రాజ్యాన్ని ప్రకటించడం మొదలుపెట్టి వందేళ్లు!
1. దాదాపు వందేళ్ల క్రితం, యెహోవా ప్రజలు ఏంచేయాలని ప్రోత్సాహం పొందారు?
1 ‘ఇదిగో, రాజు ఏలుతున్నాడు! మీరు ఆయన బహిరంగ ప్రతినిధులు. కాబట్టి రాజునూ, ఆయన రాజ్యాన్నీ ప్రకటించండి, ప్రకటించండి, ప్రకటించండి.’ దాదాపు వందేళ్ల క్రితం, హృదయాన్ని కదిలించే ఆ మాటలతో సహోదరుడు రూథర్ఫర్డ్ రాజ్య సందేశాన్ని అన్ని చోట్ల ప్రకటించమని యెహోవా ప్రజలను ప్రోత్సహించాడు. మనం అదే చేశాం! తొలి క్రైస్తవుల్లాగే “ఆకాశముక్రింద ఉన్న సమస్తసృష్టికి” రాజ్యసువార్తను ప్రకటించాం. (కొలొ. 1:23) ఓసారి వందేళ్లు వెనక్కి తిరిగి చూద్దాం. దేవుని రాజ్యాన్ని ప్రకటించేందుకు మనం ఏం చేశాం? రాజ్య పాలన వందేళ్ల వార్షికోత్సవం దగ్గరపడుతుండగా, దాని గురించి ప్రకటిస్తూ ఉండేలా మనం ఏంచేయవచ్చు?
2. మన సాహిత్యం దేవుని రాజ్యాన్ని ఎలా ప్రకటిస్తూ వచ్చింది?
2 వెనక్కి తిరిగి చూస్తే . . . దశాబ్దాలుగా మన సాహిత్యం దేవుని రాజ్యం గురించి ప్రకటిస్తోంది. 1939 నుండి మన ముఖ్య పత్రిక శీర్షిక: కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది. ఈ పత్రిక రాజ్యం గురించి, అదేమి సాధిస్తుందనే దాని గురించి తరచుగా చర్చిస్తుంది. దేవుని రాజ్యం మాత్రమే మానవాళికి మంచి భవిష్యత్తును తీసుకురాగలదని తేజరిల్లు! పత్రిక ముఖ్యంగా చెప్తుంది. ప్రపంచంలో ఇప్పుడు అన్నిటికన్నా ఎక్కువ భాషల్లో, ఎక్కువ సంఖ్యలో ప్రచురితమయ్యే పత్రికలు ఈ రెండే అవడం ఎంత సముచితం!—ప్రక. 14:6.
3. రాజ్యాన్ని ప్రకటించడానికి మనం ఏయే విధానాలను ఉపయోగించాం?
3 రాజ్యాన్ని ప్రకటించేందుకు యెహోవా ప్రజలు ఎన్నో విధానాలను ఉపయోగించారు. మొదట్లో మనం సౌండ్ కార్లను, రేడియో కార్యక్రమాలను, ఒక చోటు నుండి మరో చోటుకు మోసుకెళ్లగలిగే ఫోనోగ్రాఫ్లను ఉపయోగించాం. తక్కువమంది రాజ్య ప్రచారకులున్న ఆ సమయంలో, రాజ్యసువార్తను ఎక్కువమందికి వ్యాప్తిచేయడానికి ఈ విధానాలు సహాయపడ్డాయి. (కీర్త. 19:4) ఇటీవల, jw.orgలో కూడా మన సమాచారం అందుబాటులో ఉంది. అలా, మన పనిపై ఆంక్షలున్న దేశాల్లో జీవించేవాళ్లతో సహా లక్షలమందికి రాజ్యసువార్త ప్రకటిస్తున్నాం.
4. ఏ ప్రత్యేక పద్ధతుల్లో మనం ప్రకటించడం మొదలుపెట్టాం?
4 రాజ్య సందేశాన్ని వ్యాప్తి చేయడానికి యెహోవా ప్రజలు కొన్ని ప్రత్యేక పద్ధతులను ఉపయోగిస్తున్నారు. ఉదాహరణకు, 1995 సమయంలో ఇంటింటి పరిచర్యతో పాటు పార్కుల్లో, పార్కింగ్ స్థలాల్లో, వ్యాపార స్థలాల్లో ప్రకటించడానికి కూడా ప్రాముఖ్యత ఇవ్వడం మొదలుపెట్టాం. ఇటీవల, కొన్ని దేశాల్లోని పెద్దపెద్ద నగరాల్లో స్పెషల్ మెట్రోపోలిటన్ సాక్ష్యం ఏర్పాటు చేశాం. అంతేకాక, ఎన్నో సంఘాలు సాహిత్య కార్టులు, టేబుళ్లు ఉపయోగిస్తూ తమ ప్రాంతంలో ప్రజలు ఎక్కువగా ఉండే దగ్గర బహిరంగ సాక్ష్యం ఇస్తున్నాయి. అయినాసరే, ఇంటింటి పరిచర్యే మన ముఖ్య ప్రకటనా పద్ధతి.—అపొ. 20:20.
5. కొత్త సేవా సంవత్సరంలో చాలామందికి ఎలాంటి అవకాశాలు ఉన్నాయి?
5 ముందుకు చూస్తే . . . సెప్టెంబరు నెలతో కొత్త సేవా సంవత్సరం ఆరంభమౌతుంది. ఆ నెల నుండి చాలామంది క్రమ పయినీరు సేవ మొదలుపెడతారు. మీరూ వాళ్లలో ఒకరు అవ్వాలని అనుకుంటున్నారా? ఒకవేళ క్రమ పయినీరు సేవ చేయలేకపోయినా, అప్పుడప్పుడు సహాయ పయినీరు సేవ చేయగలరా? పయినీరు సేవ చేసినా చేయకపోయినా రాజ్యం గురించి శాయశక్తులా ప్రకటించేందుకు మీరు చేసే ప్రతీ త్యాగాన్ని యెహోవా ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు.—మలా. 3:10.
6. 2014 అక్టోబరు నెల ఎందుకు ప్రత్యేకంగా ఉంటుంది?
6 ఈ 2014 అక్టోబరు కల్లా రాజ్యం ఆరంభమై 100 ఏళ్లు పూర్తౌతుంది. భవిష్యత్తు కోసం ఎదురుచూస్తుండగా మనలో ప్రతీ ఒక్కరం వినేవాళ్లందరికీ ‘దేవుని రాజ్యాన్ని గూర్చిన సువార్త’ ప్రకటిస్తూ ఉందాం.—అపొ. 8:12.