మీ పరిచర్యను విస్తృతం చేసుకోవడానికి ఇప్పుడే ప్రణాళిక వేసుకోండి
1. జ్ఞాపకార్థ ఆచరణ కాలానికి ఏ ప్రత్యేకత ఉంది? దానికోసం మనమెలా సిద్ధపడవచ్చు?
1 ప్రతీ సంవత్సరం జ్ఞాపకార్థ ఆచరణ కాలంలో అంటే మార్చి, ఏప్రిల్, మే నెలల్లో ‘యెహోవాకు మెండుగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి’ మనకెన్నో అవకాశాలు దొరుకుతాయి. (కీర్త. 109:30) విమోచన క్రయధనాన్ని ఏర్పాటు చేసిన దేవుని పట్ల మీకున్న మెప్పుదలను చూపించడానికి మార్చి నెలలో ఎక్కువ పరిచర్య చేయగలరా? ప్రణాళికలు వేసుకోవడానికి ఇదే సరైన సమయం.—సామె. 21:5.
2. గత ఏప్రిల్‌లో 30 గంటల సహాయ పయినీరు సేవ ఏర్పాటు గురించి విన్నప్పుడు మీరు, ఇతరులు ఎలా స్పందించారు?
2 సహాయ పయినీరు సేవ: గత సంవత్సరం, ఏప్రిల్‌లో 30 గంటల సహాయ పయినీరు సేవ చేయవచ్చు అని తెలుసుకున్నప్పుడు సంఘాలు ఎంతో సంతోషించాయి. ఒక సహోదరుడు ఇలా రాశాడు: “నేనింకా ఉన్నత పాఠశాల విద్యార్థినే కాబట్టి క్రమ పయినీరు సేవ చేయడానికి నాకు వీలుకావడం లేదు. కానీ, ఏప్రిల్ నెలలో 30 గంటల ఫారమ్‌ను నింపి 50 గంటలు చేయడానికి కృషి చేస్తాను.” పూర్తికాల ఉద్యోగం చేస్తున్న ఒక సహోదరి, “30 గంటలైతే ఇట్టే చేసేయొచ్చు!” అని అంది. గతంలో పయినీరుగా సేవ చేసిన, ఇప్పుడు 80వ పడిలో ఉన్న మరో సహోదరి ఈ ఏర్పాటు గురించి విన్నప్పుడు ఇలా అంది: “ఈ క్షణం కోసమే నేను ఎదురుచూస్తున్నాను! పయినీరు సేవలో గడిపిన కాలమే నా జీవితంలో శ్రేష్ఠమైన కాలమని యెహోవాకు తెలుసు!” సహాయ పయినీరు సేవ చేయలేని ఇతరులు పరిచర్యలో ఎక్కువ సమయం గడపడానికి లక్ష్యాలు పెట్టుకున్నారు.
3. మార్చి, ఏప్రిల్, మే నెలల్లో సహాయ పయినీరు సేవ చేయడానికి ఎలాంటి మంచి కారణాలున్నాయి?
3 మార్చి నెలలో మళ్లీ మనకు 30 లేదా 50 గంటల సహాయ పయినీరు సేవ చేసే అవకాశముంది, కాబట్టి సహాయ పయినీరు సేవ చేయడానికి అది అత్యంత అనువైన నెల. అంతేకాదు, ఏప్రిల్ 5న జరిగే జ్ఞాపకార్థ ఆచరణకు ఇతరులను ఆహ్వానించడానికి, శనివారం మార్చి 17 నుండి ఒక ప్రత్యేక ప్రచార కార్యక్రమంలో పాల్గొంటాం. చాలామంది, పరిచర్యను ఎక్కువగా చేయడంలో ఎంతగా సంతోషిస్తారంటే, 50 గంటలు చేయాల్సి వచ్చే ఏప్రిల్, మే నెలల్లో కూడా సహాయ పయినీరు సేవ చేయాలనుకుంటారు.
4. మన పరిచర్యను ఎలా విస్తృతం చేసుకోవచ్చు? దానివల్ల ఎలాంటి ప్రయోజనాలున్నాయి?
4 జ్ఞాపకార్థ ఆచరణ కాలంలో మీ కుటుంబంలోని ప్రతి ఒక్కరూ తమ పరిచర్యను ఎలా విస్తృతం చేసుకోవాలనుకుంటున్నారనే విషయం గురించి వీలైతే మీ తర్వాతి కుటుంబ ఆరాధనా సాయంకాలం రోజు చర్చించండి. (సామె. 15:22) మీ ప్రయత్నాలను ఆశీర్వదించమని యెహోవాను అడగండి. (1 యోహా. 3:22) మీ పరిచర్యను విస్తృతం చేసుకుంటే యెహోవాను మరింతగా స్తుతించడమేకాదు మీ సంతోషం కూడా రెట్టింపవుతుంది.—2 కొరిం. 9:6.