రాజ్యమందిర నిర్మాణం —పరిశుద్ధసేవలో ఒక ప్రాముఖ్యమైన అంశం
1. రాజ్యమందిర నిర్మాణంలో ఏమి సాధించబడింది, కానీ ఇంకా ఏమి అవసరం?
1 ఇండియా బ్రాంచి క్షేత్రంలో గత సంవత్సరం 19 రాజ్యమందిరాలు పూర్తిచేయబడ్డాయి. దీనిలో భాగంవహించిన వారందరూ పడిన శ్రమను మేము మనస్ఫూర్తిగా మెచ్చుకుంటున్నాం. భారీ ఎత్తున పని పూర్తిచేయబడినప్పటికీ, రాజ్యమందిర నిర్మాణంలో చేయవలసింది ఇంకా చాలా ఉంది. మనకు అత్యవసరంగా ఇంకా 175 రాజ్యమందిరాలు కావాలి. మనం యెహోవాకు చేసే పరిశుద్ధసేవకు సంబంధించిన ప్రాముఖ్యమైన ఈ అంశానికి మనమందరం ఎలా మద్దతివ్వవచ్చు?—ప్రక. 7:15.
2. రాజ్యమందిర నిర్మాణ పనికి మనమేవిధంగా నేరుగా మద్దతివ్వవచ్చు?
2 సుముఖంగా ఉండండి: మీరు బాప్తిస్మం తీసుకున్న ప్రచారకులైతే, అప్లికేషన్ ఫర్ కింగ్‌డమ్‌హాల్ కన్స్ట్రక్షన్ వాలంటీర్ ప్రోగ్రామ్ ఫారమ్‌ను నింపడం ద్వారా కింగ్‌డమ్‌హాల్ కన్స్ట్రక్షన్ డెస్క్‌తో పనిచేయడానికి స్వచ్ఛందంగా ముందుకు రావాలని మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. (కీర్త. 110:3) స్వచ్ఛందంగా ముందుకు వచ్చేవారందరూ ఇష్టపూర్వకంగా పనిచేసేవారై ఉండాలి, సహకార స్ఫూర్తిని చూపించాలి. (కీర్త. 133:1) మీకు నిర్మాణ నైపుణ్యాలు లేకపోయినా, నిర్మాణ పథకం విజయవంతం కావడానికి మీరెంతగానో సహాయపడవచ్చు. నిర్మాణపనిని పర్యవేక్షించగలగడంతోపాటు, అవసరమైన వివిధ అనుమతులు సంపాదించడంలో సహాయం చేయగలిగే అర్హులైన సహోదరుల మద్దతు ప్రస్తుతం మాకవసరం. భవిష్యత్తులో మీరు మరింతగా ఉపయోగపడేలా, కొన్ని నిర్మాణ నైపుణ్యాల్లో మీరు శిక్షణ కూడా పొందవచ్చు.
3. ఈ ఏర్పాటుకు మనమింకా ఏ యే విధాలుగా మద్దతివ్వవచ్చు?
3 మీరు స్వచ్ఛందంగా ముందుకు రాలేకపోతే, ఆ ఏర్పాటులో భాగం వహించగలిగే ఇతరులను ప్రోత్సహించడం ద్వారా మీరు మద్దతివ్వవచ్చు. వారు రాజ్యమందిర నిర్మాణ పథకంలో పనిచేస్తున్నప్పుడు, సంఘంలో వారికున్న నియామకాలను మీరు చేయడం ద్వారా సహాయం చేయవచ్చు. కొంతమంది రాజ్యమందిర నిర్మాణ పథకంపై పనిచేస్తున్నప్పుడు, పెద్దలు ముందుగానే ప్రణాళిక వేయడం ద్వారా, సంఘ నియామకాలు చక్కగా నిర్వహించబడేలా ఏర్పాట్లు చేయగలరు. రాజ్య సంబంధ విషయాలను వృద్ధి చేయడానికి మనం ఐక్యంగా పని చేస్తే యెహోవా తప్పకుండా సంతోషిస్తాడు.—హెబ్రీ. 13:16.
4. రాజ్యమందిర నిర్మాణ పథకాల్లో పాల్గొంటున్నవారిపట్ల అనుకూల దృక్పథాన్ని మనమెలా చూపించవచ్చు?
4 ప్రోత్సహించేవారిగా ఉండండి: ఆరాధనా స్థలాల నిర్మాణం ఎక్కువ సమయం అవసరమయ్యే, శ్రమతోకూడిన పని. నిర్మాణ పథకాల్లో సహాయం చేయడానికి ఆహ్వానించబడేవారు కొన్నిసార్లు సొంత సంఘాలనుండి దూరంగా ఉండాల్సివస్తుందనే విషయం అర్థం చేసుకోదగిందే. ‘ఆ పనిని’ శ్రద్ధగా చూసుకోవడానికి త్యాగాలు చేసే నిర్మాణ స్వచ్ఛంద సేవకులను అభినందించి, ప్రోత్సాహాన్నివ్వడానికి మనం వెనుకాడకుండా ఉందాం.—అపొ. 6:3; రోమా. 14:19.
5. నిర్మాణ స్వచ్ఛంద సేవకులు ఏ విధంగా సమతుల్యతను చూపించవచ్చు?
5 సమతుల్యత కలిగివుండండి: దేవుని రాజ్యం గురించి ప్రకటించడం మన ఆరాధనలో ప్రాముఖ్యమైన పని. (మార్కు 13:10) దీన్ని మనసులో ఉంచుకుని, స్వచ్ఛంద సేవకులు అనవసరంగా తమ సంఘాలకు దూరంగా ఉండే పరిస్థితి ఏర్పడకుండా పథకాలను రూపొందించడానికి మేము ప్రయత్నిస్తాం. అలాగే, నిర్మాణ స్వచ్ఛంద సేవకులు తమకున్న అనేక బాధ్యతలను చూసుకోవడంలో సమతుల్యత కలిగివుండడానికి ప్రయత్నిస్తారు. తాము లేనప్పుడు సంఘ నియామకాలను ఇతరులు చూసుకొనేలా అవసరమైన ఏర్పాట్లు చేస్తారు.
6. సత్యారాధనను వృద్ధిచేసేందుకు సంఘంలోని వారందరూ కలిసికట్టుగా పనిచేస్తే ఏమి సాధించబడుతుంది?
6 అపొస్తలుడైన పౌలు, ‘ప్రేమయందు తనకు క్షేమాభివృద్ధి కలుగునట్లు శరీరమునకు అభివృద్ధి కలుగజేసుకోవడానికి’ ఐక్యంగా కలిసి పనిచేసేవారిగా సంఘ సభ్యులను వర్ణిస్తున్నాడు. (ఎఫె. 4:16) యెహోవాపట్ల, సత్యారాధనపట్ల మనకున్న ప్రేమ ప్రకటనా పనికి, రాజ్యమందిర నిర్మాణానికి మద్దతిచ్చేందుకు కలిసికట్టుగా పనిచేయడానికి మనల్ని పురికొల్పుతుంది.