“నాకు ఇష్టం లేదు”
1 కొన్ని ప్రాంతాల్లో చాలామంది మన సందేశానికి అలాగే స్పందిస్తారు. క్షేత్రంలో మన సందేశంపట్ల అలాంటి ఉదాసీనత ఎదురైనప్పుడు నిరుత్సాహపడకుండా ఉండడానికి మనకేది సహాయం చేస్తుంది? ఇతరుల్లో సువార్తపట్ల ఆసక్తిని మనమెలా రేకెత్తించవచ్చు?
2 సంతోషాన్ని కాపాడుకోండి: అనేకులు ఎందుకలా ఉదాసీనత చూపిస్తున్నారో గుర్తుంచుకోవడం సంతోషాన్ని కాపాడుకోవడానికి మనకు సహాయం చేస్తుంది. పరిణామ సిద్ధాంతం బోధించబడిన ప్రజలు లేదా నాస్తికుల మధ్య పెంచబడినవారు బైబిలుకున్న విలువ గురించి అంతగా ఆలోచించివుండరు. మరికొందరు మతంలో గమనించిన వేషధారణనుబట్టి నిరుత్సాహానికి లోనైవుండవచ్చు. ఇంకొందరిలో నెలకొన్న నిరాశానిస్పృహలు వారు చూపించే ఉదాసీనతలో కనిపించవచ్చు. (ఎఫె. 2:12) ఇంకొంతమంది తమ జీవిత చింతలతో కృంగిపోయున్నారు కాబట్టి వారు సువార్తను ‘ఎరుగరు’ లేక లక్ష్యపెట్టరు.—మత్త. 24:37-39.
3 కొంతమంది ప్రతికూలంగా స్పందించినా, మనం చేసే కృషి యెహోవాను మహిమపరుస్తుందని తెలుసుకుని మనం పరిచర్యలో ఆనందాన్ని పొందవచ్చు. అంతేగాక, ఇంకా సత్యం విలువ తెలియని వారితో కూడా సత్యం గురించి మాట్లాడడం మన విశ్వాసం బలపడేలా చేస్తుంది. క్షేత్రంలోని ప్రజలను యెహోవా దృష్టించినట్టే మనమూ దృష్టించడానికి కృషి చేద్దాం. ఆయన “కుడియెడమలు ఎరుగని” నీనెవె ప్రజలమీద జాలిపడ్డాడు. (యోనా 4:11) మన క్షేత్రంలో నివసించేవారికి సువార్త అవసరం! కాబట్టి, మనం మన ప్రయత్నాలను విరమించుకోకుండా బైబిలు సందేశంపట్ల వారి ఆసక్తిని రేకెత్తించే మార్గాల కోసం వెదకాలి.
4 స్థానిక సమస్యలను చర్చించండి: మీ ఉపోద్ఘాతంలో బహుశా స్థానిక సమస్యను పేర్కొని, గృహస్థుని అభిప్రాయాన్ని అడగండి. ఆయన చెప్పేది విని, ఆయన ఆందోళనచెందుతున్న విషయాలకు సమాధానంగా బైబిల్లోని ఓదార్పుకరమైన సందేశాన్ని చూపించండి. స్థానికంగా జరిగిన విషాద సంఘటన తర్వాత, ఒక సాక్షి ప్రతీ ఇంటి దగ్గర తన హృదయపూర్వక సానుభూతిని వ్యక్తపరిచాడు. “దానితో ప్రజలు సంభాషించడం ప్రారంభించారు, నేను వారిపట్ల వ్యక్తిగత ఆసక్తిని చూపించినందువల్ల ఆ రోజు ఎంతోమందితో చక్కగా సంభాషించగలిగాను” అని ఆయన చెప్పాడు.
5 మానవులు ఎదుర్కొనే సమస్యలన్నిటినీ దేవుని రాజ్యమే పరిష్కరిస్తుంది. గృహస్థుణ్ణి ఎక్కువగా బాధపెట్టే సమస్యేమిటో గుర్తించడానికి ప్రయత్నించండి. అప్పుడాయన బైబిల్లోని నిరీక్షణా సందేశాన్ని వివరించేందుకు మిమ్మల్ని అనుమతించవచ్చు. అలా జరగకపోతే, అతడు “ఇంకొకసారి” వినడానికి సుముఖంగా ఉండవచ్చు.—అపొ. 17:32.