సులభంగా అర్థమయ్యేటట్టు బోధించండి
1. ప్రజలు నేర్చుకోవడానికి సహాయం చేయాలంటే ఏది చాలా ప్రాముఖ్యం?
1 ప్రజలు నేర్చుకోడానికి సహాయం చేయాలంటే సులభంగా అర్థమయ్యేటట్టు బోధించడం చాలా ప్రాముఖ్యం. గొప్ప బోధకుడైన యేసు బోధించిన పద్ధతిని పరిశీలిస్తే, మన ‘బోధనా కళను’ మెరుగుపర్చుకోగలుగుతాం.—2 తిమో. 4:2, NW; యోహా. 13:13.
2. సులభంగా అర్థమయ్యేటట్టు ఎలా బోధించవచ్చు, దీనివల్ల ఎలాంటి ప్రయోజనం ఉంటుంది?
2 సులభంగా అర్థమయ్యేటట్టు మాట్లాడండి: కొండమీది ప్రసంగంలో యేసు, ఇంతవరకు ఎవ్వరూ చెప్పని కొన్ని లోతైన సత్యాలు చెప్పాడు, వాటన్నిటినీ ఆయన సులభంగా అర్థమయ్యేటట్టు వివరించాడు. (మత్త., 5-7 అధ్యా.) ఆయన మాటలు వింటున్న ప్రజలు ‘ఆయన బోధకు ఆశ్చర్యపోయారు.’ ఆయనను నిర్బంధించడానికి వచ్చిన బంట్రౌతులు, ఆయన చెప్పింది విని ఆశ్చర్యంతో ఇలా అన్నారు: “ఆ మనుష్యుడు మాటలాడినట్లు ఎవడును ఎన్నడును మాటలాడలేదు.” (మత్త. 7:28, 29; యోహా. 7:46) ఇతరులు సత్యాన్ని అంగీకరించాలంటే పెద్ద పెద్ద మాటలు, అర్థంకాని పదబంధాలు, చాలా వివరాలున్న ఉపమానాలు ఉపయోగించాల్సిన అవసరం లేదు. అందరికీ తెలిసిన పదాలను ఉపయోగిస్తూ సత్యాన్ని స్పష్టంగా వివరించవచ్చు.
3. కొంతమంది తమ శ్రోతలకు ఒకేసారి ఎక్కువ సంగతులు ఎందుకు చెప్తారు, కానీ అలా చేయకుండా ఉండాలంటే ఏమి చేయాలి?
3 ఎన్ని విషయాలు చెప్పాలో నిశ్చయించుకోండి: ఒకసారికి ఎన్ని విషయాలు చెప్పాలో నిశ్చయించుకోవడానికి యేసు, తన శ్రోతల గ్రహించే సామర్థ్యాన్ని పరిగణలోకి తీసుకున్నాడు. (యోహా. 16:12) అలాగే మనం కూడా మన శ్రోతల గ్రహించే సామర్థ్యాన్ని పరిగణలోకి తీసుకుని దానికి తగ్గట్టుగా మాట్లాడాలి. ప్రాముఖ్యంగా మన బంధువులకు, కొత్తగా ఆసక్తి చూపిస్తున్నవారికి, పిల్లలకు సాక్ష్యమిచ్చేటప్పుడు ఇలా చేయడం అవసరం. వాళ్లు శ్రద్ధగా వింటున్నట్లు అనిపించినా, మరీ ఎక్కువ సంగతులు చెప్పకుండా జాగ్రత్తపడాలి. యథార్థ హృదయం ఉన్నవాళ్లు సత్య దేవుడైన యెహోవా గురించి తెలుసుకుంటూనే ఉంటారు.—యోహా. 17:3; 1 కొరిం. 3:6.
4. ఎక్కువ వివరాలు చెప్పే బదులు ముఖ్య విషయాలు చెప్తే వచ్చే ప్రయోజనమేమిటి?
4 ముఖ్య విషయాలు చెప్పండి: యేసు బోధించేటప్పుడు ఒకేసారి చాలా వివరాలు చెప్పి, అర్థం చేసుకోవడం కష్టమయ్యేటట్టు చేయలేదు. ఆయన, ‘సమాధులలో ఉన్నవారందరు బయటికి వచ్చెదరు’ అని చెప్పాడు, అయితే పునరుత్థానం చేయబడేవారు రెండు వేరు వేరు స్థలాలకు వెళ్తారనే దానిగురించి మరీ విపులంగా ఆ సమయంలో వివరించలేదు. (యోహా. 5:28, 29) బైబిలు అధ్యయనాలు నిర్వహించేటప్పుడు మనం ముఖ్య విషయాలు చెప్పాలి, పుస్తకంలో లేని అనవసరమైన విషయాలను చర్చించకుండా జాగ్రత్తపడాలి.
5. సులభంగా అర్థమయ్యేటట్టు బోధిస్తే మనం ఏ ఆశీర్వాదాన్ని పొందుతాం?
5 మనం తెలుసుకోవలసినదంతా యెహోవా సులభంగా అర్థమయ్యేటట్టు బోధించినందుకు మనమాయనకు ఎంత కృతజ్ఞులం! (మత్త. 11:25) సులభంగా అర్థమయ్యేటట్టు బోధించడానికి కృషి చేస్తూ పరిచర్యలో మంచి ఫలితాలు రావడం వల్ల కలిగే ఆనందాన్ని పొందుదాం.