యెహోవాను స్తుతించడానికి మరిన్ని అవకాశాలు
1. ఏ కొత్త ఏర్పాటు వల్ల మనం ‘యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు మెండుగా చెల్లించవచ్చు’?
1 మార్చి నెల నుండి ఒక కొత్త ఏర్పాటు అమలులోకి వచ్చింది. దానివల్ల ప్రచారకులు మార్చి, ఏప్రిల్ నెలల్లో, అదే విధంగా ప్రాంతీయ పర్యవేక్షకుడు సందర్శించే నెలలో 30 గంటలు పరిచర్యలో గడిపి సహాయ పయినీరు సేవ చేయవచ్చు. ఒకవేళ ప్రాంతీయ పర్యవేక్షకుని సందర్శనం ఓ నెలలో మొదలై మరో నెలలో ముగుస్తుంటే, ప్రచారకులు ఏదైనా ఒక నెలలో 30 గంటలు పరిచర్యలో గడిపి సహాయ పయినీరుగా నమోదు కావచ్చు. ప్రత్యేక, క్రమ పయినీర్లతో ప్రాంతీయ పర్యవేక్షకుడు జరిపే కూటంలో సహాయ పయినీర్లు చివరివరకు ఉండవచ్చు. కాబట్టి నెలలో 50 గంటలు వెచ్చించడం మనకు వీలు కానట్లయితే, 30 గంటలు వెచ్చిస్తూ సంవత్సరానికి నాలుగుసార్లు వరకు మనం సహాయ పయినీరు సేవచేసి ‘యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు మెండుగా చెల్లించవచ్చు.’—కీర్త. 109:30; 119:171.
2. ప్రాంతీయ పర్యవేక్షకుని సందర్శనంలో సహాయ పయినీర్లకు ఏ మంచి అవకాశం ఉంది?
2 ప్రాంతీయ పర్యవేక్షకుని సందర్శనంలో: ఇప్పుడు వీలైనంత ఎక్కువ మంది ప్రాంతీయ పర్యవేక్షకుని సందర్శనంలో సహాయ పయినీరు సేవ చేసి, ఆయనతో కలిసి పరిచర్యలో పాల్గొంటూ పరస్పర ప్రోత్సాహాన్ని ఆస్వాదించవచ్చు. (రోమా. 1:11, 12) చాలామంది సహాయ పయినీర్లు, వారంలో ఒక్కసారైనా ఆయనతో పని చేసేందుకు వీలుగా ఒకరోజు సెలవు పెడతారు. ఉద్యోగస్థులైన సహాయ పయినీర్లు శని, ఆదివారాల్లో తమతో కలిసి పని చేయడం ప్రాంతీయ పర్యవేక్షకునికి వీలవుతుందేమో కనుక్కోవచ్చు. క్రమ, ప్రత్యేక పయినీర్లతో పాటు పయినీరు కూటానికి హాజరవడం ద్వారా సహాయ పయినీర్లు ఎంతగా ప్రోత్సాహం పొందుతారో ఆలోచించండి.
3. సహాయ పయినీరు సేవ చేసేందుకు జ్ఞాపకార్థ ఆచరణ కాలం ఎందుకు అద్భుతమైన అవకాశం?
3 మార్చి, ఏప్రిల్ నెలల్లో: జ్ఞాపకార్థ ఆచరణ కాలంలో గతంలో 30 గంటలు వెచ్చించి, ఒక నెల సహాయ పయినీరు సేవచేసిన వాళ్లు ఇప్పుడు తమ “స్తుతియాగము” రెట్టింపు చేసుకోవచ్చు! (హెబ్రీ. 13:15) సహాయ పయినీరు సేవచేసి మన పరిచర్యను విస్తృతపర్చుకునేందుకు మార్చి, ఏప్రిల్ నెలలు అద్భుతమైన అవకాశాలు కల్పిస్తాయి. మనం ప్రతీ సంవత్సరం ఆ నెలల్లో, జ్ఞాపకార్థ ఆచరణకు ఇతరుల్ని ఆహ్వానించే పనిలో సంతోషంగా పాల్గొంటాం. అలాగే జ్ఞాపకార్థ ఆచరణ కాలంలో చాలామంది తమ పరిచర్యను విస్తృతపర్చుకుంటారు కాబట్టి, మనకు ఎక్కువమంది ప్రచారకులతో పనిచేసే అవకాశం దొరుకుతుంది. జ్ఞాపకార్థ ఆచరణ తర్వాత, దానికి హాజరైన వాళ్లను మళ్లీ కలిసి ప్రత్యేక బహిరంగ ప్రసంగానికి హాజరయ్యేలా వాళ్లలో ఆసక్తిని పెంపొందిస్తాం. మరి సహాయ పయినీరు సేవ చేసేందుకు దొరికిన ఈ అదనపు అవకాశాల్ని మీరు సద్వినియోగం చేసుకుంటారా?—లూకా 6:45.