మతగురువుల మీద కోర్టు వెలుపల లోపల వేయబడిన దావాఖర్చులు చెల్లించడానికి చర్చి చందాలు వాడుచున్నవని ఆరోపించాడు. (g91 10/22)
చంపవలెనా వద్దా
‘చంపుట క్రైస్తవులకు తగినదే కావచ్చు’ అని రోమన్ కాథోలిక్ కార్డినల్ గియకోమ బిఫి అన్నాడు. మనస్సాక్షి కారణంగా అభ్యంతరం చెప్పిన ఇటలీ ప్రేక్షకులున్న ఓ ఇటీవలి సభాముఖంగా ఆయన ఇలా అన్నాడు: “నీవు క్రైస్తవుడై వుండవచ్చును, అది ఇతరుల జీవితాలను కాపాడగలిగేదైతే చంపవచ్చును, యుద్ధం చేయవచ్చును,” అని ఎల్ పైస్ అనే వార్తాపత్రిక ఆ విషయాన్ని ప్రచురించింది. అతడు గర్భస్రావమునకు బద్ధ విరోధియైనప్పటికి అతడు “శాంతి అహింస అనేవి సంపూర్ణ విలువలున్నవేమి కావు” లేక అసలు “క్రైస్తవ విలువలు” కావని నొక్కి తెలిపాడు. ఆ మతాధిపతి ఆశ్చర్య చకితులైన ప్రేక్షకులతో చెప్పిన దేమంటే అలా మనస్సాక్షి కారణంగా అభ్యంతరం చెప్పుట నిజంగా “అర్థరహితం” ఎందుకంటే శాంతి “అలౌకిక నిరీక్షణ మరి భూమిమీదికి వస్తుందని నిరీక్షించుట ఊహాజనిత లోకం వంటిదై వుంటుంది.” (g91 11/8)
మలావీలో ఎయిడ్స్
లండన్ వార్తాపత్రిక ది డైలీ టెలిగ్రాఫ్ ప్రకారం ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇటీవల నివేదించిన దేమంటే, మలావీ దేశంలోని 37 శాతం ప్రజలకు ఎయిడ్స్ రోగవ్యాపకంచేసే హెచ్‌ఐవి అనే క్రిమి సోకింది. అంటే దాని అర్థం ముప్పై లక్షలమందికి రోగం సోకింది. ఎయిడ్స్ మూలంగా అప్పటికే ఏడువేలమంది మరణించారు. టెలిగ్రాప్ పత్రికా విలేఖరి మలావీలోని బ్లాంటైర్‌నుండి వ్రాస్తున్నదేమంటే, దేశంలోని 90 శాతం మంది వ్యభిచారిణులకు అది అంటుకుందని, 75 శాతం సైన్యం మరియు పోలీస్ దళానికి, పట్టణ ప్రాంతాల్లో ప్రసవించే 60 శాతం మంది తల్లులకు సోకింది. దక్షిణ మలావీలోని ఓ ఆసుపత్రిని టెలిగ్రాఫ్ పత్రికా విలేఖరి దర్శించినపుడు అచ్చట సగం మంది ఎయిడ్స్ సంబంధిత రోగాలతో బాధపడుతున్నట్లు కనబడింది. ఆమె ఇలా వ్రాస్తుంది: “వంద మంది రోగులకు ఒక్క నర్సువున్నందున రోగులు సాధ్యమైనంత తేలికగా చనిపోవుటకు వదలివేయబడుతున్నారు.” (g91 10/22)
భూమి కనుమరుగైంది
ఆగస్టులో అట్లాంటిస్ అనే అంతరిక్ష నౌకలో భూప్రదక్షిణ చేసిన రోదసీ యాత్రికులు అంతరిక్షం నుండి భూమిని చూసినప్పుడు దానిచుట్టూ దట్టమైన పొగ అలుముకొనియున్నందున భూమి కొన్ని చోట్ల స్పష్టముగా కనిపించలేదని నివేదించారు. దీనికి గల కారణం యిటీవల ఫిలిప్పీన్స్ మరియు జపానులలో అగ్నిపర్వతం ప్రేలగా వచ్చిన పొగ మరియు కువాయిత్‌లో నూనె బావులు కాలగా లేచిన దట్టమైన పొగ అయివుంటుందని వారి ఊహ. రోదసీయాత్రికులు చెప్పిందేమంటే గత యాత్రల్లో చూచిన దానికి ఇప్పటి భూవాతావరణానికి స్పష్టమైన తేడావున్నది. ఆ నౌకనాయకుడు కర్నల్ జాన్ ఇ. బ్లాహా అంతరిక్షం నుండి కువాయిత్ నూనె గనుల అగ్నిమంటలను తిలకించినపుడు “ఇది నిజంగా విచారకరమైన దృశ్యము” అని అన్నాడు.
క్రొత్తరకపు జీవులు
“ప్రపంచ వన్యప్రాణి సంస్థ ప్రెసిడెంట్, కాథరీన్ పుల్లర్ వాషింగ్టన్ డి.సి. లోని తన ఆఫీసులోనే విజ్ఞాన శాస్త్రానికే క్రొత్త రకంగా కనబడే పాలిపోయిన పసుపచ్చరంగుగల చీమలను చూచిందని” నేషనల్ జాగ్రఫిక్ పత్రిక తెలుపుతుంది. తన మధ్యాహ్న భోజనమప్పుడు క్రిందపడిన ఆహారపు ముక్కలకు తినడానికి వచ్చిన యీ చీమలు ఒక కుండీలోనున్న మొక్క దగ్గరనుండి వచ్చినట్లు కనుక్కున్నారు. కొన్నింటిని నమూనాగా తీసికుని వెళ్లి చీమల పరిశోధనాధికారి హర్‌వార్డ్ యూనివర్శిటి ప్రొఫెసర్ ఎడ్వర్డ్ ఓ. విల్సన్‌కు ఇస్తే ఆయన వాటిని పరిశీలించి అవి ఫెయిడోల్ అని పిలువబడే రకానికి చెందినవని, యీ క్రొత్త వాటికి ఆమె గౌరవార్థంగా ఆమె పేరుతోనే పిలువాలని నిర్ణయించుకున్నట్లు తెలిపాడు. “వాషింగ్టన్ ఆఫీసులో మీరు క్రొత్తరకాలు చూడగలిగితే, సహజ సృష్టిలో యింకను కనుగొనవలసి వేచియున్న రకాలు నిజంగా అసాధారణంగా వుంటాయి” అని పుల్లర్ అంటోంది.
పరిమాణములో మరోవేపు చూస్తే పెరూదగ్గర పసిఫిక్ సముద్ర తీరంలో ఓ క్రొత్తరకపు తిమింగిలం కనబడింది—28 సం.ల తరువాత మొదటిసారి కనబడింది. అది కొసముక్కుగల తిమింగిలపు గుంపు అని పిలువబడే యీ గుంపు అతి చిన్నది. పెద్దది, మగది షుమారు నాలుగు మీటర్లపొడవు వుంటుంది. అవి ఎంత అరుదుగా కనబడునంటె, మెసొప్లాడాన్ పెరూవియసస్ అని ఇప్పుడు పిలువబడే యీ క్రొత్తరకములను స్థిరపరచుటకు తగిన రకాలను పరిశీలించి చూచుటకు విజ్ఞాన శాస్త్రజ్ఞులకు 15 సం.లు పట్టింది. తిమింగిలం ఆహారం నిజంగా చిన్న చేపలే. “ఈ రకపు తిమింగిలం పోల్చగా చిన్నదైనప్పటికి ఇంతకాలం కనబడకుండ ఎలా తప్పించుకు తిరుగుతున్నాయనేదే పరమ రహస్యం” అని న్యూయార్క్ టైమ్స్ పత్రిక తెలుపుతుంది. (g91 11/8)
యౌవనులు తీర్మానించుకొనగలరా?
యౌవనస్థులు వారి వైద్య చికిత్సనుగూర్చి తీర్మానం చేసికోగల పరిణతి చెంది యున్నారా? కౌమార దశకెదిగిన యెహోవాసాక్షులు రక్తమార్పిడిని తిరస్కరించినపుడు యీ ప్రశ్న తరచు వస్తుంది. అందుకు లేదు అనే సాధారణంగా సమాధానం వస్తుందని కొందరు న్యాయవేత్తలు వైద్య నిపుణులు అనుకుంటున్నప్పటికీ, అడోలసెంట్ డెవెలప్‌మెంట్ మీద కార్నెజీ కౌన్సిల్ ఇటీవల చేసిన అధ్యయనంలో మరోవిధంగా తేలింది. సైన్స్ పత్రిక ప్రకారం వైద్య చికిత్సపరంగా ఇటు వాస్తవికంగాను అటు ఊహాజనితంగాను కౌమారదశలోనున్నవారు, పెద్దవారైన యౌవనస్థులు ఎలా స్పందించారోనని ఏడు రకాల అధ్యయనములను పోల్చి చూశారు. పరిశోధకులు కనుగొన్నదేమంటే, పెద్దవారైన యౌవనస్థులతో (18 నుండి 25 సం.ల మధ్యవయసు గలవారు) కౌమారదశలోని 14 లేక 15 సం. వయస్సున్న వారిని పోల్చితే తీర్మానం చేయు సామర్థ్యములలో స్వల్ప తేడా మాత్రమేవున్నది. వీరు వారికంటె పెద్దవారైనవారివలెనే అదే “శక్తి సామర్థ్యములను హేతుశక్తిని” కనబరచారని అధ్యయనం కనుగొన్నది.
రక్తంవల్ల కాలేయవ్యాధి
రక్తమార్పిళ్లద్వారా హెపటైటిస్-సి రకం ఒకటి సోకే అపాయమున్నదని ఇటీవలి జపాన్‌లో జరిగిన పరిశోధన తెల్పింది. జపానులో కాలేయపు క్యాన్సర్ వ్యాధికి, కాలేయపు రోగానికి గురైన వారిలో సగంమంది యీ రకమైన వ్యాధి క్రిమివల్లనే అట్టి రోగాలకు గురయ్యారు. ఒక అధ్యయనం ప్రకారం రక్తమార్పిడి చేయించుకున్న 962 మందిలో 8.3 శాతం మందికి యీ హెపటైటిస్-సి రకం సోకింది గానీ అసలే రక్తాన్ని ఎక్కించుకొనని 1,870 మందిలో 0.7 మందికి మాత్రమే అట్టి రోగం సోకింది. ఆశ్చర్యమేమనగా, జపాను రెడ్ క్రాస్ సొసైటి నిర్వహించిన రక్తపరీక్షలో యీ రోగక్రిమి సోకిన 40 శాతం మందిని ఆ పరీక్ష ద్వారా పసిగట్టలేక పోయారు. (g91 10/22)