దేవుని వాక్యం బలమైనది
1. రాబోయే సేవా సంవత్సరంలో జరిగే ప్రత్యేక సమావేశ దిన ముఖ్యాంశం ఏమిటి?
1 అపరిపూర్ణ మనుషులు చేసిన దేనికీ లేనంత శక్తి బైబిలుకు ఉంది. మన ఆలోచనల్ని, విధానాల్ని యెహోవా చిత్తానికి అనుగుణంగా మలిచి మనల్ని పూర్తిగా మార్చే శక్తి దానికి ఉంది. దేవుని వాక్యం ఎంత శక్తిమంతమైనది? ఆ శక్తిని మన జీవితాల్లో పూర్తిగా ఉపయోగించుకోవాలంటే మనం ఏమి చేయాలి? ఇతరులకు సహాయం చేసేందుకు దాన్ని మనం మరింత సమర్థవంతంగా ఎలా ఉపయోగించవచ్చు? ఈ అంశాలను 2014 సేవా సంవత్సరంలో జరగబోయే ప్రత్యేక సమావేశ దిన కార్యక్రమంలో పరిశీలిస్తుండగా, మనందరం ఆధ్యాత్మికంగా బలపడతామనే నమ్మకాన్ని కలిగి ఉందాం. ఆ సమావేశ ముఖ్యాంశం “దేవుని వాక్యం బలమైనది.” దాన్ని హెబ్రీయులు 4:12 నుండి తీసుకున్నారు.
2. ఏ ప్రశ్నల జవాబులను మనం తెలుసుకుంటాం?
2 ఈ ప్రశ్నలకు జవాబులు తెలుసుకుంటాం: కార్యక్రమాన్ని వింటుండగా ఈ కింది ప్రశ్నల జవాబులను గమనించండి.
• యెహోవా వాక్యంపై మనం ఎందుకు నమ్మకం ఉంచాలి? (కీర్త. 29:4)
• దేవుని వాక్యానికున్న శక్తిని మనమెలా రుచి చూడవచ్చు? (కీర్త. 34:8)
• దేవుని వాక్యానికున్న శక్తిని పరిచర్యలో మీరెలా ఉపయోగించవచ్చు? (2 తిమో. 3:16, 17)
• సాతాను లోకానికున్న మోసపుచ్చే శక్తికి బలైపోకూడదంటే మనం ఏమి చేయాలి? (1 యోహా. 5:19)
• యౌవనులారా, మీరు ఆధ్యాత్మిక విజయాన్ని ఎలా సాధించవచ్చు? (యిర్మీ. 17:7)
• మనం బలహీనులుగా ఉన్నప్పుడు సహితం బలవంతులం ఎలా కావచ్చు? (2 కొరిం. 12:10)
• మనలో చెడు అలవాట్లు, వైఖరులు బలంగా పాతుకుపోయి ఉన్నా మనం నూతనమౌతూనే ఉండడానికి ఏది అవసరం? (ఎఫె. 4:23)
3. ప్రత్యేక సమావేశంలో, కార్యక్రమాన్ని వినడమేకాక ఇంకా ఎలాంటి ప్రయోజనాలు కూడా పొందవచ్చు?
3 ఈ ప్రాముఖ్యమైన సమాచారాన్ని వినడం ద్వారా మనం ఎంతో ప్రయోజనం పొందుతాం. అంతేగాక ప్రాంతీయ, జిల్లా సమావేశాల్లాగే ప్రత్యేక సమావేశ దినం కూడా వేరే సంఘాల్లోని మన సహోదర, సహోదరీలతో సహవసించేలా మన హృదయాల్ని విశాలపర్చుకునే అవకాశాన్ని కల్పిస్తుంది. (కీర్త. 133:1-3; 2 కొరిం. 6:11-13) కాబట్టి, పాత స్నేహితులతో సమయం గడపండి, కొత్త స్నేహితుల్ని పరిచయం చేసుకోండి. మీరు హాజరయ్యే ప్రత్యేక సమావేశానికి సందర్శక ప్రసంగీకుడిగా జిల్లా పర్యవేక్షకుడో బెతెల్ నుండి ఒక సహోదరుడో వస్తున్నట్లయితే ఆయనతో, ఆయన భార్యతో మాట్లాడడానికి ప్రయత్నించండి. అవును, రానున్న ప్రత్యేక సమావేశ దిన కార్యక్రమం కోసం ఆశగా ఎదురుచూడడానికి మనకు ఎన్నో కారణాలున్నాయి.