ఫలవంతమైన పరిచర్యకు కీలకం—ప్రేమ
1 “నా యొద్దకు రండి; నేను మీకు విశ్రాంతి కలుగజేతును.” (మత్త. 11:28) ఊరటనిచ్చే అలాంటి మాటలు యేసుకు ప్రజలపట్ల ఉన్న ప్రగాఢమైన ప్రేమను ప్రతిబింబిస్తున్నాయి. క్రైస్తవ పరిచారకులుగా మనం, ఈ ప్రేమలేని లోకంలో విసిగివేసారిన ప్రజలపట్ల ప్రేమను చూపించడంలో యేసును అనుకరించాలని కోరుకుంటాం. ఇతరులతో సువార్తను పంచుకుంటుండగా మనం ప్రేమను ఎలా చూపించవచ్చు?
2 మాటల్లో: సువార్తను పంచుకోవడానికి ప్రతీ అవకాశాన్ని ఉపయోగించుకొనేలా ప్రజలపట్ల ఉన్న ప్రేమ యేసును పురికొల్పింది. (యోహా. 4:7-14) అనియత సాక్ష్యమివ్వడానికి వెనుకాడకుండా ఉండేలా ప్రేమ మనకు సహాయం చేస్తుంది. ఆరేళ్ల ఒక అమ్మాయి రోగులు వేచివుండే గదిలో తన పక్కన కూర్చున్న ఒక స్త్రీకి సాక్ష్యమిచ్చింది. ఆ అమ్మాయి అలా చేసేందుకు ఏది సహాయం చేసింది? “ఆమె యెహోవా గురించి తెలుసుకోవలసిన అవసరమున్న వ్యక్తిలా కనిపించింది” అని ఆ అమ్మాయి వివరించింది.
3 మనం హృదయపూర్వకమైన, ఆప్యాయమైన చిరునవ్వుతో, స్నేహపూర్వకమైన స్వరంతో పలకరించడంద్వారా ప్రజలపట్ల మనకున్న శ్రద్ధను వ్యక్తంచేయవచ్చు. ఇతరులు చేసే వ్యాఖ్యానాలను జాగ్రత్తగా వినడం, వారి చింతలను గుర్తించడం, వారిపట్ల నిజమైన వ్యక్తిగత శ్రద్ధను కనపర్చడంద్వారా కూడా మనం ప్రేమ చూపించవచ్చు. యేసును అనుకరిస్తూ, మనం ప్రోత్సాహకరమైన రాజ్య సందేశాన్ని గురించి, ప్రజలపట్ల యెహోవాకున్న ప్రేమపూర్వక కనికరాన్ని గురించి నొక్కిచెప్పాలి.—మత్త. 24:14; లూకా 4:18.
4 క్రియల్లో: ఇతరుల అవసరాలపట్ల ఆచరణాత్మకంగా, క్రియారూపంలో సహాయాన్నందించడానికి యేసు వెంటనే స్పందించాడు. (మత్త. 15:32) పరిచర్యలో ప్రేమపూర్వక దయతో కూడిన పనులు చేయడానికి మనకు కూడా అవకాశాలు లభించవచ్చు. ఒక స్త్రీ ఫోనులో ఎవరో చెబుతున్న ముఖ్యమైన విషయాన్ని అర్థంచేసుకోవడానికి ఇబ్బందిపడుతుండడాన్ని ఒక సహోదరి గమనించింది. ఫోన్ చేసిన వ్యక్తి మాటలను అనువదించడానికి మన సహోదరి చొరవ తీసుకుంది. ప్రేమపూర్వకమైన ఈ చర్య ఆ స్త్రీ బైబిలు అధ్యయనాన్ని అంగీకరించడానికి నడిపించిన లేఖనాధారిత చర్చకు మార్గం సుగమం చేసింది. మరో సందర్భంలో, పునర్దర్శనానికి వెళ్లిన సహోదరుడు, గృహస్థుడు బరువైన మంచాన్ని ఇంట్లోకి తీసుకెళ్తుండగా అది గుమ్మంలో ఇరుక్కుపోవడంతో ఇబ్బందిపడుతుండడాన్ని చూశాడు. మంచాన్ని లోపలపెట్టడానికి సహాయం చేసిన తర్వాత ఆ మంచంమీదే కూర్చుని, కృతజ్ఞతాభావంతో ఉన్న ఆ వ్యక్తితో సహోదరుడు బైబిలు అధ్యయనాన్ని ప్రారంభించాడు.
5 మనం పరిచర్యలో భాగం వహిస్తుండగా, దేవునిపట్ల, పొరుగువారిపట్ల మనకున్న ప్రేమను ప్రదర్శిస్తాం. (మత్త. 22:36-40) మాటల్లో, క్రియల్లో అలా ప్రేమను ప్రదర్శించడంవల్ల మన దగ్గర సత్యముందని యథార్థవంతులు గ్రహించడానికి తోడ్పడుతుంది.