సేవా కూటంలోని భాగాలను నిర్వహించేవాళ్లకు నిర్దేశాలు
మన రాజ్య పరిచర్య ఈ సంచిక నుండి, సేవా కూటం పట్టికలో తక్కువ పదాలు ఉపయోగించబడతాయి. ఇక్కడివ్వబడిన సూచనలు, జ్ఞాపికలు మే, 2009, మన రాజ్య పరిచర్యలోని “సేవాకూటానికి ఎలా సిద్ధపడాలి?” అనే ఆర్టికల్లో చెప్పబడిన విషయాలకు మరిన్ని విషయాలను చేర్చి, వాటిని మరింత స్పష్టం చేస్తాయి.
▪ ప్రసంగం: నియమించబడిన సమాచారం ఆధారంగా ఇవ్వబడే ప్రసంగం. దీనిలో ప్రేక్షకులు పాల్గొనరు. సంఘానికి ఎంతో సహాయకరంగా ఉండే విషయాల మీదే ప్రసంగీకుడు దృష్టిపెట్టాలి.
▪ ప్రశ్నాజవాబులు: కావలికోట అధ్యయనంలాగే క్లుప్త ఉపోద్ఘాతం, ముగింపు ఉంటాయి. ప్రతీ పేరాలోనూ ప్రశ్నలు వేయబడతాయి. నిర్వాహకుడు ఎక్కువగా వ్యాఖ్యానించకూడదు. సమయముంటే ముఖ్యమైన లేఖనాలను చదివించవచ్చు. పేరాలు చదివించమని సూచనలు ఇవ్వబడితే తప్ప వాటిని చదివించాల్సిన అవసరం లేదు.
▪ చర్చ: ఇది ప్రసంగంలా ఇవ్వబడినా దానిలో ప్రేక్షకులు కూడా కొంతవరకు పాల్గొంటారు. కాబట్టి, ఇది కేవలం ప్రసంగమూ కాదు, అలాగని కేవలం ప్రశ్నాజవాబులూ కాదు.
▪ ప్రదర్శనలు, ఇంటర్వ్యూలు: ప్రదర్శింపజేయమని ఉంటే, ఒక ప్రదర్శనను ఏర్పాటు చేయాల్సిన బాధ్యత ఆ భాగం నిర్వహించే సహోదరునిదే. ఆయనే ప్రదర్శన చేయాలనేమీ లేదు, ప్రదర్శన చేయడానికి సమర్థులైన, ఆదర్శవంతులైన సహోదర సహోదరీలను ఎంపిక చేసుకోవాలి. సాధ్యమైతే, ఆయన వాళ్లతో ముందుగానే ఏర్పాట్లు చేసుకోవాలి. కొత్తవాళ్లకు, అనుభవం లేనివాళ్లకు స్టేజి మీదకు వెళ్లే అవకాశం కల్పించాలనే ఉద్దేశంతో, ప్రదర్శనను వాళ్లతో చేయించడం మంచిది కాదు. కావాలంటే వాళ్లను గృహస్థులుగా ఉపయోగించుకోవచ్చు. ప్రచారకులు ప్రదర్శన చేసేటప్పుడు ప్రేక్షకుల వైపు తిరిగి ఉండాలి. ఇంటర్వ్యూ చేయబడే సహోదర సహోదరీలు తమ సీట్లలోనే కూర్చుని మాట్లాడే బదులు స్టేజి మీదకు వెళ్లి మాట్లాడాలి. ప్రదర్శనలను, ఇంటర్వ్యూలను ముందుగా ప్రాక్టీస్ చేసుకోవాలి. కూటం ముగించాల్సిన సమయం దాటిపోతుంటే, ఆ భాగం నిర్వహించే సహోదరుడు ప్రదర్శనలను, ఇంటర్వ్యూలను రద్దు చేసే బదులు తన వ్యాఖ్యానాలను తగ్గించుకోవాలి. పరిచర్య సేవకులు వీటిలో పాల్గొనే వాళ్లను ఎంపిక చేసుకునే ముందు పెద్దల సభ సమన్వయకర్తను లేదా మరో పెద్దను సంప్రదించాలి.
ఏదైనా ఒక విశేషమైన భాగానికి ప్రత్యేకంగా నిర్దేశాలు ఇవ్వబడితే వాటిని జాగ్రత్తగా పాటించాలి. సహోదరులు పై నిర్దేశాలకు అనుగుణంగా సేవా కూటాల్లో భాగాలు నిర్వహిస్తే, సేవా కూటాలు “మర్యాదగాను, క్రమముగాను” జరగడానికి ఎంతో దోహదపడతారు.—1 కొరిం. 14:39, 40.