చక్కగా బోధించడానికి మూడు సలహాలు
1. చక్కగా బోధించడానికి మనం ఎందుకు కృషి చేయాలి?
1 క్రైస్తవ సాక్షులమైన మనందరమూ బోధించేవాళ్లమే. మనం ఇతరులను మొదటిసారి కలిసినప్పుడు, వాళ్ల ఆసక్తిని పెంచడానికి తిరిగి వెళ్లినప్పుడు, బైబిలు అధ్యయనం నిర్వహిస్తున్నప్పుడు వాళ్లతో సమాచారాన్ని పంచుకుంటాం. అయితే, మనం బోధించేది మామూలు విషయం కాదు. ఎందుకంటే, “రక్షణార్థమైన జ్ఞానము” కలిగించే ‘పరిశుద్ధ లేఖనాలను’ అర్థం చేసుకోవడానికి మనం ప్రజలకు సహాయం చేస్తున్నాం. (2 తిమో. 3:14, 15) అదెంతో అద్భుతమైన అవకాశం. కాబట్టి, చక్కగా బోధించడానికి ఉపయోగపడే మూడు సలహాలను ఇప్పుడు చూద్దాం.
2. సరళంగా బోధించాలంటే మనం ఏమి చేయాలి?
2 సరళంగా బోధించండి: మనకు ఒక విషయం బాగా తెలిసినప్పుడు, కొత్తవాళ్లకు దాన్ని అర్థం చేసుకోవడం ఎంత కష్టంగా ఉంటుందో మర్చిపోతుంటాం. అందుకే, బైబిలు అధ్యయనం నిర్వహిస్తున్నప్పుడు అనవసరమైన వివరాలు చేర్చకండి. ముఖ్యమైన విషయాలనే నొక్కిచెప్పండి. ఎక్కువగా మాట్లాడితేనే చక్కగా బోధించినట్లు అని అనుకోకండి. (సామె. 10:19) సాధారణంగా, ముఖ్యమైన లేఖనాల్ని మాత్రమే చదవడం మంచిది. లేఖనం చదివిన తర్వాత, చర్చిస్తున్న విషయానికి సంబంధం ఉన్న భాగాన్ని మాత్రమే వివరించండి. మత్తయి 5 నుండి 7 అధ్యాయాల్లో ఉన్న కొండమీది ప్రసంగంలో యేసు, లోతైన సత్యాలను తక్కువ పదాలు ఉపయోగించి, సులభంగా అర్థమయ్యేలా బోధించాడు.
3. ఉదాహరణలు ఎందుకు ఉపయోగించాలి? ఎలాంటి ఉదాహరణలు వాడడం మంచిది?
3 ఉదాహరణలు ఉపయోగించండి: ఉదాహరణలు ఆలోచింపజేస్తాయి, హృదయాన్ని తాకుతాయి, విషయాన్ని ఎక్కువకాలం గుర్తుంచుకోవడానికి సహాయం చేస్తాయి. మంచి ఉదాహరణలు వాడడానికి మీరు కథారచయిత అయ్యుండాల్సిన అవసరం లేదు. యేసు తరచూ అందరికీ అర్థమయ్యే చిన్నచిన్న ఉదాహరణలు ఉపయోగించాడు. (మత్త. 7:3-5; 18:2-4) చిన్న కాగితం మీద గీసిన బొమ్మలు కూడా ఎంతో సహాయం చేస్తాయి. ముందే కొద్దిగా ఆలోచిస్తే చక్కని ఉదాహరణలు మనసుకు తడతాయి.
4. ప్రశ్నలు చక్కగా ఉపయోగించాలంటే ఏమి చేయాలి?
4 ప్రశ్నలు వేయండి: ప్రశ్నలు కూడా విద్యార్థిని ఆలోచించేలా చేస్తాయి. కాబట్టి, ప్రశ్న అడిగిన తర్వాత జవాబు కోసం ఓపిక పట్టండి. అలా కాకుండా వెంటనే జవాబు కూడా మీరే చెబితే, చర్చిస్తున్న అంశం మీ విద్యార్థికి అర్థమైందో లేదో తెలుసుకోలేరు. ఆయన చెప్పిన జవాబు తప్పయితే, కేవలం దాన్ని సరిదిద్దడమే కాదు ఆయనే సరైన జవాబు తెలుసుకునేలా ఇంకొన్ని ప్రశ్నలు వేయడం మంచిది. (మత్త. 17:24-27) మనం పరిపూర్ణులం కాదు కాబట్టి బోధించే విషయంలో మనందరికి ఏదోక లోపం ఉంటుంది. అందుకే మనమెలా బోధిస్తున్నామో ఎప్పుడూ జాగ్రత్తగా చూసుకోవాలని బైబిలు చెబుతోంది. మనమలా చేస్తే మనకు, మన బోధ వినేవాళ్లకు శాశ్వత ప్రయోజనాలు కలుగుతాయి.—1 తిమో. 4:16.