బైబిలు ఉద్దేశము
మీరేమి విశ్వసిస్తున్నారనేది ప్రాముఖ్యమా?
“ఏది నిజమై ఉండాలని మానవుడు ఇష్టపడతాడో దానిని నమ్మడానికి అతడు ఇష్టపడతాడు.”—ఆంగ్ల వ్యాస రచయితయు, రాజనీతిజ్ఞుడునైన ఫ్రాన్సిస్ బాకన్, 1561-1626.
మత సిద్ధాంతాల దగ్గరికొచ్చేసరికి, ‘పైన ఒకరున్నారని’ ఒకడు యథార్థంగా విశ్వసించినంత కాలం, తన తోటి మానవులను ప్రేమించినంత కాలం అతడు ఏమి విశ్వాసిస్తున్నాడన్నది అంత ప్రాముఖ్యం కాదని అనేక మంది ప్రజలు భావిస్తారు. దేవుని గూర్చి, ఆయన సంకల్పాన్ని గూర్చి, ఆయననెలా ఆరాధించాలనే విషయాన్ని గూర్చి మత శాఖలు ఉపదేశించే భిన్నమైన తలంపులను చూసి, కొందరు అవి పైపైవేనని, ఒకే వ్యక్తి ధరించే రకరకాల దుస్తులవంటివని తలస్తున్నారు. అలాంటి విషయాలను పెద్ద వివాదాలుగా చేసేవారు, నిజమైన క్రైస్తవ స్ఫూర్తిని కోల్పోతున్నారని కూడా వారు భావించవచ్చు.
మత బోధల చర్చలన్నీ ప్రయోజనకరమైనవి కావని లేఖనాలు అంగీకరిస్తున్నాయి. ఉదాహరణకు, తిమోతికి తాను వ్రాసిన ప్రేరేపిత లేఖనాల్లో ‘కలహమును దూషణను’ ప్రోత్సహించే మనుష్యులను అపొస్తలుడైన పౌలు సూచించాడు. ‘వాగ్వాదములను గూర్చియు వ్యర్థముగా ప్రయాసపడు . . . చెడిపోయిన మనస్సు కలిగిన వారని’ పౌలు వారిని వర్ణించాడు. (1 తిమోతి 6:4, 5) “నేర్పులేని మూఢుల వితర్కములు జగడములను పుట్టించునని యెరిగి అట్టివాటిని విసర్జించుము” అని, “పనికిరాని మాటలనుగూర్చి వాదము పెట్టుకొనవద్దని” సంఘాలకు బోధించమని తిమోతికి ఆయన ఉపదేశించాడు. (2 తిమోతి 2:14, 23) నేటి మత చర్చ ఈ వర్ణనకు సరిపోయింది, అది అర్థరహితంగా కాలయాపన చేయడమని నిరూపించబడింది.
మత విశ్వాసాలను గూర్చిన అన్ని చర్చలు అర్థరహితమని దీని భావమా? సరే, కొన్ని దుస్తులు వేసుకోదగ్గవి కానందున పూర్తిగా వస్త్రాలను ధరించడం మానేయము, మానేస్తామా? కొన్ని మత సంబంధమైన ప్రశ్నలు చర్చించదగ్గవి కానందున మతానికి సంబంధించిన విషయమంతటిని ప్రాముఖ్యత లేనిదన్నట్లు ఎందుకు విడిచి పెట్టాలి? మత సిద్ధాంతాలు ముఖ్యమైనవని పౌలు ఎంచాడని పైన పేర్కొనబడిన ఆయన మాటల సందర్భం చూపిస్తుంది. అబద్ధ బోధలవల్ల ఒకరు విశ్వాసం నుండి తప్పిపోగలరని ఆయన అనేకసార్లు హెచ్చరించాడు, “భిన్నమైన బోధ చేయవద్దని . . . కొందరికి ఆజ్ఞాపించ”వలెనని తిమోతికిని ఆయన ఉపదేశించాడు. (1 తిమోతి 1:3-7; 4:1; 6:3-5; 2 తిమోతి 2:.14-18, 23-26; 4:3, 4) కచ్చితంగా, తొలి క్రైస్తవులు విశ్వసించినది ప్రాముఖ్యం కాకపోతే నిజంగా ఆయన దానిని గూర్చి అంత గట్టిగా నొక్కి చెప్పి ఉండేవాడే కాదు.
అలాగైతే, సిద్ధాంతాలను గూర్చిన ప్రశ్నలకు విముఖులై ఉండమనే సలహా ఎందుకు? ఎందుకంటే పౌలు దినాల్లోని “చెడిపోయిన మనస్సు కలిగి సత్యహీనులై”న అని పౌలు వర్ణించిన కొందరు మనుష్యులు ఇతరుల విశ్వాసాన్ని తొలగించాలనే ఒకే ఒక ఉద్దేశంతో సిద్ధాంతాలను గూర్చిన వివాదాలను లేవదీసేవారు. (1 తిమోతి 6:5) మత విశ్వాసాలను గూర్చిన చర్చలను చేయవద్దని పౌలు తిమోతికి సలహా ఇచ్చినప్పుడు, ఆ అవినీతిపరులైన మనుష్యులు లేవదీసిన ప్రశ్నలను గూర్చే ఆయన మాట్లాడాడు.
విశ్వాసాలు నడవడికను ప్రభావితం చేస్తాయా?
మనమెలాంటి వాళ్ళమౌతామనే దానిపై, అంటే మన వ్యక్తిగత గుణగణాలు మరియు నడవడికపైన మన మతసంబంధమైన విశ్వాసాలు అంత ప్రభావం చూపుతాయా అని కొందరు ప్రశ్నించవచ్చు. ధరించేవారి అభిరుచి ప్రకారం ఎలాగైతే జాకెట్‌ను ఆఫ్‌ప్యాంట్లతో కలిపి వేసుకోవచ్చో, లేదా మ్యాచ్ అయ్యే విధంగా వేసుకోవచ్చో, అలాగే విశ్వాసాలు మరియు ప్రవర్తన అనేవి రెండు వేరువేరని, పరస్పర సంబంధంలేని విషయాలని వారు దృష్టించవచ్చు. అయితే, బైబిలు దృక్కోణంలో విశ్వాసాలు మరియు నడవడిక అనేవి ఒక సెట్టుగా కలిసి ఉండే సూట్ వంటివి.
మనమేమి విశ్వసిస్తాము, మనమెలాంటి వ్యక్తులమవుతాము అనేవాటికి నేరుగా సంబంధం ఉందని బైబిలు తెలుపుతుంది. ప్రవర్తనను ప్రభావితం చేసే తప్పుదోవపట్టించే విశ్వాసాలకు యేసు కాలం నాటి స్వనీతిపరులైన పరిసయ్యులు ఒక ఉదాహరణ. (మత్తయి 23:1-33; లూకా 18:9-14) మరొకవైపు, కొలొస్సయులు 3:10, NW ఇలా ఉపదేశిస్తుంది: ‘ప్రాచీనస్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము దానిని సృష్టించినవాని పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకొనుడి.’ దైవభక్తిగల జీవితాన్ని నడిపించే శక్తి, దేవుని గూర్చిన కచ్చితమైన జ్ఞానాన్ని కలిగివుండడంతో ముడిపెట్టబడిందని గమనించండి.
“కచ్చితమైన జ్ఞానము” అని అనువదించబడిన గ్రీకు పదం గ్రీకు లేఖనాల్లో 20 సార్లు కనిపిస్తుంది, అది సరియైన, కచ్చితమైన, లేక పూర్ణమైన జ్ఞానాన్ని సూచిస్తుంది. దానిని గూర్చి “నాకు ముందు తెలిసిన విషయాన్ని గురించి మరింత ఎక్కువగా తెలియడం; నేను క్రితం దూరం నుండి చూసిన దానిని సరిగ్గా చూడడం” వంటిదని గ్రీకు పండితుడైన నతనియేల్ కల్వెర్‌వెల్ వివరించాడు. నగల వ్యాపారి ఖరీదైన రత్నం యొక్క లక్షణాలను, విలువను కట్టడానికి, దానిని పరీక్షించుకున్నట్లే, ఒక క్రైస్తవుడు తాను సేవించే దేవుని గూర్చిన సరియైన, కచ్చితమైన, పూర్ణమైన జ్ఞానాన్ని పొందేందుకు దేవుని వాక్యాన్ని తప్పకుండా పరిశీలించాలి. ‘పైన ఒకరు ఉన్నారని’ కేవలం నమ్మేదానికి ఎంతో భిన్నంగా, దేవుని వ్యక్తిత్వాన్ని గూర్చి, ఆయన సంకల్పాలను గూర్చి, ఆయన ప్రమాణాలను గూర్చి, “మంచి మాటలకు మాదిరియగు” బోధలన్నిటిని గూర్చి తెలుసుకోవడం ఇందులో ఇమిడి ఉంది.—2 తిమోతి 1:13.
ఒకడు దేవున్ని గూర్చి స్వల్పంగా మాత్రమే తెలుసుకోవడం వల్ల కలిగే ఫలితం యొక్క ఒక ఉదాహరణ రోమీయులకు వ్రాయబడిన ప్రేరేపిత లేఖనంలో మొదటి అధ్యాయంలో ఇవ్వబడింది. ‘దేవుని నెరిగియు . . . కచ్చితమైన జ్ఞానమందు ఆయనను ఉన్నతపరచని’ కొందరు మనుష్యులను గూర్చి అక్కడ సూచించబడింది. తప్పుడు విశ్వాసాల పర్యవసానాలను గూర్చి అపొస్తలుడైన పౌలు ఈ విధంగా చెప్పాడు: “వారు తమ మనస్సులో దేవునికి చోటియ్యనొల్లకపోయిరి గనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనస్సుకు వారినప్పగించెను. అట్టివారు సమస్తమైన దుర్నీతిచేతను, దుష్టత్వము చేతను, లోభము చేతను, ఈర్ష్యచేతను నిండుకొని, మత్సరము నరహత్య కలహము కపటము వైరమనువాటితో నిండినవారై కొండెగాండ్రును అపవాదకులును, దేవద్వేషులును, హింసకులును, అహంకారులును, బింకములాడువారును, చెడ్డవాటిని కల్పించువారును, తలిదండ్రుల కవిధేయులును, అవివేకులును మాట తప్పువారును అనురాగ రహితులును, నిర్దయులునైరి.”—రోమీయులు 1:21, 28-31.
నిస్సందేహంగా, ఆ పురుషులకు గల విశ్వాసాలు వారు క్రైస్తవ జీవితాలను గడపగలిగే వారి సామర్థ్యాన్ని నేరుగా ప్రభావితం చేశాయి. ఆలాగుననే, విశ్వాస నడవడికలను వేరు చేయలేని విధంగా అల్లుకుపోయిన అతుకులు లేని వస్త్రంతో పోల్చవచ్చు. కాబట్టి, దేవుని ప్రీతిని పొందాలని కోరుకునే అందరూ తమ మత విశ్వాసాలు నిజంగా సత్యమైనవేనా, దేవుని వాక్యంపై ఆధారపడినవేనాయని రూఢిచేసుకోవడం ప్రాముఖ్యం. ఎందుకంటే “మనుష్యులందరు రక్షణపొంది సత్యమునుగూర్చిన అనుభవజ్ఞానముగలవారై యుండవలెనని [దేవుడు] యిచ్ఛయించుచున్నాడు.”—1 తిమోతి 2:4.
[25వ పేజీలోని చిత్రం]
పరిసయ్యుని స్వనీతిపరాయణత్వం అతని విశ్వాసాలను ప్రతిబింబించింది