పరిచర్యలో నైపుణ్యాలు మెరుగుపర్చుకుందాం—మళ్లీ కలుసుకోవడానికి ఏర్పాట్లు చేసుకోండి
ఎందుకు ప్రాముఖ్యం? ఎవరైనా ఆసక్తి చూపిస్తే, మళ్లీ వాళ్లు ఇంట్లో ఎప్పుడుంటారో కనుక్కొని వెళ్లి సత్యపు విత్తనానికి నీళ్లు పోయాలని అనుకుంటాం. (1 కొరిం. 3:6) అందుకు మొదటిసారి కలిసినప్పుడే వాళ్లను మళ్లీ ఎప్పుడు కలవవచ్చో అడిగి తెలుసుకోవాలి. అంతేకాకుండా, ఈసారి కలుసుకున్నప్పుడు ఏ ప్రశ్న చర్చిస్తారో ముందే చెప్పడం మంచిది. అప్పుడు ఇంటివాళ్లు మనం మళ్లీ ఎప్పుడు వస్తామా అని ఎదురుచూస్తారు, ఒకవేళ ఇచ్చిన ప్రచురణలోనే మనం వేసిన ప్రశ్నకు జవాబు ఉంటే వాళ్లు దాన్ని చదివే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈసారి వచ్చినప్పుడు ఏం మాట్లాడాలో ముందే అనుకున్నారు కాబట్టి, ఇంటివాళ్లతో ఏం మాట్లాడాలనే కంగారు మీకుండదు, మీరు మళ్లీ ఎందుకు వచ్చారని వాళ్లు కూడా అనుకోరు. కాబట్టి, మీరు మళ్లీ వెళ్లినప్పుడు, ముందు అనుకున్న ప్రశ్న గురించి మాట్లాడడానికి వచ్చానని చెప్పి, దాని గురించి చర్చించడం మొదలుపెట్టవచ్చు.
ఈ నెలలో దీన్ని ప్రయత్నించండి:
పరిచర్యలో ఎలా మాట్లాడాలో సిద్ధపడుతున్నప్పుడే, మళ్లీ కలుసుకున్నప్పుడు చర్చించాల్సిన ప్రశ్నను కూడా తయారు చేసుకోండి. మీతో పనిచేస్తున్న ప్రచారకునికి దాన్ని చెప్పండి.