ఇంటిగుమ్మం దగ్గర, టెలిఫోన్లో ప్రగతిదాయక బైబిలు అధ్యయనాలను నిర్వహించండి
1. మనం బైబిలు అధ్యయనాలు నిర్వహించడం వెనకున్న ఉద్దేశమేమిటి?
1 బైబిలు అధ్యయనం ప్రారంభించడం ఎంత సంతోషాన్నిస్తుందో కదా! కానీ, బైబిలును అధ్యయనం చేయడానికి ఆసక్తి కలిగివుండేవారిని కనుగొనడం కేవలం ప్రారంభం మాత్రమే. ఆ వ్యక్తిని క్రీస్తుకు నిజమైన శిష్యునిగా చేయడమే అధ్యయనం వెనకున్న ఉద్దేశం. (మత్త. 28:19, 20) ఆ గమ్యాన్ని చేరుకోవడానికి మనకేమి సహాయం చేస్తుంది?
2. ఇంటిగుమ్మం దగ్గర, టెలిఫోన్లో బైబిలు అధ్యయనాలు అంటే ఏమిటి, అవి ఎందుకు సమర్థవంతమైనవి?
2 తీరికలేని ప్రజలు: నేటి ప్రజలకు రోజురోజుకీ తీరికలేకుండా పోతోంది. అనేక ప్రదేశాల్లో, చాలామంది ప్రారంభంలోనే బైబిలు అధ్యయనం చేయడానికి ఒక గంటను కేటాయించేందుకు సుముఖంగా ఉండకపోవచ్చు. అటువంటివారికి సహాయం చేయడానికే మనం ఇంటిగుమ్మం దగ్గర, లేదా టెలిఫోన్ ద్వారా బైబిలు అధ్యయనాలను ప్రారంభించాలని ప్రోత్సహించబడుతున్నాం. అటువంటి అధ్యయనాలు వేరేవాటితో పోలిస్తే అవి ప్రారంభ దశలో సంక్షిప్తంగా ఉండవచ్చు, అంతేగాక, వాటిలో బైబిలు బోధిస్తోంది లాంటి సాహిత్యంనుండి ఒకటి లేదా రెండు పేరాల ఆధారంగా కేవలం కొన్ని బైబిలు వచనాలను పరిశీలించడమే ఇమిడివుండవచ్చు. చాలామంది ప్రచారకులు ఇప్పుడు ఇంటిగుమ్మం దగ్గర, టెలిఫోన్లో అలాంటి అధ్యయనాలను నిర్వహిస్తున్నారనేది ఎంత అభినందించదగ్గ విషయమో కదా!
3. ఇంటిగుమ్మం దగ్గర చేసే అధ్యయనం గడువును పెంచడానికి మనమెందుకు కృషి చేయాలి?
3 అయితే, ఎల్లప్పుడూ ఇంటిగుమ్మం దగ్గరే అధ్యయనాన్ని కొనసాగించి, దానితోనే మనం సంతృప్తి చెందాలా? లేదు. అధ్యయనం ప్రారంభించిన క్రొత్తలో మనం ఇంటిగుమ్మం దగ్గర ఎక్కువసేపు మాట్లాడడం జ్ఞానయుక్తం కాకపోయినా, 1990, జూన్ మన రాజ్య పరిచర్య 4వ పేజీ ఇలా వ్యాఖ్యానించింది: “ఒకసారి బైబిలు అధ్యయనం ప్రారంభమై, గృహస్థుని ఆసక్తి పెరిగిన తర్వాత, అధ్యయనం చేయడానికి ఎక్కువ సమయం గడపవచ్చు.” అది చాలా ప్రాముఖ్యం. దాన్ని ఇలా ఉదాహరించవచ్చు: ఆహారంలేక బాధపడుతున్న బాలునికి ఆకలి మామూలు స్థాయికి చేరుకునేంత వరకు మొదట్లో కొద్దికొద్దిగా ఆహారమిస్తాం. అయితే నెలలకొద్దీ అలా కొద్దికొద్దిగా ఆహారం ఇస్తే ఆ బాలుడు పూర్తిగా బలం పుంజుకొని, అందరిలాగే ఎదుగుతాడని మనం అనుకోం. అదేవిధంగా, విద్యార్థి పరిణతిచెందిన దేవుని సేవకునిగా ఎదగాలంటే ఆయన మరింత క్రమబద్ధమైన రీతిలో, క్రమంగా అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది.—హెబ్రీ. 5:13, 14.
4. బైబిలు అధ్యయనాన్ని ఇంట్లో నిర్వహించడం ద్వారా ఎటువంటి ప్రయోజనాలున్నాయి?
4 ఇంట్లో బైబిలు అధ్యయనాలు: అధ్యయనాన్ని అంతగా జనసంచారంలేని ప్రదేశంలో అంటే ఇంట్లో లేదా మరేదైనా ఇతర అనువైన స్థలంలో నిర్వహించడం మంచిది. అలా చేయడం విద్యార్థి దేవుని వాక్యాన్ని త్వరగా నేర్చుకుని దాని అర్థాన్ని గ్రహించడానికి సహాయం చేస్తుంది. (మత్త. 13:23) అధ్యయన నిర్వాహకుడు ఆ విద్యార్థికున్న అవసరాలకు తగ్గట్టుగా అధ్యయన సమాచారాన్ని మలచడానికి కూడా అది సహాయం చేస్తుంది. అంతేగాక, ఎక్కువసేపు అధ్యయనం చేయడం దేవుని వాక్యాన్ని మరింత సంపూర్ణంగా, విశ్వాసాన్ని బలపర్చే విధంగా పరిశీలించడానికి వీలు కల్పిస్తుంది.—రోమా. 10:17.
5. మనం ఇంటిగుమ్మం దగ్గర నిర్వహించే అధ్యయనాన్ని ఇంట్లో నిర్వహించే అధ్యయనంగా ఎలా మార్చవచ్చు?
5 ఇంటిగుమ్మం దగ్గర చేసే బైబిలు అధ్యయనాన్ని మీరు ఇంట్లో నిర్వహించేదానిగా ఎలా మార్చవచ్చు? అనేకసార్లు సంక్షిప్త అధ్యయనాలు చేసినతర్వాత, నిర్దిష్ట సమయమే అయినా కొంత ఎక్కువ సమయం అధ్యయనం చేద్దామని సూటిగా ఎందుకు అడగకూడదు? అలా చేయలేకపోతే ఆ వ్యక్తిని పరోక్షంగా ఇలా అడగవచ్చు, “ఈ రోజు ఈ విషయాన్ని కూర్చొని చర్చించడానికి మీకు సమయముందా?” లేదా “ఈ రోజు ఈ అంశాన్ని చర్చించడానికి మీరు ఎంత సమయాన్ని వెచ్చించాలనుకుంటున్నారు?” మీ ప్రయత్నాలు విఫలమైతే, ఇంటిగుమ్మం దగ్గర సంక్షిప్త బైబిలు అధ్యయనాలను కొనసాగించండి. మళ్ళీ తగిన సమయంలో ఇంట్లో నిర్వహించబడే అధ్యయనంగా మార్చేందుకు ప్రయత్నించండి.
6. మనం ఏ లక్ష్యంతో మన పరిచర్యలో కొనసాగాలి, ఆ లక్ష్యాన్ని సాధించడానికి ఈ ఆర్టికల్లోని సూచనలు మనకు ఎలా సహాయం చేస్తాయి?
6 అర్హులైన వారిని కనుగొనడంలో కొనసాగుతుండగా, బైబిలు అధ్యయనాలను ప్రారంభించడంలోని మన ఉద్దేశాన్ని మరిచిపోకుండా ఉందాం. యథార్థహృదయులు బాప్తిస్మం తీసుకున్న యెహోవా సమర్పిత సేవకులుగా మారేందుకు సహాయం చేయడమే మన ధ్యేయం. మనం ఈ లక్ష్యంతో పరిచర్యలో కొనసాగుతుండగా ఆయన మన ప్రయత్నాలను ఆశీర్వదించునుగాక!—2 తిమో. 4:5.