అవిశ్వాసియైన భర్త లేదా భార్య సత్యం తెలుసుకోవడానికి మీరు సహాయం చేయగలరా?
1. క్రైస్తవ భర్త లేదా భార్య తన వివాహ భాగస్వామి సత్యం తెలుసుకునేలా సహాయం చేయాలని కోరుకున్నట్టే ఇంకా ఎవరు కూడా కోరుకుంటారు?
1 మీ సంఘంలో కొంతమంది ప్రచారకులకు అవిశ్వాసియైన భర్తగానీ భార్యగానీ ఉన్నారా? అలాగైతే, ఈ ప్రచారకులు తమ భర్త లేదా భార్య కూడా తమతోపాటు సత్యారాధన చేయాలని తప్పకుండా కోరుకుంటారు. అయితే, అలా కోరుకునేది వాళ్లు మాత్రమే కాదు. దేవుడు కోరుకున్నట్టే, “మనుష్యులందరు సత్యమునుగూర్చిన అనుభవజ్ఞానముగలవారై యుండవలెను” అని సంఘంలోని సభ్యులందరూ కోరుకుంటారు. (1 తిమో. 2:4) మనం మన సంఘంలో ఉన్న ప్రచారకుల అవిశ్వాసులైన భర్తలు లేదా భార్యలు సత్యం తెలుసుకోవడానికి ఎలా సహాయం చేయవచ్చు?
2. మనం వివేచన ఉపయోగించి అవిశ్వాసియైన భాగస్వామికి ఎలా సహాయం చేయవచ్చు?
2 ముందు మనం విషయాలను అవిశ్వాసియైన భర్త లేదా భార్య వైపు నుండి ఆలోచించడానికి ప్రయత్నించాలి. చాలామంది అవిశ్వాసులైన భర్తలు లేదా భార్యలు తమ కుటుంబాలను ప్రేమిస్తారు, మంచి భర్తలుగా లేదా భార్యలుగా, తల్లిదండ్రులుగా ఉండడానికి ప్రయత్నిస్తారు. వాళ్లకు వాళ్ల స్వంత మత నమ్మకాలుంటాయి, బహుశ వాటిని వాళ్లు మనస్ఫూర్తిగా నమ్ముతుండవచ్చు. యెహోవాసాక్షుల గురించి అంతగా తెలియని వాళ్లు లేదా మనమంటే గిట్టనివాళ్లు చెప్పింది తప్ప వాళ్లకు మన గురించి బహుశా ఎక్కువ తెలిసి ఉండకపోవచ్చు. కొంతమందికి, తమ భర్త లేదా భార్య ఇంతకు ముందు కుటుంబంతో గడిపే సమయాన్ని ఇప్పుడు ఆరాధన కోసం గడపడం చూసి కోపమొస్తుంది. మనం వివేచన ఉపయోగిస్తే అవిశ్వాసితో దయగా, గౌరవంగా వ్యవహరించగలుగుతాం, ఆయన లేదా ఆమె ఉన్నప్పుడు అనవసరంగా కంగారుపడకుండా ఉండగలుగుతాం.—సామె. 16:20-23.
3. అవిశ్వాసియైన భర్తకు లేదా భార్యకు సత్యంపట్ల ఆసక్తి కలిగించడానికి చక్కని మార్గం ఏమిటి?
3 వ్యక్తిగత ఆసక్తి: అవిశ్వాసియైన భర్తకు లేదా భార్యకు మొదట్లో సత్యంపట్ల ఆసక్తి కలిగించడానికి చక్కని మార్గం మనం చేసే పనులే గానీ బైబిలు గురించి మాట్లాడడం కాదు. (1 పేతు. 3:1, 2) ముఖ్యంగా మనం చేసే పనులు వాళ్లమీద మనకు వ్యక్తిగత శ్రద్ధ ఉందని చూపించాలి. సంఘంలోని సహోదరీలు అవిశ్వాసియైన భార్య విషయంలో, సహోదరులైతే అవిశ్వాసియైన భర్త విషయంలో శ్రద్ధ చూపించాలి. ఎలా?
4. మనం వ్యక్తిగత శ్రద్ధను ఎలా చూపించవచ్చు?
4 ఇప్పటివరకు మీరు అవిశ్వాసియైన భర్తనుగానీ భార్యనుగానీ కలవకపోతే, వాళ్ల క్రైస్తవ వివాహ భాగస్వామితో మాట్లాడి వాళ్లను కలవవచ్చు. అవిశ్వాసియైన భాగస్వామి మీరు చేసే ప్రయత్నాలకు మొదట్లో సానుకూలంగా స్పందించకపోతే నిరుత్సాహపడకండి. మనం వాళ్లతో స్నేహంగా ఉంటే, వాళ్లపట్ల వ్యక్తిగత శ్రద్ధ చూపిస్తే యెహోవాసాక్షుల మీద వాళ్లకున్న సదభిప్రాయం ఇంకా ఎక్కువయ్యే అవకాశముంది. (రోమా. 12:20) కొంతమంది పరిణతివున్న క్రైస్తవులు అవిశ్వాసియైన భర్తను బాగా తెలుసుకోవడానికీ మనమీద ఏదైనా అయిష్టత ఉంటే దాన్ని పోగొట్టడానికీ ఆయనను, ఆయన కుటుంబాన్ని భోజనానికి ఆహ్వానించారు. వాళ్లు ఎక్కువగా ఆధ్యాత్మిక విషయాల గురించే మాట్లాడడానికి ప్రయత్నించే బదులు ఆయనకు ఆసక్తివున్న విషయాల గురించి మాట్లాడారు. తర్వాత ఎప్పుడైనా, ఆయన ఆసక్తి చూపించినప్పుడు ఆధ్యాత్మిక విషయాల గురించి మాట్లాడే అవకాశం దొరకవచ్చు. లేదా, ఆయన భార్య ఏమి నేర్చుకుంటుందో చూడడానికి మన కూటాల్లో ఒకదానికి రమ్మని ఆహ్వానిస్తే, ఎలాగూ ఆయనకు సంఘంలో కొంతమంది తెలుసు కాబట్టి, ఆయన రావడానికి ఇష్టపడవచ్చు. ఆయన సత్యం తెలుసుకోవడానికి సిద్ధంగా లేకపోయినా, విశ్వాసియైన తన భార్యకు మద్దతు ఇస్తున్నందుకు మనం ఆయనను తప్పకుండా మెచ్చుకోవచ్చు.
5. అవిశ్వాసులైన భర్తలు లేదా భార్యలు సత్యం తెలుసుకోవడానికి పెద్దలు ఎలా సహాయం చేయవచ్చు?
5 ముఖ్యంగా పెద్దలు, అవిశ్వాసులైన భర్తలు లేదా భార్యలు సత్యం తెలుసుకోవడానికి వాళ్లకు సహాయం చేయాలి, వాళ్లకు సాక్ష్యమివ్వగల అవకాశాలను వెంటనే గ్రహించగలగాలి. బైబిలు గురించి మాట్లాడితే వినడానికి ఇష్టపడని అవిశ్వాసియైన భర్త ఆసుపత్రిలో ఉన్నప్పుడు లేదా తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు లేఖనాలను ఉపయోగించి ప్రోత్సహిస్తే వినే అవకాశముంది. అవిశ్వాసియైన భర్త లేదా భార్య ఉన్న కుటుంబాల్లో ఏదైనా విపత్తు తలెత్తితే అంటే కుటుంబ సభ్యులెవరైనా చనిపోతే, పెద్దలు వాళ్లను ఓదార్చడానికి వెళ్లినప్పుడు అవిశ్వాసియైన వివాహ భాగస్వామిని కూడా తమతోపాటు కూర్చోమని అడగవచ్చు.
6. అవిశ్వాసియైన భర్త లేదా భార్య సత్యం తెలుసుకోవడానికి మనం ఎందుకు సహాయం చేయాలి?
6 మన సంఘంలోని ప్రచారకుల అవిశ్వాసియైన భర్త లేదా భార్య సత్యాన్ని ఇష్టపడి క్రైస్తవులుగా మారినప్పుడు ఆ ప్రచారకులు ఎంత సంతోషిస్తారో ఒక్కసారి ఊహించండి. అది చూసి యెహోవా, దేవదూతలు, సంఘంలోని మిగతావాళ్లు కూడా ఎంతో ఆనందిస్తారు. (లూకా 15:7, 10) అయితే, అవిశ్వాసియైన భర్త మొదట్లో అంతగా ఆసక్తి చూపించకపోయినా, ‘ఎవడును నశింపవలెనని యిచ్ఛయింపక, అందరు మారుమనస్సు పొందవలెనని కోరుకునే’ యెహోవా మనం చేస్తున్న ప్రయత్నాలను చూసి ఆనందిస్తాడు కాబట్టి మనం సంతోషంగా ఉండవచ్చు.—2 పేతు. 3:9.
[6వ పేజీలోని బ్లర్బ్]
అవిశ్వాసియైన భర్తకు లేదా భార్యకు మొదట్లో సత్యంపట్ల ఆసక్తి కలిగించడానికి చక్కని మార్గం మనం చేసే పనులేగానీ బైబిలు గురించి మాట్లాడడం కాదు