మీకు దేన్ని బట్టి ‘అతిశయం కలుగుతుంది’?
1. నెల చివర్లో, మనం దేన్ని బట్టి అతిశయించాలి?
1 నెల చివర్లో, అందరినీ క్షేత్ర సేవా నివేదికలు ఇవ్వమని అడిగినప్పుడు, మీకు దేన్ని బట్టి ‘అతిశయం కలుగుతుంది’? (గల. 6:4) మనం పరిచర్యలో 130 గంటలు గడిపే ప్రత్యేక పయినీర్లమైనా, నెలకు కనీసం 15 నిమిషాలు రిపోర్టు చేయడానికి ఆమోదం పొందిన ప్రచారకులమైనా, మనందరం పూర్ణాత్మతో యెహోవా సేవ చేస్తున్నందుకు సంతోషించాలి.—కీర్త. 100:2.
2. మనం మరింత ఎక్కువగా యెహోవా సేవ చేయడానికి ఎందుకు కృషి చేయాలి?
2 యెహోవా ఈ విశ్వానికే సర్వాధికారియైన ప్రభువు కాబట్టి, మన నుండి శ్రేష్ఠమైనది పొందడానికి ఆయన అర్హుడు. (మలా. 1:6) ఆయన మీద ప్రేమతో మనం ఆయన చిత్తం చేయడానికి మన జీవితాల్ని సమర్పించుకున్నాం. రోజు ముగిసేసరికి లేదా నెల చివర్లో, మన సమయంలోనూ నైపుణ్యాల్లోనూ శక్తిలోనూ “ప్రథమఫలమును” యెహోవా సేవకోసం వెచ్చించామనే నమ్మకం మనకు కలిగితే, దాన్ని బట్టి మనం అతిశయించవచ్చు. (సామె. 3:9) అయితే మనం చేయగలిగినంత చేయడం లేదని మన మనస్సాక్షి చెప్తే, దాని గురించి ఏమి చేయాలో ఆలోచించుకోవాలి.—రోమా. 2:15.
3. మనల్ని మనం ఇతరులతో పోల్చుకోవడం ఎందుకు జ్ఞానయుక్తం కాదు?
3 ఇతరులతో పోల్చుకోకూడదు: మనం చేసే సేవను ఇతరులు చేసే సేవతోనో, మరింత ఆరోగ్యంగా ఉన్నప్పుడు మనం చేసిన సేవతోనో పోల్చుకోవడం జ్ఞానయుక్తం కాదు. పరిస్థితులు ఎప్పుడూ ఒకేలా ఉండవు. అందరికీ ఒకే సామర్థ్యం ఉండదు. కాబట్టి, ఇతరులతో పోల్చుకుంటే పోటీతత్వం పెరుగుతుంది, పనికిరానివాళ్లమనే భావన ఏర్పడుతుంది. (గల. 5:26; 6:4) యేసు ఎవరినీ ఎవరితోనూ పోల్చలేదు. కానీ, తాము చేయగలిగింది చేసినందుకు ప్రతీ వ్యక్తిని మెచ్చుకున్నాడు.—మార్కు 14:6-9.
4. తలాంతుల గురించి యేసు చెప్పిన ఉపమానం నుండి మనం ఏ విలువైన పాఠాలు నేర్చుకోవచ్చు?
4 తలాంతుల గురించి యేసు చెప్పిన ఉపమానంలో, ప్రతీ దాసుడు ‘తన సామర్థ్యము చొప్పున’ తలాంతులు అందుకున్నాడు. (మత్త. 25:15) యజమాని తిరిగి వచ్చి వాళ్లను లెక్క అడిగినప్పుడు, తమ సామర్థ్యాన్ని బట్టి, పరిస్థితిని బట్టి చేయగలిగినదంతా చేసిన దాసులు తమ యజమాని మెప్పును పొంది ఆయన సంతోషంలో పాలుపొందారు. (మత్త. 25:21, 23) అలాగే మనం కూడా రాజ్య ప్రకటనాపనిలో నిమగ్నమైవుంటే, దేవుని ఆమోదం పొందుతామని నమ్మవచ్చు, దాన్ని బట్టి మనకు అతిశయం కలుగుతుంది!