బైబిలు అధ్యయనం ప్రతిపాదించడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండండి
1. మత్తయి 28:19, 20 లో యేసు ఇచ్చిన ఆజ్ఞను నెరవేర్చాలంటే ఏమి చేయాలి?
1 యేసు, ‘శిష్యులనుగా చేయమనే, బోధించమనే’ ఆజ్ఞ మనకిచ్చాడు. (మత్త. 28:19, 20) అందుకే మనం ఎల్లవేళలా బైబిలు అధ్యయనం ప్రతిపాదించడానికి సిద్ధంగా ఉండాలనుకుంటాం. ఈ క్రింది సలహాలు బహుశా మీకు సహాయం చేయవచ్చు.
2. మనం ఎవరెవరికి బైబిలు అధ్యయనం ప్రతిపాదించవచ్చు?
2 బైబిలు అధ్యయనం ప్రతిపాదించండి: మనం బైబిలు అధ్యయనాలను ఎంత ఎక్కువగా ప్రతిపాదిస్తే అంత ఎక్కువగా ఒక అధ్యయనం దొరికే అవకాశాలు ఉంటాయి. (ప్రసం. 11:6) మన సందేశం వినడానికి ఇష్టపడిన వారందరికి బైబిలు అధ్యయనం ప్రతిపాదించడానికి ప్రయత్నించారా? ఒక సంఘం, బైబిలు అధ్యయనాలు ప్రారంభించడానికి ప్రత్యేకంగా ఒక నెల కేటాయించి తీవ్రంగా కృషిచేసింది. 42 కొత్త బైబిలు అధ్యయనాలు ప్రారంభించినందుకు వారెంత సంతోషించి ఉంటారో కదా! మీరు బైబిలు అధ్యయనాలు నిర్వహిస్తారని ఆసక్తిగల వారికి తెలుసులే అనుకోకండి. మీరు పునర్దర్శనానికి వెళ్ళినప్పుడు బైబిలు అధ్యయనం ఎందుకు ప్రతిపాదించకూడదు? ఒకవేళ వాళ్ళు అంగీకరించకపోతే వచ్చిన నష్టమేమీ లేదు. వారిలో ఆసక్తి పెంచేందుకు మీరు ప్రయత్నిస్తూనే ఉండవచ్చు. మీ పొరుగువారికి, బంధువులకు, తోటి పనివారికి, తోటి విద్యార్థులకు బైబిలు అధ్యయనం ప్రతిపాదించారా? అంతేగాక, మీ బైబిలు విద్యార్థి వాళ్ళ స్నేహితుల్లో, బంధువుల్లో ఎవరైనా బైబిలు అధ్యయనం చేయడానికి ఇష్టపడతారా అని మీరు వారిని అడగవచ్చు.
3. బైబిలు అధ్యయనం ప్రారంభించడానికి మన దగ్గర ఏ కరపత్రం ఉంది? దానిని ఎప్పుడెప్పుడు ఉపయోగించవచ్చు?
3 బైబిలు అధ్యయనం ప్రతిపాదించడానికి సహాయపడే కరపత్రం: మీరు సత్యం తెలుసుకోవాలనుకుంటున్నారా? అనే కరపత్రం బైబిలు అధ్యయనాలు ప్రారంభించడానికి చాలా అనువుగా ఉంటుంది. సువార్త పట్ల నిజమైన ఆసక్తి చూపించినవారికి దాన్ని మీరు ఇవ్వవచ్చు. పునర్దర్శనాలు చేస్తున్నప్పుడు కూడా మీరు దానిని ఉపయోగించవచ్చు. మీరు క్షేత్ర పరిచర్య చేస్తున్నప్పుడు, ప్రయాణిస్తున్నప్పుడు, షాపింగ్‌కు వెళ్తున్నప్పుడు మీతోపాటు దానిని ఎందుకు తీసుకువెళ్ళకూడదు? పనిస్థలంలో దానిని మీరెందుకు ఉపయోగించకూడదు? దాని చివరి పేజీ, బైబిలు అధ్యయన ఏర్పాటు గురించి క్లుప్తంగా వివరిస్తూ, బైబిలు బోధిస్తోంది పుస్తకాన్ని పరిచయం చేస్తుంది.
4. మీరు సత్యం తెలుసుకోవాలనుకుంటున్నారా? అనే కరపత్రాన్ని బైబిలు అధ్యయనం ప్రారంభించేందుకు ఎలా ఉపయోగించవచ్చు?
4 ఆ కరపత్రాన్ని ఆసక్తి చూపించినవారి చేతికిచ్చి, మొదటి పేజీలో ఉన్న ప్రశ్నలు చూపిస్తూ “ఈ ప్రశ్నల్లో దేనికి మీరు జవాబు కావాలనుకుంటున్నారు?’ అని అడగవచ్చు. ఆ తర్వాత కరపత్రంలో ఇవ్వబడిన జవాబును కలిసి చర్చించి, చివరి పేజీలో ఉన్న బైబిలు అధ్యయన ఏర్పాటు గురించిన వివరాలను చదవండి లేదా సారాంశపూర్వకంగా చెప్పండి. ఆ తర్వాత మీరు, వారు ఆసక్తి కనుపరచిన అంశంపై మరింత సమాచారాన్ని బైబిలు బోధిస్తోంది పుస్తకంలో నుండి చూపించి ఆ పుస్తకం వారికివ్వండి. పునర్దర్శనానికి ఏర్పాట్లు చేసుకొని, చర్చ కొనసాగించండి.
5. బైబిలు అధ్యయనాలను ప్రతిపాదించడానికి మనం ఎల్లప్పుడూ ఎందుకు సిద్ధంగా ఉండాలి?
5 బైబిలు నిజంగా ఏమి బోధిస్తోందో తెలుసుకోవాలని తపించే ప్రజలు మన క్షేత్రంలో ఇంకా ఉన్నారు. అదే సమయంలో మన క్షేత్రంలోని ప్రజల మతాభిమానానికి అనవసరంగా ఇబ్బంది కలిగించకుండా ఉండడానికి ఔచిత్యం, వివేచన అవసరం. బైబిలు అధ్యయనాలను ప్రతిపాదించడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటే జీవమార్గంలోకి వచ్చేందుకు ఇతరులకు సహాయపడుతూ ఆనందించే అవకాశాలు మనకెన్నో లభిస్తాయి.—మత్త. 7:13, 14.