1వ భాగం: ప్రగతిదాయక బైబిలు అధ్యయనాలను నిర్వహించడం
బైబిలు అధ్యయనం అంటే ఏమిటి?
1 ప్రపంచవ్యాప్తంగా దేవుని ప్రజలు ప్రతి నెలా దాదాపు అరవై లక్షల బైబిలు అధ్యయనాలను నిర్వహిస్తున్నారు. మంచి బోధనా పద్ధతులను ఉపయోగించడం ద్వారా మనం ఈ బైబిలు విద్యార్థులు ప్రగతి సాధించి దేవునికి సమర్పించుకొని బాప్తిస్మం తీసుకొని ‘ఇతరులకు బోధించుటకు సామర్థ్యముగలవారిగా’ తయారయ్యేందుకు సహాయం చేయవచ్చు. (2 తిమో. 2:2) మీ విద్యార్థులు కూడా అలాంటి ప్రగతి సాధించాలని మీరు కోరుకుంటున్నారా? ఈ సంచిక మొదలుకొని మన రాజ్య పరిచర్యలో, ప్రగతిదాయక బైబిలు అధ్యయనాలను నిర్వహించడానికి సంబంధించిన ప్రాథమిక అంశాలను వివరిస్తూ శీర్షికల పరంపర ప్రచురించబడుతుంది.
2 బైబిలు అధ్యయనాన్ని ఎప్పుడు రిపోర్టు చేయాలి: మీరు బైబిలుతోపాటు ఒక ప్రచురణను ఉపయోగిస్తూ క్లుప్తంగానే అయినా క్రమంగా ఒక పద్ధతి ప్రకారం బైబిలు చర్చలను నిర్వహిస్తుంటే, మీరొక బైబిలు అధ్యయనం నిర్వహిస్తున్నట్లే. ఆ చర్చ ఇంటి గుమ్మం ముందు జరిగినా, టెలిఫోనులో జరిగినా అది అధ్యయనమే. అధ్యయనం ఎలా నిర్వహించబడుతుందో ప్రదర్శించిన తర్వాత రెండుసార్లు అధ్యయనాన్ని నిర్వహిస్తే, అది అలా కొనసాగుతుందనే నమ్మకం మనకుంటే దానిని ఒక అధ్యయనంగా రిపోర్టు చేయవచ్చు.
3 ఎన్నో బైబిలు అధ్యయనాలను నిర్వహించడానికి దేవుడు కోరుతున్నాడు బ్రోషుర్ లేదా జ్ఞానము పుస్తకం ఉపయోగించబడుతున్నాయి. అవి పూర్తయిన తర్వాత, ఆ వ్యక్తి నెమ్మదిగానే అయినా ప్రగతి సాధిస్తున్నట్లు స్పష్టంగా కనిపిస్తుంటే, ఆయన తాను నేర్చుకుంటున్న దానిపట్ల కృతజ్ఞత పెంపొందించుకుంటుంటే దేవుణ్ణి ఆరాధించండి పుస్తకం నుండి అధ్యయనం చేయడం కొనసాగించవచ్చు.
4 లక్షలాదిమంది యేసుక్రీస్తు నిజమైన శిష్యులుగా తయారవడానికి బైబిలు అధ్యయనాల సేవ ఫలవంతంగా సహాయం చేస్తోంది. (మత్త. 28:19, 20) రానున్న పరంపరలోని శీర్షికల్లో ఇవ్వబడే సలహాలను అన్వయించుకోవడం ద్వారా మీరు ప్రగతిదాయక బైబిలు అధ్యయనాన్ని నిర్వహించవచ్చు.