స్వచ్ఛందంగా ముందుకొచ్చే స్ఫూర్తి ఆశీర్వాదాలను తెస్తుంది
1. స్వచ్ఛందంగా ముందుకొచ్చే స్ఫూర్తిని దావీదు, నెహెమ్యా ఎలా చూపించారు?
1 గొల్యాతు యుద్ధరంగంలో ఉన్న ఇశ్రాయేలీయులను సవాలు చేసినప్పుడు, సైనికులలో ఎవరో ఒకరు ఆయనతో యుద్ధం చేయగలిగేవారే. కానీ యుద్ధం నేర్చుకోని, గొర్రెలు కాసుకొనే ఒక పిల్లవాడు తప్ప స్వచ్ఛందంగా ఎవరూ ముందుకు రాలేదు. (1 సమూ. 17:32) చెరలో ఉన్న యూదులు యెరూషలేముకు తిరిగి వెళ్ళి, గోడలు పునర్నిర్మించడంలో విఫలమైనప్పుడు, పారసీక రాజుయొక్క పానదాయకుడు కోటలో తన గౌరవనీయమైన స్థానాన్ని వదులుకుని, పనిని వ్యవస్థీకరించడానికి యెరూషలేముకు ప్రయాణమవడానికి స్వచ్ఛందంగా ముందుకొచ్చాడు. (నెహె. 2:4) ఈ ఇద్దరూ అంటే దావీదు, నెహెమ్యా చూపించిన స్ఫూర్తినిబట్టి యెహోవా వారిని ఆశీర్వదించాడు.—1 సమూ. 17:45, 50; నెహె. 6:15, 16.
2. క్రైస్తవులు స్వచ్ఛందంగా ముందుకొచ్చే స్ఫూర్తిని ఎందుకు చూపించాలి?
2 నేడు, లోకంలో స్వచ్ఛందంగా ముందుకొచ్చే స్ఫూర్తి కొరవడుతుంది. ఈ “అంత్యదినాల్లో” ప్రజలు తీరిక లేని జీవితాన్ని గడుపుతున్నారు, అనేకులు ‘స్వార్థప్రియులుగా’ ఉన్నారు. (2 తిమో. 3:1, 2) ఒక వ్యక్తి, ఇతరులకు సహాయం చేయాల్సిన అవసరం వస్తే స్వచ్ఛందంగా తన సేవలను అందించే అవకాశాలను నిర్లక్ష్యం చేసేంతగా వ్యక్తిగత విషయాల్లో మునిగిపోవడం చాలా తేలిక. అయితే, క్రైస్తవులుగా మనం, ఇతరులకు సహాయం చేయడానికి చొరవ తీసుకున్న యేసును అనుకరించాలని కోరుకుంటాం. (యోహా. 5:5-9; 13:12-15; 1 పేతు. 2:21) స్వచ్ఛందంగా ముందుకొచ్చే స్ఫూర్తిని మనమెలా చూపించవచ్చు, అలా చూపించడం ద్వారా మనమెలాంటి ఆశీర్వాదాలను పొందుతాం?
3. స్వచ్ఛందంగా ముందుకొచ్చే స్ఫూర్తి సంఘ కూటాల్లో ఎలా దోహదపడుతుంది?
3 మన సహోదరుల గురించి: కూటాల్లోని ఆయా భాగాల్లో ప్రేక్షకులు భాగం వహించవలసి ఉన్నప్పుడు వ్యాఖ్యానించడానికి స్వచ్ఛందంగా ముందుకు రావడంద్వారా ఇతరులకు “ఆత్మసంబంధమైన కృపావరం” ఇవ్వవచ్చు. (రోమా. 1:12) వ్యాఖ్యానించడం యెహోవాకు గౌరవాన్ని తెస్తుంది, సత్యం మన మనసుల్లో, హృదయాల్లో స్థిరంగా నాటుకునేలా చేస్తుంది, సంఘ కూటాలు మనకు మరింత ఆహ్లాదాన్ని కలిగించేలా చేస్తుంది. (కీర్త. 26:12) దైవపరిపాలనా పరిచర్య పాఠశాలలో నియామకాన్ని పొందిన వ్యక్తి రాకపోతే వారికి బదులు ఒక ప్రసంగాన్ని ఇవ్వడానికి కూడా మనం స్వచ్ఛందంగా ముందుకు రావచ్చు. ఇది మన బోధనా సామర్థ్యాలను పెంచుకోవడానికి సహాయం చేస్తుంది.
4. స్వచ్ఛందంగా ముందుకొచ్చే స్ఫూర్తిని చూపించగల ఇతర మార్గాలేవి?
4 సహోదరులు సంఘంలో బాధ్యతలను చేపట్టడానికి కృషిచేయడం ద్వారా స్వచ్ఛందంగా ముందుకొచ్చే స్ఫూర్తిని చూపించవచ్చు. (యెష. 32:2; 1 తిమో. 3:1) వివిధ డిపార్ట్మెంట్లలో పనిచేయడానికి స్వచ్ఛందంగా ముందుకు రావడంద్వారా ప్రాంతీయ, జిల్లా సమావేశాలు చక్కగా జరిగేలా అందరూ తోడ్పడవచ్చు. పరిచర్యలో ప్రయాణ పైవిచారణకర్తతో పనిచేయడానికి లేదా ఆయనను భోజనానికి ఆహ్వానించడానికి స్వచ్ఛందంగా ముందుకొచ్చినప్పుడు మనం ‘ఒకరి విశ్వాసముచేత ఒకరము ఆదరణ పొందుతాము.’ (రోమా. 1:11) తండ్రిలేని పిల్లలకు, విధవరాండ్రకు, అనారోగ్యంతో ఉన్నవారికి, చిన్నపిల్లలున్న తల్లులకు, సంఘంలోని ఇతరులకు ఆచరణాత్మక సహాయాన్ని మనం అందించినప్పుడు ఆనందాన్ని, యెహోవా ఆమోదాన్ని పొందుతాం.—సామె. 19:17; అపొ. 20:35.
5. రాజ్యమందిరానికి సంబంధించిన ఏ విషయాల్లో స్వచ్ఛంద సేవకుల అవసరం ఉంటుంది?
5 మన సమయాన్ని, శక్తిని స్వచ్ఛందంగా ఉపయోగించే మరో మార్గమేమిటంటే, రాజ్యమందిరాన్ని శుభ్రపరచి, దాన్ని మంచి స్థితిలో ఉంచడానికి సహాయం అందించడమే. అనేకులు సత్యంలోకి వస్తున్నారు కాబట్టి, క్రొత్త రాజ్యమందిరాల అవసరం, వాటిని నిర్మించడానికి స్వచ్ఛంద సేవకుల అవసరం ఎంతో ఉంది. ఒక వివాహ జంట నిర్మాణ పని రాకపోయినా, స్థానిక రీజనల్ బిల్డింగ్ కమిటీకి మద్దతునివ్వడానికి ముందుకొచ్చారు. చివరకు, ఆ జంట శిక్షణ పొంది, ఇప్పుడు తాపీ పనిలో సహాయం చేస్తున్నారు. భార్య ఇలా అంటోంది: “ఇతరులతో కలిసి పనిచేయడం సన్నిహిత స్నేహాలకు దారి తీసింది. రోజు చివర్లో మేము శారీరంగా అలసిపోతాము కానీ ఆధ్యాత్మికంగా నూతనోత్తేజాన్ని పొందుతాం.”
6. మనం చేయగలవాటిలో స్వచ్ఛందంగాచేసే పరిచర్య ఎందుకు అతి ప్రాముఖ్యమైనది?
6 ప్రకటించడంద్వారా: నేడు స్వచ్ఛందంగా మనం చేయగల అత్యంత ప్రాముఖ్యమైన పని ఏమిటంటే రాజ్య ప్రకటనా పనే. ప్రజలు బైబిలు ఉపదేశాన్ని అర్థం చేసుకొని, అన్వయించుకోవడానికి సహాయాన్ని పొందుతుండగా, వారి జీవితం సంకల్పవంతంగా మారడమేకాక, హానికరమైన అలవాట్లను మానుకునే శక్తిని వారు పొందుతారు. బైబిల్లో ఉన్న ప్రోత్సాహాన్నిచ్చే భవిష్యత్ నిరీక్షణ గురించి తెలుసుకుంటారు. బైబిలు విద్యనందించడంద్వారా, ఇతరులకు నిరంతర ప్రయోజనాలను చేకూర్చే సంతోషకరమైన స్వచ్ఛంద సేవను మనం చేస్తాము. (యోహా. 17:3; 1 తిమో. 4:16) బహుశా సహాయ పయినీరు సేవ లేక క్రమ పయినీరు సేవ చేయడం ద్వారా, అవసరం ఎక్కువగా ఉన్న స్థలానికి వెళ్ళడం ద్వారా, లేదా మరో భాషను నేర్చుకోవడం ద్వారా ఈ పనిలో ఎక్కువగా భాగం వహించేందుకు మన పరిస్థితులు అనుమతించవచ్చు.
7. స్వచ్ఛందంగా పనిచేయడానికి ముందుకు రావడం నేడెందుకు ప్రాముఖ్యం?
7 రాజైన దావీదు, మెస్సీయ తన పరిపాలన ప్రారంభించినప్పుడు, దేవుని ప్రజలు “ఇష్టపూర్వకముగా వచ్చెదరు” అని ప్రవచించాడు. (కీర్త. 110:3) యెహోవా చివరి ఆధ్యాత్మిక కోత త్వరగా ముగిసేలా చేస్తుండడంతో, స్వచ్ఛందంగా చేయడానికి పని ఎంతో ఉంది. (యెష. 60:22) ‘చిత్తగించుము నేనున్నాను నన్ను పంపుము’ అని మీరన్నారా? (యెష. 6:8) నిజానికి, మనం స్వచ్ఛందంగా ముందుకొచ్చే స్ఫూర్తిని ప్రదర్శించడంద్వారా, మనం యెహోవాను సంతోషపరుస్తాము, గొప్ప ప్రతిఫలాలను పొందుతాము.