బలంగా నాటుకుపోయిన నమ్మకాలను మనం పెకిలించివేస్తున్నాం
1 శతాబ్దాలుగా సాతాను అనేకుల హృదయాల్లో, మనసుల్లో అబద్ధ బోధలను నాటుతూ వారిని మోసగిస్తున్నాడు. త్రిత్వము, అమర్త్యమైన ఆత్మ, నరకాగ్ని వంటి సిద్ధాంతాలను వ్యాప్తి చేస్తూ, సృష్టికర్త ఉనికిపట్ల, బైబిలు ప్రామాణికతపట్ల సందేహాలను లేవదీస్తున్నాడు. జాతి వివక్ష, దేశభక్తి వంటి ఇతర అడ్డంకులు ప్రజలు సత్యాన్ని గ్రహించకుండా చేస్తున్నాయి. (2 కొరిం. 4:4) బలంగా నాటుకుపోయిన అలాంటి నమ్మకాలను మనం ఎలా పెకిలించివేయవచ్చు?—2 కొరిం. 10:4, 5.
2 భావోద్రేకాలు ముడిపడివున్నాయి: ప్రజలు ఎంతోకాలంగా నమ్ముతున్న మతపరమైన నమ్మకాలు సాధారణంగా వారి భావోద్రేకాలతో ముడిపడివుంటాయి. కొందరి హృదయాల్లో చిన్నప్పటి నుండే తప్పుడు నమ్మకాలు నాటుకుపోతాయి. అలాంటి వారికి సహాయం చేయాలంటే, మనం వారి దృక్కోణంపట్ల గౌరవముందని చూపించేవిధంగా మాట్లాడాలి.—1 పేతు. 3:15.
3 తాము నమ్ముతున్నవాటిని, అలా నమ్మడానికి గల కారణాలను వివరించడానికి అనుమతించడంద్వారా మనం అలాంటి వారిని గౌరవించవచ్చు. (యాకో. 1:19) తమకు ఇష్టమైనవారు చనిపోవడంవల్ల వారిని తిరిగి చూడాలనే తపనతో బహుశా వారు ఆత్మ అమర్త్యమైనదని నమ్ముతుండవచ్చు. పండుగ సమయాల్లో తమ కుటుంబ సభ్యులతో కలిసి గడిపే అవకాశాలు లభిస్తాయి కాబట్టి వారు పండుగలు చేసుకుంటుండవచ్చు. వారి అభిప్రాయాలను వినడంద్వారా మనం వారి మనోభావాలను అర్థంచేసుకొని, అనవసరంగా వారికి అభ్యంతరం కలిగించకుండా తగినవిధంగా ప్రతిస్పందించగలుగుతాము. కొన్ని సందర్భాల్లో ఆ విషయాన్ని తర్వాత ఎప్పుడైనా చర్చించాలని మనం నిర్ణయించుకోవచ్చు.—సామె. 16:23.
4 యేసును అనుకరించండి: యేసు ఒక ధర్మశాస్త్రోపదేశకుడు అడిగిన ప్రశ్నలకు ప్రతిస్పందించినప్పుడు మనకొక చక్కని మాదిరినుంచాడు. యేసు ఆ వ్యక్తి ఏమి చేయాలో సూటిగా చెప్పలేదు ఎందుకంటే అలా చెప్తే ఆ వ్యక్తి తాను బలంగా నమ్ముతున్నవాటినిబట్టి యేసు చెప్పినవాటిని తిరస్కరించే అవకాశముంది. యేసు లేఖనాలు చూపిస్తూ ఆ వ్యక్తికి తన అభిప్రాయాలను వ్యక్తం చేసే అవకాశాన్నిచ్చి, ఒక ఉపమానం చెప్పడం ద్వారా ఆయన సరైన ముగింపుకు రావడానికి సహాయం చేశాడు.—లూకా 10:25-37.
5 దేవుని వాక్యం మతపరమైన తప్పుడు నమ్మకాలను విడిచిపెట్టేలా ప్రజలకు సహాయం చేయగలదు. (హెబ్రీ. 4:12) మనం సత్యం గురించి ఓపికగా నేర్పుతో వివరిస్తే వినేవారి హృదయాలు ప్రేరేపించబడతాయి, అప్పుడు వారు అబద్ధ బోధలను తిరస్కరించి, తమను స్వతంత్రులను చేయగల సత్యాన్ని హత్తుకోగలుగుతారు.—యోహా. 8:32.