సంఘ పుస్తక అధ్యయనంలో నా బైబిలు కథల పుస్తకం ఉపయోగించడం
1 దేవుని లిఖితవాక్యంలోని సందేశానికున్న శక్తి ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది జీవితాల్ని మార్చేసింది. (హెబ్రీ. 4:12) మనం బైబిల్లోని వృత్తాంతాలను చదివి, వాటిని దృశ్యీకరించుకున్నప్పుడు దేవుని వాక్యం మనపై వ్యక్తిగతంగా ప్రభావం చూపించడం ప్రారంభిస్తుంది. నిజంగా, దేవుని వాక్యం గతించిపోయిన చరిత్ర కాదు. అందులోని వాక్యాలు సజీవమైనవి, అవి నెరవేరడానికి శరవేగంతో దూసుకువెళుతున్నాయి. సంఘ పుస్తక అధ్యయనంలో నా బైబిలు కథల పుస్తకం ఉపయోగిస్తూ దేవుని లిఖిత వాక్యాన్ని క్షుణ్ణంగా పరిశీలించడం ద్వారా మనమెంతో ప్రయోజనం పొందవచ్చు.
2 నా బైబిలు కథల పుస్తకం, బైబిలు యొక్క ప్రాథమిక జ్ఞానాన్ని చాలా ఆసక్తికరమైన విధంగా, సులభంగా అర్థం చేసుకునేరీతిలో అందజేస్తుంది. బైబిలు వృత్తాంతాలు అవి జరిగిన క్రమంలోనే ఇవ్వబడ్డాయి. ఇందులోని అనేక రంగురంగుల చిత్రాలు బైబిలు వృత్తాంతాలను ధ్యానించడానికి సహాయం చేస్తూ, బోధించడంలో చక్కని ఉపకరణాలుగా తోడ్పడతాయి. (కీర్త. 77:12) అంతేకాదు, దానిలోని పేజీలు దేవునిపట్ల భయభక్తులు కలిగివున్న పితరులైన అబ్రాహాము, ఇస్సాకు, యాకోబు వంటి వారితో “నడవడానికి” దోహదపడతాయి. మనం దైవభక్తిగల స్త్రీలైన శారా, రిబ్కా, యథార్థతగల మోయాబీయురాలైన రూతు వంటి వారిని “చూడవచ్చు.” అవును, మనం కొండమీది ప్రసంగంలో యేసు క్రీస్తు స్వరాన్ని సహితం “వినవచ్చు.” మనం సంఘ పుస్తక అధ్యయనానికి బాగా సిద్ధపడితే, పరిశుద్ధ లేఖనాల్లోని ఈ గొప్ప ఉపదేశమంతా మన సొంతమవుతుంది. ఈ అధ్యయనం, దేవుని వాక్యాన్ని చదివి, తద్వారా ఎంతో ఆనందాన్ని, ప్రయోజనాన్ని పొందాలన్న మన నిర్ణయాన్ని బలపరుస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు!
3 బైబిలు కథలు పుస్తకంలోని ప్రతీపాఠానికి రెండు రకాల ప్రశ్నలు ఇవ్వబడ్డాయి. మొదటి రకం ప్రశ్నలు కథను, అందులో వివరించబడిన సంఘటనలను సమీక్షించడానికి సహాయం చేస్తాయి. ఒక కథను పూర్తిగా చదివిన తర్వాత, అధ్యయన నిర్వాహకుడు ఈ ప్రశ్నలను అడుగుతాడు. సమాధానాలు కథలోని సమాచారం ఆధారంగా క్లుప్తంగా, సూటిగా ఉండాలి. ప్రశ్నలు ఎల్లప్పుడూ కథలోని సంఘటనల క్రమాన్ని అనుసరించి ఇవ్వబడవని దయచేసి గమనించండి.
4 ఆ తర్వాత నిర్వాహకుడు కథ నుండి నేర్చుకోగల ముఖ్య విషయాలను నొక్కిచెప్పడానికి, అందులో ఇవ్వబడిన రెండవ రకం ప్రశ్నలను అడుగుతాడు. ప్రతీ అదనపు ప్రశ్నకు ముందు కొన్ని లేఖనాలు ఇవ్వబడ్డాయి. వీటిలో కొన్ని లేఖనాలు చాలా పెద్దగా ఉన్నాయి. పుస్తక అధ్యయనం కోసం సిద్ధపడుతున్నప్పుడు, వీటిని అందరూ ముందుగానే చదువుకోవాలి. ప్రతీ అదనపు ప్రశ్న తర్వాత కూడా చాలా లేఖనాలు ఇవ్వబడ్డాయని మీరు గమనిస్తారు. ఈ లేఖనాలు సమాధానాలు కనుక్కోవడానికి సహాయపడతాయి. అందులో ఇవ్వబడిన లేఖనాలకు, వృత్తాంతంలో నొక్కిచెప్పబడిన విషయాలకు ఎలా సంబంధముందో తెలియజేసే అర్థవంతమైన వ్యాఖ్యానాలను నిర్వాహకుడు రాబట్టాలి. బైబిల్లోని విషయాలపై, దానిలోని బోధల అన్వయింపుపై అవధానముంచడానికి నిర్వాహకుడు హాజరైనవారికి సహాయం చేయాలి.
5 పుస్తకంలో ప్రతీ భాగానికున్న ఉపోద్ఘాతం, పుస్తక అధ్యయనంలో ఒక విడి పాఠంగా పరిశీలించబడుతుంది. ప్రతీ భాగంయొక్క ఉపోద్ఘాతాన్ని చదివిన తర్వాత, నిర్వాహకుడు తాను తయారుచేసుకున్న సముచితమైన ప్రశ్నలను అడుగుతాడు. ఇలా ముందుగా పరిశీలించడం, తర్వాతి కథలను పరిశీలించడానికి సహాయపడుతుంది. ఈ పుస్తక అధ్యయనం మన మనస్సుల్లో, హృదయాల్లో ఆధ్యాత్మిక లక్షణాలను పొందుపర్చి, మన గొప్ప పరలోక తండ్రియైన యెహోవాకు మరింత సన్నిహితమవడానికి మనకు సహాయం చేయునుగాక!—యాకో. 4:8.