మానవ పరిపాలనను తూకం వేస్తే
భాగం 10 తుదకు పరిపూర్ణ ప్రభుత్వం!
దైవపరిపాలన: గ్రీకు పదాలైన “థియోస్” (దేవుడు) మరియు “క్రాటోస్” (ఒక పాలన); అంటే దేవుని ఆధ్వర్యమున లేక నడిపింపు క్రింద ఒక ప్రభుత్వము, కొన్ని సార్లు నియమిత ప్రతినిధుల ద్వారా పాలించునది.
నీవొక అసలైన వజ్రపు ఉంగరాన్నిగాని ముత్యాల దండను గాని కొనగల్గితే, దానిననుకరించిన నకిలీ వస్తువును నీవు కొంటావా? నీవు తీసుకొనబోవునది అన్నింటికంటె అత్యుత్తమమైనదని నమ్మునట్లు మోసగించబడితే తప్ప బహుశా కొనవు.
ప్రభుత్వ విషయం కూడ కోట్లాదిమంది ప్రజలు వారు పొందుచున్నది పొందదగిన దానిలోకెల్లా శ్రేష్ఠమైనదేనని నమ్మేటట్లు మోసగించబడియున్నారు. నిజానికి వారు అల్పమైన అనుకరణలనే పొందుచున్నారు. అందుకేవారు నిస్పృహ, అసంతృప్తి మరియు ఆశాభంగం చెందుచున్నారు.
ఉత్తమ ప్రభుత్వంకొరకు అన్వేషణ
విలియం రాల్ఫ్ ఇంజ్, లండన్ సెయింట్ పాల్ కెథిడ్రల్ యొక్క మాజీ ఆంగ్లికన్ చర్చి డీన్, 1922 లో ఇలా వ్రాశాడు: “ఒక ఉత్తమ ప్రభుత్వం మానవునికి అది గొప్ప దీవెనకరంగా వుంటుంది, అయితే ఏ దేశం అటువంటిదాన్ని ఎన్నడును పొందలేదు.” ఎందుకు?
అమెరికా 35 వ ప్రెసిడెంట్ జాన్. యఫ్. కెనడీ మాటల్లో దీనికి కొంత వివరణ దొరుకుతుంది. “ఏ ప్రభుత్వం దాన్ని ఏర్పరచిన మనుష్యులకంటె శ్రేష్ఠమైనది కాదు,” అని ఆయన అన్నాడు. ఎంతటి వరప్రసాదకరమైన రాజకీయ నాయకుడైనా అసంపూర్ణుడే గనుక మానవులు స్థాపించిన ప్రతి ప్రభుత్వం విఫలం కావలసిందే.
పదిహేడవ శతాబ్ది ఇంగ్లీష్ నాటక రచయిత ఫిలిఫ్ మాసింజర్ ఇలా వ్రాసింది వాస్తవమే: “ఇతరులను పాలించనైయున్నవాడు మొదట తనకు తాను స్వయంగా గురువైయుండాలి.” మరి అసంపూర్ణ మానవులలో ఎవడు నిజంగా తనకు తాను గురువై యుండగలడు? నిజానికి ఏ రాజకీయ నాయకునికి కూడ, పరిస్థితులను స్థితిగతులను చక్కదిద్ది తన స్వంత క్షేమాన్ని ఆనందాన్ని ఏర్పాటు చేయుటకు సరిపడు జ్ఞానవివేచనలే లేవు, మరి లక్షలాది మంది తోటి మానవులకు క్షేమం ఆనందాన్నిచ్చు సామర్థ్యం అంతకంటె లేదు. ఒకవేళ అతడు ఎప్పుడూ సరియైన నిర్ణయాలు చేయగల్గినప్పటికీ వాటిని అమలు పెట్టే శక్తి అతనికి లేదు.
అమెరికన్ వ్యాసరచయిత బ్రూక్స్ అట్కిన్‌సన్ యీ సమస్యను గుర్తెరిగినవాడై 1951 లోనే ఇలా ఓ ముగింపుకొచ్చాడు: “మనలను పరిపాలించుటకు మహామహులు కావాలి—ఆ పని చాలా విస్తారమైంది మరియు తెలివైన తీర్పుచేయగలిగే అవసరం చాలా అవశ్యం. అయితే మహామహులు మాత్రం లేరు.” నాలుగు దశాబ్దాల తర్వాత కూడ అటువంటివారెవ్వరు కనబడలేదు.
నిజానికి, మానవులు తమ్మును తామే పాలించుకోవలెనని దేవుడు ఎన్నడూ ఉద్దేశించలేదు. పరిపూర్ణ ప్రభుత్వము ననుభవించాలంటే మహామహుల పాలనకంటె గొప్పదే మానవులకు కావాలి. వారికి దైవపరిపాలన, దేవుని ప్రభుత్వం కావాలి.
ఎటువంటి దైవపరిపాలన
దైవపరిపాలన ఎటువంటిదంటే దేవుడు మొదటి మానవ జతను ఏదెనులో వుంచినపుడు అక్కడున్నటువంటి ప్రభుత్వము వంటింది. సర్వలోకనాధునిగా తొలుత దేవుడే అన్నింటిమీద అధికారియై పరిపాలనచేశాడు.
యూదా చరిత్రకారుడైన ఫ్లేవియస్ జోసీఫస్ 19 శతాబ్దముల క్రితం మొట్టమొదటిసారిగా “థియోక్రసి” అని అనువదించిన గ్రీకు పదాన్ని కనిపెట్టినపుడు ఆయన దాన్ని ఇశ్రాయేలు జనాంగమునకు వర్తించునట్లు ఉపయోగించాడు. దాన్ని సరిగ్గా వుపయోగించాడు, ఎందుకంటే ఆనాడు దేవుడు ఇశ్రాయేలీయులను ఒక జనాంగముగా ఎన్నుకున్నాడు. ఆయన పరిపాలన తన ప్రతినిధులద్వారా జరిగించినప్పటికిని వారిని ఆయనే నిజంగా పరిపాలించాడు.—ద్వితీయోపదేశకాండము 7:6; 1 దినవృత్తాంతములు 29:23.
“థియోక్రసి” అనే పదం ఇతర భాషల్లోనికి ప్రవేశ పెట్టబడినపుడు, మొదట జోసీఫస్ తలంచిన భావాన్నే వ్యక్తపర్చేవారు. అయితే తర్వాత అది అనేక భావాలను పొందుపరచుకుంది. ది ఎన్‌సైక్లోపీడియా ఆఫ్ రెలిజియన్ ప్రకారం దాన్ని “ఐగుప్తు ఫరో రాజులకు, పురాతన ఇశ్రాయేలుకు, మధ్యయుగపు క్రైస్తవమత సామ్రాజ్యానికి, కాల్విన్ మత సిద్ధాంతాలకు, ఇస్లాం మరియు టిబెట్టులోని బౌద్ధమతమునకు విరివిగా వర్తింపజేశారు.”
“ఆంగ్లేయ పాలనలో దైవపరిపాలన రాచరికము ఉండేది—లోకాన్ని పాలించడానికి దేవుని ఏర్పాటులో రాజొక ముఖ్య పాత్ర వహిస్తాడు, రాజు దేవుని ప్రతినిధిగాను తీర్పరిగాను వ్యవహరిస్తాడు” అని చరిత్రకారుడైన డబ్ల్యు. యల్. వారెన్ అంటున్నాడు. ఈ ఆధునిక కాలంలో ఆ మాటను “‘యాజక—పిచ్చిగల’ సమాజాల ‘జ్ఞానోదయం’ చెందిన తిరస్కారమును గూర్చి తెలియజేయుటకు కూడ వాడుచున్నారని జార్జి వాషింగ్టన్ యూనివర్శిటీ, డుయే వాలస్ జూనియర్, అంటున్నారు.
ఆ పదమునకు ఇప్పుడు విశాలార్థమున్నది గనుక అది ఉనికిలో ఉన్న అనేక రకముల దైవపరిపాలనను సూచించుచున్నది. మరి ఏ రకం మనకు కావాలి?
పోటీ దైవపరిపాలనలు
వ్రాయబడిన చరిత్రలో మొట్టమొదటి మానవ ప్రభుత్వమును 4,000 సం. క్రితం నిమ్రోదు స్థాపించాడు. నోవహు మునిమనుమడైన యీ నిమ్రోదు తనను తానే రాజుగా చేసుకొని, బైబిలునందు వర్ణించబడినట్లు అతడు, “యెహోవా ఎదుట పరాక్రమముగల వేటగాడాయెను.” (ఆదికాండము 10:8, 9) యెహోవాకు వ్యతిరేకంగా పరిపాలకునిగా చేసుకొనుటవలన నిమ్రోదు తననుతాను ఒక రాజకీయ దేవునిగా చేసికొనెను. అందుచేత, దేవుని ప్రధాన శత్రువైన అబద్ధ దేవుడగు సాతానుయగు అపవాది యొక్క మద్దతు అతనికుండెను. (2 కొరింథీయులు. 4:4) గనుక నిమ్రోదు పాలన అసలు దైవపరిపాలనకు పోటీగా నకిలీ పరిపాలన అయ్యింది.
నిమ్రోదు సామ్రాజ్యంలోని నివాసులంతా భూమియందంతట చెదరి పోయినపుడు ప్రజలింకా వారి ప్రభుత్వాలు దైవపరిపాలనకు సంబంధించినవేనని, అంటే, వారారాధించిన దేవుడు లేక దేవుళ్లనుండి అధికారం పొందినవేనని అనుకొనుచుండిరి. (ఆదికాండము 11:1-9) ఆ విధంగా “దైవపరిపాలన” అనే పదం “మతం మరియు ప్రభుత్వం మధ్య తేడాలేనటువంటి పురాతన తూర్పుదేశ తొలినాగరికతను వర్ణించేదిగా” వాడబడిందని ది ఎన్‌సైక్లోపీడియా ఆఫ్ రెలిజియన్ తెల్పుతుంది.
ఫరోల క్రిందనుండిన ఐగుప్తువంటి రాజ్యాలలో రాజు ఓ గొప్ప దేవతకు భర్తయని లేక ఒక దేవుని కుమారుడనే నమ్మకముండేది. ఇతర సంస్కృతుల వారు రాజు దైవాంశ సంభూతుడని లేక దైవలక్షణములున్నవాడని అంతగా చెప్పలేదు, గాని అతడు దేవుడేర్పరచుకున్నవాడని గట్టిగా నమ్మేవారు. అలెగ్జాండర్ కాలంలోను అటుతర్వాతను వున్న గ్రీసు దేశంలో రాజును దైవంగా భావించేవారని, ఎ హిస్టరీ ఆఫ్ పొలిటికల్ థియొరి చెబుతుంది, “ఎందుకంటే దేవుడు తన ప్రపంచానికి శాంతి ననుగ్రహించునట్లే అతడు తన రాజ్యానికి శాంతిని తెస్తాడు.” ఈ చరిత్ర పుస్తక మింకను ఇలా తెల్పుతుంది: “సామాన్య మానవునికి లేని దైవత్వము ఆయనకున్నది, పరలోక దీవెన లేకుండా, ఉన్నత స్థానాన్ని ఆక్రమించుకొను అయోగ్యులకు అది నాశనం తెచ్చును.”
రాజు దైవమనే యీ నమ్మకం క్రైస్తవయుగమని పిలువబడే కాలంవరకు వచ్చింది. ట్యూటన్ జాతులవారు కేథోలిక్ మతానికి మారిన తర్వాత రాజుకున్న ఖ్యాతి పెరిగిపోయింది. చర్చి రాజుకు కిరీటం ధరింపజేయుట రాజ్యమేలుటకు రాజును దేవుడే ఎన్నుకున్నట్లు భావం స్ఫురించేది. దీనిని ఆధారం చేసుకుని, రాజులది దైవ హక్కేయను సిద్ధాంతం క్రమేపి వృద్ధియైంది.
“క్రైస్తవ” యుగానికి ముందు కూడ రోమా పాలకులైన కైసరులు దైవత్వమును ఆపాదించుకుంటూ వారి ప్రభుత్వాలు దైవపరిపాలనలనే భావన కల్గించారు. రోమీయుల దృష్టిలో మానవ పాలన దైవపరిపాలనతో సమానం, వారి ప్రభుత్వ దైవపరిపాలనకు (భిన్నమైన) పోటియైన నిమ్రోదు పాలనను అనుకరించునట్లు చేశారు. గనుక సా.శ. మొదటి శతాబ్దంలోని యూదామత గురువులు యేసును కాబోవు రాజుగా తృణీకరించి, “మాకు కైసరు తప్ప వేరొక రాజు లేడని” చెప్పినపుడు వారు నిజానికి యేసు ప్రకటిస్తున్న అసలైన ప్రభుత్వానికి పోటీగా నున్న నకిలీ దైవపరిపాలనను ఇష్టపడుచున్నట్లు వ్యక్తపరచారు.—యోహాను 19:15.
యెహోవా దైవపరిపాలన ఏ ఇతర పరిపాలనలకంటె కూడ ఎంతో శ్రేష్ఠమైయున్నందువలన సాతాను తన మానవనిర్మిత నకిలీ పాలనలలో అందులోని కొన్ని గుణాలను చొప్పించుటకు విఫల యత్నం చేశాడనుటలో ఆశ్చర్యం లేదు. ఈ స్వయం నిర్మిత దైవపరిపాలనలన్నీ అసలు ఆశయపు అంచుల్లోకి కూడ రాలేక పోయినవి. వాస్తవానికి వాటిలో ఏదీ దేవుని వలనగాని ఆయన ప్రతినిధులద్వారా పరిపాలింపబడలేదు. అవి అసలు పరిపాలన హీనమైన అనుకరణలైయున్నవి, నకిలీ దేవుని అధీనమందున్న మానవ అసంపూర్ణ పాలనకు ప్రతీకలై యున్నవి.
అందుకే బైబిలు యుక్తంగా యీ దేవున్ని “ఈ లోకాధికారి” అని “యీ యుగసంబంధమైన దేవత” యనియు పిలుస్తోంది. (యోహాను 12:31; 14:30; 2 కొరింథీయులు 4:4) అందుచేతనే అతడు యేసునకు “యీ లోక రాజ్యములన్నిటిని, వాటి మహిమను” యివ్వచూపగలిగాడు, ఆ శోధనను యేసు నిక్కచ్చిగా తిరస్కరించాడు. (మత్తయి 4:8-10) నిజమైన దేవుడగు యెహోవా పరిపాలించేదే అసలైన దైవపరిపాలనయని ఎరిగిన యేసు నిజమైన పాలనయందున్న దైవలక్షణాలను పరిపూర్ణంగా అమలుపరచుటకు చేతగాని మానవ నిర్మిత ప్రత్యామ్నాయాలను అంగీకరించుటకు మోసపోలేదు.
పరిపూర్ణ ప్రభుత్వం సమీపమైంది
కొన్ని సంవత్సరాల క్రితం, ఎసెక్స్ యూనివర్శిటీకి చెందిన హగ్ బ్రోగన్ ఇలా ముగించాడు: “రాజకీయ పశువు అయిన మానవుడు తనను మరియు తన నాగరికతలను రక్షించుకోవాలనుకుంటే అతడు తన కాలములో అంతకంతకు వచ్చే అవసరాలను తీర్చుటకు క్రొత్త క్రొత్త ప్రభుత్వాలను వెదకుటలో వెనుకంజవేయలేడు.” నిమ్రోదు కాలం నుండి మానవులదే పనిచేస్తున్నారు, అప్పటి అవసరాలను తీర్చుటకు అనేక నూతన ప్రభుత్వాలను మాటిమాటికి కనిపెడుతూ వస్తున్నారు. అయితే మానవ పాలన నిరుపయోగమని నిరూపించుటకు మరి ఎంత సమయం అవసరం?
పరలోకమందు 1914 లో యెహోవాయొక్క మెస్సియా రాజ్యం స్థాపించబడుట ద్వారా మానవ పరిపాలన యొక్క బుద్ధిహీన ప్రయోగమును సవాలు చేసే సమయం వచ్చిందనుట సంతోషదాయకం.a 1914 నుండి మానవ ప్రభుత్వాలు, ఇంకను కొన ఊపిరితోవున్నప్పటికి, ప్రాణ భిక్షతోనే జీవిస్తున్నాయి. (దానియేలు 7:12) “అంత్యదినములని” బైబిలు సూచించే కాలములో మనం జీవిస్తున్నాం. (2 తిమోతి 3:1-5) గోడమీద వ్రాసిన చేతివ్రాత ప్రకారం మానవ పాలనకు త్వరలో నాశనం రానైయున్నదనుట ఎంత స్పష్టంగా వున్నదంటే దాన్నెవరూ నిజంగా కాదనలేరు. దాన్ని నిర్లక్ష్యం చేయవచ్చును గానీ దాన్ని తుడిచివేయలేరు.
బైబిలునందు దానియేలు 2 వ అధ్యాయంలో యెహోవా యొక్క మెస్సీయా రాజ్యం ద్వారా పాలించే దైవపరిపాలన ఒక రాయితో పోల్చబడింది, అది “చేతి సహాయం లేకుండ తీయబడిన రాయి, యినుమును మట్టియు కలిసిన ఆ ప్రతిమ (మానవ పాలనకు సూచన) యొక్క పాదముల మీదపడి దాని పాదములను తుత్తునియలుగా విరుగగొట్టెను.” దీని భావమేమంటే స్థాపించబడిన దేవుని రాజ్యం త్వరలో మహాచెడ్డదైన మానవపరిపాలనను దాని ప్రతి రూపమును పడగొట్టి తుత్తునియలుచేస్తుంది. ఎంత పూర్తిగా నాశనం చేస్తుంది? బైబిలు ఇందుకు ఇలా సమాధానమిస్తుంది: “అంతట ఇనుమును మట్టియు ఇత్తడియు వెండియు బంగారమును ఏకముగా దంచబడి కళ్లములోని చెత్తవలె కాగా వాటికి స్థలము ఎచ్చటను దొరకకుండ గాలివాటిని కొట్టుకొనిపోయెను.”—దానియేలు 2:34, 35.
మానవ దుష్ట ప్రభుత్వాలు ఆ విధంగా ఎన్నటికి వాటి జాడలేకుండా సంపూర్తిగా ఊడ్చివేయబడితే, స్పష్టంగా ఇక మానవ పాలనను ప్రచారంచేసే వారికి కష్టమైన సమయం ముందున్నది. ఈ వాస్తవాన్ని గుర్తెరిగిన లక్షలాదిమంది ప్రజలు, భ్రష్టమైన మానవ పాలన కంటె ఉన్నతమైన పాలన కొరకు వెదకుట జ్ఞానయుక్తమని గ్రహిస్తున్నారు. విశ్వసృష్టికర్తయైన యెహోవా దేవుని పాలన మాత్రమే, వేల సంవత్సరాలుగా చేసిన మానవ తప్పుడుపాలన, తప్పుడు నిర్వాహకం మూలంగా వచ్చిన సమస్యలను పరిష్కరించగలదు. మన కాలావసరములను నిజమైన దైవపరిపాలన మాత్రమే తీర్చగలదు.
“మానవ పరిపాలనను తూకంవేస్తే” అను యీ పది శీర్షికల భాగం, పరిపాలన విషయంలో వ్యక్తిగత నిర్ణయం తీసుకునే ప్రాముఖ్యతను నీవు గ్రహించునట్లు చేసిందని అవేక్! పత్రిక ఆశిస్తుంది. అన్నిటికంటె ముఖ్యంగా తెలివైన నిర్ణయంచేసికొనుటకు అది నీకు సహాయపడుతుందని ఆశిస్తున్నాం. మానవ పరిపాలన త్రాసులో తూకంవేస్తే తక్కువగా తూగినదని తేలింది. నీవు దేనిని ఎన్నుకుంటావు? చౌకబారు పాలనా, నిజమైన పరిపాలనా? మానవ పరిపాలనా లేక నిజదేవుడైన యెహోవా పరిపాలనా?—దానియేలు 2:44; మత్తయి 6:10. (g90 12/22)
[అధస్సూచీలు]
a దేవునిరాజ్యం 1914లో స్థాపించబడినదని, అప్పటినుండి యీలోకం అంత్యదినములలోనే వున్నదనుటకైన నిదర్శనము కొరకు వాచ్‌టవర్ బైబిల్ అండ్ ట్రాక్ట్ సొసైటీ ఆఫ్ న్యూయార్క్ వారు 1982 లో ప్రచురించిన మీరు పరదైసు భూమిపై నిరంతరము జీవించగలరు అనే పుస్తకం 16, 18 అధ్యాయములను చూడండి.
[20వ పేజీలోని బాక్సు]
యెహోవా దైవపరిపాలన ఏమిచేయును
◆ బలహీనులైన వృద్ధులను తిరిగి చురుకైన యౌవనదశకు తెచ్చును.—యోబు 33:25.
◆ యుద్ధములు గతించిపోవునట్లు చేయును.—కీర్తన 46:9; యెషయా 9:7.
◆ ప్రతి ఒక్కరికి పసందగు గృహములను అనుగ్రహించును.—యెషయా 65:21.
◆ రోగులను అంగవైకల్యముగలవారిని స్వస్థపరచును.—యెషయా 33:24; 35:5, 6.
◆ మృతులను లేపును.—యెషయా 25:8; అపొ.కార్యములు 24:15; ప్రకటన 20:13.
◆ భూమిపై దుష్టత్వం, అవినీతి, మరియు నేరం లేకుండా తుడిచివేయును.—సామెతలు 2:21, 22.
◆ అందరికి సమృద్ధిగా ఆహారముననుగ్రహించును.—కీర్తన 72:16; యెషయా 25:6.
◆ మనుష్యులు జంతువుల మధ్య సమాధానకరమగు సంబంధాన్ని తిరిగి నెలకొల్పును.—యెషయా 11:6-9; యెహెజ్కేలు 34:25.
◆ ప్రతిఒక్కరికి అర్థవంతమగు ప్రయోజనకరమగు పనిని అప్పగించును.—యెషయా 65:22, 23.
◆ ఈ భూమిని పూర్తిగా పరదైసుగా మార్చును.—యెషయా 35:1, 6, 7; లూకా 23:43.
ఇవి మానవులు చేసిన తుచ్ఛ రాజకీయ వాగ్దానాలు కావు; అవి దేవుడు చేసిన వాగ్దానాలు, ఆయన “అబద్ధమాడజాలని దేవుడు.”—హెబ్రీయులు 6:18.
[21వ పేజీలోని చిత్రం]
పరిపూర్ణ ప్రభుత్వము యొక్క నిత్యాశీర్వాదములు నీవును పొందగలవు!