చక్కని ఉపోద్ఘాతాలను ఎలా సిద్ధంచేసుకోవాలి?
1. ఉపోద్ఘాతం ఎందుకు చక్కగా ఉండాలి?
1 ఘుమఘుమలాడే వంటకం, ఎప్పుడెప్పుడు భోంచేయాలా అనే కోరికను కలిగిస్తుంది. అలాగే చక్కని ఉపోద్ఘాతాలు మంచి లేఖనాధారిత చర్చలకు ద్వారం తెరుస్తాయి. వాటి నిడివి, వాటిలోని సమాచారం వేర్వేరుగా ఉన్నా రుచికరమైన భోజనం విషయంలోలాగే చక్కని ఉపోద్ఘాతాలకు కూడా ముందుగానే ఆలోచించి సిద్ధపడడం అవసరం. (సామె. 15:28) చక్కని ఉపోద్ఘాతాన్ని ఎలా సిద్ధంచేసుకోవచ్చు?
2. ఇంటివాళ్లకు ఆసక్తికరంగా ఉండే ఉపోద్ఘాతాన్ని ఎలా సిద్ధం చేసుకోవచ్చు?
2 ఆసక్తికరమైన అంశాలను ఎంచుకోండి: ఉపోద్ఘాతం ఆసక్తికరంగా లేకపోతే ఇంటివాళ్లు మనం చెప్పేది వినకపోవచ్చు. కాబట్టి సిద్ధపడుతున్నప్పుడు, ఎలాంటి విషయాల గురించి మాట్లాడితే మీ ప్రాంతంలోని ప్రజలు ఇష్టపడతారో ఆలోచించండి. మంచి ప్రభుత్వం గురించా? కుటుంబ సంతోషం గురించా? యుద్ధాలు లేని లోకం గురించా? సాధారణంగా ప్రజలు తమ అభిప్రాయాన్ని చెప్పడానికి ఇష్టపడతారు కాబట్టి వాళ్లను ఆలోచింపజేసి, వాళ్ల అభిప్రాయాన్ని రాబట్టే ప్రశ్నను సిద్ధం చేసుకోండి. మన రాజ్య పరిచర్యలో వచ్చే ఉపోద్ఘాతాల్లో ఒకదాన్ని తీసుకుని మీ ప్రాంతానికి తగినట్లు దాన్ని మలుచుకోగలరా? వాటిలో కొన్నిటిని అప్పుడప్పుడూ మీ కుటుంబ ఆరాధనలో ఎందుకు ప్రాక్టీసు చేయకూడదు?
3. క్షేత్రంలోని ప్రజల సంస్కృతిని, నేపథ్యాన్ని బట్టి మన ఉపోద్ఘాతాన్ని ఎలా సిద్ధంచేసుకోవచ్చు?
3 సంస్కృతి, నేపథ్యం గురించి ఆలోచించండి: కొన్ని ప్రాంతాల్లో, మనం ఎందుకు వచ్చామో వెంటనే చెప్పాల్సి ఉంటుంది. ఇంకొన్ని ప్రాంతాల్లో, ఇంటికి వచ్చిన వ్యక్తి తమ యోగక్షేమాలను అడగకపోయినా, తన గురించి చెప్పుకోకపోయినా ఇంటివాళ్లు అమర్యాదగా భావిస్తారు. మరికొన్ని ప్రాంతాల్లో, నేరుగా బైబిలు ఉపయోగించి మాట్లాడవచ్చు. (అపొ. 2:14-17) అయితే క్రైస్తవులుకాని వాళ్లు, ఏ మతంతోనూ సంబంధంలేని వాళ్లు ఎక్కువగా ఉండే ప్రాంతంలో పరిచర్య చేస్తుంటే, మొదటిసారి కలిసినప్పుడు కాకుండా పునర్దర్శనమప్పుడు బైబిలును ఉపయోగించడం మంచిది.—అపొ. 17:22-31.
4. మన పరిచయ మాటల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
4 పరిచయ మాటలు: మీ పరిచయ మాటల్ని జాగ్రత్తగా ఎంచుకోండి. తక్కువ మాటల్లో, సరళంగా చెప్పడం మంచిది. మనం ఎలా మాట్లాడుతున్నామనేది కూడా చాలా ప్రాముఖ్యం. ఉత్సాహంగా మాట్లాడండి. ఇంటివాళ్ల పట్ల నిజమైన శ్రద్ధను చూపిస్తూ స్నేహపూర్వకంగా, మనస్ఫూర్తిగా చిరునవ్వు నవ్వండి. ఈ సలహాలను పాటిస్తే చక్కని ఉపోద్ఘాతాలను సిద్ధంచేసుకోగలుగుతాం, “ప్రభువు బల్లమీద” ఉన్న వాటిని ఆరగించాలనే కోరికను మన ప్రాంతంలోని ప్రజల్లో పుట్టించగలుగుతాం.—1 కొరిం. 10:21.