డైకు శాన్ స్వప్న సౌధాన్ని నిర్మించుట
జపాన్‌లోని అవేక్! ప్రతినిధి ద్వారా
జపాన్‌కు వచ్చు అనేకమంది సందర్శకులు తామిచ్చట చూచే అందమైన సాంప్రదాయ గృహములచే ఆకర్షితులౌతున్నారు. వాలుజారు పైకప్పు, పైకి తిరిగియున్న యింటి ముంజూరులు, దానికి చేరువున పూలతోట, మరియు వరండా యివన్నీ తమ వన్నెను జతచేయును. అయితే ఆసక్తికరమైన విషయమేమంటే, ఈ రకమైన యిల్లు సర్వసాధారణముగా కేవలం ఒక్క వ్యక్తి ఆధ్వర్యముననే నమూనా గీయబడి, నిర్మించబడి అలంకరించబడును. అతడే డైకు శాన్ లేదా వడ్రంగి మేస్త్రి అని పిలువబడతాడు.
మిస్టర్. కాటో 40 సంవత్సరముల అనుభవమున్న డైకు శాన్. అనేకమంది జపానీయులు తమ స్వప్నసౌధమని పరిగణించు దానిని అతడు, అతని చేతిపని నిపుణుల బృందము నిర్మిస్తున్నారు. ఆ యింటియొక్క అసమానమైనరీతి, దానిని తానెట్లు నిర్మిస్తున్నాడోనన్న విషయము అతడు చెబుతుండగా మనం విందాము.
సుప్రసిద్ధ నమూనా
డైకు శాన్ మనకిలా చెబుతున్నాడు, “సుప్రసిద్ధమైన జపానీయుల యింటిని గూర్చిన సారాంశమంతా కేవలం రెండు మాటలలో సంక్షిప్త పర్చవచ్చు: వాబి మరియు సాబి.” ఇతర సంగతులతో పాటు ఈ రెండు మాటలు “శుద్ధమైన, రుచికరమైన సులభసాధ్యత,” అనే అర్థమును కలిగి యున్నవి. “సూక్ష్మత” “ప్రశాంతత,” మరియు “నాజూకైన” అనే భావాన్ని కల్గియున్న యితర మాటలు జపానీయుల నిర్మాణ కళను దాని రమ్యతను అర్థము చేసికొనుటకు మనకు సహాయపడగలవు.
జపాన్‌లో తరచుగా వచ్చే తుఫానులు, భూకంపముల కారణమున మరియు వేసవిలో ఎక్కువ తేమ ఉంటుంది కనుక సాగేగుణమున్న చెక్కను కుటుంబ గృహము కొరకు సామాగ్రిగా ఎంచుకుంటారని డైకు శాన్ వివరిస్తున్నాడు. మట్టి, వెదురు, కాగితములు కూడ ఉపయోగించే సామాగ్రినందున్నవి. కనులకింపుగా ఉండేందుకు, ఇల్లు, తోటను రెండింటిని కలిపి నమూనా గీసారు.
ఈ స్వప్నసౌధము మరియు పూలతోట ఎలా కనిపిస్తాయి? అది ఎలా నిర్మించబడుతుంది? వేరొక భవనప్రాంతమునకు మనము వెళ్తే ఒక స్వప్న సౌధాన్ని ఎలా నిర్మిస్తాడో మనకు ప్రత్యక్షంగా చూపిస్తానని డైకు శాన్ సలహా యిస్తున్నాడు.
నేలమీద నుండి పైకి
ఆ ప్రాంతములో మనము నడుస్తుండగా, “వందసంవత్సరాల క్రితం నిర్మించబడిన యిల్లు, నేలనుండి నిర్మించబడలేదు,” అని డైకు శాన్ చెప్పుచున్నాడు. “రాళ్లపై నిలువబెట్టిన చిన్నచిన్న గుంజలపై పొడవుగా పరచిన దూలములమీద అవి ఉండేవి.” ఈ భవనాలలో అనేకములు నేటికి నిలిచియున్నాయన్న వాస్తవం డైకు శాన్ నైపుణ్యమునకు తార్కాణము. “ప్రస్తుత కాలంలో పునాదులు, ఆధారాలు సిమ్మెంటుతో కడుతున్నారు. కాని మిగతా భవన నిర్మాణము యధావిధిగానే ఉంటుంది,” అని చెప్పాడు. అది గోడలకు కూడా వర్తిస్తుంది, అవి ప్రాశ్చాత్య శైలి గృహములతో పోల్చితే వాటి ఆకృతి, నిర్మాణములో చాలా వ్యత్యాసంగా ఉంటాయి.
జపానీయుల ఇంటిలోపలి గోడలు శాశ్వత అడ్డుగోడలు కాక తాత్కాలిక విభాగంగా ఉండేవిధంగానే ఉంటాయి. నిర్మాణములోనున్న ఒక గోడను చూపిస్తూ డైకు శాన్ యిలా వివరిస్తున్నాడు, “వెదురును చీల్చి అల్లిన ఇటువంటి తడికైపై రెండునుండి ఐదు మట్టిపూతలు పూయబడతాయి. ప్రతి పొరయొక్క సాంద్రత వ్యత్యాసంగా ఉంటుంది, మొదటి పూత పూర్తిగా ఎండిన తర్వాతనే తదుపరిపూత పూయబడుతుంది. ఈ కారణంచేత, ఒకయిల్లు పూర్తి అవడానికి సరాసరి మూడునెలలు పడుతుంది.” (అయితే స్వప్నసౌధాన్ని నిర్మించాలంటే యింకా ఎక్కువ కాలం పట్టవచ్చును.) జపానీయులు యిష్టపడే సహజమైన మట్టి రంగులనిచ్చుటకు నాణ్యమైన మన్ను లేదా యిసుకతో పూసి గోడలను పూర్తిచేస్తారు. తేమగానున్న కాలములో కాంక్రీటు గోడలు తరచు చెమర్చునట్లుగా అవి చెమ్మగిల్లవు గాని తేమను లాక్కుంటాయి.
తదుపరి డైకు శాన్ నేలమీదికి మన అవధానాన్ని మళ్లిస్తున్నాడు. వరండా, చావిడి, వంటగదుల నేలలు గట్టి చెక్కతో చేయబడతాయి. మిగతా గదులలో అనేకము టటామి అని పిలువబడే దట్టంగా అల్లబడిన గడ్డి చాపలతో పరచబడి ఉంటాయి. ఈ ప్రత్యేకమైన తివాచీ శీతాకాలమందు వెచ్చగా, వేసవిలో చల్లగా ఉంటుంది. దృఢంగా ఉంటుంది అయినను కూర్చోడానికైనా లేక పడుకోడానికైనా సరే మృదువుగా ఉంటుంది. ప్రతి ఒక్క చాప రెండు మీటర్ల పొడవు ఒక మీటరు వెడల్పు ఐదు సెంటీ మీటర్ల మందం ఉంటుంది. గదులను అవి పట్టే చాపలను బట్టి గుర్తిస్తారు. కనుక వాటి పరిమాణమును బట్టి ఎనిమిది, ఆరు, లేక నాలుగున్నర చాపల గదులు అని పిలుస్తారు.
గుప్తంగా ఉంచే కుటుంబ రహస్యం
డైకు శాన్ యొక్క నైపుణ్యం నిజంగా అద్భుతంగా జోడించుపనిపై ఆధారపడియుంటుంది. మా గైడ్ తన తండ్రి తనకిచ్చిన 70 ఏళ్లనాటి నిర్దేశిక పుస్తకాలను మాకు చూపించాడు. అందులో ఒక్కొక్క పేజినందు సంక్లిష్టమైన, రమ్యమగు వడ్రంగి జోడింపుల నగిషీలున్నవి. వడ్రంగి మేస్త్రి తన వడ్రంగి కార్యసూక్ష్మతను అనాదికాలం నుండి గుప్తంగా ఉంచే రహస్యంగా కాపాడుకొంటూ వస్తున్నాడు, కేవలం వాటిని తన కుమారునికి లేదా వారసునికి అందిస్తు ఉంటాడు. ఇప్పుడు అలా చేయుట అవసరము లేకున్నను, ఒక్క మేకును కూడా ఉపయోగించకుండా యిల్లంతటిని నిర్మించ గలరు.
“ఈ వడ్రంగి జోడింపు విధానములు కొన్ని, యితర ప్రాంతాల వడ్రంగివారు ఉపయోగించే వాటివలె ఉంటాయి. ఉదాహరణకు, ఒకదానిలో మరొకటి బిగుసుకుపోయే, పావురాయితోక ఆకారపు కుసి, అంచునకోసే కుసి, పిడి అతుకు, ఏటవాలు అతుకు ఉన్నవి” అని డైకు శాన్ వివరించాడు. ఆ భవనము యొక్క ఆ భాగమునకు ఉండే వత్తిడి, భారమునుబట్టి ఏ రకం జోడింపులు వాడాలో అనేది ఆధారపడి యుంటుంది. అట్టి జోడింపులు భూకంపముల తాకిడి యిల్లు వంగి, భూకంప ప్రకంపనలు తట్టుకొనేటట్లు ఉంటాయి.
తుది మెరుగు
జపానీయుల సాంప్రదాయ గృహము యొక్క ముఖ్య ఘట్టము బహుశ దాని పైకప్పు కావచ్చు. అది చాలా పెద్దదిగాను, మిగతా యింటికన్నా బరువుగాను ఉంటుంది. అయితే పైకప్పే దాని దృఢమైన దూలములతో మిగతావాటికి బలము చేకూర్చి ప్రకృతి వైపరీత్యాలనుండి సంరక్షిస్తుంది అని డైకు శాన్ మనకు తెల్పుతున్నాడు. పైకప్పులు అనేక రీతులుగా ఉన్నను, సాధారణంగా అవి త్రికోణాకారము గల గోడలపై వేయబడును లేదా కొసలు, ప్రక్కభాగములు కూడ ఏటవాలుగా ఉండునట్టు వేయబడును లేదా ఈ రెండు విధానములు సమ్మిళితము చేసి వేయబడును. మట్టితో చేసి కాల్చిన పైకప్పు పెంకులను కొన్నింటిని డైకు శాన్ మాకు చూపించాడు. మరలా, జనాదరణగల అపూర్వమైన నీలివర్ణము మినహాయించి భూమి యొక్క రంగులే అత్యధికముగా కనిపించును.
“కొద్దిగా పైకిలేచియున్న మూలలు, ముందుకు పొడవుగా ఉన్న ముంజూరులు అందులో నివసించే వారి సౌకర్యార్థము ఏర్పాటుచేయబడిన ముఖ్య విషయాలు” అని డైకు శాన్ చూపించాడు. “వర్షాకాలములో వరండాలో క్రిందనుండి పైకప్పువరకున్న అద్దాల తలుపులను తెరచి ఉంచుటకు అవి అనుమతించును. అయితే వేసవిలో ఎండవేడి లోనికి రాకుండా అవి తగిన రీతిగా ఏర్పాటుచేయబడ్డాయి.”
భవన స్థలాన్ని సందర్శించుట ముగింపునకు వచ్చింది. ఇప్పుడు మన గైడ్ తాను నిర్మించుటకు ఒకటిన్నర సంవత్సరాలు పట్టిన ఒక గృహాన్ని చూడమని మనలనాహ్వానిస్తున్నాడు.
ఒక నిజమైన స్వప్న సౌధము
మనము వాహనము మీద వెళ్లి, దాని అందమైన రూపమును చూచే సరికి ఏ వ్యక్తియైన తాను సురక్షితంగా ఉన్నానని భావించగల యిల్లు యిదేనని మనము గుర్తించ గలము. దాని ముఖద్వారం తలుపు చెక్కలతో చేయబడి, తడికలాగ జోడించబడి అద్దములచే పొదగబడియున్నది. అది సులభంగా తెరుచుకుంటుంది. అందమైన ప్రవేశమార్గము గుండా లోపలికి ప్రవేశించాం. మా బూట్లను తీసివేసిన తర్వాత, యింటిలోనికి అడుగుపెట్టాం. ఆ హాలులో మా కాలిక్రిందనున్న నేల చెక్కలు గట్టిగా ఉన్నాయి.
బయటికి కన్పిస్తున్న నిర్మాణపు స్తంభాలను చూచుటకు మేము ఆగాము. అవి ఎంత మృదువుగా ఉన్నవంటే పట్టుకుంటే పట్టువలె ఉన్నవి. వార్నిషు పెట్టిన దానివలె మెరుస్తున్నవి. మామదిలో ఉన్నది పసిగట్టినట్లు డైకు శాన్ యిట్లు చెప్పాడు, “ఈ యింటిలో ఉన్న ఏ చెక్క పనికి రంగుగాని, బంగారువన్నె తెచ్చు వార్నిషుగాని పూయబడలేదు.” “సాధ్యమైనంత మట్టుకు నునుపుగా నుండుటకు అది రూపుదిద్దబడింది.”
జపానీయుల శైలిలో ఉన్న చావడి యొక్క వివరాలు గమనించాము. ప్రక్కకు త్రోసే తలుపులున్న కిటికీల పైభాగమునున్న దూలములపై చెర్రీపండ్లు చెక్కబడి ఉన్నాయి. గది యంతా చెక్క చట్రములపై కాగితము అతికించిన గోడలు ఉన్నాయి. వరండా వైపు ఉన్న ప్రక్కకు త్రోసే తలుపులు తడిక వలె చేయబడి తెల్లని షోజి కాగితము అతికించబడి ఉన్నాయి. వసారా మరి యితర గదులకు ఉన్న (ఫుసుమా అనబడే) తలుపులు మాత్రం దళసరి కాగితముతో కప్పబడి ఉన్నాయి. గదులను వేరుచేయుటకు ఉపయోగించే ప్రతి అడ్డుగోడలను వివిధ రకములుగా అలంకరించబడి ఉన్నాయి. “ఈ అడ్డుగోడలు తొలగిస్తే చాలు చిన్న గదులను పెద్ద గదిగా మార్చవచ్చు,” అని డైకు శాన్ వివరిస్తున్నాడు. ఎంత అనుకూలం!
టొకొనోమా, లేదా గోడలోని గూడు దానికి జతపర్చబడిన అరలు గట్టి గోడలకే ఉంటాయి. “ఇదే యింటికున్న అందం, దానిలో మంచి చెక్క, పనితనము యిమిడియుంది,” అని డైకు శాన్ చెప్తున్నాడు. నేడు అక్కడ అందమైన దస్తూరి గల గ్రంథపు చుట్ట వ్రేలాడుతున్నది.
మిగతా యిల్లంతటిని మాకు చూపాడు. దేవదారు, సైప్రస్, పైన్, టటామి చెక్కల సువాసన ప్రతిగదిలోను వ్యాపించియున్నది. సూక్ష్మమైన తుల్యత, రమ్యమగు అభిరుచి యిల్లంతటిలో కన్పిస్తుంది.
మేము బయటకు వచ్చేసరికి మా పరిశీలనకు తోట మాత్రం మిగిలియున్నది. అది అంత పెద్దది కాక పోయినను, అది నిర్మలంగా, ప్రసన్నంగా ఉన్నది. అందు ఒక నీటికొలను ఉంది దానిలో రంగురంగుల చేపలు, అందమైన జలపాతమున్నది. డైకు శాన్ ఒక గృహాన్ని నిర్మించేటప్పుడు ప్రదర్శించే నైపుణ్యత, కళా చాతుర్యతకు విస్మయమొందుచూ, సంతృప్తితో మేము తిరిగి వచ్చాము. (g91 10/22)